Home » Yoga » Meditation Benefits

 

ధ్యానం - 2

Meditation - 2

                                             ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది . ధ్యానం మన మనసును స్వాధీనంలోకి తెస్తుంది. మనసును స్వాధీనం చేసుకున్న తరవాత మన మనసులోని ఆలోచనలోనే తరంగాలన్నీ ఆగిపోవడమే కాక, మనలోని చేతనా స్పృహ విస్తరిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడల్లా మానసికంగా పెరుగుదలను పొందుతుంటాం. ప్రారంభంలో కాస్త కష్టమైనప్పటికీ, రాను రాను తీవ్రతరం చేస్తే ధ్యానం కుదురుతుంది. అప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచనే ఉండదు. ఆ సమయంలో మన మనసుకు, తద్వారా మన శరీరానికి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది . ఈ విషయం గురించే శాస్త్రజ్ఞులు మెదడుపై పరిశోధనలు జరిపి, ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో ఎటువంటి ఫలితాలుంటాయనే విషయాన్ని విపులీకరించారు .

మెదడులో ఫ్రంటల్ లోబ్ , పెరైటల్ లోబ్ , థాలమస్, రెటిక్యులార్ ఫార్మేషన్ అంటూ నాలుగు భాగాలున్నాయి . ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాలుగు భాగాలలో నాలుగు విధాలైన మార్పులు జరుగుతుంటాయనీ, ఫలితంగా మెదడు పూర్తి విశ్రాంతి పొందుతుంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ఫ్రంటల్ లోబ్ : మనం వేసే పక్కా ప్రణాళికలకు మెదడులోని ఈ భాగమే కారణం. మనలోని చైతన్యానికి, భావోద్వేగాలకు ఈ భాగమే ప్రధాన కారణం. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం నిశ్చలమవుతుంది. ఫలితంగా మన మనసు తేలికపడినట్లవుతుందన్న మాట .

పెరైటల్ లోబ్ : ఈ భాగం మన చుట్టు ప్రక్కలనున్న విషయాలను మెదడుకు చేరవేస్తుంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ భాగం కూడా నిశ్చలమవుతుంది . మనసులోని భారం తగ్గుతుంది.

థాలమస్: ఒకే విషయం పై దృష్టిని పెట్టేలా చేస్తుంది. ఇతరత్రా ఆలోచనలు లేకుండా చూసుకుంటుంది. ధ్యానం చేసేటప్పుడు థాలమస్ లోని ఆలోచనల పరంపరల వేగం తగ్గి ప్రశాంతత నెలకొంటుంది.

రెటిక్యులార్ ఫార్మేషన్ : శరీరంలోని వివిధ భాగాల నుండి వచ్చే సమాచారంతో మెదడుకు హెచ్చరికలు చేస్తుంటుంది . ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సంకేతాలు నిలిపివేయబడి , మెదడు విశ్రాంతిని పొందుతుంది. మొత్తంగా ఇవాళ్టి యువతరం భాషలో ధ్యానం గురించి చెప్పాలంటే, మన శరీరమనే హార్డ్ వేర్ లో మనసనే సాఫ్ట్ వేర్ ఉంది. దాంట్లోకి యాంటీ వైరస్ ను ఎక్కించడమే ధ్యానం.

                                ఆత్మ జ్ఞానం పొందే మార్గాలలో 'ధ్యానం' ఒక మార్గమని చెప్పారు . ధ్యానం ఎలా చెయ్యాలో చాలా రకాలుగా వివరించారు . అయితే " ఏది సరైన ధ్యానం ? ఏ పద్ధతిలో చేస్తే కరెక్ట్?” అని ప్రశ్నలను సంధించే వ్యక్తులకు ముందుగా ధ్యానం అంటే ఏమిటన్న విషయం పట్ల ఓ అవగాహన కలగాలి. అప్పుడే " ఏ ధ్యానం సరైనది?” అన్న ప్రశ్నకి సమాధానం లభిస్తుంది.

