Home » » లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి
Home » » భోగేశ్వరాలయము
Home » » కోటగుళ్ళు చూశారా?
Home » » గండకీ శిల - సాలిగ్రామం
Home » » కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న
Home » » వ్యాధులని నయం చేసే నంజున్ దేశ్వరుడు
Home » » శ్రీ పళ్ళికొండేశ్వరాలయం
Home » » శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారక , గుజరాత్
Home » » పాండవుల మెట్ట
Home » » వడక్కునాథన్ ఆలయంలోని నేతి శివలింగం
Home » » తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం
Home » » రామ, రాయలు పూజించిన కాకాని మల్లికార్జునుడు
Home » » శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు
Home » » ఉప్పు లేని నైవేద్యాన్ని స్వీకరించే ఉప్పిలి అప్పన్
Home » » హిడింబికి కూడా గుడి ఉంది తెలుసా
Home » » శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు
Home » » మనాలి అంటే మనువు ఆలయమే!
Home » » ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు
Home » » శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, జూపూడి
Home » » గోమతీ నదీ తీరం ద్వారక
Home » » నవగంగలు కలిసే మహామాఘ పుష్కరిణి
Home » » శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం, తిరుక్కోవెలూరు పార్ట్ 1
Home » » హింగ్లాజీ మాతా మందిర్ (పంచ పాండవ గుహలు)
Home » » ‘మా’ చిన్తపూర్ణి
లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

 

లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి 


నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా.  కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!?  నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి.  అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.  ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.  ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో వున్న లింగాన్ని చూడవచ్చు.  నరసింహస్వామే అక్కడ ఆ రూపంలో వెలిశాడు.  దాని కధేమిటంటే...

వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్నిసురభి వంశానికి చెందిన  సింగమనాయుడు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ స్వామి ఆవిర్భావం జరిగింది.  సింగపట్టణం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డు వచ్చేది.  ఎన్నిసార్లు  దానిని తీసి పక్కకి పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డువస్తుంటే, ఆ రైతు చేసేది లేక,  తాను పేదవాడినని, పొలం పండిస్తేగానీ తన కుటుంబాన్ని పోషించలేననీ, తన పనికి ఆటంకాలు రానీయవద్దని శ్రీమన్నారాయణుడిని ప్రార్ధించాడు.   భక్తుడి మొరవిన్న భగవంతుడు ఆ రోజు రాత్రి సింగమనాయుడి కలలో కనిపించి, తాను ఉత్తర దిశలో వున్న పొలంలో వెలిశానని, తనని రైతు గుర్తించలేక పోయాడని, తనని గుర్తించి, ప్రతిష్టించి, పూజలు జరపమని ఆదేశించాడు.  రాజు తలచుకుంటే కాని పనేమిటి?  ఆయన తన పరివారంతో వెళ్ళి స్వామి చెప్పిన గుర్తుల  ప్రకారం వెదుకగా లింగ రూపంలో వున్న ఒక శిల కాంతులీనుతూ కనిపించింది. 

అదే రాత్రి కలలో స్వామి చెప్పిన విగ్రహంగా గుర్తించి, దానిని ఊరేగింపుగా  తీసుకుని ఊరిలోకి రాగా ప్రస్తుతం ఆలయం వున్న వెనక ఎత్తైన బండ దగ్గరకి వచ్చేసరికి స్వామి ఆ శిలను తెస్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నృసింహుడినని చెప్పారుట.  ప్రధమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు. కనుక దీనికి “పాదం గుడి” అని పేరు.  ఇక్కడ స్వామి పాదం గుర్తులున్నాయి.  అప్పటినుంచీ ఇప్పటిదాకా స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి.  అంతేకాదు, స్వామికి ఎండ తగలకుండా వుండటానికి మొదట్లో నాపరాయితో  చిన్న గుడి నిర్మించారు.  దానిని  నేటికీ గర్భగుడిలో భక్తులు దర్శించవచ్చు.

నరసింహస్వామికి ఒక కన్ను కిందకు, ఒక కన్ను మీదకు, ఎగుడు దిగుడుగా వుంటాయి.  ఎడమ కన్ను కింద భాగంలో కమలం వున్నది.  కమలం లక్ష్మీ స్ధానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడు అన్నారు.  ఈ కొండకు శ్వేతాద్రి అని పేరు. నరసింహస్వామిని ప్రతిష్టించిన సమయంలోనే ఆంజనేయస్వామినికూడా ప్రతిష్టించారు. 

ఈ స్వామి విశేషం లింగాకారంలో వుండటమేకాదు, హరి హరులకు భేదం లేదు అని తెలుపటానికా అన్నట్లు స్వామికి త్రిపుండ్రం (అడ్డ నామాలు), ఊర్ధ్వ పుండ్రాలు (నిలువు నామాలు) వున్నాయి.  పూర్వం శైవులకు, వైష్ణవులకు ఎవరికి వారే గొప్ప అనే వివాదం వుండేది.  ఆ సమయంలో ఈ స్వామి అర్చకత్వం ఎవరు వహించాలనే వాదన ఏర్పడింది.  ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబ, సమస్య పరిష్కారానికి  పుష్పగిరి పీఠాధిపతులను, జీయర్ స్వాములను ఆహ్వానించారు.  వారు స్వామివారికి అభిషేకం చేసి చూస్తే హరి హరులకు బేధాలు లేవు అని తెలపటానికా అన్నట్లు, స్వామికి అడ్డ నామాలతోపాటు నిలువు నామాలు కూడా కనిపించాయి.  అప్పటినుంచీ ఈ బేధాలు లేని స్మార్తులైన ఓరుగంటి  వంశీయులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు.  ఆ సమయంలోనే ఆలయానికి పక్కన శివాలయం, పుష్కరిణి కూడా నిర్మించారు.

మొదట నాపరాయితో చిన్నగా కట్టబడిన ఈ గుడి తర్వాత కాలంలో అభివృధ్ధి చెందింది.  నిజాం కాలంలో మంత్రి చందూలాల్ బహద్దూర్ ఈ దేవాలయానికి అనేక భూములు ఇచ్చారు.  అతి ప్రాచీనుడైన ఈ దేవునికి ఆలయం క్రీ.శ. 1795 లో నిర్మింపబడింది.  

పుష్కరిణి
ఇక్కడ పుష్కరిణిలో భక్తి శ్రధ్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలూ పోతాయని భక్తుల విశ్వాసం.  భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు తీర్చుకుంటారు.  అంతేకాదు, భక్తులు ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు, కురుపులు పోతాయని విశ్వసిస్తారు.   తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఆ ప్రాంతంలో జలాశయాలన్నీ ఎండిపోయినా,  ఈ పుష్కరిణిలో మాత్రం నీరు వుండటం ప్రత్యేకత.

రత్నలక్ష్మి అమ్మవారు
శ్రీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా అర కిలో మీటరు దూరంలో రత్నగిరి అనే కొండ వున్నది.  ఈ కొండమీద క్రీ.శ. 1857 లో రాణి రత్నమాంబ రత్నలక్ష్మీదేవిని ప్రతిష్టించారు.  ఈ కొండమీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం.

ఉత్సవాలు
సంక్రాంతి నుంచి వారం రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, తర్వాత 25 రోజులు జాతర జరుగుతాయి.  వీటికి అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.

మార్గము
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో వున్న ఈ క్షేత్రం కొల్లాపూర్ నుంచి 9 కి.మీ. ల దూరంలో వున్నది.

 పి.యస్.యమ్. లక్ష్మి


భోగేశ్వరాలయము

 

భోగేశ్వరాలయము

(మట్టెవాడ)

కార్తీక మాసం వచ్చిందండీ.  శివారాధకులకు ఈ మాసమంతా పండుగే.  ప్రతి శివాలయంలోనూ ఉత్సవాలే.

 

అయితే, ఆధ్యాత్మికంగా, చారిత్రికంగా అద్భుతమైన సంపదగల మన దేశంలోని ఆలయాలెన్నో  చరిత్ర పుటలలో మరుగునపడుతున్నాయి.   ఒక్కసారి వాటిని పరిశీలిస్తే అద్భుత చారిత్రక గాధలెన్నో తెలుసుకోవచ్చు.   ఇలాంటి సంపదను జాగ్రత్తగా కాపాడి మన భావితరాలవారికి అందించవలసిన మనం  వీటిని విస్మరిస్తున్నాం.  అలాంటివాటిని దర్శించటానికి కూడా అశ్రధ్ధ చేస్తున్నాము.     అందుకే ఈ కార్తీక మాసంలో కొన్ని అపురూప శివాలయాలను పరిచయం చేస్తున్నాను.

ఆధ్యాత్మిక, చారిత్రిక నిలయాలైన అద్భుతమైన ఆలయాలు కాకతీయ సామ్రాజ్యంలో ఎన్నోవున్నాయి.  కాకతీయ సామ్రాజ్యం అనగానే ఓరుగల్లు…అదే ఇప్పటి వరంగల్…రామప్పగుడి, వెయ్యిస్తంబాల గుడి, భద్రకాళి ఆలయం....ఏదయివుంటుందా అని ఆలోచిస్తున్నారా?  అవేవీ కాదండీ.  వాటి గురించి అందరికీ తెలుసు.  అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మరుగునపడుతున్న మాణిక్యంగురించి.  అదేమిటంటారా?


అదే భోగేశ్వర ఆలయం.  వరంగల్ రైలు స్టేషన్ కి దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల దూరంలో మట్టెవాడలో,  పోలీసు స్టేషన్కి పక్కనే వున్న సందులో వున్నది భోగేశ్వర  ఆలయం.  వరంగల్, చుట్టుపక్కలవారిలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించివుంటారు?  ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు చూడండి.  అయితే ఈ ఆలయం చాలా పెద్దదనో, శిల్ప సంపదతో అలరారుతోందనో అనుకోకండి.  మరి ఈ ఆలయం గొప్పదనాన్ని చెప్పేముందు ఈ ఆలయంవున్న ప్రాంతంగురించికూడా తెలుసుకుందాం.

 

కాకతీయులగురించి  జరిగిన పరిశోధనలలో తేలిన విషయం..   పూర్వం ఈ ప్రాంతం పేరు  మటియవాడ  అయి వుండవచ్చునని..  మటియ  అనే శబ్దానికి వ్యాపారమని అర్ధమట.  అలాగే ప్రస్తుతం హనుమకొండకి పూర్వనామం అనుమకొండట.  అనుమడు, కొండడు అనే ఇద్దరు ఎఱుకరాజులు ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి అనుమకొండ అనే పేరు వచ్చింది.  ఈ అనుమకొండలోనే  కాకతీయరాజులు కట్టించిన ప్రసిధ్ధచెందిన వెయ్యిస్తంభాలగుడి, భద్రకాళి, పద్మాక్షి అమ్మవార్ల దేవాలయాలు వున్నాయి.  ఆ కాలంలోనే ఈ అనుమకొండ ప్రసిధ్ధికెక్కినదనటానికి ఈ దేవాలయాలే నిదర్శనం.  చారిత్రాత్మకమైన ఓరుగల్లు – అనుమకొండల నడుమ ప్రజల సౌకర్యార్ధం  అభివృధ్ధిచెందిన వ్యాపార స్ధలం ఈ మటియవాడ.  కాలక్రమేణా మట్టెవాడ అయివుంటుంది.  అలాంటి వ్యాపారకేంద్రంలో వెలసిన ఆలయం ఈ భోగేశ్వరాలయం.


 

ఈ ఆలయానికి ఈ పేరు రావటానికి ఒక కధ చెబుతారు.  భోగి అంటే పాము.  ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికివచ్చి ఈశ్వరుని సేవించేదట.  భోగిచేత సేవించబడినవాడుకనుక భోగేశ్వరుడనే పేరు వచ్చిందంటారు. 

 

ఇలాంటి కధలు చాలాచోట్ల విని వుంటారు.  అయితే ఇక్కడి విశేమేమిటంటే స్వామి కొలువైన తీరు.   శివలింగం కింద లింగం – అలా 11 లింగాలు వున్నాయట.  ఇవి కనబడవు.   పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది.  పానవట్టము క్రింది భాగము బోలుగా వుంటుంది.  ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వున్నదట.    శీచక్రం బిందు స్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వున్నది.  అంటే అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి.  దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని,  అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు.  ఈ లింగాలలో మధ్యది సువర్ణలింగంట.


 

ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా, ఆ నీరు ఒక్కచుక్కయినా బయటకిరాదు.  ఎక్కడికి పోతున్నదో ఎవరికీ తెలియదు.  ఈ లింగానికి వెనుక భాగాన పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ప్రతిష్టించబడింది. 

ఈ దేవాలయం ప్రసిధ్ధిచెందకపోవటానికి వాస్తుదోషాలు కొన్ని వున్నాయని చెబుతారు.  స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు.  అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి.  అది శాస్త్ర సమ్మతం కాదంటారు.  నైఋతిలో బావి వుందన్నారుకానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట.  ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది.  ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే.

ఈ దేవాలయంలో క్షేత్రపాలకుడైన గణపతి విగ్రహం ఒకటి ఈ ప్రాంతంలోనే ఎక్కడో బోర్లపడివున్నదనీ, దానిని కనుక్కుని పునరుధ్ధరిస్తే ఈ దేవాలయం పూర్వ వైభవాన్ని పొందుతుందనీ శ్రీ శివానందమూర్తిగారి అభిప్రాయమట.

ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం  వుంటుంది.

ఇలాంటి దేవాలయాలని గౌరవించవలసిన అవసరం మనందరికీ వుంది.

పి.యస్.యమ్. లక్ష్మి


కోటగుళ్ళు చూశారా?

 

కోటగుళ్ళు చూశారా?


వరంగల్ జిల్లాలోని ప్రసిధ్ధ రామప్ప దేవాలయంగురించి చాలామందికి తెలిసే వుంటుంది.  దర్శించినవారుకూడా ఎందరో వుంటారు.  అయితే వీరిలో ఎందరికి ఆ ఆలయానికి 10 కి.మీ. ల దూరంలో వున్న కోటగళ్ళు గురించి తెలుసు అంటే చాలామందికి తెలియకపోవచ్చు.  రామప్పకి అంత సమీపంలో వేరే గుళ్ళుకూడా వున్నాయా అని ఆశ్చర్యపోవచ్చుకూడా.  మేము రామప్పగుడికి కనీసం పదిసార్లన్నా వెళ్ళి వుంటాము.  మాకు కూడా మొన్న వెళ్ళినప్పుడే తెలిసింది ఈ గుళ్ళు ఇక్కడికి ఇంత దగ్గరలో వున్నాయని.

రామప్ప దేవాలయానికి వెళ్ళే కమానులోకి తిరగకుండా సరాసరి వెళ్తే ఘనాపూర్ చేరుకుంటాం.  దీనినే ములుగు ఘనాపూర్ అంటారు.  వరంగల్ జిల్లాలోనే ఇంకొక ఘనాపూర్ (స్టేషన్ ఘనాపూర్) హైదరాబాదునుంచి వరంగల్ వెళ్ళే మార్గంలో వున్నది.  మేమూ ముందు ఈ గుళ్ళు అక్కడే వున్నయ్యనుకున్నాంగానీ ఈ మధ్య రామప్ప ఆలయం దర్శించినప్పుడు అక్కడ గైడు చెప్పారు..అక్కడికి 10 కి.మీ. ల దూరంలోనే వున్నాయని.  అప్పటికే చీకటి పడటంతో నివాసానికి వెళ్ళి మర్నాడు ప్రొద్దున్న వాటికోసమే మళ్ళీ వరంగల్ నుంచి రానూ పోనూ 164 కి.మీ. లు ప్రయాణం చేసి మొత్తానికి వాటిని చూశాము.


చూశారా  స్ధానికులుగానీ, ప్రభుత్వంగానీ సరైన శ్రధ్ధ చూపించకపోవటంవల్ల, తగిన ప్రచారం లేకపోవటంవలన ఎంతటి అద్భుత శిల్పకళ మరుగున పడిపోతున్నదో.  రామప్ప దేవాలయ కమాను దగ్గర అందరికీ కనిపించేటట్లు ఒక పెద్ద బోర్డు పెడితే ఆసక్తివున్నవారు చూస్తారుగా.  మేము వెళ్ళేటప్పుడు కూడా దోవ గురించి అడిగితే అక్కడేమున్నాయి?  పడిపోయిన గోడలుతప్ప అన్నారు. 

ఆంధ్రప్రదేశ్లో సమూహ ఆలయాలు, అంటే ఒకే ఆవరణలో వేరు వేరు ఆలయాల నిర్మాణం పూర్వం అంత జరిగినట్లులేదు.  ఆందుకే ఈ ఆలయ సమూహం అరుదైనదే.

అద్భుతమైన శిల్పకళా సంపదతో అలరారే ఈ ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్తలో వున్నాయి.  వీటి చరిత్రలోకి వెళ్తే .. కాకతీయుల పరిపాలనా సమయంలో గణపతిదేవ మహారాజు వీటిని నిర్మించాడంటారు.  ఈయన పేరుమీదే ఘనపూర్ కి ఆ పేరు వచ్చిందంటారు.  ఈ ఆలయాలతోబాటు ఇక్కడ ఒక పెద్ద చెరువుని కూడా తవ్వించాడు గణపతి దేవుడు.   ఇప్పటికీ ఉపయోగకరంగావున్న ఆ చెరువు దర్శనీయమే.

కోటగుళ్ళకి ఆ పేరు రావటానికి బహుశా చుట్టూవున్న కోటగోడలాంటి రాతితో నిర్మించిన ప్రహరీ కారణం కావచ్చు.  ఈ ప్రహరీ లోపల అతి విశాలమైన ఆవరణలో మొత్తం 22 గుళ్ళు వున్నాయి.   శిల్పంలోనూ, నిర్మాణంలోనూ వేటి శైలి వాటిదే.  వీటి మధ్యలో ప్రధాన ఆలయం గణపేశ్వరాలయం.  ఇక్కడ ఇప్పటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఇది రామప్ప దేవాలయంకన్నా పెద్దది. పక్కనే ఇంకొక శివాలయం .. కాటేశ్వరాలయం అని అక్కడ కనబడ్డ పిల్లాడు చెప్పాడు.  ఇది గణపేశ్వరాలయానికి రెప్లికా.  దానికన్నా శిధిలావస్తలో వున్నది.  గణపేశ్వరాలయంలో వివిధ మండపాలు .. అందులో సభా మండపం తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం.

రామప్ప దేవాలయంలోలాగానే ఇక్కడకూడా సాలభంజికలు, గజకేసరి విగ్రహాలుండేవి.  అసలు ఎన్ని వుండేవో తెలియదుకానీ ప్రస్తుతం మిగిలివున్న రెండు సాలభంజికలు రామప్ప దేవాలయంలోని శిల్పాలకన్నా అద్భుతంగా చెక్కబడ్డాయి.  అలాగే గజకేసరిలో సగం మనిషి,  సగం సింహం రూపం ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు, గుఱ్ఱంతల - సింహం నడుముతో ఏనుగుమీద స్వారీ చేస్తున్నట్లు కూడా వున్నాయి.  రామప్పలో  గజకేసరి శిల్పంలో మనిషి వుండడు.   ముఖ్యాలయానికి దక్షిణంగా అనేక స్తంబాలు కలిగిన మండపం వున్నది.  దీనిలోపల కప్పుకి పద్మాలు చెక్కబడివున్నాయి.  చుట్టూవున్న 19 చిన్న ఆలయాలన్నీ గర్భ గృహం, అంతరాలయం కలిగివున్నాయి.

