Home » Health Science » PCOD Problem in Women,What Happens When PCOS Goes Untreated,What is PCOD Problem in Women,what happens when you ignore pcos and pcod symptoms for too long, PCOD ignore Problem,Signs of Infertility You Shouldnt Ignore
ఆడవారు PCOS ను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
మహిళలకు నెలసరి సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. నెలసరి సరిగా రాకపోవడం, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, బరువు పెరగడం, వంటి సమస్యలు చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఈ సమస్యలకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కారణం అవుతుంది. దీన్నే పిసిఓయస్ అని అంటారు. భారతదేశంలో ప్రతి 5 మంది మహిళలలో ఒకరు పిసిఓయస్ సమస్యతో పోరాడుతున్నారు. అంటే.. ఈ సమస్య మహిళలను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలామంది మహిళలు తమకు పిసిఓయస్ సమస్య ఉందనే విషయం కూడా తెలియకుండానే కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. మరికొందరు తమకు సమస్య ఉందని తెలిసినా కుటుంబ విషయాల్లో పడి తమ గురించి తాము పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ పిసిఓయస్ సమస్యను పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే నష్టాలు తప్పవని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
మహిళలలో అకస్మాత్తుగా బరువు పెరగడం, ముఖం పై మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు అతిగా పెరగడం, నెలసరి సరిగా రాకపోవడం, ఆలస్యంగా నెలసరి వస్తే అది తొందరగా తగ్గకపోవడం, నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం వంటి లక్షణాలు పిసిఓయస్ ను సూచిస్తాయి. నిజానికి పిసిఓయస్ అనేది వ్యాధి కాదు. ఇది శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది సాధారణంగా పెద్ద తీవ్రత లేకుండా ఉంటుంది. మహిళలను కొన్ని రోజులు అసౌకర్యానికి గురి చేస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది విశ్వరూపం చూపిస్తుంది. పిసిఓయస్ కారణంగా మహిళలలో ఇతర వ్యాధులు కూడా వస్తాయి. ఇవి మహిళలకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి.
మహిళలు పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతక వ్యాధులను ప్రేరేపిస్తుంది. వాటిలో ముఖ్యమైనది మధుమేహం. చిన్న వయసులోనే మహిళలకు మధుమేహం రావడంలో పిసిఓయస్, హార్మోన్ల అసమతుల్యత ప్రధాన కారణం.
పిసిఓయస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. పిసిఓయస్ లో బరువు పెరగడం అనే సమస్య ప్రధానంగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది క్రమంగా ఊబకాయంకు దారితీస్తుంది.
ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా పిసిఓయస్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల వస్తుంది. మహిళలలో మానసిక సమస్యలు కూడా పిసిఓయస్ కారణంగా వస్తాయి. సాధారణంగానే మహిళలలో హార్మన్ల మార్పు జరిగే పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం, అసహనం వంటివి వస్తుంటాయి. అలాంటిది పిసిఓయస్ సమస్యలో ఈ హార్మోన్ల అసమతుల్యత చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది మానసిక సమస్యలు ఎక్కువగా కలిగిస్తుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా పిసిఓయస్ ఉన్న మహిళలు గర్బం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ సమస్య తగ్గే వరకు గర్భం దాల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి గర్భం దాల్చే ప్రయత్నాలు చేసే మహిళలు పిసిఓయస్ లేకుండా చూసుకోవాలి.
పరిష్కారాలు..
పిసిఓయస్ సమస్యకు ఒక నిర్ణీత వైద్యం అంటూ లేదు. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్య కాబట్టి మహిళలు హార్మోన్లు తిరిగి బ్యాలెన్స్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. అదేవిధంగా ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి. ఆకుకూరలు బాగా తినాలి.
ఆహారం విషయంలోనే కాదు.. ఆహారం తినడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తం ఆహారం తినకుండా చిన్న చిన్న మొత్తాలను ఎక్కువ సార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పిసిఓయస్ తగ్గించడానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.