"నాకు కాస్త నయంగానే వుంది. బాబుకి జ్వరం తగ్గలేదు. డాక్టరు దగ్గిరికి తీసుకెళ్ళి చూపెట్టండి" అంది.
మూడు రోజుల నుంచి ఆమెకి జ్వరం తరచూ ఏదొకటి స్వల్ప అస్వస్థత వుంటూంటుంది ఆమెకి."
"తల్లివి నువ్వే తీసుకెళ్ళు. నీకు జ్వరం తగ్గిందన్నావుగా" అన్నాడు.
సరేనన్నట్లు తలూపింది.
స్నానించి వచ్చాడు.
టిఫినూ కాఫీ.
టిఫిన్ మెక్కి కాఫీ తాగేసరికి రామ్మూర్తికి కాస్త వుత్సాహంగా అనిపించింది. నిర్మలమీద మరో జోక్ వెయ్యబోయి ఆగిపోయాడు.
తిట్టినా, దీవించినా, ప్రణయించినా, ప్రళయించినా, సరసించినా విరసించినా__ ఆమె నీరసించినట్లుగానే అనిపిస్తుంది రామ్మూర్తికి. మొదట్లో నిరసిస్తున్నట్లుగా అనుకున్నాడు గానీ అది నీరసించటం అని తరవాత తరవాత అనుకున్నాడు.
రామ్మూర్తికి పావుగంట క్రితం తన పక్కనుంచి దూసుకుపోయిన యెర్ర పడవ కారు గుర్తొచ్చింది_ నిర్మలవంక చూడగానే.
__అదేం వక్షం. అందునా బాలింతవక్షం! అందుకే పిల్లాడికి సీసా పాలు. సీసా పాలు పాలసీసా గాజుసీసా గాజుకారు సీసాకారు గాజుకారు గాజుపాల_- కవల పిల్లలకి, సరదాకి అప్పుడప్పుడూ_ మొగుడూ లేడు కడుపూ లేదు పాలూ లేవు__ కానీ పాలు పాలు పాలపండు పాలబంతులు....
"రిక్షా పిలిస్తే తీసుకెళ్తాను మరి__"
"యీ నీరసాన్ని పసిబిడ్డడే ఎత్తుకోవాల్సి వస్తుంది" అనుకుంటూ "నే తీసుకెళ్తాలే_" అని లేచి పిల్లాణ్ణి భుజాన వేసుకున్నాడు.
పిల్లాడు మరింత ఏడవడం మొదలెట్టాడు కదలికకి.
"ఇంజక్షను సూది గుచ్చినట్టు ఏడుస్తాడేం_ నీ లక్షణమే అబ్బింది" అని విసుక్కున్నాడు.
"నేను ఇంజక్షను చేయించుకుంటూ ఏడవడం మీరెప్పుడు చూశారండి?" అని చమత్కరించడం ఆమెకి చాతకాదు. చాతకాకుండానే ఒకసారి అలా యేదో అంటే, రామ్మూర్తికి చమత్కారంలా కాక చురకలాగా అనిపించింది. యేదో ములుకుమాట అన్నాడు. ములుకు గుచ్చుకున్నదీ లేనిది తెలియని నీలాంటి_ ఆమె మౌనం,
"ఆ డాక్టరు యక్షప్రశ్నలన్నీ అడుగుతాడు. పొద్దుటినుండి వీడి గాధంతా నాకు తెలియదుగా_ నువ్వూ రా_" అన్నాడు రామ్మూర్తి.
తల వూపింది నిర్మల.
96
సాయంత్రం ఆరు గంటలవేళ.
రోడ్డువెంట నిదానంగా పోతున్న విజయ్ కుమార్, పక్కన సినిమా హాలు ఆవరణలో కొందరిని చూసి; వెంటనే స్కూటర్ లోనకి తిప్పాడు. వెనక కూర్చుని వున్న యాదగిరి "యిటు యాడికి?" అన్నాడు.
"బాపూ సీతా కల్యాణం గొప్ప సినిమా" అన్నాడు విజయ్ కుమార్.
అక్కడ నిలుచుని వున్నవాళ్ళలో లలితకళల నిపుణులు కొందరు వున్నారు. తన ఆసక్తి వాళ్ళకి తెలియాలని విజయ్ కుమార్ దిలావర్ దగ్గిరికి వెళ్ళవలసినవాడల్లా యిటు తిరిగాడు.