సందర్శకులు ఎక్కువగా రానందున పూజారిగానీ, గైడుగానీ ఎప్పుడూ అందుబాటులో వుండరు.  మమ్మల్ని చూసి ఒక 15 ఏళ్ల అబ్బాయి వచ్చాడు.  అప్పటికే శివాలయంలో పూజ జరిగింది.  పుష్పాలతో శివలింగం, పానువట్టం చక్కగా అలంకరించబడివున్నది.  ఆ అబ్బాయే చొక్కా విప్పి దేవుడికి హారతి ఇచ్చాడు.   గైడుకి కూడా ఫోన్ చేశాడు మా ఫోన్తో.  కానీ కలవలేదు. 

ప్రకృతి భీభత్సాలకి, శతృవుల దాడులకు, మానవుల వికృత చేష్టలకి అనేక విగ్రహాలు ధ్వంసమయి, ఆలయాలు చాలామటుకు శిధిలమయిన తర్వాతకూడా ఈ గుళ్ళు పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయంటే, అవి సరిగ్గా వున్ననాటి వైభవం వూహించుకోవచ్చు.  ఇంత అపురూప కళాఖండాలని రక్షించుకుని, ఆలయాలను పునర్నిర్మిస్తే ఎంతటి అద్భుత కళాసంపద మనదవుతుందో!!

ఆ అబ్బాయి  ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ గుళ్ళ పునరుధ్ధరణకి 4 కోట్ల రూపాయలు పైన మంజూరయినాయి.  ఆర్కియాలజీ డిపార్టుమెంటువారి ఆధ్వర్యంలో  జీర్ణోధ్ధరణ జరుగుతున్నది.   చుట్టూ ప్రహరీ గోడ కొంత మరమ్మత్తు చేశారని చూపించాడు.   ప్రవేశద్వారం వద్ద కుడివైపు గుంతలు తవ్వుతున్నారు.

ఇలాంటి అద్భుత ఆలయాల పోషణలో, ప్రచారంలో, పరిరక్షణలో,  స్ధానికులు ఎక్కువ శ్రధ్ధ చూపిస్తే  ఎన్నో కళా నిలయాలను మనం కాపాడుకోవచ్చు.

ఘనపూర్ వరంగల్ కి 82 కి.మీ. ల దూరంలోవుంది.  వరంగల్ నుంచి వెళ్ళేవారు యన్.హెచ్. 202 లో ములుగు రోడ్డులో వెళ్ళాలి.  ములుగుదాటి 5 కి.మీ. వెళ్ళిన తర్వాత ఎడంవైపు తిరిగి 12 కి.మీ. వెళ్తే కోటగుళ్ళు చేరుకోవచ్చు.  రామప్ప దేవాలయం దర్శించినవారు, దాని కమాను ముందునుంచి సరాసరి వెళ్తే 10 కి.మీ. ల దూరంలో వున్నది.  కరీంనగర్ నుంచి 110 కి.మీ. లు.  కరీంనగర్ – వరంగల్ స్టేట్ హైవేలో హుజూరాబాదుదాకా వచ్చాక ఎడమవైపు పరకాల వెళ్ళే రోడ్డులోకి తిరగాలి.  భూపాలపల్లి – పరకాల రోడ్డులో గాంధీనగర్ (పరకాలనుంచి 20 కి.మీ. లు) వెళ్ళాక కుడివైపు తిరిగి 9 కి.మీ.లు వెళ్తే కోటగుళ్లు చేరుకోవచ్చు.  

మార్గమంతా  సుందర ప్రకృతి దృశ్యాలమధ్య పొడవైన తాటి చెట్లు స్వాగతం చెబుతున్నట్లు కనువిందు చేస్తూవుంటాయి..

 

 

 

... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


గండకీ శిల - సాలిగ్రామం

"గండకీ శిల - సాలిగ్రామం"

"ద్వారకా శిల - చక్రాంకితాలు" - రెండూ విష్ణు స్వరూపాలే!

 

 


                   సాలిగ్రామం అంటే శిలరూపంలోవున్న విష్ణు మూర్తి అవతారం! అవి ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావు . హిమాలయాలలో, నదీ ప్రవాహం లో చాలా కొద్ది చోట్ల మాత్రమే లభిస్తాయి . అందులోనూ చాలా రకాలున్నాయి. నేపాల్ లోని గండకీ నదిలో లభించే ఈసాలిగ్రాములు ఎంతో పవిత్రమైనవి. సహజంగా రాతిలోనే చక్రాలుగా, అనేక చిన్న చిన్న రంద్రాలుగా, ఇంకా అనేక గుర్తులతో ఏర్పడుతుంటాయి . వీటిని పూజా మందిరంలో దేవతార్చన డబ్బాలో పెట్టి రోజూ మడితో పూజ చేస్తారు.  పురుషసూక్తం చదువుతూ సకలషోడశపచారాలతో పూజ చేస్తారు. మహా నైవేద్యం సమర్పిస్తారు. ఇది అందరూ కూదా చేయలేరు. స్త్రీలు అసలు చేయరు... తాకరు . కుటుంబ సభ్యులు మాత్రమే వాటిని  పూజించే అర్హత  వుంటుంది. బయటి వారికి చూపించరు.

 


సాలిగ్రాము - తులసి


పూజా సమయంలో  తప్పనిసరిగా  సాలిగ్రాములతో పాటు  తులసి దళాలను  కూడా పక్కన  వుంచి  పూజ  చేస్తారు. సాలిగ్రాముకి  తులసికి  కార్తీక  మాసం లో వివాహం చేస్తారు.  తులసి సాలిగ్రము  అంటే  విష్ణుమూర్తి ని  ప్రేమించి  వివాహం  చేసుకుంది.  ఈ  కథ  అందరికి  తెలిసిందే .   నార్త్  లో  సాలిగ్రామ శిలకి తులసి  ప్రతిమకి  వైభవం గా వివాహం  చేస్తారు . ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలలో  కూడా  తులసికి శ్రీకృష్ణుడికి కల్యాణం  చేస్తారు ..  


సాలగ్రామం అంటే  విష్ణుమూర్తి అని భావించి   పంచ గవ్యం,  పంచామృతాలతో  అభిషేకించి,  పూలు, పళ్ళు,  ధూప దీప  నైవేద్యాలతో  అర్చించాలి.  అనంతరం  తీర్థ ప్రసాదాలు  స్వీకరిస్తే సర్వ శుభాలు  కలుగుతాయి.   తులసి  పురాణ  కధలే  కాదు  ఇంకా అనేక  కథలు  ప్రాచుర్యం లో వున్నాయి.  కాలనేమి  పుత్రిక  బృంద జలంధరుడిని  వివాహం  చెసుకుంటుంది. కాని జలంధరుడు తన రాక్షస  స్వభావంతో  అందరినీ హింసిస్తుం టాడు.  బృంద  ప్రాతివత్య మహిమతో  అతనిని  ఏమి  చేయలేక పోతారు బ్రహ్మాది  దెవతలు.  బృందకి  ప్రాతివ్రత్యానికి భంగం  వాటిల్లితే  తప్ప  జలధరుని సంహరించ లేరని  తెలిసి,   శరణు వెడు తారు.  విష్ణుమూర్తి  లోక సంరక్షణార్థం  జలంధరుని  రూపం  ధరించి  బృందని  మోసగిస్తాడు .విష్ణువు  నిజ స్వరూపం  తెలిసిన  బృంద శిలగా మారమని  శపిస్తుంది. ఈ విధంగా  విష్ణుమూర్తి  శిలగా  మారాడని ఒక కధనం వుంది .  
మహాభారతం లో కూడా శ్రీకృష్ణుడు సాలిగ్రామ  లక్షణాలను  ధర్మరాజు కి  వివరించినట్లు వుంది.

 


మన దేశంలోనూ  ఇతర  దేశాల్లోనూ  ఉన్న  దేవాలయాలలో  సాలిగ్రాములని పూజిస్తారు. మనకి లభించే  సాలిగ్రమాల్లో  కూడా కొన్ని ఎంతో  పవిత్రమైనవి.  సాలిగ్రామాలని  పూజించటం ద్వారా  ఉజ్వల  భవిష్యత్తుని, సంతానాన్ని, సంపదలని, , శాంతిని, ఇలా ఎన్నో  లభిస్తాయనీ అంటారు.  
వైష్ణవులు అతి పవిత్రంగా సాలిగ్రామలనుపూజిస్తారు.   కొన్ని నియమాలు  పాటిస్తారు .
స్నానం చేయనిదే  సాలిగ్రామాన్ని  తాకరు.  నేలమీద  వుంచరు. సాత్వికమైన  ఆహారాన్ని  తీసుకుంటారు. చెడు  పనులు చేయరు.
                  నేపాల్ లోని కాళీ -  గండకి నదీ ప్రవాహంలో  లభించే సాలిగ్రామాల్లో విష్ణుమూర్తి అవతారాలు  సహజ  సిద్ధంగా  శిలా రూపం లో లభిస్తాయి. శంఖ, చక్ర, గద,రూపాలు శిలపై వున్న  చక్రాలను ,  వాటి  ఆకారాలను  బట్టి  వివిధ  నామాలున్నాయి.   ఒకే  చక్రం  వుంటే  సుదర్శన  చక్రం అని అంటారు. లక్ష్మ, నరసింహ  కూర్మావతారాలలో  కూడా  సాలిగ్రాములు  లభిస్తాయి.
సాలిగ్రామాలలో  వారి రంగు, చక్రాల  గీతాలు ,  సైజ్ ను బట్టి  అది ఎలాటి  సాలిగ్రామమో నిర్ణయిస్తారు. 25 రకాల  సాలిగ్రమలున్నాయి. వీటిల్లో  కొన్ని

 

 

రెండు చక్రాలు - లక్ష్మీనారాయణ ,

మూడు చక్రాలు - అచ్యుతుడు

నాలుగు చక్రాలు - జనార్ధుడు

ఐదు చక్రాలు - వాసుదేవుడు

ఆరు చక్రాలు - ప్రద్యుమ్నుడు

ఏడు చక్రాలు - సంకర్షణుడు  

ఎనిమిది చక్రాలు - పురుషోత్తముడు  

తొమ్మిది చక్రలు - నవవ్యూహం

పది చక్రాలు  - దశావతారం

పదకొండు చక్రాలు - అనిరుద్ధుడు

పన్నెండు చక్రాలు - ద్వాదశాత్ముడు  

పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని అంటారు.

 

 

 
శిలారూపం లో లభించే సాలిగ్రాములు  కొన్ని జలాశయాలలోనూ , కొన్ని పర్వత ప్రాంతాలలోనూ లభిస్తాయి .  అవే జలజ, స్థలజ అని అంటారని వరాహ పురాణంలో  వుంది .
దేవాలయాలలోనే  కాదు  ఈ  సాలిగ్రామాల  అర్చన  గృహాలలోనూ , గృహ ప్రవేశాల సమయంలో, వాస్తు పూజా సమయంలో, .  వివాహాల సమయంలో ,చెస్తారు
అలాగే  హిమాలయాలలోని  బద్రీనాథ్ ఆలయంలోని  నారాయణుడు కూడా  సాలిగ్రమమే అని అంటారు . ఆది  శంకరాచార్యుల వారికి  అలకా నదీ ప్రవాహం లో  బదిరీ నారాయణుడి విగ్రహం  లభించిందని ,  దానిని  వారు బదిరీ లో ప్రతిష్టిం చారని  అక్కడి  స్థల పురాణం  చెబుతోంది.   ఉడిపి లోని  శ్రీ కృష్ణుడు కూడా సాలిగ్రామ రూపధారి .

 

 


ద్వారావతి శిల - ద్వారకా శిల
నల్లని గుండ్రని రాతిలో విష్ణు స్వరూపం నదీ ప్రవాహాల్లో లభిస్తే.... తెల్లని రాతిలో గుండ్రంగా చక్రాలు రాతిమీద చిన్నచిన్నవిగా లభిస్తాయ.   చక్రాంకితాలు అని పిలుస్తారు వీటిని. ఇవి ఎక్కువగా గోమతి నదిలో దొరుకుతాయి.ద్వారకా నగర నదీ తీరం  గోమతి నది.  ఇక్కడ శిలా రూపంలో  చక్రాంకితాలు లభిస్తాయి.  ఇవి  తెల్లగా వుండి చక్రాలు చక్రాలు గా వుంటాయి .  ఇక్కడ దొరికే  శిలల పై  ఒక చక్రం వుంటే దేవేసుడని, రెండు  వుంటే  సుదర్సనుడని అంటారు.  ప్రహల్లాద సంహిత లో ఒక చక్రం  వుంటే సుదర్శనమని, రెండు చక్రాలు వుంటే  లక్ష్మి నారాయణులని వుంది.  తెల్లటి శిల లపై  లభించే చక్రాల సంఖ్యను బట్టి  విష్ణుమూర్తి అవతారాలు గా  పిలుస్తారు. ఒక్కో చక్రం ఒక్కో  ఫలితాన్ని స్తుంది.   
సాలిగ్రాముల గురించి స్కంద పురాణం, బ్రహ్మపురాణం, వరాహ పురాణం, గరుడ పురాణం ఇలా ఎన్నో పురాణాలలో సాలిగ్రాముల ప్రస్తావన వుంది.  
ద్వారకా శిలలు  సాలిగ్రాముల లాగా  అంత  ప్రాముఖ్యత  లేదు.  చిన్నవిగా,  పలుచగా వుండి తెల్లటి  రాతి మీద  చక్రాలు  వుంటాయి.  చక్రాల  సంఖ్యను బట్టి  వాటికి  వివిధ  నామాలు వున్నాయి.
 గండకి  శిలలు  వివిధ  రకాల  సైజులలో వుండి వాటిపై  రక రకాల  గుర్తులు  సహజ సిద్ధంగా వుంటాయి.  వాటిపై  గుర్తులను బట్టి  సాలిగ్రామ విష్ణుమూర్తి  అవతారాలు, మనం చెప్పే  విష్ణు నామాలుగా వర్ణిస్తారు . అవే అచ్యుత, నారాయణ, జనార్ధన, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ,  వాసుదేవ  ఇత్యాది నామాలు సాలిగ్రామాలకి  వున్నాయి .

 


ఆరాధన :
సౌరాష్ట్ర, మహారాష్ట్ర, బెంగాల్ మొదలైన  రాష్ట్రాలతో  పాటు  'మధ్వ' శాఖ  బ్రాహ్మాణులు, ఇతర  శాఖ వారు ఎక్కువగా  సాలిగ్రాములను పూజిస్తారు .
 ఇవి వున్న ఇంట ఎంతో నిష్టగా పూజా పునస్కారాలు చేయాలి. రోజూ నిత్య నైవేద్యం పెట్టాలి . దేవతార్చన డబ్బా పులిచర్మం తో తయారు చేసినది కాని, వెదురు బుట్టలో (చిన్నవి) కాని పెట్టి తులసీ దళాలతో పూజిస్తారు . చాలా చోట్ల అసలు సాలిగ్రాము లంటూ నకిలీవి కూదా వుంటాయి . జాగ్రత్త గా చూసి కొనుక్కోవాలి . అంతే కాదు అవి దేవతార్చన సమయం లో తప్ప వాటిని ఇతర విగ్రహాల లాగా బయట వుంచ

 ఇప్పటి కాలంలో పూర్వకాలపు మడి ఆచారాలు తగ్గిపోవటంతో చాలా మంది సాలిగ్రామ పూజ నిష్ఠగా చేయలేక వాటిని ఇంట్లో పెట్టుకోవటం లేదు..

సాలగ్రమాల్లో రూ.200 నుంచి రూ.1,00,000 వరకు  లభిస్తాయి.  పూజ మందిరాలలో  చిన్న చిన్న  సలిగ్రమాలకే  పూజ  చేస్తారు. అభిషేకాలతో పూజ చేసిన అనంతరం  కొన్ని చోట్ల  వీటికి  అలంకారం  చేస్తారు.  కళ్ళు, ముక్కు, చెవులు, వస్త్రాలు, ఆభరణాలు   వంటివి  అలంకరించి  పూజచేస్తారు

 

 

 

 

....Mani Kopalle


కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న

 

కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న



               

                                                                                

తెలంగాణాలోని ఓరుగల్లు ప్రాంతాన్నేలిన  కాకతీయ రాజులు శివ భక్తి పరాయణులు.  వారు పరమశివుని ఆరాధించటమేగాక, శివునిపట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు.  వారు నిర్మించిన రామప్ప, వెయ్యి స్తంబాల గుడి, వగైరా అనేక ప్రసిధ్ధ శివాలయాలను వరంగల్ జిల్లాలో నేటికీ దర్శించవచ్చు.  అలాంటి దేవాలయాలలో ఒకటి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు.  పరమ శివుడు ఇక్కడి తన భక్తులను కాపాడటానికి వీరశైవమతారాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు సుతుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం.  తర్వాతకూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు.

 

 

భక్తులచేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జునస్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు.  దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు.  మట్టితో చేసిన ఈ విగ్రహం  షుమారు 500 సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది.  

 

కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలో వున్న మండపములు విస్తరించబడ్డాయి.  సత్రాలు, నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి.  దేవాదాయశాఖవారి ఆధ్వర్యంలో వున్న ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువే.  సదా సందడిగా వుండే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  కొమరవెల్లి మల్లన్న జాతరగా ప్రసిధ్ధిగాంచిన ఈ బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంత్రి తర్వాత వచ్చే మొదటి ఆదివారంనాడు ప్రారంభమై ఉగాదిదాకా సాగుతుంది.  ఆ సమయంలో ప్రతి ఆదివారం ఉత్సవాలు, బోనాలు వగైరా సందడిగా జరుగుతాయి. తమకి అండదండగా నిలిచి సదా కాపాడే ఈశ్వరునికి బోనాలు సమర్పించి ఆయనకు కృతజ్ఞతులు తెలుపుకుంటారు.  ఈ ఉత్సవాలలో స్వామిపట్ల భక్తులకుగల భక్తిప్రత్తులకు నిలువెత్తు అద్దం పట్టినట్లు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

 

 

జాతర సమయంలో భక్తులను విశేషంగా ఆకర్షించే ఇంకొక వేడుక పెద్ద పట్నం.  ఇది శివరాత్రి రోజున జరుగుతుంది.  భక్తులు ఆలయం ముందు ముగ్గు వేసి, భగవంతుని కీర్తిస్తూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు.  అలాగే జాతర మొదటి రోజు, చివరి రోజు జరిగే అగ్ని గుండాలు, అంటే నిప్పుల మీద నడవటం, భక్తి శ్రధ్ధలతో చాలా ఉత్సాహంగా జరుగుతాయి.

