Home » Fashion » Jewelry Trends 2023
2023లో అదిరిపోయే జ్యువెలరీ ఇదే…
న్యూ ఇయర్ వచ్చేసింది.. వారం రోజులు అలా దొర్లుకుంటూ వెళ్లిపోయాయి. కొత్తదనంలో ఉన్న కిక్కును మెల్లిగా పాతబరుస్తూ కాలం వెక్కిరిస్తుంది. కానీ కాలం వెక్కిరిస్తుంటే అలా చూస్తూ ఊరుకుండిపోతామా?? మరీ ముఖ్యంగా ఫాషన్ కు అడ్డాగా నిలిచే అమ్మాయిలు ఊరుకుంటే ఫ్యాషన్ ప్రపంచం చిన్నబోదూ… కొత్త సంవత్సరానికి కొత్తగా ఫ్యాషన్ ను జోడించాలి. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. తగ్గేది లేదనట్టు ఉండాలి ఫ్యాషన్ ప్రపంచంలో ఆడవారి హవా.. మరి కొత్త సంవత్సరంలో ఫాషన్ ను ఎలా స్టార్ట్ చేస్తారు?? ఇదిగో ఇలా…
కఫ్ బ్రాస్లెట్!!
కొన్ని ఫ్యాషన్ లు కాలం మారినంత తొందరగా పాతబడవు. వాటిలో ఈ కఫ్ బ్రాస్లెట్ కూడా ఒకటి. బంగారం, వెండి, ఇతర రాళ్లు పొదిగిన దగ్గర నుండి వివిధ రకాల డిజైన్ల వరకు ఈ కఫ్ బ్రాస్లెట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న బ్రాస్లెట్లు ఇవే… వీటిని షర్ట్, టీ షర్ట్ వంటి ఫ్యాషన్ దుస్తుల నుండి గౌన్ లు, స్కర్ట్ లు వంటి దుస్తుల వరకు ప్రతిదానికి సెట్ అవుతాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలో అయినా సాధారణ ఔటింగ్ కి అయినా పార్టీస్ కు అయినా నప్పుతాయి. కాబట్టి వీటికి మీ ఫ్యాషన్ లో చోటిస్తే మిమ్మల్ని రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడిపిస్తాయివి.
లింక్ చైన్స్..
భారతీయులకు మెడలో ధరించే గొలుసులకు ఉన్న అటాచ్మెంట్ ఈనాటిది కాదు. అయితే కాలంతో పాటు ఈ గొలుసుల డైజైన్లు కూడా మారిపోతూ వస్తుంటాయి. ప్రస్తుతం 2023లో హాట్ హాట్ ఫ్యాషన్ గా నిలిచే చైన్స్ లో లింక్డ్ చైన్స్ చాలా ప్రముఖమైనవి. ఇవి కేవలం చైన్స్ లా మాత్రమే కాకుండా బ్రాస్లెట్ తో కలిపి జతగా వస్తాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఈ చైన్స్ ను చిన్న చిన్న వాటితో అటాచ్ గా లింక్ చేయడం వాటిని ధరించినప్పుడు ఒకదాని తరువాత ఒకటి స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ కనువిందు చేయడం భలేగా ఉంటుంది. కొత్తగా అట్రాక్ట్ అవ్వాలంటే ఈ లింక్డ్ చైన్స్ మీ ఖాతాలో ఉండాల్సిందే..
ముత్యాల మెరుపులు..
వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేది ఒక జ్యువెలరీ సంస్థ యాడ్. వజ్రం గురించి ఏమో కానీ ముత్యాలు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఎన్ని తరాలు మారినా కూడా ముత్యానికి ఉన్న ప్రాధాన్యత, వాటికి ఉన్న ప్రత్యేకత తగ్గదు. మహిళలు తమ నగల జాబితాలో బంగారం, వెండి వంటి నగలకు ఎంత చోటు ఇచ్చినా ముత్యం పేరు వింటే బంగారం, వెండిని పక్కన పెట్టి మరీ ముత్యానికి ఓటేస్తారు. ముఖ్యంగా బంగారం, వెండి లోకి ముత్యాలు ఎంతో పొందిగ్గా ఒదిగిపోతాయి. పెద్దగా ఉన్న చెవి పోగులలో ముత్యాలు పొదిగినవి స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటాయి. అందుకే ముత్యాలు ఎవర్గ్రీన్ అనుకోవచ్చు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
2022-2023 సంవత్సరంలో గడిచిన ఫ్యాషన్ ను ఒకసారి గమనిస్తే 80-90 మధ్య కాలంలో ఫ్యాషన్ ను రి క్రియేట్ చేసారని బాగా అర్థమవుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను నిజం చేస్తూ పాతతరం ఆభరణాలకు ఫ్యాషన్ నిపుణులు కొత్త మెరుగులు దిద్దారు. వాటి కోవలోనే మెడలో ధరించే ఆభరణాలను తలమీద ధరించడం, కడియం టైప్ గాజులు ధరించడం, చంకీలు ఇంకా చోకర్ శైలి ఆభరణాలు ట్రెండ్ గా మారాయి. 2023 లో కూడా ఇదే హవా కొనసాగుతుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.
భలే ఇయర్ బటన్స్…
ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ముఖాన రూపాయి కాసంత బొట్టు పెట్టి, ముక్కులో ఓ.. మోస్తరు ముక్కు పుడక, చెవులకు రాళ్లు పొదిగిన బటన్ కమ్మలు పెట్టుకునేవారు. అయితే అప్పుడు వారిని చాదస్తం అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడో.. నాటి కాలంవారి ట్రెండ్ నయా రూపం దాల్చింది. కేవలం నవరత్నాలతో సరిపెట్టకుండా ఎన్నో రకాల రాళ్లను కొత్తకొత్తగా ఇయర్ బటన్స్ తో జతచేస్తున్నారు. సెలెబ్రిటీస్ సైతం మంచి చీరకట్టు, హెయిర్ బన్ వేసి ఈ తరహా ఇయర్ బటన్స్ పెట్టి ఎక్కడ లేని హుందాతనాన్ని ఫ్యాషన్ లో మేళవిస్తున్నారు.
ఇలా పాత ఫ్యాషన్ మొత్తం కొత్తదనంతో కొత్త సంవత్సరంలో కొత్తగా మెరుస్తుంది. మిమ్మల్ని కూడా మెరిపిస్తుంది.
◆నిశ్శబ్ద.