మధ్యలో చాలాసార్లు యాదగిరికి చాలా విషయాలు వివరించాడు విజయ్ కుమార్. ఇంటర్వెల్ లో అవసరం లేకపోయినా, మూడు నాలుగుసార్లు వివరించాడు. బయటికీ లోనకీ తిరిగాడు.
"ఏం సిన్మా బోర్ గున్నది." అన్నాడు యాదగిరి. తనకీ కాస్త విసుగ్గానే అనిపిస్తున్నా "నీకు తెలవదు చాలా ఇంటరెస్టింగ్ గా వుంది" అన్నాడు విజయ్ కుమార్.
తెర దగ్గిరి సీట్లో శ్రీపతిని చూసి ఆశ్చర్యపోయాడు విజయ్ కుమార్.
ఇలాంటి సినిమాలయితే __ ఖాళీగా తెలిపిగా వుంటుందని శ్రీపతి, కింది తరగతి టిక్కెట్టు కొనుక్కుని తెరముందునే కూచుంటాడు.
సినిమా ముగిసిన వేళకి సన్నగా జల్లు పడుతోంది. జనం వరండాలో నిలుచున్నారు. కొందరు చినుకుల్లో నడిచి వెళుతున్నారు.
శ్రీపతి, విజయ్ కుమార్ లు దూరం నుంచి ఒకరినొకరు చూసి ఇద్దరూ పది అడుగులు ముందుకు వేశారు.
"లేబర్ క్లాసులో కూచున్నారు?" అన్నాడు విజయ్ కుమార్.
"నేనూ లేబర్ నే. కేపిటలూ కేపిటలు మీది సాంతం ఫలసాయం లేని పని. లేబరే." అని చిన్నగా నవ్వి, "మరేంలేదు. ఇలాంటి సినిమాల కొస్తే పై తరగతిలో కూచుంటే, విజ్ఞానపు అజ్ఞానపు రన్నింగ్ కామెంటరీలు వినలేక చావాల్సొస్తుందని" అన్నాడు శ్రీపతి.
"అటు వెళ్ళి టీ తాగుదామా?" అన్నాడు విజయ్ కుమార్.
"ఓ." అన్నాడు శ్రీపతి.
చినుకుల్లో నాలుగడుగులు వేసి, పక్కనే యిటు హాలు ఆవరణలోకి అటు రోడ్డుమీదకీ వున్న ఇరానీ హోటల్లో కూచున్నారు. కూడా యాదగిరి.
"హీరో హీరోయిన్ లు చాలా బాగున్నారు" అన్నాడు విజయ్ కుమార్.
"ఓల్డ్ మాస్టర్ల ఫిమేల్ మ్యాడ్ లా వున్నాడు. కాకపోతే వాళ్ళకి మన నీలం తెలియదు" అన్నాడు శ్రీపతి.
"బాపూ గొప్ప ఆర్టిస్ట్. గొప్పగా తీశాడు." అన్నాడు విజయ్ కుమార్ సిగరెట్ వెలిగిస్తూ.
"కెమెరామెన్ కి మరీ మరీ చక్కని యాంగిల్స్ ని సెలక్ట్ చేసి పెట్టటమూ రంగుల కలయిక కంపోజిషన్ లూ బాపూ ప్రత్యేకత. గంగావతరణం బావుంది. బాపూ పరిమితుల ననుసరించి, Bapu is too lyrical for the mighty sublimeness of the Gauga and the Himalayas. రోరిక్ వేసిన The Birth of Ganges చూడతగింది__"
మధ్యలోనే అందుకుని, "అవును ఆ వోల్డ్ మాస్టర్ చాలా గొప్పగా చేశాడు" అన్నాడు విజయ్ కుమార్.
'ఓరి నీ అజ్ఞానం మండా. వాలెజ్స్క్ ఫిమేల్ న్యూడ్ ల అవయవాలలు వీడి కళ్ళలో మెదిలి వుండాలి.' అనుకుని, "రోరిక్ వెనకటి శబ్దాల యూరోపియన్ వోల్డ్ మాస్టర్ కాదు. నికోలస్ రోరిక్ రష్యన్. చాలాకాలం హిమాలయ ప్రాంతాల్లో వున్నాడు. అతని రెండో కొడుకు తొలి భారతీయ సినీరాణి దేవికారాణిని పెళ్ళిచేసుకున్నాడు. ఆ చిత్రం సంజీవదేవ్ గారి దగ్గిరుంది__"