విష్ణు అనుగ్రహానికి రెండు మార్గాలు
Karthika Puranam – 26
విష్ణుగణాలు చెప్పింది విని విస్మృత చేష్టుడు, విస్మయరూపుడు అయిన ధర్మదత్తుడు వారికి దండవత్ ప్రణామాలు చేసి ''ఓ విష్ణు స్వరూపులారా! ఈ ప్రజానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాలచేత ఆ కమలనాభుని సేవించుకుంటూ ఉన్నారు. వాటిలో దేన్ని ఆచరించడంవల్ల విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి'' అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనికి ఇలా సమాధానం ఇచ్చాయి.
''పాపరహితుడైన బ్రాహ్మణుడా! పూర్వం కాంచీపురాన్ని ''చోళుడు'' అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరుమీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి చెందాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. యజ్ఞాలకోసం నిర్మించిన బంగారు యూపస్తంభాలతో తామ్రపర్ణీ నది రెండు తీరాలు కుబేర ఉద్యానవనాలైన ''చైత్రరథాల'' వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు ''అనంతశయన'' పేర యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణు ఆలయనికి వెళ్ళి మణి మౌక్తిక సువర్ణ పుష్పాలతో శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్థిమితంగా శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు.
అంతలోనే ''విష్ణుదాసు'' అనే బ్రాహ్మణుడు విష్ణువును పూజించేందుకు ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ, అభిషేకం చేసి తులసిదళాలతోనూ గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ అభిజాత్యాన్ని విస్మరించి ''ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పూలతోనూ చేసిన నా పూజవల్ల ప్రకాశమానుడైన ఆ ప్రభువును తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావు? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడుచేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా?'' అన్నాడు.
ఆ మాటలకు బ్రాహ్మణునికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి ''రాజు'' అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ''ఓ రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా, ఐశ్వర్యమత్తుడివై ఉన్నావు. విష్ణు ప్రీత్యర్థం నువ్వు ఆచరించిన యజ్ఞం ఏదైనా ఒక్కటుంటే చెప్పు'' అనడిగాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ ''నీ మాటలవల్ల నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ ఉంది. ధనహీనుడివి, దరిద్రుడివి అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నువ్వు ఎప్పుడైనా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివి.. నీకు భక్తుడివి అనే అహంకారం మాత్రం ఉంది. ఓ సదస్యులారా! సద్బ్రాహ్మణులారా! శ్రద్ధగా వినండి.. నేను విష్ణు సాక్షాత్కారం పొందుతానో, ఈ బ్రాహ్మణుడు పొందుతాడో చూడండి. అంతటితో మా ఇద్దరి భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది'' అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి, చోళుడు స్వగృహానికి వెళ్ళి ''ముద్గలుడు'' అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయ క్షేత్రంలో ఋషి సముదాయాలు చేసిన, అన్నదానాలు, అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించసాధ్యం కానిది సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు
పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ, కార్తీక వ్రతాచరణలూ, తులసివన సంరక్షణలు, ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం, షోడశోపచార విధిని నిత్యపూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు. నిత్యం సర్వ వేళల్లోనూ భోజనాది సమయాల్లో సంచారమందు, తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాల్లో విశేష నియమపాలన చేస్తున్నాడు. ఇలా భక్తులైన చోళ, విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలాకాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు.
కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసి వెళ్ళిపోయారు. దాని గురించి విష్ణుదాసు విచారణ చేయలేదు. కానీ తిరిగి వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండటంవల్ల ఆరోజు భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మర్నాడు కూడా వంటచేసుకుని శ్రీహరికి నివేదించేలోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళ మించకూడదని ఆరోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను కొనసాగించాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తున్నారు. అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు. వారంరోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే వంటకాలను పూర్వస్థానంలోనే ఉంచి తాను చాటున దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూడసాగాడు. కాసేపటికి ఒకానొక చండాలుడు అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం దీనంగా ఉంది. ఎముకల గూడులా ఉన్నాడు. అతన్ని చూసి జాలిపడిన బ్రాహ్మణుడు ''ఓ మహాత్మా! కాసేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకు వెళ్ళు'' అంటూ నేతిగిన్నెతో అతని వెంటపడ్డాడు.
ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించడానికే అనే భయంతో చండాలుడు పరుగుతీయసాగాడు. విప్రుడేమో ''అయ్యా! నేతితో కలుపుకుని తినవయ్యా'' అంటూ వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి చండాలుడు కిందపడి మూర్ఛపోయాడు.
వెనకే వచ్చిన బ్రాహ్మణుడు ''అయ్యో, మూర్ఛపోయావా?'' అంటూ తనపై వస్త్రపు చెంగుతో చండాలునికి విసరసాగాడు. ఆ సేవవల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు. ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్ళకు శంఖచక్ర గదాదారి, పీతాంబరుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుని వలె గోచరించడంతో అతను అవాక్కయ్యాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదిదేవతలు విమానరూఢులై అక్కడికి వచ్చారు. విష్ణువు మీద, విష్ణుదాసునిమీద కూడా పూలవాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. ఆదినారాయణుడు విష్ణుదాసుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతోబాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు. యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి ''ఓ ముద్గరమునీ! నాతో జగడమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్తున్నాడు. ఇంత ఐశ్వర్యవంతుని అయ్యుండీ, కఠినమైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారం పొందలేక పోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నామీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీన్నిబట్టి మహా భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గంలేదు. ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను'' - అని చెప్పాడు.
బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే ఉండటంవల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.
ఆ కారణంచేతనే చోళ దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లుళ్ళే కర్తలవుతూ ఉన్నారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి ''ఓ శ్రీహరీ! త్రికరణ శుద్ధిగా నీపట్ల భక్తిని సుస్థిరం చేయి తండ్రీ!'' అని ప్రార్ధించి సమస్త సదస్యులూ చూస్తుండగానే అగ్నిప్రవేశం చేశాడు.
అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రమీనాటికీ ''విశిఖ''గానే వర్ధిల్లుతోంది.
హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు.
ఓ ధర్మదత్తా! అలనాడే ఈవిధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. కనుక ఓ విప్రుడా! విష్ణు అనుగ్రహానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ ఒకటి ఆత్మజ్ఞానం, రెండోది ఆత్మార్పణం'' అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు.
Karthika Puranam Epic 26th Chapter, Karthika Puranam and Dharmadatta story, Karthika Puran Vaikuntha Dwarapalaka, Karthika Puranam and story of Vishnudas