 

స్వామి ఆలయానికి కొంచెం దూరంలోనే కొండపై రేణుకా దేవి వున్నది.  ఈవిడ మల్లికార్జున స్వామికి సోదరిగా భావించి భక్తులు జాతర సమయంలో ఈవిడకి కూడా బోనాలు సమర్పిస్తారు.  జాతర జరిగే సమయంలో ఆదివారాలు ఆ ప్రాంతమంతా బోనాలు సమర్పించే భక్తులతో నిండిపోయి వుంటుంది.  పసుపు కుంకుమలతో అందంగా అలకరించిన పాత్రలపై దీపం వెలిగించి తలపై పెట్టకుని స్వామికి, రేణుకా దేవికి బోనాలు సమర్పించటానికి వరుసగా కొండపైకి ఎక్కే భక్తుల బారులు చూడటానికి రెండు కళ్ళూ చాలవు.  రాత్రి 7 గం. ల దాకా మాత్రమే సాగే ఈ బోనాల ఉత్సవాన్ని చీకటి పడ్డాక కొండ కిందనుంచి చూస్తే బారులు తీరిన దీపాలు కదులుతున్నట్లు అందంగా వుంటుంది ఆ దృశ్యం.

 

 

ఆలయం ఎదురుగా వున్న బండి చక్రాలు (రధం ఆకారంలో వున్న కట్టడం) స్వామి రధంగా భావించి పూజిస్తారు భక్తులు.  బోనాలు, అగ్ని గుండాలు వగైరా సంబరాలన్నీ ఇక్కడే జరుగుతాయి.

 

మల్లికార్డునస్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం వున్నది.  శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్ధాపకులు, ప్రచారకులు.

 

ఈ ఆలయానికి 20కి.మీ. ల దూరంలో గ్రామ దేవత కొండ పోచమ్మ ఆలయం వుంది.  ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు.  స్వామిని జాతర సమయంలో దర్శించి, ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండ పోచమ్మ ఆలయానికి చేరుకుని, ఈ తల్లిని కొలిచి, మంగళవారంనాడు బోనాలు సమర్పిస్తారు.  ఈ ఆలయం చిన్నదే అయినా, అమ్మవారు తనని నమ్మినవారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి.

 

దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వివిధ సేవలకోసం ఆన్ లైన్ లో రిజర్వు చేసుకునే సౌకర్యం కల్పించారు.

 

మార్గము: వరంగల్ కి 110 కి.మీ., సిధ్ధిపేటకి 22 కి.మీ, హైదరాబాదునుంచి 90 కి.మీ. ల దూరంలో వున్నది కొమరవెల్లిలోని ఈ ఆలయం. కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా, చేర్యాల మండలంలో వున్నది.  సికిందరాబాదు, వరంగల్, హనుమకొండ, సిధ్ధిపేట, వేములవాడనుంచి బస్ సౌకర్యం వున్నది.  హైదరాబాదు నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారిలో, హైదరాబాదునుంచి షుమారు 90 కి.మీ. లు వెళ్ళాక కుడి వైపు కమాను కనబడుతుంది.  దాన్లోంచి 4 కి.మీ. లు వెళ్తే కొమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జునుని చేరుకోవచ్చు.

.

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


వ్యాధులని నయం చేసే నంజున్ దేశ్వరుడు

వ్యాధులని నయం చేసే నంజున్ దేశ్వరుడు

 

 

ఈ ఆలయంలోని శివునికి పూజలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులే కాదు మొండి రోగాలు కూడా మాయమవుతాయట. ఈ పుణ్య క్షేత్రాన్ని దక్షిణ కాశి  అని కూడా అంటారు. ఇది కర్ణాటక రాష్ట్రo లోని మైసూరు కి దగ్గ్గరలో ఉన్న నంజున్ గడ్ జిల్లాలో  ఉంది. ఇక్కడి శివుడిని శ్రీ కంఠ ఈశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేసారని ఆలయ శిలాఫలకాలు చెప్తున్నాయి.


నంజ అంటే విషం,నంజుంద అంటే విషం తాగి లోకాన్ని రక్షించివాడు అని అర్ధం వస్తుంది. సముద్రమథన సమయంలో వచ్చిన విషాన్ని సేవించిన శివుడు లోకాన్ని మొత్తం రక్షించి నీలకంటుడిగా పూజలందుకున్నాడు. ఆ అవతారమే ఇక్కడ ప్రతిష్ఠ గావించబడింది. ఆలయం దగ్గరలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి ఉరుల్ అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధి అయినా క్రమంగా తగ్గుముఖం పడుతుందిట. పూర్వం కర్నాటకని పాలించిన టిప్పుసుల్తాన్ ఏనుగుకి కళ్ళ సంబందిత వ్యాధి వచ్చి ఎంతకీ తగ్గకపోతే ఇక్కడ నంజున్ దేశ్వరుడికి పోజలు చేయిస్తే వెంటనే తగ్గిందట. ఆ ఆనందానికి నిదర్శనంగా టిప్పు స్వామి వారికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడట.

 

 


ఈ శ్రీకంటేశ్వర ఆలయంలో ప్రతి ఏడాది రెండు సార్లు రథోత్సవం నిర్వహిస్తారట. ఒకటి దొడ్డ రథోత్సవం రెండవది చిక్క రథోత్సవం . ఈ రథోత్సవం మూడు రోజులు జరుగుతుంది. అయిదు రథాలతొ జరిగే ఈ ఉత్సవం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ రథాలలో శివుడిని,.పార్వతి దేవిని,గణపతిని,కుమారస్వామిని,చండికేశ్వరుడిని తిరువీధులలో ఊరేగిస్తారు. మూడు రోజులు జరిగే ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాలని లాగి తమ భక్తిని చాటుకుంటారు.


ఇక్కడికి దగ్గరలోనే పరశురామ క్షేత్రం ఉంది. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుక శిరస్సుని ఖండించి ఆ వ్యథతో తనకు చిత్తశాంతి కలగటానికి ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించాడట,కాని ఎక్కడా లభించని మనశ్శాంతి ఇక్కడికి వచ్చేసరికి లభించటం తో ఇక్కడే ఉండిపోయి తపస్సు చేసుకున్నాడట. శ్రీ కంఠ ఈశ్వరుడిని దర్శించుకునే వారు ముందుగా ఈ పరశురామ క్షేత్రాన్ని దర్శించాలిట.

 

 


ఈ ప్రాంతంలోని మరో విశేషం కపిల నదిపై కట్టిన వంతెన. ఇది దేశంలోనే అతి పురాతన బ్రిడ్జ్ గా పేరుపొందిదట. 1735 లో కట్టిన ఈ వంతెన ఇప్పటికి చెక్కు చెదరలేదు. అలాగే ఇక్కడి అరటిపండుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది తెలుసా. నంజన్ గుడ్ రసభాలే అనే జాతిక్ చెందిన ఈ అరటి ఎంతో రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట.


ఇన్ని విశేషాలతో ప్రఖ్యాతి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని చూసి తరించక తప్పదు కదా!

...కళ్యాణి 


శ్రీ పళ్ళికొండేశ్వరాలయం

 

శ్రీ పళ్ళికొండేశ్వరాలయం

 


                                                                                             

ఈ నెల 7వ తారీకు మహా శివరాత్రి.  మరి ఈ సందర్భంగా మనం ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్పుకోవాలికదా.  అందుకే ఈ ఆలయం గురించి.  మీరు కొన్ని ఆలయాలలో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి వుండవచ్చు.  కానీ శివుణ్ణీ ఎప్పుడన్నా అలా చూశారా!?  మహా శివుడి దర్శనం సాధారణంగా లింగ రూపంలోనే అవుతుంది.  కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు వుండవచ్చు.  కానీ పడుకున్న శివుడు ఎక్కడుంటాడు అంటున్నారు కదూ!!?  ఇలాంటి అపురూప ఆలయం కనుకే మహా శివరాత్రి ప్రత్యేక కానుక. ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటిపల్లిలో వున్నది.  ఇందులో అనేక విశేషాలున్నాయండీ.  ముందుగా స్ధల పురాణం తెలుసుకోవాలికదా.

 


క్షీర సాగర మధనం కధ మీకు తెలిసినదేకదా.  అందుకని ఆ కధంతా ఇప్పుడు చెప్పనుగానీ, ఆ మధనం సమయంలో హాలాహలం  సముద్రంలోంచి ఉద్భవించిందని చెబుతారుకదా. ఆ  విషానికి హాలాహలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?  మందర పర్వతానికి తాడులా కట్టిన వాసుకి నొప్పి భరించలేక బాధతో హాలం అనే విషాన్ని కక్కింది.  అప్పుడే సముద్రంలోంచి హలం అనే విషం బయల్దేరింది.  ఇవి రెండూ కలిసి హాలాహలం అయింది.  సరే .. ఆ విషాన్ని చూసి దేవతలు భయపడటం, ఈశ్వరుని ప్రార్ధించటం, ఆ పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించటం, పార్వతీమాత అడ్డుకోవటంవల్ల విషాన్ని కంఠంలోనే నిలిపి గరళకంఠుడవ్వటంకూడా మీకు తెలుసు.     ఆ విధముగా గరళమును స్వీకరించి సకల జగత్తును కాపాడిన రోజు శనివారం, త్రయోదశి ప్రదోష సమయంలో.  ఆ సంతోష (జగత్తుని కాపాడిన సంతోషం) సమయాన శివుడు నందీశ్వరుని రెండు కొమ్ములమధ్య ఆనంద తాండవమాడాడు.  అందుకే ప్రదోష సమయంలో నందీశ్వరునికి నమస్కరిస్తే శివుని దయను పొందవచ్చు.


విషపానం తర్వాత గౌరీదేవితో కలసి కైలాసానికి బయల్దేరాడు పరమశివుడు.  మార్గంలో ఈ సురుటపల్లికి వచ్చేటప్పటికి,  కైలాసనాధుడు విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్లవటంతో లోక మాత ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు.  సకల జీవులకు సర్వ మంగళాలని ప్రసాదించే జగజ్జనని ఇక్కడ సర్వ మంగళగా పిలువబడుతోంది.  పడుకున్న ఈశ్వరుడుగనుక స్వామి పళ్ళికొండేశ్వరుడుగా ప్రసిధ్ధి చెందాడు.


మరి ఈ ఆలయంలో అనేక విశేషాలున్నాయన్నానుకదా.  వాటిని చూద్దామా శివుడు అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని శయనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్క చోటే.  19 అడుగుల పొడుగున, సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని వున్న ఈ శయన శివుడు, అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతుంటారు.  చుట్టూ విష్ణు, బ్రహ్మ, నారదుడు, సూర్య చంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, భృగు మహర్షి, మార్కండేయుడు, కుబేరుడు, అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, వాల్మీకి, విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూవున్నారు.  ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయం పక్కనే వున్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు. ఈ ఆలయంలో ముందు మరగతాంబికను, వాల్మీకేశ్వరులను దర్శించాక శయన శివుని దర్శించాలంటారు.

 


ఇక్కడ హాలాహలంనుంచి సకల భువనాలనూ రక్షించాక, శివుడు ప్రదోష  సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత వున్నది. అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభం అయి తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయంటారు.  ఆ సమయంలో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకీ అభిషేకం జరగటం ఇక్కడి విశేషం. 1971 సంవత్సరం, కార్తీక మాసంలో కంచి మఠాధిపతి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక్క రోజుకోసం ఈ గుడికి వచ్చి 30 రోజులు వున్నారుట.  ఆ సమయంలో ఈ ఆలయంలో చెల్లా చెదురుగావున్న కొన్ని అపురూప శిల్పాలను ప్రతిష్ట చేయించి  ఆలయ శోభను మరింత పెంచారు.  స్వామివారు వచ్చిన దగ్గరనుంచి ఇక్కడికి భక్తుల రాక ఎక్కువయింది. ఈ ఆలయంలో పలు దేవతా మూర్తులు పత్నీ సమేతంగా వుండటంకూడా విశేషమే.  అందువల్ల ఈ దేవతా మూర్తులను దర్శిస్తే కుటుంబమంతటికీ మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.  

 


ఇక్కడ శయన శివుడేకాక ఇంకా ఆలయాలు, ఉపాలయాలు, అనేక సుందర విగ్రహాలు వున్నాయి.  వాటి విశేషాలు చూద్దాం.... ఆలయానికి ఇరుప్రక్కలా శంఖనిధి, పద్మనిధి తమ భార్యలతో వుంటారు.  ఇది అరుదు.  ఇక్కడ అమ్మవారు మరగతాంబిక.   అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వస్తుంటే  ఆలయం బయట గోడకి .. ద్వారానికి కుడివైపు (మనకి ఎడమవైపు) సాలిగ్రామ గణపతి, ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి  వుంటారు.  లోపలకి వెళ్ళగానే ఎదురుగా శ్రీ మరగదాంబిక అత్యంత సుందర రూపంలో ..   భక్తులనుబ్రోచే ఆ తల్లికి కుడివైపున కల్పవృక్షము, ఎడమవైపు కామధేనువు విలసిల్లుతున్నాయి.


మరగతాంబిక ప్రక్కన వాల్మీకేశ్వరుని ఆలయం వున్నది.  ఇక్కడ వాల్మీక ఋషి రామాయణం రాసేముందు శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్టించాలనుకున్నారు. కానీ  సరిగ్గా కుదరనందువల్ల తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు. ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలిసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడయ్యాడు.  ఈ స్వయంభూ లింగం త్రికోణాకార ఫలకం మీద ముందుకు శివ లింగం వున్నట్లు వుంటుంది.  ఈ విశేష లింగాన్ని విశేషంగా ఏం కోరుకున్నా నెరవేరుతుందంటారు.


వాల్మీకేశ్వరాలయం గర్భగుడి గోడకి వెలుపలవైపు వున్న అద్భుత విగ్రహం, మరెక్కడా చూడలేనిది దక్షిణామూర్తి.  ఇక్కడ స్వామి వటవృక్షం కింద వుండడు.  వృషభారూఢుడై వుంటాడు.  జటాజూటం, గంగ, పులి చర్మం, నాగాభరణం కూడా వుంటాయి.  అంతేకాదు అమ్మ గౌరి వెనకనుంచి స్వామిని కౌగలించుకుని వుంటుంది.  ఈ దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానం, చదువు, పెళ్ళి, పిల్లలు, మాంగల్య భాగ్యం మొదలగు సకల సన్మంగళాలు జరుగుతాయని నమ్మకం.
ఈ ఆలయాల చుట్టూ కనిపించే అద్భుతమైన విగ్రహాలు ఏకపాద మూర్తి ..  ఒక పాదం మీద నుంచున్న త్రిమూర్తుల ఆకారాలు స్పష్టంగా ఒకే రాతిలో చెక్కబడ్డాయి.  వారి రెండో పాదం కింద వారి వారి వాహనాలు వున్నాయి.  మధ్యలో శివుడు, అటూ ఇటూ బ్రహ్మ, విష్ణులు.


జ్వరహర మూర్తి .. దేవతలకు వచ్చిన శూలై అనే జ్వరమును తగ్గించేందుకు శివుడు ఎత్తిన అవతారమే జ్వరహర మూర్తి.  ఈ మూర్తి చేతిలో అగ్ని, మూడు తలలు, మూడు కాళ్ళు, మూడు చేతులతో వుంటుంది.  ఈ జ్వర హర మూర్తికి పాలాభిషేకం చేయిస్తే ఎలాంటి విష జ్వరాలయినా, చిన్న పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలయినా పోతాయంటారు. విష్ణు భైరవుడు ..  కపాలం పట్టుకున్న విష్ణు విగ్రహం అరుదు.  ముందు ఈ విగ్రహం ఇక్కడ లేదు.  శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ వున్నప్పుడు ఈ మూర్తిని గుర్తించి, భక్తుల సందర్శనంకోసం ఇక్కడ ప్రతిష్టింపచేశారు. మణికంఠుడుకి పెళ్ళి కాలేదని చాలామంది అభిప్రాయం.  ఇక్కడ ఈ స్వామి తన భార్యలు పూర్ణ, పుష్కలలతో దర్శనమిస్తారు.  అలాగే ఇంకొక విగ్రహం గజవాహనం పై అయ్యప్ప.

 


వల్లీ దేవసేనా సమేతుడై దక్షిణ ముఖంగా వున్న సుబ్రహ్మణ్యస్వామిని కూడా ఇక్కడ దర్శించవచ్చు.  దక్షిణ ముఖంగా వున్న సుబ్రహ్మణ్యస్వామి తిరు చందూరులో మాత్రమే దర్శనమిస్తాడంటారు.  యమగండం, రాహు దోష సమస్యలు, ఋణ బాధలు వున్నవారు ఈ స్వామిని సేవిస్తే వారి బాధలు తొలగి పోతాయంటారు. అలాగే లవ కుశుల పాదాలు, రాజమాతంగి, చేతిలో చిలుకతో విష్ణు దుర్గ, వాహనాలతో సహా సప్త మాతృకలు, భూ వరాహ స్వామి,  వగైరా అనేక శిల్పాలను చూడవచ్చు.


ఇన్ని అద్భుతాలున్న ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గం. లనుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, తిరిగి సాయంత్రం 3-30 గం. లనుంచి రాత్రి 8 గం.ల వరకు.  ప్రతిరోజూ ప్రదోష సమయం సాయంత్రం 4 గం. ల నుంచి 6-30 గం. ల వరకు.  త్రయోదశి రోజుల్లో  ప్రదోష వేళల్లో విశేష పూజలు జరుగుతాయి.


ఇన్ని విశేషాలు చదివేసరికి ప్రయాణానికి సిధ్ధమయ్యారు కదూ... ఇదిగో మార్గం…


తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో చిత్తూరు జిల్లాలో వున్న సురుటిపల్లి అనే చిన్న గ్రామంలో వున్నది శ్రీ పళ్ళికొండేశ్వరాలయం.  పుత్తూరునుంచి చెన్నై వెళ్ళే బస్సులన్నీ సురుటిపల్లిలో ఆగుతాయి.  చిన్న గ్రామం కావటంవల్ల ఇక్కడ సదుపాయాలుండవు.  


అక్కడదాకా వెళ్ళినవారు అక్కడికి 12 కి.మీ. ల దూరంలో వున్న నాగలాపురంలోని వేదనారాయణస్వామి   ఆలయం తప్పక చూడండి.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారక , గుజరాత్

 

 

శ్రీ సిద్దేశ్వర్  మహాదేవ్  మందిర్ ద్వారక , గుజరాత్

 


       

​         

 

మనం శివాలయాలు అని అన్నట్లే  మేము వెళ్ళిన  గుజరాత్ లోని శివాలయాలను  సిద్దేస్వర్ మహదేవ్ గా పిలుస్తారని పించింది.  మాతృ గయలోనూ  సిద్దేస్వర్  ఆలయం స్వయం భూ శివలింగం వుంది. ద్వారక లోనూ సిద్దేస్వర్ మహాదేవ ఆలయం వుంది. నేను వివరించే ఆలయం ద్వారకా పట్టణం లో వున్న  సిదేస్వర్  ఆలయం గురించి.శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్  ద్వారకా నగరం గుజరాత్  లో  వుంది.  ఇక్కడి లింగం   స్వయం భూ లింగం ఇది. ద్వారకాదీసుడైన  శ్రీ కృష్ణుడిని  దర్శించిన  అనంతరం  పట్టణంలో  వున్న ఇతర దర్శనీయ  ప్రదేశాలు,  ఆలయాలలో  శ్రీ సిద్దేస్వర్  మహాదేవ   మందిర్  ఒకటి.  ఇది  చాలా పురాతన మైన  ఆలయం.  ఆలయ  ప్రాంగణంలో అడుగిడగానే పెద్ద బావి, భూతనాథ్ ఆలయం,  కనిపిస్తాయి. ఈ బావికి సావిత్రి  బావి అని పేరు.

