Home » Ladies Special » ఎపిసోడ్ -50
రాష్ట్రం మొత్తం గ్రాండ్ మాస్టర్ గురించి యింత విపరీతంగా చర్చిస్తున్న ఆ సమయంలో...
శ్రీహర్ష శమంత్ యింటికి వచ్చాడు.
రేవతిని చూడగానే మనసు చెదిరిపోయింది.
శమంత్ మరణం ఆమెనెంత కృంగదీసిందో తెలిసిపోయింది.
చిక్కిశల్యమైపోయిన రేవతి బ్రతుకుతున్న శవంలా వుంది... భోంచేసి ఎన్నాళ్ళయిందో మొహం పాలిపోయి ఆమెలోని జీవకళని చంపేసింది.
"లల్లూ యెక్కడమ్మా"
అతడి గొంతు పూడుకుపోయింది.
పిచ్చిదానిలా చూసింది జవాబు చెప్పకుండా.
"పాపయేది..."
తనకో పాపకూడా ఉందన్న విషయం గుర్తుకొచ్చినట్టు క్షణంలో తేరుకొని బెడ్ రూం కేసి నడిచింది రేవతి నీరసంగా.
"పాప నిద్రపోలేదు"
కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తూంది.
"ల... ల్లూ..." పిలిచాడు శక్తిని కూడగట్టుకుంటూ.
నెమ్మదిగా వెనక్కి తిరిగింది.
"అం... కు... ల్"
ఎన్ని రోజుల నిరీక్షణో మరి పాప కళ్ళు నీళ్ళను వర్షిస్తున్నాయి, "మరేమో డాడీ"
శ్రీహర్ష గుండె ఝల్లుమంది.
శమంత్ మరణించినట్టు పాపకి తెలిసిపోయిందా.
"... ఎంత యేడ్చినా రావటం లేదు... వూరెళ్ళలేదు... దేవుడి దగ్గరికి వెళ్ళారట... అంటే... యిప్పుడప్పుడే రారట... ..."
"ఎవరన్నారమ్మా" పైకెత్తుకున్నాడు అందోళన్ని అదిమిపెడుతూ.
"మమ్మీయే..."
ఏ గుండెపొర పగిలిందో గోడకి జారిగిలబడి రేవతి వెక్కి ఏడుస్తూంది.
అది ఏడుపు కాదు.
ప్రేవుల్ని బ్లేడ్లతో కోస్తుంటే బాధని దాచుకోలేక గుండెపడే పెనుగులాటలా ఉంది.
"డాడీ బేడ్ డాడీ కదూ... ..."
ఏమని జవాబు చెప్పగలడు?
"మరి మమ్మీని నన్నూ ఏడిపిస్తున్నారుగా. ఇంతకాలం మమ్మల్ని వదిలి ఎప్పుడూ వుండలేదన్నమాట... ..."
"దేవుడి దగ్గరకంటే చాలా దూరం కదా... అందుకే ఆలస్యం అయివుంటుంది"
"మరి నువ్వు దేవుడంకుల్ వి అందిగా..."
"ఎవరూ"
"మా మమ్మీ... అప్పుడే మరచిపోయావా..."
"లేదు లల్లూ. గుర్తుంది"
"దేవుడంకుల్ వి అయితే నీకు దేవుళ్ళు ఫ్రెండ్సేగా."
అన్యమనస్కంగా అన్నాడు "అవును"
"అలాంటప్పుడు దేవుడికి నచ్చజెప్పి డాడీని తీసుకురావచ్చుగా"
"నిజమే"
"తీసుకొస్తానని ఆరోజు మాటిచ్చావ్ గా."
ఎంతనమ్మకం యీ పసికందుకి.
"అలాగే తీసుకొస్తాను."
"ఎప్పుడు"
"దేవుడ్ని కలిసినపుడు"
"ఎప్పుడు కలుస్తున్నావ్"
నిర్లిప్తంగా నవ్వేడు. "వెంటనే కలుసుకోవాలని వెళ్ళిపోయేవాడ్ని లల్లూ. బహుశా నేను వెళ్ళక తప్పదేమో కూడా... కాని యిక్కడ చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయాయి."
అతడి మాటలు అర్థంకాలేదో లేక అంకుల్ కూడా అబద్ధం చెబుతున్నాడనిపించిందో ఉక్రోషంగా చూసింది "నువ్వూ బేడ్ అంకుల్ వే."
నిజమే.
ఇంతశక్తి ఉండీ శమంత్ ఆపదల్లోకి చొచ్చుకుపోతున్నాడని తెలిసీ రక్షించలేకపోయిన తను బేడ్ అంకుల్ గా అంగీకరించాడు.
"డాడీ కొంతకాలం కావాలని వూరెళ్ళాడని ఆరోజు గేస్ కొట్టావ్"
"అవునమ్మా. దేవుడంటే నీకు అర్థంకాదని అలా చెప్పాను."
"నాకిప్పుడు అర్థమైపోయిందిగా..."
"అయితే దేవుడ్ని ఈ రాత్రికి కలిసి మాటాడతాను... నా ఫ్రెండేగా" లల్లూ అన్నదాన్నే అందంగా చెప్పాడు.
"మరి డాడీ ఏ దేవుడి దగ్గరుంటాడు."
అబద్ధంలోనయినా ఆ క్షణానికి బుజ్జగించాలనుకున్నాడేమో అసంకల్పితంగా అనేసాడు. "మహావిష్ణువు దగ్గరే... ..."
"అంటే గరుత్మంతుడు మీద తిరుగుతాడు కదూ"
"మరేం."
"రక్కుతుంటాది."
"అవును. ఇదిగో రక్కేసాడు కూడా" మొన్నెప్పుడో డేవిడ్ మూలంగా అయిన గాయం బేండేజ్ ని చూపించాడు నమ్మకంగా...
పాప ఆసక్తిగా చూసింది.
చాలా కంగారుపడింది కూడా "మరెలా"
"రాత్రి బాగా పొద్దుపోయేక గరుత్మంతుడు నిద్రపోతుంటాడు. అప్పుడు విష్ణువు దగ్గరికి వెళతాను."
ఈ అయిడియా బాగానే వున్నట్టనిపించింది లల్లూకి.
"నా గురించి, మమ్మీ గురించి డాడీ చెప్పంకుల్."
"అలాగే."
"అంతేకాదు మరి. నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురావాలి."
జవాబు చెప్పలేకపోయాడు.
"కాని..."
"ఏమిటంకుల్."