Home » Fashion » ఎపిసోడ్ -10
"మీ పేరు తెలియదు." నీళ్ళు నిండిన కళ్ళతో ఓ యువతి అతడికి సమీపంలో నిలబడింది. శమంత్ భార్యేమో నెమ్మదిగా అంది "వెళ్ళిపోతున్నారా అన్నయ్యా."
సన్నని ప్రకంపన అతడిలో.
"కనీసం ఆయన స్పృహలోకొచ్చేదాకా వుండొచ్చుగా."
చేతులు జోడించింది. "ప్లీజ్".
లేదు. తనలాంటి కృతజ్ఞతలకి స్పందించడు. అసలు పోలీసులు, సాక్ష్యాలు... అభినందనలూ... యివేమీ తనకు యిష్టంలేనివి.
"మరోసారి వస్తాను."
"మీరు చేసిన సహాయానికి మూల్యం చెల్లించగలిగే శక్తి నాకు లేకపోయినా కనీసం మీ గాయాలు మానేదాకా అయినా మా ఆతిధ్యాన్ని అంగీకరించండి."
ఏ పాశమో అతడ్ని బంధిస్తూంది.
అతడి కుడి అరిచేతుకున్న బేండేజ్ ని చూస్తూ అంది. "ఓ తోబుట్టువుగా ప్రార్థన్ని మన్నించండి. ఈ గాయం మానేదాకా మీరు అన్నం తినలేరుగా" తనే తినిపిస్తానన్న సుతిమెత్తని ఆత్మీయత ఆమె గొంతులో.
"కనీసం మీరంటే యిప్పటికి చాలా ఆరాధన పెంచేసుకున్న మా పాపకోసం"
అప్పుడు చూసాడు శ్రీహర్ష.
ఓ స్తంభం చాటున నిలబడ్డ ఆరేళ్ళపాప తలని మాత్రం బయటపెట్టి కళ్ళను ఆల్చిప్పలా విస్ఫారితంచేసి చూస్తోంది.
మనసుపొరలు పూర్తిగా చిట్లిందిక్కడే.
జూలీ యింతే.
ఎప్పుడో ఒకనాడు తన యింటికివస్తే సరాసరి ఒడికిచేరేది కాదు. టేబుల్ వారన నిలబదో, ఫ్రిజ్ పక్కనుంచో యిలాగే తలవంచి కళ్ళు తిప్పుతూ అల్లరిచేసేది.
ఆగిపోయాడు తాత్కాలికంగా.
సరిగ్గా ఇదే సమయంలో.
బయట జీప్ లోంచి మహేంద్ర అనుచరులు శ్రీహర్షని గమనిస్తున్నారు.
"వాడే" శ్రీహర్షని చూస్తూ సాధించాల్సిన గెలుపుకోసం ఓ పథకాన్ని చెబుతున్నాడు లాయర్ శంకర్.
"ముందు దిగింది లాయర్ శంకర్.
"కమాన్" శ్రీహర్ష పాపకోసం చేయి చాచాడు.
పాపకళ్ళు మరింత విస్ఫారితాలయ్యాయి.
"మంచి పాపవిగా"
ఉత్సుకతగా అతడి చేతుల్లో వాలిపోయింది "పాపకాదు. నా పేరు లల్లూ. అంటే లాలిత్యన్నమాట."
పైకెత్తుకున్నాడు. "అంత మంచిపేరా నాకు... తెలీదు."
"రేవతి చెప్పలేదా."
"రేవతెవరూ."
"మమ్మి."
"మరి మమ్మీని అలా పేరు పెట్టి పిలవొచ్చా"
"డాడీ పిలుస్తారుగా"
"డాడీ పెద్దవాడుగా."
"మరి నేను చిన్నపిల్లనిగా" టక్కున అంది లల్లూ.
నవ్వేశాడు జూలీ గుర్తుకురాగా. భాషా ప్రాంతాలతో తేడాలేదు. పసి పిల్లలు వాళ్ళ యక్షప్రశ్నలు ఎక్కడయినా ఒకటే అనిపించడంతో "నువ్వు అల్లరి లల్లూవేమోకదూ." అన్నాడు చెంపలపై ముద్దుపెట్టుకుంటూ.
"కాదు. గడుగ్గాయిని."
"వెరీగుడ్" క్షణం ఆగి "నేనెవరో తెలుసా?" అడిగాడు.
"ఓ..."
"చెప్పుకోచూద్దాం?"
"దేవుడివి."
క్షణం తత్తరపడ్డాడు. "దేవుడేమిటి?"
"నీ పేరు."
"ఎవరన్నారు?"
"రేవతి... మరేమో నువ్వూ చిరంజీవిలా బాగా ఫైట్ చేస్తావటగా."
"చిరంజీవెవరు?"
"అయ్యోరామా" బోలెడంత జాలిపడిపోయింది. "సినిమాల్లో చేస్తాడే అతడన్నమాట. నాకు ఎంత యిష్టమో. వట్టి ఫైటింగ్ కాదు డాన్సులూ బాగా చేస్తాడు."
"నాకు డాన్సులు రావుమరి."
"నేను నేర్పుతా."
"నువ్వే...?
"మరేం. నేను బ్రేక్ డేన్స్ చేస్తా."
"నిజంగా!" తనూ ఆశ్చర్యాన్ని నటించాడు శ్రీహర్ష.
"మరి మా యింటికొస్తేనే."
పాప తల లాలనగా నిమిరాడు. ఒక చిన్న సంఘటనతో ఆ పసికందు మనసులో చాలా అపురూపమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాదు, శమంత్ భార్య రేవతి అలాంటి స్థానాన్ని సృష్టించేసింది.
"వస్తావా అంకుల్?"
జవాబు చెప్పలేదు.
శమంత్ యింకా స్పృహలోకి రాలేదు. ప్రాణాపాయంలేదు. ఒక చిన్న పొదరిల్లులాటి ఆ కుటుంబంలో యిప్పుడు ముగ్గురికీ తాను ఆత్మీయుడే...
"హల్లో"
లాయర్ శంకర్ పలకరించాడు శ్రీహర్షకు అభిముఖంగా నిలబడి. లల్లూ తల్లి దగ్గరికి పరుగెత్తింది.
"నిన్నే" శ్రీహర్షని చూస్తూ అన్నాడు శంకర్.
"చెప్పండి"
అతడెవరో యేమిటో అర్థంకాని శ్రీహర్షకి శంకర్ ఏకవచన ప్రయోగం చురుక్కుమనిపించినా హాస్పిటల్ ఆవరణలో ఓ మూలకి నడిచాడు.
"నా పేరు లాయర్ శంకర్."
"ఐసీ."
"నేను మహేంద్రకి లీగల్ అడ్వయిజర్ ని."
"వాడెవడు" టక్కున అడిగాడు శ్రీహర్ష.
"ఈదేశ ఉపప్రధాని కొడుకు."