 

 

 

 

ఇక్కడ లింగానికి  అభిషేకాదులు స్వయంగా మనమే  చేసుకోవచ్చు.  విశాలమైన ప్రాంగణం . ప్రవేశ ద్వారం  నుంచి ఆలయానికి  వెళ్ళే దారి  అంతా  సాధువులు కాషాయ వస్త్ర ధారణతో, పొడుగాటి  జడలు, ముడులతో హర హర మహా దేవ్  అంటూ  వచ్చే  వారిని బిక్ష   అడుగుతూ  కనిపించారు  మాకు. 

 

 

ఈ  ఆలయం  చుట్టూ  కూడా చాలా  ఆలయాలున్నాయి.  వాటిల్లో  మారుతి  మందిర్,  విగ్రహ పూజ కనిపించని  ఇతర పురాతన  ఆలయాలు.  వున్నాయి.
ఈ ఆలయం  దర్శించ టానికి  కొద్ది మందే వస్తుంటారు. రష్  వుండదు.  టికెట్స్  వుండవు.  ప్రశాంత  వాతావరణం. 

ద్వారకలో  ప్రధాన  ఆలయం  శ్రీకృష్ణ  మందిరం.  చుట్టు పక్కల కూడా ద్వారకా దీసునికి  సంబందినిన  ఆలయాలే  వున్నాయి.  బెట్  ద్వారక,  రుక్మిణి మందిర్,  మూల ద్వారక, బాలకా తీర్థ్,  లక్ష్మి నారాయణ్  టెంపుల్, ఇలా ఎన్నో  వున్నాయి.

ద్వారకా పట్టణం లో  వున్న సన్ సెట్  పాయింట్, సిద్దేశ్వర్  మహాదేవ  మందిర్,  భడకేశ్వర్ మందిర్, గీతా మందిర్, లక్ష్మి నారాయణ్  మందిర్, ఇలాటి ఆలయాలు కూడా  ప్రసిద్ధి   చెందాయి.  వీటిని  దర్శించే  వారు  కొద్ది  మందే!  ద్వారకా పట్టణం  నుంచి  లోకల్  ఆటోలు  నగర దర్శనం 200 రూపాయలతో  చూపిస్తారు.  బస్ లు  వున్నా అవి అన్ని  పాయింట్స్   కవర్  చేయవు.
గుజరాత్ లోనే  వున్నా సిద్దాపూర్ లోని  (మాతృగయ)  ఇది.

 

 

సిద్దేశ్వర్ మహాదేవ మందిర్ , మాతృ గయ, గుజరాత్  ఈ పురాతన ద్వారకా సిద్దేస్వర్  మహాదేవ ఆలయం గురించిన స్థల వివరాలు  ఏమి లభ్యం  కాలేదు.

 

....Mani Kopalle


పాండవుల మెట్ట

పాండవుల మెట్ట

 

 

 

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామాన్ని మీ లో చాలామంది చూసి వుంటారు.  మరి దానికి దగ్గరలో వున్న పాండవుల మెట్ట సంగతి విన్నారా?  చాలామందికి తెలియని ఈ క్షేత్రంలో పాండవులు తమ అరణ్య వాసంలో కొంతకాలం గడిపారని కధనం. ఒక చిన్న గుట్టమీద చిన్న చిన్న ఆలయాల సముదాయం వున్నది.   పాండవుల పట్ల గౌరవసూచకంగా ఈ గుట్టమీద ఒక చిన్న ఆలయం, గుట్టమీదకు తేలికగా వెళ్ళటానికి మెట్ల మార్గం నిర్మించారు. ఈ  గుట్టమీద వున్న రెండు గుహలలోనే పాండవులు నివసించారంటారు.  వారు ఇక్కడనుంచి రాజమండ్రిలోని గోదావరిదాకా ఒక సొరంగమార్గంద్వారా వెళ్ళి రోజూ గోదావరిలో స్నానంచేసి వచ్చేవారంటారు.  దానికి నిదర్శనంగా ఇక్కడవున్న ఒక సొరంగ మార్గాన్ని చూపిస్తారు.  ఇది రాజమండ్రిలోని సారంగధర మెట్టదాకా వుందిట.   ప్రస్తుతం ఈ మార్గం రాజమండ్రివైపు మూసివేయబడి అడ్డంగా ఇళ్ళు కట్టారన్నారు.

 

 

గుట్టమీద వున్న పెద్ద పాదం గుర్తుని భీముని పాదంగా చెబుతారు. ఇక్కడ పోలియోబారిన పడినవారు తమ ఆరోగ్యంకోసం పూజలు చేస్తారు.   పూర్వం ఈ ప్రాంతంలో కోయవారు ఎక్కువగా నివసించేవారు.  ఇప్పటికీ వారు తమ పిల్లలకి పాండవుల పేర్లు, ద్రౌపది పేరు పెట్టుకుంటారు..  1952లో ఈ ప్రాంతంలో నివసించిన శ్రీ సాలూరి వెంకట సుబ్బారావు అనే పుణ్యాత్ముడు ఇక్కడ ఛాయా, పద్మినీ, ప్రభా, ప్రజాదేవీ సమేత శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం నిర్మించారు. పల్లె ప్రజల నమ్మకాలకు, విశ్వాసానికీ ఒక మచ్చు తునక....వేసవికాలంలో పాండవుల గుహ దగ్గర వరద పాయసం చేస్తారు.  ఆ పాయసం ఎటు పొంగితే అటు వానలు బాగా పడతాయని ఇక్కడివారి నమ్మకం.

 

 

ఇక్కడ వున్న అర్ధ నారీశ్వర శివలింగం కాశీనుంచి తెచ్చి ప్రతిష్టించారు.  ఇంకా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, గాయత్రి వగైరా దేవతలకు చిన్న చిన్న ఉపాలయాలు వున్నాయి. పిఠాపురానికి దగ్గరలో వున్న పాండవులమెట్టకి సామర్లకోటనుంచీ, పిఠాపురంనుంచీ కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు.  సామర్లకోట వెళ్ళినవారు పిఠాపురం, పాండవుల మెట్ట కూడా చూసి రావచ్చు.  ఏదో ఒకదానికే సమయంవుంటే మాత్రం పిఠాపురమే వెళ్ళిరండి.అవకాశం వున్నవారు సందర్శించదగ్గ ప్రదేశం.

 

- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 


వడక్కునాథన్ ఆలయంలోని నేతి శివలింగం

వడక్కునాథన్ ఆలయంలోని నేతి శివలింగం

 


మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప శివాలయాలు ఉన్నాయి కదా. వాటిలో కొన్ని ఆలయాల గురించి తెలుసుకుంటే అవునా ఈ ఆలయాల్లో ఇన్ని వింతలూ ఉన్నాయా అనిపించక  తప్పదు. అలాంటి వింత ఉన్న మరో ఆలయమే కేరళలోని ట్రిచూర్ దగ్గరలో ఉన్న వడక్కునాథన్ దేవాలయం. ఇక్కడి విశేషం ఏమిటంటే అన్ని అలయాలలోలాగా శివ లింగం దర్శించుకోవటానికి వీలుపడదు దానికి కారణం ఎప్పుడు ఈ లింగం నేతితో కప్పబడి ఉండటమే.

 

ఆలయ చరిత్ర ఏమిటంటే పరశురాముడు క్షత్రియులని తుదముట్టించాకా తన పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దక్షిణ కింద తన భూమినంతా దానం ఇచ్చేసాడట. తను మళ్లీ తపస్సు చేసుకోటానికి తగిన భూమిని ఇమ్మని సముద్రుడిని కోరాడట. అప్పుడు సముద్రుడు  కేరళ ప్రదేశాన్ని పరశురామునికి తపస్సు చేసుకోటానికి అనువుగా ప్రసాదించాడట. పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్లి శివపార్వతులని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడట. శివుడు పరివార సమేతుడై వచ్చి ఒక మర్రి చెట్టుకింద అంతర్దానమయ్యాడట. దానినే శ్రీ మూల స్థానం అని పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చిన్ రాజవంశీయులు ఆలయం కట్టాలని నిర్ణయించుకుని అక్కడ నుంచి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయంలో ప్రతిష్టించారట. ఈ ఆలయానికి 1600 సంవత్సరాల చరిత్ర ఉందని చెపుతారు.

 

 

అప్పటి నుంచి శివలింగానికి అభిషేకం చెయ్యటానికి నేతిని వాడేవారు. అదే ఆచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. అయితే విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళ నుంచి నేటితో అభిషేకాలు చేస్తూ వస్తున్నా ఆ నెయ్యి కాస్త కూడా కంపు కొట్టదట. ఈగలు వాలవట. ఆ నెయ్యి కరగదట. ఎంతటి ఎండాకాలం అయ్యి ఎండలు మండిపోయినా శివలింగానికున్న నెయ్యి కాస్త కూడా కరగాకపోవటం నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్య ఔషదంగా తలచి వాళ్ళ మందుల తయారీలో కూడా వాడుతుంటారు.  ఈ ఆలయ ప్రాంగణం లోనే గోవులుకాసే కృష్ణుడి విగ్రహాని కూడా మనం చూడచ్చు.

 

కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్టు ఇక్కడి ఆలయంలో శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు. తన చల్లని చూపులతో మనని ఎప్పటికి రక్షిస్తూ ఉంటాడు.


...కళ్యాణి


తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం

 

తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం

 

 

కాళికాదేవిని భక్తితో పూజిస్తే వెంటనే కరుణిస్తుంది. కోళ్ళను బలి ఇస్తే కోరికలను తీరుస్తుంది. ఊరంతటిని కాపాడతానని అభయమిచ్చిన ఆ దేవి ఇప్పటికి తన భక్తులను అంటురోగాల బారి నుంచి కాపాడుతూనే ఉంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఉత్సవాల సమయంలో జరిగే తతంగాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోక తప్పదు.


ఇలాంటి అద్భుతమైన దేవాలయం కేరళలోని త్రిస్శుర్ జిల్లాలో కొడుంగళ్ళూర్ సమీపంలో ఉంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పరుశరాముడు కేరళని సృష్టించాకా అతనిని దారుక అనే రాక్షసుడు హింసించసాగాడట. పరశురాముడు శివుడికి తపస్సు చేసిన పిమ్మట అతని ఆదేశానుసారం భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడట. ఆ భద్రకాళి అమ్మవారే దారుకుడిని సంహరించి ఆ ప్రాంతం అంతటిని కాపాడుతూ ఉంటానని అభయమిచ్చిందట.

 

 


జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ఆలయంలో పంచ శ్రీచక్రాలని ప్రతిష్టించారట. ఈ స్థలం ఇంతటి శక్తి సంతరించుకోటానికి కారణం ఆ శ్రీచక్రాలేనని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఏడు అడుగుల ఎత్తు ఉండే అమ్మవారి మూలవిరాట్టు విగ్రహాన్ని పనస చెట్టు కలపతో చెక్కారని స్థలపురాణం చెపుతోంది. విశాలంగా పది ఎకరాలలో విస్తరించబడిన ఈ ఆలయంలో సప్తమాతృకల ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. మూలవిరాట్టుతో పాటు అన్ని విగ్రహాలు ఉత్తరముఖంగా ఉండటం ఈ ఆలయం యొక్క మరో విశేషం.


ఇదే ఆలయ ప్రాంగణంలో పొంగు, అమ్మవార్లు వంటి అంటువ్యాధులను దూరం చేసే వాసురి మాత విగ్రహం కూడా ఉంది. ఈ అమ్మవారిని పసుపుతో పూజిస్తారు. ఆలయానికి యాభై మీటర్ల దూరంలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి అమ్మవారు తన ఖడ్గం నేల మీదకి విసరటంతో ఏర్పడిందని చెపుతారు. కాళికామాతని దర్శించుకునే వారు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి తరువాతే దర్శనానికి గుడిలోకి ప్రవేశిస్తారట.

 


ఇక ఉత్సవాల విషయానికి వస్తే కుంభ మాసం అంటే మార్చ్ ఏప్రిల్ నెలల్లో జరిగే భరణి ఉత్సవం వారం రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేలాది  కోళ్ళను బలి ఇస్తారు. ఈ ఉత్సవం జరిగే రోజుల్లో స్వర్ణకారుల వంసపారంపర్య వ్యక్తులు గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. ఈ భరణి ఉత్సవంలో భక్తులు ఎర్రటి దీక్షా వస్త్రాలు కట్టుకుని పెద్ద కత్తులు చేత పట్టుకుని వీదుల్లో అరుచుకుంటూ పూనకంతో పరుగులు తీస్తారు. అలవాటు లేనివారు ఇదంతా చూసి భయపడతారు కూడా.  ఇక జనవరి ఫిబ్రవరి మాసాల్లో జరిగే తలప్పొలి ఉత్సవంలో ఏనుగులని ఎంతో అందంగా అలంకరించి  శోభాయమానంగా ఊరేగిస్తారు.

ఇన్ని విశేషాలున్న ఇలాంటి ఆలయాన్ని దర్శిస్తే ఆ కాళికా మాత  అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది.

 

...కళ్యాణి


రామ, రాయలు పూజించిన కాకాని మల్లికార్జునుడు

                                                                                                                                                  రామ,రాయలు పూజించిన కాకాని మల్లికార్జునుడు

 


                                                                                        

కాకానినాధ కరుణా రస పూర్ణ సింధో
భక్తారి భంజన నిరంజన దేవ బంధు
దేవేంద్ర మౌళిమణి మండిత పాద యుగ్మ
శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే

శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో వున్నది.   ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను  శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు.  దీనికి నిదర్శనముగా శ్రీశైల స్ధల పురాణములో శ్రీ మల్లికార్జునుని అంశావతారములను వివరించేటప్పుడు కాకానియొక్క ప్రశస్తి కూడా చేయబడింది.

ప్రాచీన క్షేత్రమంటేనే అనేక గాధలుంటాయికదా.  మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో వున్న కొన్ని గాధలు తెలుసుకుందామా?

ఇంద్రకీలాద్రికి (విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన కొండ) గర్చపురికి (గుంటూరు) మధ్యగల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిధ్ధయోగి చాలాకాలం పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.  సిధ్ధయోగి పరమేశ్వరుని ఆ స్ధలమందే వుండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు.  పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభువుగా వెలిశాడు.

ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి (నేటి మంగళగిరి) నుండి ప్రయాణించుచూ, మంగళాద్రికి గర్తపురికి (నేటి గుంటూరు) మధ్యగల ఒక సుందర వనాన్ని చూసి కొంతకాలం అక్కడ వున్నారు.  అదే ప్రస్తుతం కాకాని.  మునీశ్వరులు ఈశ్వరుని సేవించుచుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ అక్కడ సంతోషముగా వుండసాగిరి.  ఆ వనము క్రమముగా ఒక గ్రామముగా ఏర్పడినది.  సిధ్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు.  అందుకే ఈ ప్రదేశానికి సిధ్ధయోగ సమాజమనే పేరుకూడా వుంది.   ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్యగీతాలతో స్వామిని సేవించటానికొస్తారు.

 

 

పరమేశ్వరుడు ఇక్కడే వుండిపోవటంవల్ల భ్రమరాంబిక దిగులుతో స్వామిని వెతకటానికి తన చెలికత్తెలను పంపింది.  వారు ఇక్కడ స్వామిని చూసి దేవి వార్తలు తెలియజేశారు.  ఈశ్వరుడు కూడా తన స్ధానానికి చేరుకోవాలని నిర్ణయించుకుని, తన భక్తాగ్రేసరులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడటానికి ఇక్కడ లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడు.  తర్వాతకాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్ధాలను సేవిస్తూ ఇక్కడికివచ్చి ఇక్కడవున్న శివలింగాన్నిచూసి పూజలు చేశాడు.  ఈశ్వర సంకల్పంవల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది.  వెంటనే అనేక ఋషిపుంగవులను ఆహ్వానించి, యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు.

యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు.  భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది.  యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు.

అప్పుడా కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది,  “ఓ మహర్షీ, నేను కాకాసురుడనే రాక్షసుడను.  బ్రహ్మ ఇచ్చిన వరంచేత దేవతలకిచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు.  నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు?  నీ యజ్ఞం సఫలం కావాలంటే నేనొక ఉపాయం చెబుతాను.  నువ్వు పవిత్ర జలాలతో పవమాన, అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీదజల్లు.  పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపంవల్ల నేనీ రూపంలో వున్నాను.  మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది.  మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది.”

భరద్వాజ మహర్షి ఆ విధంగా చెయ్యగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి, మహాశివుని మల్లెపూవులతో పూజించి తన స్వస్ధానానికి వెళ్ళిపోయాడు.  మల్లెపూవులతో పూజింపబడటంచేతకూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్ధిరపడింది.  ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది.  తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటనుంచీ వున్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడినప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి.

శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు.ఈ క్షేత్రంగురించి ఇంకొక కధ పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు.  ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్టించి, పూజించి, తరించినచోటుగా గ్రహించి, ఆ చోటునాకర్షించి ప్రజలను రక్షించటానికి ఆ లింగమునందావిర్భూతుడై వున్నట్లుగా చెప్పబడుతుంది. 

విశేషములు

అగస్త్య మహర్షి తన దక్షిణదేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి, గర్చపురికి శిష్యులతోసహా కాలినడకన వెళ్తూ దోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు.  స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమయింది.  ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునులతోపాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై వున్నాడు.  అందకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగ ప్రతిష్ట చెయ్యటం వగైరాలు ఇక్కడ చేస్తారు.
శ్రీకృష్ణదేవరాయని ఆస్ధానమునగల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామమని చెబుతారు.  ఒకసారి రాయలు ఈ ప్రాంతానికి

వచ్చినప్పుడ మంత్రి కోరికమీద ఇక్కడ బస చేశాడు.  అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషములను తెలిపి, ఆలయము జీర్ణావస్ధలోనుండుటవల్ల పునర్నిర్మించవలసినదిగా కోరారు.  రాయలు తన మంత్రి చిట్టరుసుకి కావలసిన ధనమిచ్చి ఆలయ పునర్మిర్మాణానికి ఆనతినిచ్చాడు.  తానుకూడా మనసులో తనకి పుత్రుడు కలిగితే స్వామి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు.  తర్వాత రాయలుకి పుత్రుడు కలగటం, అతనికి సదాశివ రాయలు అని పేరు పెట్టటం జరిగింది.  ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన  ‘మారిచీ పరిణయంబు’   అనే కావ్యములో వ్రాయబడ్డది.  శాసనము ద్వారాకూడా తెలియుచున్నది.

ఈ దేవాలయ ప్రాంగణంలో రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి.  సర్పదోషమున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

తర్వాత చాలాకాలానికి క్రీ.శ. 1911లో కాకాని వాస్తవ్యులైన కొల్లిపర వెంకటరత్నంగారు ఈ ఆలయాన్ని పునరుధ్ధరించి, పునఃప్రతిష్ట చేశారు.

ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రులు, పెద్ద నందీశ్వరుడు, శివతాండవమూర్తి, మహిషాసురమర్ధని, సుబ్రహ్మణ్యస్వామి వగైరా దేవతామూర్తులని, కళ్యాణ మండపాన్ని  చూడవచ్చు.

