"దొరకదు" అన్నాడు బండివాడు.
దేవదాసు ఇదే సందేహంతో గభాలున కూలబడిపోయాడు. యిక వెళ్ళడం పడదా అని మనసులో అనుకున్నాడు. అతడి ముఖం చూస్తుంటే అంతిమ ఘడియలు సమీపించినట్లుగా బాగా స్పష్టంగా కన్పిస్తున్నాయి. గ్రుడ్డివాడు కూడా ఆ సంగతి బాగా గ్రహించగలడు.
బండివాడు జాలిపడి "బాబుగారూ! ఒక యెద్దుల బండి మాట్లాడుకొని పొండి" అన్నాడు.
"ఎప్పటికి చేరుకుంటాను?" అడిగాడు దేవదాసు.
"దారి బాగోలేదు. అందువలన బహుశా రెండురోజులు పడుతుంది" అన్నాడు బండివాడు.
రెండురోజులు బ్రతికి వుంటానా లేదా అని దేవదాసు మనసులో లెక్క వేసుకుంటూ ఉన్నాడు. కాని పార్వతి దగ్గరకు వెళ్ళడం అవసరం. ఈ సమయంలో అతడి మనసులో గత కాలానికి సంబంధించిన అనేక కృత్రిమ ఆచార వ్యవహారాలు, చాలా అబద్ధపు విషయాలు ఒక్కొక్కటి వరసగా జ్ఞప్తికి వస్తూ ఉన్నాయి. కాని కడపటిరోజుకు సంబంధించిన యీ ప్రతిజ్ఞను నిజం చేయవలసి వుంటుంది. ఏ విధంగానయినా సరే, ఒకసారి ఆమెకు దర్శనమివ్వ వలసిందే. అయితే ఇప్పుడు ఈ జీవితానికి ఎక్కువ గడువు ముగిలిలేదు. దీన్ని గురించే ఎక్కువ చింతగా ఉన్నది.
దేవదాసు యెడ్లబండి మీద కూర్చోవడంతోనే ఆయనకు తల్లి గుర్తుకు వచ్చింది. ఆయన వ్యాకులంగా రోదించాడు. జీవితంలోని ఈ ఆఖరు సమయంలో మరో స్నేహమయియొక్క పవిత్రమయిన ప్రతిమ నీడ కనిపించింది_ఈ నీడ చంద్రముఖిది. ఆమెను పాపిష్టిది అని ఎప్పుడూ ఏవగించుకున్నాడు. ఈ రోజు ఆమెకే తన తల్లి సరసన గౌరవంతో కూడిన ఆసనం మీద ఆసీనురాలై ఉండటం చూసి ఆయన కళ్ళు బొటబొటా కన్నీళ్ళు కార్చాయి. ఇప్పుడు ఈ జీవితంలో ఆమెను మళ్ళీ కలుసుకోలేడు. అంతేకాదు, ఆమెకు చాలాకాలం వరకు ఆయన కబురు కూడా ఏమీ తెలియదు. అప్పటికీ పార్వతి దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది. పార్వతిని మరోసారి కలుసుకుంటానని దేవదాసు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఈరోజు ప్రతిజ్ఞను పూర్తి చేయాలి. దారి బాగాలేదు. వర్షం కారణంగా అక్కడక్కడ నీరు నిలిచి వుంది. కొన్నిచోట్ల అటూ ఇటూ ఉన్న కాలిబాట తెగి పడిపోయింది. దారి అంతా బురదతో నిండి ఉండి, ఎద్దులబండి అటూ ఇటూ ఒరుగుతూ పోతున్నది. కొన్నిచోట్ల దిగి చక్రాన్ని నెట్టవలసి వస్తున్నది. కొన్నిచోట్ల యెడ్లను నిర్దయగా కొట్టవలసి వస్తున్నది. ఎలా గయినా సరే ఈ పదహారు కోసుల దూరం ప్రయాణం చేయవలసిందే. మధ్యలో చల్లటి గాలి వీస్తూ ఉన్నది. ఈరోజు కూడా ఆయనకు సాయంకాలం తరువాత తీవ్రమయిన జ్వరం వచ్చింది. ఆయన భయపడిపోయి బండి మనిషిని "ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?" అని అడిగాడు.
"బాబూ, ఇంకా పది కోసుల దూరం పోవాలి" అన్నాడు బండి మనిషి.
"త్వరగా తీసికొని వెళ్ళు. నీకు మంచి బహుమతి లభిస్తుంది_"జేబులో వంద రూపాయల నోటు ఉన్నది. దానిని చూపించి "త్వరగా వెళ్ళు, వంద రూపాయలు బహుమతి ఇస్తాను" అన్నాడు.
దీని తరువాత ఎప్పుడూ, ఏ విధంగా రాత్రి గడిచిపోయిందో దేవదాసుకు తెలియలేదు. అప్పటినుంచి చైతన్య రహితంగానే ఉన్నాడు. ఉదయం స్పృహ వచ్చింది. "ఇంకా ఎంతదూరం ఉంది? ఏం-దారికి అంతు లేదా?" అన్నాడు.
