Home » Health Science » ఎపిసోడ్-5
చాయ తల ఎత్తితే సంధ్య నవ్వుతూ కనిపించింది. ఆమె మాటలకి చాయకి చిరాకేసింది.
"అంటే.... నాముఖం చూసి వూహించాడనా....? నిజం కాదనా?" అంది దురుసుగా.
సంధ్య కొద్దిగా నవ్వి "సాధారణంగా ఇలాగే చెప్తుంటారు" అంది.
ఆ మాటలకి కోయదొరకి కోపం వచ్చింది.
"డుర్....ర్....ర్....కూన.....ఉన్నదున్నట్టుగా సెభ్తాను......కావాలంటే సెయ్యి జాపు...." అన్నాడు సంధ్యని.
"ఒద్దులే....." అంది నవ్వుతూ సంధ్య.
చాయ రోషంగా "కాదు చూపించుకోవాల్సిందే ఏం చెపుతాడో విందాం" అంది.
సంధ్య చాయ వైపుచూసి "నువ్వు అడుగుతున్నావు కాబట్టి చూపించు కుంటున్నాను" అంది.
కోయదొర ఆమెని, ఆమె చేతినీ మార్చి మార్చి చూసి విచారంగా ముఖం పెట్టాడు.
ఆ తర్వాత ఏదో లెక్కపెట్టి "పెట్టని సీతమ్మోరి గండ్లు......నేలమీద నడుస్తాది కాని నింగికి ఎగరదు. తిండికి బట్టకి కొరతుండదుగాని సేతిలో పైసా నిలవదు. బీద పుట్టుకగాని లచ్చిమి బుద్ది" అన్నాడు.
చాయ అతను చెపుతూ వుంటే ఫ్రెండ్స్ వైపు గర్వంగా చూసింది.
సంధ్య చెయ్యి వెనక్కి తీసుకుని నవ్వుతూ "అయితే కష్టాల్లో వున్నానంటావు" అంది.
"కొండదేవత పలుకు అబద్డంకాదు" అన్నాడు గట్టిగా కోయదొర.
"సరే.....సరే...." అని సంధ్య పర్సులోంచి పదిరూపాయలు తీసి ఇచ్చి "ఆమెని కూడా తీసుకో" అంది.
"అక్కర్లేదు నావి నువ్వెందుకివ్వడం?" అంది చాయ.
"పర్లేదు మనం ఈరోజు నుండీ ఫ్రెండ్స్ కదా...." స్నేహపూరితంగా చాయ చేతిని పట్టుకుని అంది సంధ్య.
చాయ ఇంకేం మాట్లాడలేదు. కోయదొర వెళ్ళిపోయాడు.
"నాది రాణీ జాతకం అని అతను చెప్తే నువ్వు ఎందుకు నవ్వావు?" ఉక్రోషంగా అడిగింది చాయ.
సంధ్య మళ్ళీ నవ్వి "కావచ్చు! కానీ వాళ్ళు చెప్పేదంతా నమ్మనక్కర్లేదు. కూటికోసం కోటి తిప్పలు పాపం" అంది.
"అంతా నిజమే చెప్పాడని నాకు గట్టిగా అనిపిస్తోంది" పంతంగా అంది చాయ.
సంధ్య మాట్లాడలేదు.
"ఏం.....నీకింకా నమ్మకం కలగలేదా?" రెట్టించింది చాయ.
సంధ్య నవ్వుతూనే తల అడ్డంగా వూపి- "కలగలేదు" అంది.
"ఎందుకని....?" చాయ అరిచినట్టుగా అడిగింది. ఆమె ముక్కు పుటాలు ఎర్రబడ్డాయి. అసలే పెద్దవైన కళ్ళు కోపంగా ఇంకా పెద్దవిగా మారి ముచ్చటగా వున్నాయి.
సంధ్య జవాబివ్వడానికి నోరు తెరిచేలోగానే వాళ్ళ ముందుకి ఓ మెర్సిడీస్ కారొచ్చి ఆగింది. అందులోంచి డ్రయివర్ దిగి-
"అమ్మాయిగారూ....బస్ స్టాప్ కి ఎందుకొచ్చారూ? కాలేజీలో మీరు కనపడకాపోతే నాపై ప్రాణాలు పైనే పోయాయి అనుకోండి. ఎండలో ఇంతసేపూ నిలబడ్డారని తెలిస్తే, బాబుగారు నా తోలు వొలిచి ఎండపెట్టేస్తారు. రండి.....కారెక్కండి...." అన్నాడు.
"రామయ్యా! మమ్మీకి కారు పంపొద్దని చెప్పానుగా ఎందుకు వచ్చావు?" చిరుకోపంగా అడిగింది సంధ్య.