సంతానములేనివారు, రోగగ్రస్తులు ఒక మండలంరోజులు దీక్షతో రోజూ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలిగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.  శివక్షేత్రమైనా సత్యన్నారాయణ వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతాయి.  ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

పాలపొంగలి నివేదన ఇక్కడ ప్రత్యేకత.  పరవడి దినాలలో భక్తులు ఇక్కడే పాలపొంగలి వండి స్వామికి నివేదన చేసి తాము ప్రసాదం తీసుకుంటారు.  ఆ సమయాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా వుంటుంది.

రవాణా సౌకర్యం

5వ నెంబరు రహదారి సమీపంలో, గుంటూరుకి 7 కి.మీ. ల దూరంలో  గుంటూరు – విజయవాడ మధ్య వుండటంవల్ల గుంటూరు, మంగళగిరి, విజయవాడనుంచి బస్సు సౌకర్యం బాగా వున్నది.

వసతి

దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.  సమీపంలోనే గుంటూరు, విజయవాడలలో వుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు.

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

 

శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

 


                                                                        

ఆధ్యాత్మికతవెల్లివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, వాటి గురించి ఇంకెన్నో అద్భుతమైన కధనాలు…తెలుసుకున్నకొద్దీ ఆశ్చర్యం..తరచి చూసినకొద్దీ అద్భుతం.  ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకుని, వాటిని దర్శించి, గౌరవించాల్సిన కనీస బాధ్యత ఈ దేశ ప్రజలమైన మనది.  అయితే మన దురదృష్టమేమిటంటే మన అశ్రధ్ధనండీ, తెలియకపోవటంవల్ల కానీయండీ, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవటంవల్ల కానీయండీ, సమయాభావంవల్ల కానీయండీ, మన సంప్రదాయాలూ, ఆలయాల పట్ల మనకు తగ్గుతున్న ఆసక్తివల్ల కానీయండీ, ఏ ఇతర దేశాలకీ లేనటువంటి ఇంత ఆధ్యాత్మిక, కళా సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాము.  ఐతిహాసిక గాధలకీ, మన భారత దేశానికీగల సంబంధ బాంధవ్యాలను మనం విస్మరిస్తున్నాం.  తద్వారా మన భావి తరాలకు వాటి విలువ తెలియకుండా చేస్తున్నాం. మీ చుట్టుపక్కలే ఎన్నో అపురూపమయిన, అతి పురాతనమైన ఆలయాలు అద్భుత శిల్ప సంపదతో, అనేక విశేషాలతో,  అలరారేవెన్నో వున్నాయి.  వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలో వున్న శ్ర్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం గురించి ఇప్పుడు చెప్తాను.

 

పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కి.మీ. ల దూరంలో వుంది యనమదుర్రు గ్రామంలోని ఈ ఆలయం.  అయితే ఎందుకనో భీమవరంలోని భీమేశ్వరాలయం, మావుళ్ళమ్మ ఆలయం ప్రసిధ్ధి చెందినట్లుగా ఈ శక్తీశ్వరాలయం ప్రసిధ్ధి చెందలేదు.  ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి.  వంద ఏళ్ళ క్రితంవరకు ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు.  వంద ఏళ్ళ క్రితం త్రవ్వకాలలో త్రేతాయుగంనాటి ఈ ఆలయం బయటపడింది.  అంతేకాదు.  ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికా అన్నట్లు ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి.  పార్వతీ దేవి శక్తి.  ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు.  జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది.  బహుశా పార్వతీదేవిని ఈ భంగిమలో ఇంకెక్కడా చూడమేమో.  

 

 

అలాగే శివుడుకూడా ఏమీ తక్కువతినలేదు.  తనూ ఒక ప్రత్యేక భంగిమలో వెలిశాడు.  సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలోకూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు.  అవునండీ.  శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతాడు శివుడు ఇక్కడ.  మళ్ళీ చదవక్కరలేదు.  మీరు చదివింది కరెక్టే.  శివుడేమిడీ, శీర్షాసనమేమిటీ అంటారా.  మీ కోసమే ఆ విగ్రహాల ఫోటో.  ఈ భంగిమలు జాగ్రత్తగా గమనించి, బాగా గుర్తు పెట్టుకుని మరీ వెళ్ళండి ఆ ఆలయానికి.  చూడండి.. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది.  ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు.  ఈ వ్యాసం చదివిన వాళ్ళంతా ఈ దంపతుల అత్యద్భుతమైన ఈ భంగిమలు చూడటానికే ఈ ఆలయానికి వెళ్ళి వస్తారనే నమ్మకం వుంది.  ఇంతకూ ఈ పార్వతీ పరమేశ్వరులు అంతర్జంటుగా ఎలా వున్నవాళ్ళ అలాగే ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా  చెప్తారు.  ఆ కధేమిటంటే….

 

మీరు యమధర్మరాజు గురించి వినే వుంటారు.  భయమేస్తోందా.  పాపం యమధర్మరాజుకి కూడా ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట.  పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారాయే.  అందుకనే మార్గాంతరంకోసం శివుడుకోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై భవిష్యత్ లో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు వుంటే సత్వరం నయం అయి, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయం చేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడు.

 

పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం.  ఇక్కడ శంబరుడనే రాక్షసుడుండేవాడు.  రాక్షసుడంటే వాడి అకృత్యాలూ, మునులను హింసించటాలూ వగైరా షరా మామూలే.  పాపం ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు.  యముడుకూడా పాపం మునులంతా అడిగారుకదా అని ఆ రాక్షసుడిని చంపటానికి  చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు.  అప్పుడు శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు.  పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, ప్రత్యక్షమై, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది.   తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు.

 

అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్ లో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు.  యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో, యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది.  దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు.  ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు.  అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.

 

 

ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది.  స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు.  ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారుట.  ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట.  అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట.  ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట.  అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు.  ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు.  కాశీలోని గంగానదిలోని ఒక పాయ అందర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు.  అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.

 

దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి.  అంటే సర్పం.  ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇటీవలి కాలందాకా వుండేవని పూజారి చెప్పారు.  ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు.  ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగు పాము పిల్లలు తిరుగుతుంటాయి.  ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట.  అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.

 

 

ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి.  తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట.  ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్నున్నయ్యోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట.  ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి.

 

పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట.  భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట.  శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నదిట.

 

శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కవిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

 

చూడటానికి చిన్నదిగా వున్నా, ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని అవకాశం దొరికినప్పుడు తప్పక దర్శించండి.


 

- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


ఉప్పు లేని నైవేద్యాన్ని స్వీకరించే ఉప్పిలి అప్పన్

 

ఉప్పు లేని నైవేద్యాన్ని స్వీకరించే ఉప్పిలి అప్పన్

 


ఉప్పు వేయకపోతే అసలు ఎలాంటి వంటకాన్నైనా తినలేము, అలాంటిది ఏకంగా దేముడికే ఉప్పు లేని వంటకాన్ని నైవేద్యంగా పెట్టటమా అని ఆశ్చర్యపోతున్నారా నిజమేనండి ఇలాంటి వింత అచారాలున్న ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఉప్పిలి అప్పన్ దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ దగ్గరలో ఉంది.


స్థల పురాణం విషయానికి వస్తే మార్కండేయుడు లోక సంచారం చేస్తూ తిరువ్విన్నగరంకి వచ్చినపుడు తన కోరిక తీరటానికి ఈ ప్రాంతమే సరి అయినదని అనుకుని వేల సంవత్సరాలు లక్ష్మి దేవి కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడట. ఎన్నో ఏళ్ళు గడచిన తర్వాత లక్ష్మి దేవి ఒక చిన్న పిల్ల రూపంలో ఆయన ముందుకు వచ్చింది. ఆ పాపను చూసిన మార్కండేయుడికి తన తపస్సు సగం ఫలించిందని అనిపించిది. ఆ పాపను ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాడిని చేయసాగాడు. అలా ఉన్న రోజుల్లో శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలివాడి రూపంలో  మార్కేందేయుడి ముందుకు వచ్చి ఆ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు.

 

అందుకు మార్కేందేయుడు నువ్వు చూస్తే ముసలివాడివి, నా కూతురు చూస్తే చిన్నపిల్ల కనీసం వంటలో ఉప్పు సరిగా వేసిందో లేదో కూడా తెలియని అమాయకురాలు, అలాంటి పిల్లని నీకిచ్చి ఎలా పెళ్లి చేయగలను అని ప్రశ్నిస్తాడు. దానికి సమాదానంగా ముసలి వాడు ఉప్పు లేకపోయినా తను చేసిన వంటకి వంకలు పెట్టకుండా నేను తింటాను, అంతేకాని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అక్కడ నుంచి కదలను అని మొండిపట్టు పడతాడు. ఇదంతా చూసిన మార్కండేయుడికి అనుమానం వచ్చి కళ్ళు మూసుకుని తన దివ్య నేత్రాలతో వచ్చినది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళముందు శంఖ, చక్ర, గధారూరుడైన విష్ణుమూర్తి దర్సనమిస్తాడు. అప్పుడు మార్కండేయుడు తన కూతురిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.

 


ఈ పురాణగాధ ప్రకారం ఇప్పటికి కూడా ప్రతి రోజు ఉప్పు వెయ్యకుండానే దేముడికి నైవేద్యం పడతారు. ఇక్కడ ఫాల్గుణ మాసంలో జరిగే రథోత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రథోత్సవంలో ఉప్పిలి అప్పన్ గా పిలువబడే విష్ణుమూర్తి, భూదేవితో కలిసి తిరువీధిలో ఊరేగుతాడు. ఈ ఒక్క ఉత్సవమే కాక వసంతోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి పది రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆఖరి రోజు కనకాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకంతో ముగిస్తారు.

 

ఈ విధంగా విష్ణు మూర్తి లక్ష్మి దేవులు ఒక అవతారం ఎత్తి భూలోకంలో పెళ్లి చేసుకుని భక్తులని ఉద్దరిస్తున్నారు. అలాంటి దివ్య మూర్తుల దర్శనం మనం తప్పక చేసుకోవాలి.

...కళ్యాణి


హిడింబికి కూడా గుడి ఉంది తెలుసా

 

హిడింబికి  కూడా గుడి ఉంది తెలుసా

 


మన దేశంలో గుడులు ఎంత ప్రాశస్త్యం పొందాయో మళ్లీ మళ్లీ చెప్పక్కర్లెద్దు. ఒక వైపు యముడికి గుడి ఉంటే  మరో వైపు బ్రహ్మదేముడికి గుడి ఉంది. అలాగే భీముడి భార్య అయిన హిడింబికి కూడా మన దేశంలో ఒక గుడి ఉంది. అది కూడా ఎక్కడో కాదు హిమాచల్ ప్రదేశ్ లోని  కులులో ఉంది.


హిడింబి, హిడింబాసురుడు ఇద్దరు అన్నా, చెల్లెళ్ళు. హిడింబికి తన అన్నయ్య బలాన్ని చూసి ఎంతో గర్వంగా ఉండేది. ఎవరైతే తన అన్నను ఓడిస్తాడో అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పాండవులు అరణ్యవాసం చేసే రోజుల్లో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేసారట. ఆ సమయంలో హిడింబాసురుడు భీమునిపై యుద్ధానికి వెళ్లి ఓడిపోయి, భీముని చేతిలో మరణిస్తాడు. ఆ తరువాత భీముడికి, హిడింబికి పెళ్లి జరుగుతంది. వీళ్ళ ఇద్దరికీ పుట్టినవాడే ఘటోత్కచుడు. అయితే పాండవులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళేటప్పుడు హిడింబి వారితో కలిసి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయి, తరువాతి కాలంలో తపస్సు చేసుకుంటూ కాలం గడిపిందిట.

 


హిడింబి తపస్సు చేసుకుంటూ మోక్షం పొందిన దగ్గరే గుడి కట్టారని ఆలయ చరిత్ర చెపుతోంది. ఆలయం మొత్తం చెక్కతో కట్టబడింది. ఈ గుడి దగ్గర నుండి 70 మీటర్ల దూరంలో ఘతోత్కచుడికి కూడా ఒక గుడి ఉందిట. హిడింబి గుడి లోపల ఒక పెద్ద రాయి మీద హిడింబా దేవి కాలి ముద్ర కూడా ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో చూసినా ఈ కాలి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది కూడా.


ఇక ఉత్సవాల విషయానికి వస్తే ఇక్కడ జరిగే డూన్గరి మేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ మేళాలో అక్కడి ఆడ పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో తయారయ్యి హిడింబి దేవి అనుగ్రహం కోసం నృత్యం చేస్తారు. వసంత ఋతువులో జరిగే ఉత్సవం కావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి హిడింబా దేవిని పూజిస్తారు. కులూ వెళ్ళాల్సి వస్తే ఈ గుడిని తప్పకుండా దర్శించి తీరాల్సిందే.

..కళ్యాణి


శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు

 

 

శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు

 

 

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహా మండపే,
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్ధితం
అగ్రేవాచయతి ప్రభంజనసుతేతత్వ్తం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం.

 

అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రఘురామచంద్రుడు భక్త రక్షా దీక్షా బధ్ధుడై నెలకొనని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.  అలాగే మనవారు ఏ విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు.  సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అది.  అటువంటి రామచంద్రునికి దేశమంతా అనేక ఆలయాలు.  జగత్ప్రసిధ్ధి చెందిన ఆలయాలు కొన్నయితే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో.  వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వంగానీ, ఇటు మత పెద్దలుగానీ కనీసం ఆ ప్రాంత ప్రజలుగానీ  వాటి విలువ తెలుసుకుని ఆదరించకపోవటంవల్ల  వాటి గురించి తెలియచెప్పేవారు లేక, వాటి చరిత్రలతో సహా కనుమరుగవుతున్నాయి.  అలా కనుమరుగుకాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న ఇందూరులోని శ్రీ రఘునాధ ఆలయం గురించి రేపు శ్రీరామ నవమి సందర్భంగా తెలుసుకుందాము.    

 

 

ఇందూరు అంటే ఇదెక్కడ వున్నదని కొందరు సందేహపడవచ్చు.  నిజామాబాదు అంటే అందరికీ తెలుస్తుంది.  క్రీ.శ. 1905 లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్ జా – 6 సమయంలో ఇందూరు పేరు నిజామాబాదుగా మార్చబడ్డది.  అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వ నామధేయాలు ఇందూరు, ఇంద్రపురి.  

 

రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.శ. 914-928 మధ్య కాలంలో  ఇందూరుని పరిపాలించాడు. ఆయన పేరుమీదే ఇందూరు ప్రసిధ్ధిచెందింది.  ఆ రాజే  ఆ సమయంలో  ప్రస్తుతం ఊరు శివారులో కొండపైన ఈ కోటని నిర్మించాడు.  ఈ కోట నిర్మింపబడి 1100 సంవత్సరాలపైబడ్డా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది.    

 

 

అప్పటి పోరాటాలకేకాదు..తెలంగాణా స్వాతంత్ర్యపోరాట వీరులు శ్రీ దాశరధి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి నిజాం ప్రభువునెదిరించిన పోరాటంలో వారిని ఇక్కడనే బంధించారు.   ఆ గది ఫోటోని చూడండి.  

 

చరిత్ర ఆధారంగా శ్రీ సమర్ధ రామదాస్ జీ (మన దేశ అత్యంత సాహస వీరుడైన  ఛత్రపతి శివాజీ గురువు)  ఈ కోటలో శ్రీ రఘునాధస్వామి   ఆలయాన్ని నిర్మింప చేశారు.

 


 

అతి పురాతనమైన ఈ దేవాలయంయొక్క వైశాల్యం సుమారు 3900 చ.గ.లు.  ఇక్కడి ధ్వజస్తంబము ఒకే రాతిలో మలచబడ్డది.  53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిలా ధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగించేవారని ప్రతీతి.

 

రఘునాధుడనే మహర్షి ఇక్కడ చాలాకాలం తపస్సు చేసుకున్నారు.  ఈయన కోటలోగల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే వున్న బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడ్డ శిలా కట్టడముదాకా వెళ్ళి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కధనాలు ప్రచారంలో వున్నాయి. అంతేకాదు.  కోటలో పలు సొరంగ మార్గాలు వున్నాయనటానికి ఇంకో ఆధారం కోట లోపల్నించి డిచ్ వల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై వున్నాయి.   కోటలో ఈ రఘునాధ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది.  ఎ.సి. ల గురించి తెలియని ఆ కాలంలో కట్టిన ఈ ధ్యానమందిరంలో  మండు వేసవిలోకూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయిగొలుపుతూ వుండేటట్లు నిర్మింపబడింది.  ఇంజనీరింగు చదువులులేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మనవారి ప్రతిభ వేనోళ్ళ కొనియాడతగినది.

 

 

ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలివుంటాయి.  (శ్రీరామచంద్రుని అంకంపై సీతమ్మ, పక్కనే లక్ష్మణస్వామి).  అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా వున్న గర్భాలయం, గర్భాలయం ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాధ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాములవారి పాదుకలు, విశాలమైన కళ్యాణమండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను పెంపొందింపచేస్తాయి.  

 

కొండకిందవున్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో వుండే స్వామివారి స్ధానం ఒకే దిశల సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా వుండటం విశేషం.  ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది.

 

ఈ మందిరంలో అర్చనచేసి రాముని ప్రార్ధించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.

 

ఇంత ప్రాచీనమైన ఈ ఆలయం 2002 దాకా సరైన ఆదరణ లేక రోజూ మూసి వుండేదిట.  ఏడాదికి ఒకసారి తీసి శ్రీరామచంద్రుని కళ్యాణం చేసేవారుట.  అయితే 2002 నుంచి శ్రీ చిన్న జియ్యరు స్వామితిరిగి నిత్య పూజలు ప్రారంభించారు.  ఇలాంటి ఆదరణ నోచుకోవాల్సిన ఆలయాలు ఇంకెన్నో.  

 

ఇక్కడనుంచి చూస్తే చుట్టూవున్న అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.  అంతేకాదు  దేవాలయంవెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగావుండి చూపరులకు మరువరాని ఆనందాన్ని కలిగిస్తుంది.

 

కొండపైకి వెళ్ళేదోవలో రెండు పెద్ద కొండరాళ్ళవెనుక  ఆంజనేయస్వామికి చిన్న ఆలయం.  మార్గం గుహలోకి వెళ్తున్నట్లుంటుంది.  సహజసిధ్ధంగా ఏర్పడ్డ ఈ మార్గంగుండా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు.

 

ఇలాంటి ఆలయాలు వైభవోపేతంగా అలరారటానికి ప్రభుత్వము, పెద్దలేకాక ఆ ప్రాంత ప్రజలుకూడా కృషి చెయ్యాలి.  వీలయినప్పుడల్లా ఆలయాల్ని సందర్శించి అవి కళకళలాడటంలో మనవంతు పాత్ర మనమూ నిర్వహించాలి.  ఏమంటారు?


 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


మనాలి అంటే మనువు ఆలయమే!


మనాలి అంటే మనువు ఆలయమే!

 


ఈ వేసవి కాలంలో మనం ఎండలను తిట్టుకోని రోజు ఉండదు. హాయిగా ఏ కులూమనాలికో వెళ్తే బాగుండు అనుకోకుండా ఈ కాలం గడవదు. ఇంతకీ హిమాలయాల చెంత ఉన్న కులు లోయలోని మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దీని వెనుక మత్స్యావతారం నాటి విశేషం ఉంది.

