Home » Home and Career » మహిళలు ఆర్థికంగా ఎదగడం వైవాహిక బంధం విచ్చిన్నానికి దారి తీస్తుందా.!

మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడం, సొంతంగా సంపాదించడం సమాజంలో ఒక కీలకమైన సానుకూల మార్పు. అయితే, మహిళల ఆర్థిక ఎదుగుదల వైవాహిక బంధాలను దెబ్బతీస్తోందని లేదా విడాకులకు దారితీస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఈ చర్చ ఈమధ్య తరచూ వినబడుతోంది. నిజానికి ఆర్థిక స్వాతంత్ర్యం అనేది నేరుగా బంధాన్ని విచ్ఛిన్నం చేయదు. కానీ, సమాజంలో ఊహించని వేగంతో వస్తున్న ఈ మార్పును పాతకాలపు ఆలోచనా విధానంతో స్వీకరించడానికి ప్రయత్నించినప్పుడు కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతాయి.
మహిళల ఆర్థిక బలం.. ఆత్మగౌరవం..
మహిళకు ఆర్థికంగా బలం చేకూరినప్పుడు ఆమెకు ఆలోచనా స్వేచ్ఛ, నిర్ణయాధికారం , ఆత్మగౌరవం పెరుగుతాయి. గతంలో ఆర్థికంగా భర్తపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల చాలామంది మహిళలు గృహహింస, వేధింపులు లేదా అసంతృప్తికరమైన దాంపత్య జీవితాన్ని భరిస్తూ నడుపుకొచ్చేవారు. ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకున్న మహిళలు గౌరవం లేని చోట లేదా వేధింపులు ఉన్న చోట ఉండటానికి సిద్ధంగా లేరు. ఇలా వేధింపుల నుండి తిరగబడి ఆ బంధం నుండి బయటకు రావడాన్ని చాలా మంది వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడంగా చూస్తున్నారు. ఇలా చూడటం కంటే, అణచివేతకు గురైన మహిళ తనకు తానుగా తీసుకుంటున్న నిర్ణయంగా అర్థం చేసుకోవాలి.
పురుషుల ఆలోచన మారాలి..
మహిళలు కూడా ఆర్థికంగా ఎదుగుతున్న మార్పుల మధ్య వైవాహిక బంధం దృఢంగా ఉండాలంటే పురుషుల ఆలోచనా విధానం , ప్రవర్తన చాలా కీలకం. ఈ విషయంలో పురుషులు అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
అహంకారాన్ని పక్కన పెట్టడం..
సమాజంలో దశాబ్దాలుగా పురుషుడే ఇంటికి యజమాని , సంపాదకుడు అనే భావన బలంగా నాటుకుపోయింది. భార్య తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడో లేదా ఉన్నత పదవిలో ఉన్నప్పుడో కొందరు పురుషుల్లో ఈగో లేదా అభద్రతా భావం తలెత్తుతుంది. భార్య విజయాలను తమ విజయాలుగా భావించడం, ఆమె ఎదుగుదలను చూసి గర్వపడటం భర్తలు అలవాటు చేసుకోవాలి.
బాధ్యతలు పంచుకోవడం..
పూర్వం మహిళలు ఇంటి పనులకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు మహిళలు బయట ఉద్యోగం చేస్తూ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తున్నారు. కాబట్టి, ఇంటి పనులు, పిల్లల పెంపకం కేవలం మహిళ బాధ్యత మాత్రమే కాదు. ఇంటి పనుల్లో భార్యకు భాగస్వామ్యం ఇవ్వడం, పనులను పంచుకోవడం వల్ల ఆమెపై మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.
ఆధిపత్య పోరు కాదు.. భాగస్వామ్యం ఉండాలి..
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల సమాన భాగస్వామ్యం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఆర్థిక నిర్ణయాలు, కుటుంబ నిర్ణయాలు ఇద్దరూ కలిసి చర్చించి తీసుకోవాలి. భార్య సంపాదనను నియంత్రించాలని చూడకుండా, ఆమెకు నిర్ణయాధికారంలో ప్రాధాన్యత ఇవ్వాలి.
స్పష్టత..
దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా ఉండాలి. సంపాదన, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఏవైనా సందేహాలు లేదా చిన్నపాటి మనస్పర్థలు వచ్చినప్పుడు వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప మౌనంతో లేదా ఆధిపత్యంతో పరిష్కరించూసుకోవాలని అనుకోకూడదు. బంధంలో మౌనం అనేది చాలా పెద్ద అగాధాలు సృష్టిస్తుంది.
మెంటల్ సపోర్ట్..
ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మహిళలకు రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. అటువంటి సమయంలో భర్త నుంచి లభించే మెంటల్ సపోర్ట్ ఆమెకు కొండంత బలాన్నిస్తుంది. ఆమె ఆశయాలకు, లక్ష్యాలకు ప్రోత్సాహాన్ని అందించే భాగస్వామిగా పురుషుడు నిలవాలి. అప్పుడు భార్య మాత్రమే కాదు.. అందరి దృష్టిలో భర్త మరింత ఉన్నత స్థాయికి వెళతాడు.
చివరగా..
మహిళల ఆర్థిక ఎదుగుదల వైవాహిక బంధానికి ముప్పు కాదు, అది కుటుంబ ఆర్థిక స్థితిని బలపరిచే ఒక గొప్ప మార్గం. సమానత్వం, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే గుణం ఉన్న చోట మహిళ ఆర్థిక ఎదుగుదల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది తప్ప విచ్ఛిన్నం చేయదు. పురుషులు పాతకాలపు ఆలోచనలను వీడి కొత్త దృక్పథంతో ముందడుగు వేసినప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన దాంపత్య జీవితం సాధ్యమవుతుంది.
*రూపశ్రీ.
