కాలం వ్యక్తి ఆధీనంలో లేకున్నప్పటికీ తమ పరిధిలో గమనించగలిగిన ప్రకృతి స్థితులలో మంచి కార్యక్రమాలను మొదలు పెట్టడం వల్ల వ్యక్తి శ్రేయస్సును పొందుతాడు. తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు దాదాపుగా అన్నీ ఖగోళ సంబంధాంశాలే. ముఖ్యంగా రవి చంద్రులకు సంబంధించినవే. వీరిద్దరి ప్రభావం భూ ప్రకృత్తిపైనా, వ్యక్తి న,మనస్తత్వం పైన ఉండడం వల్ల వీరి శుభ ప్రభావాలు ఎప్పుడు ఈ భూమిపై పడతాయనే అంశంపై జరిగిన పరిశోధనే మనం నిత్యం అనుసరించే పంచాంగ పరిశీలన. పంచాంగ భావంలో తిథ్యాదులు శుభాశుభ సమయ నిర్దేశం చేస్తుంటాయి. శుభ సమయాల్లో చేసే కార్యక్రమాల వల్ల ఆయా కార్యాలు సక్రమంగా పూర్తి అవుతాయి. అవకాశం ఉన్నంత వరకు, తమకు తెలిసినంతలో శుభ సమయాన్ని ఎంచుకొని ప్రారభించిన కార్యక్రమ ఫలితాలు లోకోపయోగాన్నిస్తాయి. లేకుంటే అవి స్వార్థప్రయోజనాల కోసమే ఉపయోగపడి ఇబ్బంది పెడతాయి. అందువల్ల ముహూర్తాన్ని గమనించడం, పాటించడం అవసరం.