 

సృష్టిని మహాప్రళయం నుంచి రక్షించేందుకు విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారమే మత్స్యావతారం. ఇందుకోసం ఆయన ఒక చిన్న చేపపిల్ల రూపంలో మనువు చెంతకి చేరాడు. ఆ చేప పిల్ల అంతంతకూ అమాంతంగా పెరిగిపోవడం చూసిన మనువు అది సాక్షాత్తూ దైవస్వరూపమని తెలుసుకున్నాడు. ఇంతలో ఆ చేప రూపంలో ఉన్న మహావిష్ణువు తాను వచ్చిన కార్యాన్ని చెప్పి, మహాప్రళయం తరువాత తిరిగి సృష్టి కొనసాగేందుకు మనువుకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ రోజు నుంచి ఏడో నాటికి జల ప్రళయం సంభవిస్తుందనీ, ఆ ప్రళయాన్ని ఎదుర్కొనేందుకు ఒక పెద్ద ఓడను నిర్మించుకోమనీ మనువుని ఆదేశించాడు విష్ణుమూర్తి. ఆ ఓడలోకి మునులనూ, ఔషధాలను, జీవజాతులనూ ఎక్కించుకుని సిద్ధంగా ఉండమని సూచించాడు.

 

విష్ణుమూర్తి మాటప్రకారమే మహా ప్రళయం సంభవించడం, ఆ ప్రళయంలో మత్స్యావతార సాయంతో మనువు రూపొందించిన నావ చెక్కు చెదరకుండా నిలవడం అందరికీ తెలిసిన కథే! జలప్రళయం ముగిసేనాటికి మనువు ఎక్కడైతే అడుగుపెట్టాడో ఆ ప్రదేశమే మనాలి అని స్థానిక ఐతిహ్యం. అడుగుపెట్టడమే కాదు, ఆ ప్రదేశాన్ని తన నివాసస్థానంగా మార్చుకునే అక్కడే తపస్సునాచరించాడట. దాంతో ఈ ప్రదేశానికి ‘మనువు ఆలయం’ అన్న పేరు స్థిరపడింది. అదే క్రమంగా మనాలిగా మారింది. ఈ నమ్మకాన్ని బలపరుస్తూ అక్కడ మనువుకి ఓ అరుదైన ఆలయం కూడా ఉంది! మహాభారతంలో కూడా మనాలి ప్రస్తావన వస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ దిశగా వచ్చారనీ... ఇక్కడే భీముడు, హిడిండిని వివాహం చేసుకున్నారనీ చెబుతారు. అందుకు సాక్ష్యంగా మనాలిలో అరుదైన హిడింబి ఆలయం కూడా ఉంది.

- నిర్జర.


ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు

ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు

 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం.

ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. ఒక పురాణగాథ  ప్రకారం ఆదిశేషుడికి, వాయు దేముడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరిగి ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారట. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయు దేముడు తన శక్తి మేర గట్టిగా ఊదితే అతని ప్రతాపానికి మేరు పర్వత శిఖరం అయిదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట. అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చిందట. అదే ముఘ్దేశ్వర శివలింగం.

శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రధమ దర్శనమిచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.

 

ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే  ఒక నమ్మకం కూడా ఉంది. అంతేకాదు రాహు కేతువులకు కూడా పహిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికి ఎలాంటి జాతక దోషాలకైనా ఇక్కడ పరిహార పూజలు చేయటం పరిపాటి.

 

ఇకపోతే బ్రహ్మ దేముడు ఒక చెట్టు రూపంలో ఉండటం ఇక్కడి మరొక విశేషం. వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం  దాదాపు 3000 సంవత్సరాలనాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈ చెట్టుకున్న మరొక విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు.  ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహం కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఏనుగు మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రం పులి పంజాలా ఉంటాయి.


కావేరి నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏట జరిగే బ్రహ్మొత్సవాలకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉత్సవమూర్తులని రథంపై తిరువీధి తిప్పుతారు. నవగ్రహ పూజలకి, నవగ్రహ శాంతి హోమాలకి పేరుపొందిన ఈ ఆలయం నిజంగా చూడతగ్గ దేవాలయం.

- కళ్యాణి


శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, జూపూడి

 

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, జూపూడి

 


                                                                                  

ఇవాళ నేను చాలామందికి తెలియని ఒక గుహాలయం గురించి చెబుతాను.  ఇది కృష్ణా జిల్లా, ఇబ్రహీం పట్టణం మండలం, జూపూడిలో కృష్ణానదీ తీరాన వున్నది.  విజయవాడనుంచి హైదరాబాదు వెళ్ళే దోవలో, ఇబ్రహీం పట్టణం దగ్గర ఎడమవైపు తిరిగి 3 కి.మీ. లు వెళ్తే జూపూడి గ్రామం వస్తుంది.  అక్కడనుంచి  ఎడమవైపు వున్న సందులోంచి కొంత దూరం లోపలకి వెళ్ళాలి.  దోవ అడిగితే అక్కడివారు చెబుతారు.  ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి స్వయంభూగా వెలవటమే కాకుండా, తన ఉనికి తానే తెలియజేసుకున్నాడని కధనం.  మరి ఆ కధా కమామీషూ మనం కూడా తెలుసుకోవాలికదా...

 

 

పూర్వం జూపూడి గ్రామంలో కృష్ణా తీరంలో ఇసుక పఱ్ఱల మీద కొంతమంది పిల్లలు ఆడుకుంటూ వుండేవారు.  పిల్లలన్నాక ఆడుకోవటం మామూలేకదా.  కానీ ఇక్కడి పిల్లలు ఎంతో అదృష్టవంతులు.  అందుకే స్వయంగా వెంకటేశ్వరస్వామి వచ్చి వారితో ఆడాడు.  వాళ్ళు ఆడుకునే సమయంలో ఒక బాలుడు వచ్చి తానుకూడా వారితో ఆడతానన్నాడు.  మిగతా పిల్లలు అంగీకరించి ఆటలు మొదలు పెట్టారు.  చిత్రమేమిటంటే ఆ బాలుడు ఏ పక్షాన వుంటే ఆ పక్షమే ఆటలో విజయం సాధించేది.  అది గమనించిన పిల్లలు ఈ బాలుడు సామాన్యుడు కాడని, అతనిని పట్టుకుని ఏ విధంగానైనా బాధించాలని ప్రయత్నించారు.  అతనిని పట్టుకోవాలని ప్రయత్నించారు.  ఆ బాలుడు వారికి అందకుండా పరిగెత్తాడు.  పిల్లలూ అతని వెనక పరిగెత్తారు. కానీ కొంత దూరం పరిగెత్తిన ఆ బాలుడు అదృశ్యమయ్యాడు.  దానితో పిల్లలు ఆశ్చర్యపోయారు. 

 

ఆ బాలుడు మళ్ళీ కనిపించగా పిల్లలు మళ్ళీ వెంబడించారు.  ఆ బాలుడు నదీ తీరాన కల ఒక కొండ (శ్రీగిరి) దగ్గర నామములు ధరించిన వామనుని రూపంలో కనిపించి తాను కలియుగ వెంకటేశ్వరుడనని, ఆ కొండపై వెలయుచున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు.  పిల్లలందరూ ఆశ్చర్యపడి పరుగు పరుగున జూపూడి గ్రామంలోకి వచ్చి పెద్దలందరికీ ఆ సంఘటన వివరించారు.  పెద్దవాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు.

 

ఆ కాలంలో జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు.  ఆయన కృష్ణా నది అవతలి తీరానగల ధరణి కోట (నేటి అమరావతి) లో వుండేవారు.  ఆయనకి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై తాను జూపూడి గ్రామంలోని శ్రీ గిరిపై వెలసియున్నానని, తనని దర్శించి, ధూప దీప నైవేద్యములు జరిపించే ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు.  స్వప్నంనుండి మేల్కొన్న రాజావారు ఈ విషయాన్ని తన సేవకులకు వివరించి ఆ విషయములు తెలుసుకు రమ్మని పంపించారు.

 

వారు వచ్చి చూడగా ముళ్ళ పొదలు, గజిబిజిగా వున్న చెట్లు కనిపించాయిగానీ, స్వామివారు కనిపించక వెనుతిరిగి విషయాన్ని రాజావారికి విన్నవించారు.  ఆయన కూడా తానేదో స్వప్నం కాంచానని మిన్నకున్నారు.  ఆ రోజు రాత్రి స్వామి రాజావారికి మరల స్వప్నంలో కనిపించి కొరడాతో కొట్టి, నేను నిన్ను రమ్మంటే నువ్వు భటులను పంపుతావా అని ప్రశ్నించారు.  ఆ కొరడా దెబ్బకు రాజావారి శరీరమంతా భగభగ మంటలు పుట్టగా వెంటనే తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు.  పక్కనే వున్న కృష్ణానదిలో దిగి స్వామీ, నాకు ఈ శరీరపు మంటలు పోగొట్టి నన్ను రక్షించు అని వేడుకొనగా శరీరం చల్లబడింది. 

 

రాజావారు తన భటులతో బయల్దేరి జూపూడి గ్రామంలోని శ్రీగిరికి వచ్చి చూడగా అక్కడ అంతా ముళ్ళు పొదలు, గజిబిజిగా వున్న చెట్లు దర్శనమిచ్చాయి.  దానితో ఏమి చెయ్యాలో తోచని రాజా కొండ సమీపంలో కొబ్బరికాయ కొట్టి స్వామీ, నీవే ఏదైనా ఉపాయాన్ని చూపి నీ దర్శన భాగ్యం కలగజేస్తే నీ సేవ చేసుకుంటాను అని ప్రార్ధించాడు.  స్వామి చిన్న పిల్లాడిరూపంలో, ఊర్ధ్వపుండ్రాలతో  రాజావారికి ప్రత్యక్షమై నేనేరా నిన్ను కోరింది అని కొండపైకి తాను ముందు నడుస్తుండగా దారి ఏర్పడింది.  ముందు బాలుడు, వెనుక రాజావారు, పరివారం కొండపైన గుహ చేరుకున్నారు.  అక్కడ స్వామి తన స్వరూపాన్ని చూపించి అంతర్ధానమయ్యారు.  రాజావారు స్వామి రూపాన్ని చూసి, తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, స్వామి నిత్య ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసి, వాటికోసం 16 ఎకరాల 64 సెంట్ల భూమిని కానుకగా ఇచ్చారు.  అప్పటినుంచి స్వామికి నిత్య ధూప దీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి.

ఆలయం వివరాల

 

 

శ్రీగిరి మీద వున్న ఈ ఆలయాన్ని చేరుకోవటానికి దాదాపు 100 మెట్లు ఎక్కాలి.  ధ్వజ స్తంభం కింద ఆంజనేయ స్వామి విగ్రహం వున్నది.  ఎదురుగా చిన్న గదిలా కనబడుతుంది.  అదే ఆలయ ముఖ ద్వారం.  మేము వెళ్ళేసరికి తాళం వేసి వున్నది.  పూజారిగారు ఉదయం 9 గం. లకి వచ్చి పూజ చేసి వెళ్తారు.  మేము వెళ్ళేసరికి ఆయన ఇంకా రాలేదు.  అక్కడ అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్న ఒకాయన ఆలయానికి సంబంధించిన వారనుకుని వివరాలు అడిగాము.  కానీ ఆయన  గ్రామంలో వారు.  స్వామి ఆయన ఆరోగ్యం బాగు చేశారని, ఆయనకి చేసే సేవలాగా రోజూ వచ్చి అక్కడంతా శుభ్రం చేసి వెళ్తారుట.  స్వామి అంటే ఎంత నమ్మకమూ, భక్తో  కదా!!  ఆయనే పూజారిగారికి చెబుతాను మీరొచ్చారని అన్నారు.  ఊరు దూరంగా వుండటంతో, కారులో వెళ్ళి రండి, తొందరగా రావచ్చుకదా అంటే అప్పుడు చెప్పారు తన సేవ సంగతి.  ఆ రోజుకి పని అయిపోయిందని, సైకిల్ వుందని వెళ్ళి పూజారిగారికి  చెప్పారు.  ఊరుకి, ఆలయానికి కొంచెం దూరం వుంటుంది.

 

పూజారిగారు వచ్చి తాళం తీసి ముందు ఆలయం లోపల శుభ్రం చేశారు.  బయట ఆలయం శుభ్రంచేసి, ముగ్గు వేసే అవకాశం దక్కిందని మా చెల్లెలుగారమ్మాయి నీలిమ సంతోషించింది.

 

 

ఆలయం లోపల ప్రవేశించగానే ముందు ఒక గదిలాగా వున్నది.  అక్కడ వెంకటేశ్వరస్వామిది, ఇంకా కొందరు దేవుళ్ళ విగ్రహాలున్నాయి.  ఎడమపక్క పైకి వెళ్ళే మెట్లు .. సన్నని దోవ.  ఆ పైనే స్వామి వెలసినది.

 

 

స్వామి వెలసిన కొండ గుహ ఐస్ క్రీం కోన్ తిరగవేసినట్లు వుంటుంది.  కొన్ని మెట్లు ఎక్కాక  ఎడమవైపు గోడకి నామాలు, ఆది శేషు, శంఖం, చక్రం గోడలోనే వుబ్బెత్తుగా దర్శనమిస్తాయి.  అంతకు మించి స్వామి రూపం ఏమీ వుండదు. 

 

ఈ గుహ చాలా సన్నగా వుంటుంది.  ఒకళ్ళు వెళ్ళటానికి మాత్రమే అవకాశం వుంటుంది.  అర్చన జరిపించేటప్పుడు మనకి స్వామిని చూసే అనకాశం వుండదు.  అక్కడ పూజారిగారు నుంచుని అర్చన చేస్తారుగనుక.  అర్చనానంతరం వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము.  మరి ఆ అద్భుతమైన గుహని మీకు చూపించటానికి ఫోటోలు కూడా తెచ్చాను.

 

 

పైన చెప్పిన కధంతా జరిగి 350 సంవత్సరాలయిపోయింది.  ప్రస్తుతం నిత్య పూజలు జరుగుతున్నా, ఈ మారు మూల ఆలయానికి జనం ఎక్కువగా రాని కారణంగా పూజారిగారూ ఉదయం 9 గం.లకి వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు.    పూజారిగారు వివరాలు చెబుతూ, కొండ ఇదివరకు ఒకటిగానే వుండేది.  స్వామి దానిని పగలుగొట్టుకుని అక్కడ వెలిశారు. 80 ఏళ్ళ క్రితం దిట్టకవి వరదాచార్యులు అనే ఆయన ప్రజల సహకారంతో ఆ ప్రాంతాన్ని బాగుచేయించారు.  ఆయన సంతతివారే వంశపారంపర్యంగా పూజారులుగా వుంటున్నారు.   ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో వున్నది.  ఆలయ భూములని కౌలుకిస్తారు.

 

 

వైశాఖ శుధ్ధ చతుర్దశినాడు స్వామి కళ్యాణం అతి వైభావంగా జరుగుతుంది.  శనివారంనాడు భక్తులు ఎక్కువగా వస్తారుట

 

శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వరస్వామి ఆలయం

 

పక్కనే వున్న చిన్న కొండమీద గ్రామస్తులు శ్రీ గంగా భవానీ సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.  ప్రజలు రాజావారి దగ్గరకెళ్ళి ఆ ఆలయం గురించి వివరించగా, దానికి కూడా 16 ఎకరాల 70 సెంట్ల భూమిని కానుకగా ఇచ్చారుట.  అప్పటినుంచీ, అక్కడ కూడా నిత్య పూజలు జరుగుతున్నాయి.

 

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజారిగారికి నా యాత్రా దీపిక – 6 శ్రీ నరసింహ క్షేత్రాలు పుస్తకం ఇస్తే చాలా సంతోషించి జూపూడిలో ఈ వెంకటేశ్వరస్వామి భక్తుల కోరికలు నెరవేర్చే కరుణామయుడనీ, ఇక్కడివారికి ఈయనంటే గొప్ప గురి అనీ, అయితే ఎక్కువమందికి తెలియక పోవటంవల్ల భక్తుల రాక తక్కువనీ చెప్పారు.  ఇలాంటి ఆలయాల గురించి వీలయినంతమందికి తెలియజెయ్యాలనే నా తపన గురించి చెబితే సంతోషించారు.  ఎవరైనా వచ్చేటట్లయితే ఫోన్ చెయ్యమని ఫోన్ నెంబరు ఇచ్చారు.

 

మరి మీరా ప్రాంతానికి వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి.  పూజారిగారి పేరు శ్రీ వెంకట సత్యన్నారాయణాచార్యులు.  


..పి.యస్.యమ్. లక్ష్మి


గోమతీ నదీ తీరం ద్వారక

 

గోమతీ నదీ తీరం  ద్వారక

 


ద్వారకా పట్టణంలో గోమతీ ఘాట్ ల వద్ద  వరుసగా అనేక  ఆలయాలు  వున్నాయి.

సముద్ర నారాయణ ఆలయం :

సంగమ ఘాట్ వడ్డున శివాలయం, రాముడు, సీత, లక్ష్మణుల ఆలయాలు, సుధాముని ఆలయం వున్నాయి. ఘాట్ ఒడ్డునే ఉన్న అజ్మల్ జీ ధ్యానం చేసిన గుహ , కృష్ణుడి ఆలయం వున్నాయి

 

 

దూర్వాస కుండ్, ఇంకా ఎన్నో ఉప ఆలయాలు  వున్నాయి.


     


 1. నది ఒడ్డున అందమైన స్తూప

 


2. నది ఒడ్డున వున్నా దూర్వాస ముని కుండ్

 

 

౩ నదీ అందాలు  సముద్ర ఘోష ఆహ్లాద వాతావరణం  తిలకించేందుకు వీలుగా నది చుట్టూ ఏర్పాటు చేసిన మంటపాలు,  బెంచీలు,

 

4. నది ఒడ్డున  వున్న ఆలయం 

 

గోమతి నదిలో స్నానం చేసాక గోమతి నదికి పాలతో అభిషేకం, దీపం వెలిగించి  అరతి ఇవ్వటానికి,  పూలతో పూజ చేయటానికి , అక్కడ చాలా మంది పూజా తట్టలతో మనకి ఎదురవుతుంతారు.  20 రూపాయలకి పూజా సామాగ్రి ఇస్తారు.  అందరూ గోమతి నదికి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు.  హారతి ఇస్తారు.

 


ఇక నదీ ఒడ్డున యాత్రికులని  ఆకర్షించే ఎన్నో వస్తువుల దుకాణాలు  వున్నాయి.  ముఖ్యంగా  గోమతి, సముద్రంలో లభించే చక్రాంకితాలు, ముత్యాలు, శంఖాలు, ఇతర రంగు రంగుల రాళ్ళు అతి చౌకగా లభిస్తాయి.  చక్రాంకితాలు ఒకటి  5 రూపాయలు, ముత్యాలు ఒకటి 5 రూపాయలు ఇలా వుంటాయి వాటి ధరలు.  ఇవే కాదు ఎన్నో వస్తువులు, శ్రీకృష్ణుని విగ్రహాలు లభిస్తాయి. ముఖ్యంగా  పారాడే  కృష్ణుడు ఇక్కడ చాలా ప్రసిద్ది.