"ఇంకా ఆరు కోసుల దూరం వుంది" అన్నాడు బండి మనిషి.
ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి "కొంచెం త్వరగా వెళ్ళు, ఇక సమయం లేదు" అన్నాడు దేవదాసు.
బండి మనిషి దీనిని అర్ధం చేసుకోలేకపోయాడు. అయితే నూతన ఉత్సాహంతో ఎద్దులను అదిలిస్తూ, తిడుతూ బండి తోలుతూ ఉన్నాడు. బండి సాధ్యమైనంత త్వరగా పోతూనే ఉంది. లోపల దేవదాసు విలవిలలాడి పోతున్నాడు. పార్వతిని కలుసుకుంటానా లేదా అనే ఆలోచన ఒక్కటే మనసులో తిరుగుతూ వుంది. చేరగలుగుతామా లేదా? మధ్యాహ్నం బండి నిలబడింది. బండిమనిషి ఎద్దులకు పొట్టు పెట్టాడు. తాను కూడా అన్నం తిని మంచినీళ్ళు తాగాడు. "బాబూ, మీరేమీ అన్నం తినరా?" అని అడిగాడు.
"లేదు, బాగా దప్పికగా వుంది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలవా?" అన్నాడు.
అతడు దగ్గరలో ఉన్న చెరువులో నుంచి నీళ్ళు తెచ్చి యిచ్చాడు. ఈ రోజు సాయంకాలం తరువాత జ్వరంతోపాటుగా దేవదాసు ముక్కులో నుంచి రక్తం బొట్లు బొట్లుగా పడుతూ వుంది. ఆయన శక్తి కొలదిగా ముక్కును గట్టిగా వత్తి పట్టుకున్నాడు. మళ్ళీ పంటి దగ్గర నుంచి రక్తం బయటికి వస్తున్నట్లుగా కన్పించింది. శ్వాసించడం కూడా కష్టమౌతూ ఉంది. రొప్పుతూ రొప్పుతూ అన్నాడు_"ఇంకా ఎంత దూరం....?"
ఇంకా రెండు కోసులు వుంది. రాత్రి పదిగంటలకు చేరుకుంటాము" అన్నాడు బండి మనిషి.
దేవదాసు చాలా కష్టంగా దారి వైపు చూసి- "భగవంతుడా!" అన్నాడు.
"బాబూ, ఆరోగ్యం ఎట్లా వుంది?" అన్నాడు బండి మనిషి.
దేవదాసు దానికి సమాధానం చెప్పలేకపోయాడు. బండి పోతూనే వుంది. కాని పదిగంటలకు చేరలేదు. దాదాపు రాత్రి పన్నెండు గంటలకు బండి హాథీపోతా జమీందారుగారి ఇంటి కెదురుగా రావిచెట్టు క్రిందికి వచ్చి ఆగిపోయింది.
బండి మనిషి పిలిచి "బాబూ, క్రిందకి దిగండి!" అన్నాడు.
ఏమీ జవాబు లభించలేదు. అప్పుడతడు భయపడి దీపం ముఖం దగ్గరకు తెచ్చి "బాబూ నిద్రపోయారా?" అన్నాడు.
దేవదాసు చూస్తూ ఉన్నాడు. పెదవులు కదిలించి ఏదో అన్నాడు. కాని ఏమీ శబ్దం వినిపించలేదు. "బాబూ!" అంటూ బండిమనిషి మళ్ళీ పిలిచాడు.
దేవదాసు చేయి యెత్తాలనుకున్నాడు, కాని యెత్తలేకపోయాడు. కేవలం రెండు అశ్రుబిందువులు ఆయన కనుకొలకుల నుంచి క్రిందికి రాలిపడ్డాయి. బండిమనిషి అప్పుడు తన బుద్ధితో ఆలోచించి వెదుళ్ళను కట్టి ఒక మంచం తయారుచేశాడు. దానిమీద పరుపు పరిచి ఎంతో కష్టంమీద దేవదాసును దానిమీదికి చేర్చి పడుకోబెట్టాడు. బయట ఒక మనిషి కూడా కన్పించడంలేదు. జమీందారింట్లో అందరూ నిద్రపోతున్నారు. దేవదాసు తన జేబులో నుంచి చాలా కష్టంతో ఒక వందరూపాయలనోటు బయటకు తీశాడు. లాంతరు వెలుగులో బండిమనిషి చూశాడు. బాబు తనవైపుకే చూస్తూ వున్నాడు. కాని ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఆయన పరిస్థితి చూసి నోటు తీసుకొని దుప్పటి చెంగున కట్టుకున్నాడు! శాలువతో దేవదాసు శరీరాన్ని కప్పాడు. ఎదురుగా లాంతరు వెలుగుతూ వుంది. దగ్గరలో కొత్త సహచరుడు బండిమనిషి వున్నాడు.
