Home » Yoga » ప్రసవం తర్వాత పొత్తికడుపు తగ్గించుకోవడానికి సులభమైన ఆసనాలు..!

ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో సాగిన కండరాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెరిగిన పొత్తి కడుపును తగ్గించుకోవడం చాలామందికి సవాలుగా మారుతుంది. అయితే క్రమం తప్పకుండా కొన్ని సులభమైన యోగాసనాలు వేయడం ద్వారా పొత్తికడుపును సహజంగా, సురక్షితంగా తగ్గించుకోవచ్చు.

అయితే యోగా ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సాధారణ ప్రసవం అయిన వారు నాలుగైదు వారాల తర్వాత, సిజేరియన్ అయిన వారు వైద్యుల సలహా మేరకు రెండు నుండి మూడు నెలల తర్వాత యోగా ప్రారంభించడం మంచిది. ప్రసవం తర్వాత పొత్తి  కడుపు కొవ్వు, పొట్ట తగ్గించుకోవడానికి మహిళలు చేయవలసిన ఆసనాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..

మొదట్లో శరీరాన్ని ఎక్కువగా శ్రమపెట్టకుండా ప్రశాంతంగా, చిన్నపాటి ఆసనాలతో మొదలుపెట్టాలి.

భుజంగాసనం..

పొత్తికడుపు తగ్గడానికి , నాభి వద్ద ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి  భుజంగాసనం ఎంతో సహాయపడుతుంది. పొట్టపై పడుకుని రెండు చేతులను ఛాతీకి ఇరువైపులా ఉంచి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసనం వల్ల పొత్తికడుపు కండరాలపై ఒత్తిడి పడి, అక్కడ ఉన్న కొవ్వు కరుగుతుంది. అలాగే నడుము నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

సేతుబంధాసనం..

 ప్రసవానంతర పొట్టను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లకిలా పడుకుని మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై ఉంచాలి. తర్వాత నడుము భాగాన్ని నెమ్మదిగా పైకి లేపి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచాలి. ఇది పొత్తికడుపు, తొడలు , పెల్విక్ భాగంలోని కండరాలను గట్టిపరుస్తుంది. గర్భాశయ ఆరోగ్యానికి కూడా ఈ ఆసనం చాలా మంచిది.

నౌకాసనం..

నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపి, ఆ తర్వాత కాళ్లను , వీపు భాగాన్ని ఒకేసారి పైకి లేపి శరీర బరువును పిరుదుల భాగంపై ఉంచాలి. ఈ సమయంలో శరీరం వి ఆకారంలో ఉంటుంది. ఇది నేరుగా పొత్తికడుపు కండరాలపై పనిచేసి, అక్కడ పేరుకుపోయిన కొవ్వును శరవేగంగా తగ్గిస్తుంది.

పవనముక్తాసనం..

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా పొట్ట భాగంలో ఉన్న అనవసరమైన గ్యాస్, వాపును తగ్గిస్తుంది. వెల్లకిలా పడుకుని మోకాళ్లను ఛాతీకి దగ్గరగా తెచ్చి రెండు చేతులతో పట్టుకోవాలి. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల పొత్తికడుపు భాగం సులభంగా లోపలికి వెళ్తుంది.

ఆసనాలతో పాటు ప్రాణాయామం , కపాలభాతి వంటి శ్వాసక్రియలు కూడా పొట్టను తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి.  పుష్కలంగా నీరు తాగాలి. ఇవన్నీ చేస్తూ ఈ ఆసనాలను ప్రతిరోజూ సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 


                      *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.