 


నదీ తీరం చుట్టూ అందమైన విహార ఘాట్లు నిర్మించారు.  శ్రీకృష్ణుడి లీలలు ప్రదర్సించే చిత్రాలు (పెయింటింగ్స్) వరుసగా వున్నాయి.  అలసిన వారికి సేద తీరేలా రాతి బెంచీలు , సుందర స్తూపాలు, నిర్మించారు.  గోమతి నది ఆవలి వొడ్డు చేరటానికి ఓవర్ బ్రిడ్జి ని నిర్మిస్తున్నారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. తుది దశలో వుంది.

 
గోమతి నది ఒడ్డున  వున్న అన్ని చిన్న చిన్నవే! మన వేపు  వున్నట్లు గా ఆలయం  అంటే చక్కని శిల్ప కళ వుట్టి పడుతూ కనిపించ లేదు.  
ఎక్కువగా  సాధువులు, బిక్షకులు, కనిపించారు.  


 ..mani


నవగంగలు కలిసే మహామాఘ పుష్కరిణి

 

నవగంగలు కలిసే మహామాఘ పుష్కరిణి

 


గంగా నదిలో స్నానం చెయ్యటమే మహా పవిత్రం అంటారు. అలాంటిది నవగంగలు కలిసిన పుష్కరిణిలో స్నానం చేస్తే ఇంకెంత పుణ్యమో కదా. నవగంగలు ఏంటి ఒకే దగ్గర కలవటం ఏంటి అని ఆలోచిస్తున్నారా. 1.గంగ 2.యమున 3.సరస్వతి 4.నర్మద 5.గోదావరి 6.కావేరి 7.మహానది 8.పయోష్ణ  9.సరయు ఈ తొమ్మిది నదులని నవగంగలుగా వర్ణించటం జరిగింది. ఈ నదులన్నీ పన్నెండేళ్ళకోసారి మహామఘం అనే పుష్కరిణిలో వచ్చి కలుస్తాయని ప్రతీతి.

 

 

ఈ మహామఘం అనే పుష్కరిణి తమిళనాడులోని కుంభకోణం అనే పట్టణంలో ఉంది. ద్వాపరయుగం అంతమయ్యే కాలంలో ఆకాశంలో వెళ్తున్న అమృతభాండాన్ని వేటగాడి రూపంలో ఉన్న శివుడు బాణంతో కొడితే ఆ భాండం ముక్కలుగా విరిగి నేలమీద పడిందట. ఆ ప్రదేశమే కుంభకోణం. అలా విరిగిపడిన అమృతభాండపు ముక్కలు వివిధ శివలింగాలుగా రూపుదాల్చాయట. కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంభేశ్వర, సోమేశ్వర, చక్రపాణి, సారంగపాణి మొదలైన ప్రాంతాల్లో పడిన లింగాలు ప్రస్తుతపు ఆలయాల లాగా రూపుదిద్దుకున్నాయట. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు .సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు. శివుడి ఆకారం కూడా కుండ మూతిలాగా ఉండటం ఇక్కడి ఒక విశేషం. చైత్ర మాసంలో సూర్యకిరణాలు శివలింగం మీద పడటం ఇంకొక విశేషం. అమ్మవారిని మంగళాంబిక అనే పేరుతొ కొలుస్తారు.

 

ఆరున్నర ఎకరాలలలో విస్తరించిన ఈ పుష్కరిణిలో 21 బావులు ఉన్నాయట. చుట్టూ రాతిమెట్లు ఇంకా 16 మండపాలు కొలువుతీరి ఉన్నాయి. ప్రతి పన్నెండేళ్ళకి మాఘమాసంలో గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహామాఘ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నవగంగలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నదుల నీరు వచ్చి ఇక్కడ కలుస్తుందని ఒక నమ్మకం. అందుకే పుష్కర సమయంలో కుంభకోణంలో  దేవాలయాలన్నిటి నుండి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి స్నానం చేయిస్తారు. అదే సమయంలో భక్తులు కూడా మూడు మునకలు వేసి స్నానం ఆచరిస్తారు. ఈ ఒక్కరోజే కనీసం పదిలక్షల మంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడి స్వామిని దర్శించుకుంటారని ఒక అంచనా.

 

పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించే పుష్కర స్నానం ఎవరికీ మాత్రం చేయాలని ఉండదు. మనం కూడా ఈ సారి కుంభకోణంలో జరిగే మహామాఘ పుష్కరాలకి వెళ్ళటానికి ప్రయత్నిద్దాం.


...కళ్యాణి


శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం, తిరుక్కోవెలూరు పార్ట్ 1

 

 

శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం, తిరుక్కోవెలూరు పార్ట్ 1

 


                                                      
తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు గురించి చాలా చెప్పుకున్నాముకదా.  ఒక్కసారి అలా పక్క రాష్ట్రాలలోని ఆలయాలను కూడా చూసొద్దాం.  ఆలయాలకి పెట్టింది పేరు తమిళనాడు.  అక్కడ ఆలయాలన్నీ చాలా పెద్దగా వుంటాయి.  కొన్ని ఆలయాలలో మనం నడిచేసరికే అలసి పోతాము.  దాదాపు అన్ని ఆలయాలలోను శిల్పకళ అద్భుతంగా వుంటుంది.  అయితే అక్కడ మనలాంటి వాళ్ళకి ఇబ్బంది ఒకటే.  బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి.  ఎదురుకుండా ఆలయం చూస్తున్నా అది ఏ దేవుడి ఆలయమో ఎవరినన్నా అడగాల్సిందే. లోపల దైవాల పేర్లు కూడా తమిళంలోనే వుంటాయి  కనుక మనకి పరిచయస్తులైతే ఓహో, ఫలానావారుకదా, అని నమస్కారం చెయ్యటం, కాకపోతే ఎందుకైనా మంచిదని ఒక నమస్కారం చేసి రావటం.  ఇది నాలాంటివారికి కొంచెం బాధగానే వుంటుంది.

 

 

అక్కడికీ కొన్ని ఏళ్ళ క్రితం స్వామి మలైలో మా ఇబ్బంది గురించి ఆఫీసులో చెబితే వారు రాసి ఇమ్మన్నారు.  సరేనని నేను, మావారు మా పరిచయాలు చేసుకుంటూ మరీ రాసిచ్చాం.  ఆలయం గురించి, దేవుళ్ళ గురించి వారి మాతృభాష తమిళంలో ముందు, తర్వాత జాతీయ భాష హిందీ,  తర్వాత చాలామందికి తెలిసే భాష ఇంగ్లీషులో బోర్డులు పెడితే వేరే భాషల వారికి కూడా కొన్ని వివరాలన్నా తెలుస్తాయి.  అంతంత దూరాలనుంచీ వచ్చి వీటికి కూడా ప్రతి వాళ్ళనీ అడగాలంటే ఇబ్బందిగా వుందని.  ఏం చేస్తాం చెప్పండి.  వాళ్ళు బోర్డులు పెట్టలేదని అంత అద్భుతమైన ఆలయాలు చూడకుండా మాన్తామా!??  నా అవస్తలు నేను పడి మీకోసం కొన్ని వివరాలు తెలుసుకొచ్చానుకదా.  అవే  మీకూ చెబుతా.  అంతే.

 

 

విష్ణుమూర్తి  వామనావతారంతో శిబి చక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేల దానమడిగి, విశ్వరూపందాల్చి, రెండు అడుగులతో భూమి, ఆకాశం కొలిచి, మూడవ అడుగు ఎక్కడ పెట్టాలని శిబి చక్రవర్తిని అడుగుతాడు.  శిబి చక్రవర్తి తన తలని చూపించగా దానిమీద తన పాదం మోపి ఆయనని పాతాళలోకానికి పంపిస్తాడు.  ఆ విశ్వరూపాన్నే త్రివిక్రముడిగా కొలుస్తారు.  ఈ విశ్వరూపానికి ఆలయాలు తక్కువగానే వున్నాయి.

 

 

అయితే వామనుడు కొలిచిన మూడు అడుగులను సూచిస్తూ తమిళనాడులో మూడు ఆలయాలు వున్నాయి.  భూమిని కొలుస్తున్నట్లు సీర్కళిలో, ఆకాశాన్ని కొలుస్తున్నట్లు తిరుక్కోవలూరు, శిబి చక్రవర్తి తలమీద కాలు పెట్టినట్లు కంచిలో ఈ ఆలయాలు వున్నాయి.  ప్రస్తుతం మనం తిరుక్కోవెలూర్ గురించి తెలుసుకుందాము.

 

ఇది వైష్ణవులకు పరమ పవిత్రమయిన పుణ్య క్షేత్రం.  వైష్ణవ భక్తాగ్రేసరులు, ముదలాళ్వార్లు అని చెప్పబడే పొయగై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు మొదట భగవంతుని ప్రత్యక్షంగా దర్శించి, పాశురములను పాడిన దివ్య క్షేత్రమిది.  ఆళ్వారులు దివ్య ప్రబంధాన్ని మొట్టమొదట ఇక్కడ పాడటంవల్ల దివ్య ప్రబంధ అవతార స్ధలంగా కూడా ఈ క్షేత్రం ప్రసిధ్ధికెక్కింది.

 

ఇక్కడ స్వామికి కుడి చేతిలో శంఖం వుంటుంది.  భక్తులకు జ్ఞానాన్ని బోధించటానికి, రెండవసారి త్రివిక్రమునిగా స్వామి సాక్షాత్కరించిన స్ధలంగా కూడా ప్రత్యేకమయినది.

 

ఈ క్షేత్రాధిపతియైన శ్రీకృష్ణుని వైభవం తెలిసి వింధ్య పర్వతంనుండి దుర్గాదేవి వచ్చి స్వామికి రక్షగా ఇక్కడ వుండసాగింది.  ప్రతీ రోజూస్వామికి, అమ్మకి ఆరాధన, నివేదన అయిన తర్వాత దుర్గకు ఆరాధన, నివేదన ఇప్పటికీ జరుగుతున్నది.  తిరుమలై ఆళ్వారు తన పాశురాలలో ఈ దుర్గను కూడా స్తుతించారు.  భక్తులపాలిటి కల్పవల్లి అయిన ఈ దుర్గాదేవికి మంగళ వారం, శుక్రవారమునాడు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి.

 

ఇన్ని ప్రత్యేకతలున్న తిరుక్కోవెలూర్ పూర్వం చేర, చోళ, పాండ్య దేశాల మధ్య వుండటంవల్ల నడునాడు అనీ, ఆళ్వారులచే పాశురములలో తిరుక్కోవెలూర్ అని పాడబడటంవల్ల తిరుక్కోవెలూరుగానూ వినుతికెక్కింది. ఈ క్షేత్ర వైభవం బ్రహ్మ పురాణం, పద్మ పురాణాలలో శ్లాఘించబడినది.

 

ఆలయ నిర్మాణం

ఆలయం ఐదు ఎకరాల సువిశాల స్ధలంలో వున్నది.  ఇందులో మూల విరాట్ త్రివిక్రముడితోబాటు ఆంజనేయస్వామి, గరుక్మంతుడు, వేణు గోపాలుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఆండాళ్ మొదలగు అనేక ఉపాలయాలు, మండపాలు వున్నాయి.
రెండు వేల సంవత్సరాలకి పూర్వమే ఈ ఊరిలో ఆలయ గోపురాలు కట్టబడ్డాయి అని ఆలయ శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది.  ఆలయంలో 3 పెద్ద గోపురాలు, 4 చిన్న గోపురాలు వున్నాయి.   పాండ్య, పల్లవ, విజయనగర రాజులు, తిరుక్కోవలూర్ ని పరిపాలించిన మళయాళ ప్రభువుల సమయంలో ఈ ఆలయం, గోపురాలు కట్టించి, ఆభివృధ్ధి చేసి, ఆదరించారన్నది అక్కడి శిలా శాసనాలవలన తెలుస్తున్నది.  పెద్ద గోపురం 11 అంతస్తులతో, 192 అడుగుల ఎత్తుతో దర్శకులను ఆకర్షిస్తూవుంటుంది. ఈ ఆలయ నిర్వహణ క్రీ.శ. 1471 నుంచి తిరుక్కోవెలూర్ ఎమ్బెరుమానార్ జియర్ స్వాములు నిర్వహిస్తున్నారు.

 

మూల విరాట్

మేము వెళ్ళినప్పుడు ఆలయంలోని గర్భ గుడిలోకూడా మరమ్మత్తులు జరుగుతూండటం వలన మేము దర్శనం చేసుకోలేక పోయాము.  వేరొక మండపంలో ఉత్సవ విగ్రహాలు వుంచి మూల విరాట్ శక్తులను వాటిలో నిక్షిప్తం చేసి పూజలు చేస్తున్నారు.  ఆ దర్శనమే మాకు లభించింది.  అయితే నేను తెలుసుకున్న మూలమూర్తుల వివరాలు కింద ఇస్తున్నాను…తర్వాత వెళ్ళేవారికోసం.

 

వామనావతారంలో వున్న స్వామి ఉపాలయాన్ని స్వామి చిన్న సన్నిధి అంటారు.  స్వామి చేతిలో గొడుగుతో నిలుచున్న భంగిమలో దర్శనమిస్తాడు.  శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం రోజున ఇక్కడ విశేష ఉత్సవం జరుగుతుంది. తర్వాత శ్రీ త్రివిక్రముని సన్నిధి.  ఇక్కడ స్వామిది పెద్ద రూపం.  కుడి కాలు పెకి ఎత్తి, పక్కనే వున్న పున్నాగ వృక్షముతో అందంగా వుంటాడు.  కుడి చేతిలో శంఖాన్ని ఎత్తి తనవద్దకు వచ్చు భక్తులకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడని చెప్తారు.  ఎడమ చేతిలో చక్రము, ఒక కాలుతో ఆకాశమును మొత్తము, వేరొక కాలుతో పాతాళమును కొలిచి, మూడవ  అడుగు ఎక్కడ పెట్టవలెను అని బలి చక్రవర్తిని అడుగుతున్నట్లు కుడివైపుకల వేరొక చేతి ముద్ర వుంటుంది.   కుడికాలుకి బ్రహ్మ ఆరాధన చేస్తున్నట్లు, లక్ష్మి, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, అతని కుమారుడు నముచి ఎడమకాలును పూజ చేస్తున్నట్లు వుంటుంది.  వీరేకాదు, వామనుడికి దానము చెయ్యవద్దు అని బలి చక్రవర్తికి అడ్డు పెట్టిన శుక్రాచార్యులు, సతీ సమేతంగా మృకండ మహర్షి, ముదలాళ్వార్లు, గరుక్మంతుడు మొదలగువారు స్వామికి ఇరువైపులా కనిపిస్తారు.

 

స్వామి నిలుచున్న భంగిమలో ఇంత పెద్ద విగ్రహము ఇంకెక్కడా లేదంటారు.  లోకములు కొలిచిన స్వామిగనుక ఈ స్వామికి ఉలకళన్ద పెరుమాళ్ అని పేరు.  స్వామికి 108 సాలగ్రామాల మాల, నడుముకి దశావతార ఒడ్డాణము వుంటాయి.
ఇంకొక విశేషమేమిటంటే ఈ విగ్రహాలన్నీ చెక్కతో చేసినవి.  అందుకే అభిషేకము ఉత్సవ మూర్తులకు మాత్రమే.

 

స్ధల వృక్షము

ఈ ఆలయ స్ధల వృక్షము పొన్న చెట్టు.  ఆలయ ప్రాకారంలోని   వేణు గోపాల స్వామి ఆలయం దగ్గర వున్నది.
స్వామిని ఊహించుకుంటూ వుండండి.  స్ధల పురాణం వచ్చే వారం తెలుసుకుందురుగాని.

 

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


హింగ్లాజీ మాతా మందిర్ (పంచ పాండవ గుహలు)

 

 

హింగ్లాజీ  మాతా మందిర్ (పంచ పాండవ  గుహలు)

 


శ్రీ కృష్ణుడు  పెరిగి  ద్వారకలో  వుండి చివరికి  నిర్యాణం  చెందిన  ఆ ప్రదేశాలు ప్రభాస్ తీర్ధం,  గుజరాత్ లోనే  వున్నాయి . యా చుట్టు  పక్కల ప్రతి  ప్రదేశం  పవిత్రమైనదే!  అక్కడ  వున్న ప్రదేశాలలో  ముఖ్యమైన  ప్రదేశం గా  చెప్పబడే హింగ్లాజీ మాతా (పాండవుల  గుహ)  అనే  ప్రదేశం.  ఆ గుహ  గురించి .... 

 

 

సోమనాథ్  వెళ్ళినపుడు  సిటీ  టూర్  లో భాగంగా   హింగ్లాజీ  మాతా మందిర్ చూసాము.  దీనినే పంచ  పాండవుల  గుహ అని కూడా  అంటారు.  పాండవులు అజ్ఞాతం లో  వున్నపుడు ఇక్కడ  కొంతకాలం  వున్నారని  అంటారు.  

 

 

 

 

 

 

ఈ గుహని  అనుకునే  హింగ్లాజీ  మాత  గుడి  వుంది. ఈ  గుహలోకి  వెళ్ళటానికి దారి  చాలా  చిన్నగా  వుంటుంది .  వెళ్ళిన వాళ్ళు  వస్తే  తప్ప  ఇంకొకరు  వెళ్ళటానికి   లేదు.  లోపల  విగ్రహాలు  చిన్నవిగా  వున్నాయి.  ఈ  స్థలం  గురించిన  వివరాలు  అంతగా  లభ్యం  కాలేదు.  ఈ  గుహలు చాలా  చిన్నవి.  ఈ  గుహల  దగ్గర లోనే   సూర్య మందిర్,  ఆది శంకరాచార్య  మందిరం,  ఒక  చిన్న కొలను  వున్నాయి.  ఆ నీటి  దగ్గరికి  వెళ్ళాలంటే  మెట్లు  దిగి  వెళ్ళాలి.
హింగ్లాజీ  మాత  గుహ లోపలికి  పాకుతూ  వెళ్ళినట్లే  వెళ్ళాలి.  . 

 

 

పవిత్రమైన  జ్యోతిర్లింగ మైన ఆ  సోమనాదీసుని  చూసిన  అనంతరం భక్తి  భావం  కలగదు.   ఇవన్నీ  పురాణ స్థలాలు,  పురాతన ప్రదేశాలు,  సందర్సనీయ స్థలాలు అంతే !   ఒక  టూరిస్ట్  ప్లేస్ గా  అక్కడి  స్థలాలు  చూడాలి .  
  ఆ  సోమనాధుని  చూసి,  చుట్టు పక్కల చూసే యాత్రా  ప్రదేశాలు  ఇవన్నీ.   ... 

 

 

(పురాణాల  ప్రకారం హింగ్లాజి  మాత ప్రధానం గా చెప్పుకునే  శక్తి పీఠం పాకిస్తాన్  లో బెలూచిస్తాన్ లోని హింగోల్ నదీ  తీరంలోని   హింగ్లాజి  ప్రాంతంలో వున్నదని  అంటారు. సతీ దేవి  శరీర  భాగాలలో  శిరో భాగం (బ్రహ్మ రంధ్రం) ఇక్కడ  పడినదని కథనం.)