తెల్లవారింది. ఉదయం పూట జమీందారిగారి ఇంటిలో నుంచి మనుషులు బయటికొచ్చారు. ఎదురుగా ఆశ్చర్యకరమైన దృశ్యం! చెట్టు కింద ఒక మనిషి చచ్చిపోతూ ఉన్నాడు. చూడటానికి కులీనుడులాగా కన్పిస్తున్నాడు. శరీరం మీద శాలువ, పాదాలకు మెరుస్తున్న చెప్పులు, చేతిలో ఉంగరం అలాగే పడివుంది. ఒకరి వెంట ఒకరు వరసగా చాలామంది పోగయ్యారు. క్రమంగా యీ విషయం భువన్ మోహన్ బాబు చెవిన బడింది. ఆయన స్వయంగా డాక్టరును వెంటబెట్టుకుని వచ్చారు. దేవదాసు అందరివైపు చూశాడు. కాని అతడి కంఠం రుద్దమైపోయింది-ఒక్కమాట కూడా చెప్పలేకపోయాడు. కళ్ళ నుంచి కేవలం అశ్రువులు ప్రవహిస్తూ ఉన్నాయి. బండిమనిషి తనకు తెలిసిన సమాచారం వినిపించాడు. కాని దాని వలన ప్రత్యేకమైన సంగతులేమీ తెలియలేదు. "ఊర్ద్వశ్వాస నడుస్తున్నది" అన్నాడు డాక్టరు. "ఇక వెంటనే మరణిస్తాడు" అన్నాడు.
అందరూ "అయ్యో, ఆహా!" అన్నారు.
ఇంట్లో పైన కూర్చొని ఉన్న పార్వతి దయనీయమైన ఈ కథ విని "ఆహా!" అన్నది.
ఎవరో ఒక మనిషి జాలిపడి రెండు బొట్లు నీళ్ళు, తులసి ఆకు నోట్లోకి జారవిడిచాడు. దేవదాసు ఒకసారి అతడివైపు జాలిగా చూశాడు. తరువాత కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాలపాటు శ్వాస ఆడుతూ ఉంది. తరువాత అంతా శాశ్వతంగా శాంతించింది. ఇప్పుడు దహనకర్మ ఎవరు జరుపుతారు, ఎవరు తాకుతారు, ఏ జాతివాడు? మొదలైన వివిధ ప్రశ్నలను తీసుకొని వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. భువన్ బాబు దగ్గరలోని పోలీస్ స్టేషనుకు ఈ వార్త తెలియజేశాడు. ఇన్స్ పెక్టర్ వచ్చి దర్యాప్తు చేస్తూ వున్నాడు. ప్లీహమూ, ఊపిరితిత్తీ పెరిగిన కారణంగా మరణం సంభవించింది. ముక్కు నుంచి, నోటినుంచి రక్తం పడిన గుర్తులున్నాయి. జేబులో రెండు ఉత్తరాలు లభించాయి. ఒకటి తాల్ సోనాపుర్ కు చెందిన ద్విజ్ దాస్ ముఖోపాధ్యాయ బొంబాయిలో ఉన్న దేవదాసుకు వ్రాసినది. అందులో ఇప్పుడు డబ్బు ఏర్పాటు చేయలేము" అని వ్రాసి వుంది. రెండో ఉత్తరం కాశీనుంచి హరిమతీదేవి దేవదాసుకు "ఎట్లున్నావు" అని అడుగుతూ వ్రాసినది.
ఎడమ చేతిమీద ఇంగ్లీషులో పేరులోని మొదటి అక్షరం పచ్చపొడిచి వుంది. "ఈ వ్యక్తి దేవదాసు" అని ఇన్స్ పెక్టర్ నిశ్చయించి చెప్పాడు.
చేతి వ్రేలికి నీలం ఉంగరం ఉంది. దాని విలువ దాదాపుగా వందన్నర రూపాయలు వుంటుంది. శరీరం మీద వున్న శాలువా రెండు వందల రూపాయల విలువ చేస్తుంది. కోటు, షర్టు, ధోవతి మొదలైనవన్నీ వ్రాయబడ్డాయి. చౌదరీ, మహేంద్రనాథ్ ఇద్దరూ అక్కడ హాజరై వున్నారు. తాల్ సోనాపుర్ పేరు విని మహేంద్రుడన్నాడు..."చిన్నమ్మగారి పుట్టింటికి సంబంధించిన వ్యక్తి కాదు....!"
చౌదరీగారు వెంటనే ఆ మాటను మధ్యలో ఆపి "ఆమె ఇక్కడ గుర్తించడానికి వస్తుందా?" అన్నాడు.
ఇన్స్ పెక్టర్ గారు నవ్వి "నీకు పిచ్చెత్తిందా ఏం?" అన్నాడు.
Home » »
దేవదాసు
దేవదాసు