"సర్లేండి! ఈపాటికి అమ్మగారు కాలేజీకి ఎన్నిసార్లు ఫోన్ చేసుంటారో మీ కోసం. ప్రొద్దుట లండన్ నుండి నాన్నగారు కూడా ఫోన్ చేసి, మీరు వద్దన్నా కాలేజీకి కారు పంపమని చెప్పారట! ముందు ఎక్కండి....ఆలస్యం అయిపోయింది" అన్నాడు రామయ్య.
సంధ్య చాయవైపు చూసి నవ్వి- "బై" అని వెళ్ళి కారెక్కింది.
ఆమె ఎక్కాకా కారు డోర్ వేసి, డ్రైవర్ ఎక్కి స్టార్ట్ చేశాడు.
కారు దుమ్మురేపుకుంటూ వెళ్ళిపోయాకా, మిత్రబృందం తేరుకుని- "అమ్మో! ఏమో అనుకున్నాం.....చాలా గొప్పింటి పిల్లలా వుందే...." అన్నారు.
చాయ ఇంకా తేరుకోలేదు. నూటయాభై రూపాయల వాయిల్ చీరలో వున్న సంధ్య అంత గొప్పింటి పిల్ల అంటే ఆమెకు ఆ విషయం జీర్ణ అవటం కష్టంగా అనిపించింది.
కోయవాడి మాటలకి సంధ్య ఎందుకు నవ్విందో ఆమెకి అప్పుడు అర్ధమైంది.
* * *
కారు తమ ఇంటి పరిసరాలకి సమీపిస్తుంటేనే ఎంతో రిలాక్సింగ్ గా అనిపించింది సంధ్యకి. కిటికీ దగ్గర నిలబడి తనకోసం ఎదురుచూసే తల్లీ, తన రాకని పసిగట్టి తోక ఊపుతూ క్రీపర్ రాధామనోహరం, గేటులోంచి ఇంటివరకూ వున్న ప్రయివేటు రోడ్డుకి అటూ-ఇటూ అందంగా పెంచిన తోటా.....అన్నీ తనకోసం ఎదురుచూస్తున్నట్లే వుంటాయి. అందమైన ఆ భవనం సైతం నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్లే వుంటుంది. కారు చూడగానే వాచ్ మాన్ పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తీశాడు. స్నాధ్య కార్లోంచి కాలు కిందపెట్టడం ఆలస్యం.....జూలీ పరిగెత్తుకువచ్చి ముందు రెండు కాళ్ళూ అందించింది. సంధ్య దాని ముద్దు చేస్తూనే తల పైకెత్తి చూసింది.
తల్లి కిటికీ దగ్గరే వుంది. ఆమె కళ్ళల్లో అదే ఆనందం. ప్రతిరోజూ తనని చూడగానే ఆ కళ్ళల్లో కనబడే ఆ భావన సంధ్యకి ఎంతో ఇష్టం.
ప్రపంచంలోకెల్లా అద్భుతమైనది ఏదీ? అంటే అమ్మ పెదవి అంచున మెరిసే చిరునవ్వు! అని ఠపీమని చెబుతుంది సంధ్య. హఠాత్తుగా భగవంతుడు ప్రత్యక్షమై "నీకేం కావాలో కోరుకో" అంటే ఆలోచించకుండానే "నాకు ప్రతి జన్మలోనూ ఇటువంటి అమ్మా నాన్నే కావాలి" అని చెప్పేస్తుందా అమ్మాయి.
హాల్లోకి అడుగుపెట్టగానే గులాబీల గుబాళింపు ఆమెను సున్నితంగా చుట్టుముట్టి పరామర్శించింది. మంద్రంగా వినిపిస్తూన్న పర్వీన్ సుల్తానా స్వరం తల్లికి ఇష్టమైన త్రితాల్ లో వ్యాకుల్ నైనా.....నీర్ బహాయే.....అని విన్పిస్తూ ఆమెని తల్లి బెడ్ రూంవైపు నడిపించింది.
తూర్పు కోనలో దొంగిలించిన మబ్బులా, విశ్రాంతికోసం పశ్చిమాన క్రుంగుతున్న సూర్యబింబంలా వుంది కాంచన మంచంమీద పడుకున్న భంగిమ!
ఎర్రని జ్వాలలా ఆమె ముఖంమీద మెరిసే కుంకుమ బొట్టుని తృప్తిగా చూస్తూ "ఎందుకమ్మా.... ఈ ఎదురుచూపు? పడుకోవచ్చుగా?" అంది ఆప్యాయంగా సంధ్య.