 

 

మన  భారత  దేశం లోనూ రెండు మూడు  ఆలయాలు  ఈ మాతకి  వున్నాయి.   మేము చూసిన  గుజరాత్ లోని  సోమనాథ్  లో  5 కి.మీ. దూరంలో  ఈ గుహలు  వున్నాయి.గుహలో ఏముందో, ఎలా వుంటుందో తెలుసుకునే  వారికి తప్పకుండా  ఈ  ప్రదేశం  నచ్చుతుంది.  ఈ గుహలు, సూర్య మందిర్ కి వెళ్ళే  దారి  ఇరుకుగా  వుంటుంది. అటు ఇటు  దుకాణాలు యాత్రికులని  ఆకర్షిస్తూ  వుంటాయి .  సూర్య మందిర్కి  మెట్లు  ఎక్కాలి,  గుహలకి  మెట్లు  దిగాలి.  నడక  తప్పదు .   మన వెహికిల్  దూరంగా  వుంటుంది.


....Mani Kopalle


‘మా’ చిన్తపూర్ణి

 

 

"మా" చిన్తపూర్ణి

 

 ప్రముఖమైన  శక్తి పీఠంగా విరాజిల్లె చిన్తపూర్ణి ఆలయం.

 

చిన్తపూర్ని హిమాలయాలలోని పవిత్రమైన ఆధ్యాత్మికమైన ప్రదేశం 51శక్తి పీఠాలలో ఒకటి. ఎంతో  మహిమల ఈ క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర వుంది.   డిల్లి నుంచి పఠాన్ కోట్ చేరుకొని అక్కడినుంచి టాక్సీ లో స్వామి  చిన్మయానంద వారి తపోవన్ ఆశ్రమం చేరుకున్నాము. అక్కడి నుంచి  మేము హిమాచల్ ప్రదేశ్ లోని చుట్టుపక్కల ప్రదేశాలు చూసాము. వాటిలో శక్తి  పీఠం గా  విరాజిల్లే మా చింత పూర్ణి మందిరం ఒకటి.భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన టూరిష్టులు  కూడా వస్తుంటారు.

 

చరిత్ర కథనాలు

 

దక్షప్రజాపతి కుమార్తె, (పార్వతి దేవి) అయిన దాక్షయని పరమ శివుని వరించి వివాహం చేసుకుంటుంది. కాని దక్షుడు శివుని శక్తిని గుర్తించడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చేయ తలపెడతాడు. ఆ దక్ష యజ్ఞానికి శివుని కాని దాక్షాయినిని కాని ఆహ్వానించడు. అయినా దాక్షాయిని పుట్టినింటి  మీద మమకారంతో  పిలవకపోయినా పుట్టినింటికీ వెడుతుంది. కాని అక్కడ ఆమెకి అవమానం జరుగుతుంది. ఎవరు ఆమెని ఆహ్వానించరు పలకరించరు. శివుని కూడా అవమానిస్తూ మాట్లాడతారు. అది భరించలేక తనకి తాను అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞ కుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పటినుంచి ఆమె పవిత్రమైన  సతిగా పేరుగాంచింది. 

 

సతి మరణ వార్త విన్న పరమ శివుడు దుఃఖితుడై హుటాహుటిన దక్షవాటికకు  వస్తాడు.  శివ తాండవం చేస్తూ, దక్ష యజ్ఞానాన్ని  నాశనం చేస్తాడు. అనంతరం  సతీ దేవి మరణాన్ని జీర్ణించుకోలేని శివుడు సగం కాలిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని శివతాండవం చేస్తూ భూమండలం అంతటా మతిలేని వాడిలా  తిరుగుతూ ఉంటాడు. అది చూసిన దేవతలందరూ శివునికి సతీదేవి పై గల ప్రేమ, సతి వియోగంతో శివుని బాధనీ స్థితిని చూసి ఆందోళన చెందుతూ  శివుని నుండి సతీదేవి శరీరాన్ని వేరు చేయాలని విష్ణు మూర్తిని ప్రార్దిస్తారు.  విష్ణువు శివుని వెంట అనుసరిస్తూ సమయం చూసి సతి దేవి శరీరాన్ని తన సుదర్శన చక్రం తో ముక్కలు ముక్కలు చేస్తాడు.  సతీదేవి శరీర భాగాలు భూమండలం అంతటా పడతాయి. అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఆ జగన్మాత  కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం, విశ్వాసం.

 

ఈ  శక్తిపీఠాలలలో పరాశక్తి భైరవునితో (తన భర్త అయిన శివుడు) వెంట కాలభైరవుని (శునకం) తోడుగా కొలువై వుంటుంది  చింతపూర్ణి లో అమ్మవారి పాదాలు పడిన చోటు.  ఇక్కడ అమ్మవారు విగ్రహ రూపంలో వుండదు. పిండి రూపం లో వుంటుంది. ఇక్కడకి వచ్చిన భక్తులు తమ చింతలు దూరం చేసే తల్లిగా కొలుస్తారు. ఈ సత్యం చాలా మందికి అనుభవ పూర్వకంగా రుజువైయింది. 

 

చిన్మస్తిక దేవి. (శిరస్సు లేని దేవత)

 

స్థల పురాణాన్ని బట్టి  ఈ కధ కూడా  ప్రచారంలో వుంది. 'మస్తిక'  అంటే శిరస్సు  అని, 'చిన్'  అంటే లేదు అని, అర్థం... శిరస్సు లేని దేవత గా ఇక్కడి మాత ని కొలుస్తారు.  ఇతిహాసాలలోని పురాణాల  ప్రకారం  మార్కండే పురాణం లో ఒక గాధ ప్రచారంలో వుంది. చండి దేవికి రాక్షసులకి జరిగిన ఘోర యుద్ధం లో చండి దేవి అసురుల్ని ఓడిస్తుంది.  అందులో సాయపడిన   ఢాకిని, యోగిని గా పిలువబడే జయ విజయులు ఏంతో మంది రాక్షసులని  సంహరించి వారి రుధిరాన్ని తాగుతారు. కాని,  యుద్దానంతరం కూడా వారు విపరీతమైన  రక్త దాహంతో వున్నపుడు చండి దేవి  తన తలని తానె ఖండించి తన శరీరం నుంచి వచ్చే రక్త దారాలతో వారి దాహాన్ని తీరుస్తుంది. అందుకే ఇక్కడి దేవికి చిన్ మస్తికాదేవిగా   శిరస్సు లేని దేవిగా పిలువ బడుతోంది. 

 

పురాణాలు, ఇతిహాసాలలో ఈ స్థలాని రుద్ర  దేవుడు ఈ ప్రదేశాన్ని నలు దిక్కులా కాపాడుతుంటాడని కూడా వుంది. తూర్పున కాళేశ్వర్ మహాదేవుని ఆలయం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ ఆలయం, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్ ఆలయం దక్షిణాన శివ్  బారి ఆలయం వున్నాయి. అందుకే  ఆ ఆలయాన్ని చిన్ మస్తిక దేవి ధామ్ అని అంటారు
పండుగలు

 

ప్రతి సంవత్సరంలో పది రోజులు జూలై ఆగష్టు మధ్య ఉత్సవాలు జరుగుతాయి సావన్ (శ్రవణ్ ) అష్టమి ఉత్సవాలుగా పిలుస్తారు. ఇక్కడి అమ్మవారి మహిమల గురించి తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ ఆలయానికి వస్తుంటారు.  శ్రవణ మాసం లోను, దసరా నవరత్రులలోను కార్తిక మాసంలోను, చైత్ర మాసం లోను, పౌర్ణమికి ఇంకా ఇతర పర్వ దినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు

 

ఎంతెంత దూరం

 

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా  నుంచి 47 కి.మీ. దూరం లో  వుంది.  సొలా  సింఘి  పర్వత  శ్రేణులలో  పర్వత శిఖరం పైన  940 మీటర్ల (3,117 అడుగుల) ఎత్తులో చింతపూర్ణి అమ్మవారి ఆలయం వుంది.      
65 కి. మీ. ధర్మశాల నుంచి.అతి దగ్గరి   విమానాశ్రయం గగ్గల్. కాంగ్రా జిల్లాలో వుంది. రైలు మార్గం ఉనా జిల్లాలోని అంబ నుంచి 20 కి.మీ. దూరం లో వుంది. ఢిల్లీ నుంచి 430 కి మీ  దూరంలో వుంది. పంజాబ్ రాష్ట్రం లోని హోషియార్ పూర్ 43 కి.మీ. దూరం లో వుంది. చుట్టూ సుందరమైన ప్రక్రుతి దృశ్యాలతో అలరారుతూ వుంటుంది. ఢిల్లీ నుండి చందిగడ్, నంగల్, ఉన, ముబరిక్పూర్, తానికపుర , భార్వైన్  చిన్తపూర్ని ఒక మార్గం ఢిల్లీ నుండి జలంధర్, హోషియార్పూర్ ముబారిక్పూర్ భార్వైన్, తానికపుర ద్వారా   చిన్తపూర్నికి  ఇంకొక మార్గం

 

 

ఉప హిమాలయాలు సొలసింఘి  ధార్

 

 

ఇక్కడి పర్వతాలు ఉప హిమాలయ పర్వతాలుగా పిలవబడే   సొలా సింఘి దార్ లేదా  జస్వాన్ దార్ పర్వత శ్రేణుల నడుమ ఎర్రని ధూళితో నిండి వుంటాయి బియాస్ నది   కాంగ్రా, ఉనా జిల్లాలను  తాకుతూ ప్రవహిస్తుంది. ఇంకో ప్రక్క స్వాన్ నది పారుతూ వుంటుంది.  

 

ఈ పర్వతాల నడుమ శక్తి పీఠం అయిన చిన్తపూర్ని ఆలయం అలరారుతోంది.

 

 


ఉత్సవాలలో సుందరంగా అలకరించిన ఆలయం

 

 

దర్శనం చేసుకుని రాగానే కనిపించే ఆలయం

 

 

ఉత్సవాలలో అమ్మవారు

 

చ్ఛిన్నమస్త దేవి  , చినమస్తా దేవి , చిన్మస్తిక దేవి ఇలా భిన్నమైన పేర్లతో దేవిని కొలుస్తారు.  శిరస్సు లేని దేవిగా ప్రసిద్ధి చెందింది.

 

ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రక్రుతి రమణీయ దృశ్యాలు ,  అగాధమైన లోయల నడుమ  అందమైన గృహాలు, భవంతులు కనువిందు చేస్తాయి. ఇటు ఆధ్యాత్మికం గాను, విహార యాత్రలకి ఏంతో అనువైన ప్రదేశం ఇది

 

ఈ ఆలయంలో కొన్ని సాంప్రదాయాలు పాటిస్తారు.

 

ప్రతి ఒక్కరు ఆలయంలోకి ప్రవేసించే ముందు తలపై షాల్ కాని, కర్చీఫ్ కాని, టోపీ  కాని  ధరించాలి. స్త్రీలు కూడా తలపై కొంగుని కప్పుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించాలి.  పాదాల వరకు వస్త్రాలను ధరించాలి.

 

తోలు వస్తువులు అంటే  బెల్త్, లెదర్ పర్సులు వంటివి ఆలయం లోకి తీసుకు రాకూడదు. ఆలయంలో పాన్, గుట్కా, మత్తు పదార్ధాలు సేవించటం నిషిద్దం. ఆలయం లోకి ప్రవేసించే ముందు మాంసాహారం ఆల్కహాలు వంటివి తీసుకుని వుంటే లోనికి ప్రవేసించ కూడదు. దేవతా విగ్రాహాలకి ఎదురుగా కాళ్ళు జాపి కూర్చోకూడదు, పడుకో కూడదు. పండిట్ మాయి దాస్, కలియా సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు.  ఛాప్రో గ్రామం లో మాతా చింత పూర్ణి దేవి ని కనుగొన్నట్లు చెబుతారు. 26 తరాలకి ముందు వాడు  ఇతను. ఇప్పటికి ఇతని వంశీకులే ఆలయంలో దేవిని అర్చిస్తున్నారు.

 

కాలియా కుటుంబీకుల చరిత్రని బట్టి చుస్తే... భక్తుడైన మాయీ దాస్ తండ్రి పాటి యాలాకి దగ్గరలో అతూర్ గ్రామానికి చెందినవాడు. ఇతను దుర్గా మాత  భక్తుడు. ఇతనికి దేవి దాస్, దుర్గ దాస్, మాయీ దాస్ అనే ముగ్గురు కొడుకులు. ఆ తరువాత ఆ కుటుంబం హిమాచల్ ప్రదేశ్,   ఉన దగ్గరలోని గ్రామానికి వలస వచ్చారు. మాయీ దాస్ కూడా తండ్రి వలే దుర్గాదేవి భక్తుడు. ఎప్పుడు భజనలు కీర్తనలు చేస్తుండేవాడు. వివాహం కూడా జరిగింది. తండ్రి మరణానంతరం ఇతని కుటుంబాన్ని  అన్నలు సరిగా చూడక పోవటంతో ఇంటి నుంచి బయటికి వచ్చి ఇబ్బందులు పాడుతుండేవాడు. అయినా కూడా మాయీ దాస్ దుర్గా మాతని ఇంకా భక్తి తో సేవిస్తూ ఉండేవాడు దుర్గా  దేవి తన చింతలని పోగోడుతుందని నమ్మేవాడు.

 

ఒకసారి మాయీ దాస్ అత్తవారింటికి వెడుతూ మర్రి చెట్టు కింద సేద తీరుతాడు. చుట్టూ అడవి. నడిచి నడిచి అలసి పోయి నిద్రలోకి జారుకుంటాడు. ఆ సమయంలో ఒక అందమైన అమ్మాయి కనపడి, "మాయీదాస్!  నీవు ఇక్కడే వుంది నన్ను సేవించుకో. నీకు మంచి జరుగుతుంది" అని అంటుంది. మాయీ దాస్ వెంటనే లేచి చుట్టు  చూస్తాడు కాని అక్కడ ఎవరు కనపడరు .  అతనికి అంతా అయోమయంగా వుంటుంది.

 

అతను తిరిగి అత్తవారింటికి తన ప్రయాణం కొనసాగిస్తాడు. కాని తనకి వచ్చిన కల గురించే ఆలోచిస్తాడు. ఆ ఆమ్మాయి నిజంగా దేవేనా?  అలా ఐతే  ఆ అజ్ఞాని ఎలా అమలు పరచగలడు ఇలా పరి పరి విధాల ఆలోచిస్తూ అత్తగారింట్లో ఎక్కువ కాలం ఉండలేకపోతాడు.

 

తిరుగు ప్రయాణంలో అదే వృక్షం కింద కూర్చుని తన ఆలోచనలను దుర్గా దేవి గురించే ఆలోచిస్తాడు. "ఓ జగజ్జనని! నీ కున్న శక్తి నాకు లేదు. నేను చాల చిన్న వాడిని. నన్ను నీ నిజమైన భక్తునిగా స్వీకరిస్తే నా సందేహాలని పోగొట్టు" అని ప్రార్ధిస్తాడు.  మాయీ దాస్ ప్రార్ధనలు విన్న దుర్గామాత అతని ముందు చతుర్భుజాలతో సింహ వాహినియై  ప్రత్యక్షమౌతుంది. మాయీ దాస్ ఆమెని కీర్తిస్తాడు. "తల్లీ నీవు నన్ను ఆజ్ఞాపించు. నేను నిన్ను ఎలా సేవించుకోవాలి? నీ పాదాల చెంత నా జీవితం అంకితం  చేసుకుంటాను" అని అర్దిస్తాడు.

 

దానికి సమాధానంగా దుర్గా దేవి "నేను ఇక్కడ తరతరాలుగా ఉంటున్నాను. కాని ఈ కలి యుగం లో ప్రజలు  ఈ ప్రదేశాన్ని, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఇక్కడ పిండి రూపంలో (గుండ్రని రాతి రూపం) వున్నాను. ప్రతి రోజు పూజాదికాలు నిర్వహించేలా చూడు"  అని ఆజ్ఞాపించింది. తరువాత  అతనికి మంత్రోపదేశం  చేసింది.  దుర్గామాత "వ్స్వు ఇంతవరకూ ఛిన్నమస్తిక దేవిగా అందరికి తెలుసు. నేను అందరి బాధలు, కష్టాలు తొలగిస్తాను కనుక ఇప్పటి నుంచి ప్రజలు నన్ను చింత పూర్ణికగా  పిలుస్తారు.   నా భక్తులు ఇక్కడ నాకు ఆలయం నిర్మిస్తారు. భక్తులు సమర్పించే కానుకలు నీ బుక్తికి సరిపోతాయి" అని కూడా చెప్పింది. 

 

కొండ శిఖరాన ఆ ప్రదేశం అంతా కొండచిలువలతోను క్రూర మృగాలతోను నిండి వుంది.  అంత ఎత్తులో అక్కడ  నీళ్ళు దొరకడం కూడా చాల కష్టం. అప్పుడు దుర్గ మాత కొంత దూరం లో  ఒక ప్రదేశం చూపించి అక్కడ తవ్వితే నీరు లభిస్తుందని చెప్పింది. మాయీ దాస్ దేవి చూపించిన ప్రదేశంలో ఒక రాతిని తొలగించితే అక్కడ  మంచి నీటి వూట ఉవ్వెత్తున పైకి లేచించి. మాయీ దాస్ ఆనందానికి అవధులు లేవు.    ఆ నీటితో ప్రతి రోజు అమ్మవారికి అభిషేకానికి ఉపయోగించేవాడు. భజనలు, స్త్రోత్రాల తో పూజించేవాడు. అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న పాక వేసుకుని ఉండేవాడు.

 

ప్రస్తుతం అతని  తరువాత  26 తరాలవారు మాత ని సేవించుకున్నారు. నేటికి అతని వంశీకులే   అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.  ఆ వూరిలో అధిక భాగం అతని దయాదులే వున్నారు.

 

ఆ నీటి ట్యాంక్ సమీపం లో మాయీ దాస్ సమాధి వుంది. ఆనాడు తవ్విన తటాకమే నేడు  ఆధునీకరించి  ఆ నీటినే అభిషేకానికి, ఆలయ అవసరాలకి  వాడుతుంటారు.     

 

అడవిలో చెట్టు కింద మాయీ దాస్ చే పూజలు అందుకున్న చిన్తపూర్ని అమ్మవారికి నెమ్మది నెమ్మదిగా  ఆలయం నిర్మించి ఏంతో  అభివృద్ధి చేసారు. నేటికి ఆ ఊరిని ఛాప్రోగానే  పిలుస్తారు.

 

పూర్తిగా అడవితో నిండి వుండే ఆ ప్రదేశం రోడ్లు వాహనాల రాకపోకలతో నిత్యం  రద్దీగా మారింది. ఆలయానికి 1.2 కి.మీ. దూరంలోనే వాహనాలు ఆపి రద్దీగా వుండే బజార్ల గుండా కాళీ నడకన నడిచి ఆలయానికి వెళ్ళాలి. మంగళ శుక్ర, శని ఆది వారాలలో విపరీతమైన రద్దీ వుంటుంది. మాకు దర్సనానికి మూడు గంటల సమయం పట్టింది.

 

సాధారణంగా భక్తులు అమ్మవారికి తియ్యటి పదార్ధాలు నివేదన చేస్తారు. రవ్వతో చేసిన హల్వా, లడ్డు, బర్ఫి ఖీర్,  కొబ్బరి  వంటి ఆహార పదార్దాలే కాక  ఎర్రటి చున్ని, ధ్వజం అంటే ఎర్రటి జెండా, పూలు, నెయ్యి వంటివి కూడా దేవికి సమర్పిస్తారు. ప్రసాదాన్ని ఇంటినుంచి కాని అక్కడ బజార్లలోని షాపులలో  కాని కొని నివేదన చేస్తారు.

     

    

 

 


 

అందమైన్ స్వాన్ నది

 

....Mani Lopalle


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.