ఎందుకంటే ' ధ్యానం ' అన్నది ఒకే ఒక ప్రత్యేకమైన పధ్ధతి కాదు. ముఖ్యంగా నీళ్ళలోకి దూకడం అవసరమైనప్పుడు ఏదో ఒక విధంగా దూకగలగాలి అంతేకదా! ఎలా ఈదాలి - బటర్ ఫ్లై స్ట్రోకా మరేదన్నానా అని తర్కం కూడదంతే.

          కొంతమంది " ఏ పనీ చేయకుండా ఉండటమే ధ్యానం " అని అంటుంటారు . ఒక విధంగా అది నిజం. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు " ధ్యానం చేయడం " అని అనరు. ధ్యానంలో ఉండటం" అని అంటారు. అటువంటి స్థితిని పొందటం కోసం, ఎటువంటి పద్ధతిని స్వంతం చేసుకుంటారన్నది ఎవరి సానుకూలాన్ని బట్టి వారికి ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు ధ్యానం చేయడానికి ఒక ప్రత్యేకమయిన పద్ధతిని, ఇదే ధ్యాన నియమం అంటూ ఎవరూ నిబంధనలను విధించలేదు . ధ్యానం అనేది ఒక విధమైనటువంటి అలౌకికమైన స్థితి. ఈ స్థితి ద్వారానే మానసిక ప్రశాంతతను చేరుకోగలుగుతాము..

                       ముఖ్యంగా ధ్యానం చేయడానికి కావాల్సింది భంగిమ. ముందుగా ఏ ఆసనంలో అయితే మనం కష్టం లేకుండా ఎక్కువ సేపు కూర్చోగలుగుతామో దానిని ఎంచుకోవాలి. అనుకూల ఆసనంలో కూర్చోగానే కళ్ళు మూసుకుని, ఆలోచనల ప్రవాహాన్ని గమనించాలి. సినిమాని చూసే ప్రేక్షకుడిలా, సాక్షీ భావంతో మన మనస్సును గమనించడం మొదలవుతుంది. వాటిలో ఏవి మంచి ఆలోచనలో, ఏవి చెడ్డ ఆలోచనలో గమనించండి. నెమ్మదిగా ఊపిరి వేగం తగ్గి, ఆలోచనలు శాంతించడం మొదలవుతుంది. ఆ సమయంలో మనసంతా ఒక విధమైన ప్రశాంతత ఆవరించి, ఆలోచనలు ఒకటో రెండో, ఆకాశంలో మబ్బు తునకలా మెదలుతుంటాయి . వాటిని పట్టించుకోవద్దు . మీ ధ్యాన ఏకాగ్రత చెదరనీయకండి. అలా ఎంతసేపు నిరాలోచన స్థితిలో ఉండగలిగితే అంత మంచిది. ఆ సమయంలో మీ దరిదాపుల్లో పెద్దగా శబ్దాలేమీ  కాకుండా జాగ్రత్త వహించండి.

                     పడుకోబోయే ముందు ఈ విధమైన ధ్యానం చేస్తే, రోజంతా జరిగిన సంఘటనల తాలూకు అలజడి మీ నిద్రను భంగం చేయదు. ప్రశాంతంగా నిద్రపోతారు. తెల్లవారు ఝామున నిద్ర లేచాక ధ్యానం చేస్తే, ఆ రోజంతా ఏ సంఘటన జరిగినా స్థిర చిత్తంతో ఎదుర్కొంటారు . ఇలా మానసిక ప్రశాంతత ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందటం ధ్యానంలోని మొదటి మెట్టు. ' ఆరోగ్యమే మహాభాగ్యం ' కనుక ధ్యానమన్నది మన దైనందిన చర్యలో ఒక భాగంగా చేసుకుంటే సకల భోగాలు స్వంతం అయినట్లే.

 

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.