ప్రతి ముహూర్తానికి పంచకదోషరాహిత్యం ముఖ్యమైనది.
“తిథవారోడు భీర్యుక్తం తత్కాలోదయ మిశ్రితం
నవభిస్తు హారేద్భాగం శేషం పంచకమీరితం
ఏకో మృత్యుర్ధ్వయం వహ్నిశ్చత్వారో రాజపంచకం
షట్చోరో వసురోగస్స్యాదిత్యే తత్పంచకం స్మ్రతమ్"
పక్షాదిగా తిథులు, అశ్విన్యాదిగా నక్షత్రములు, భానువారాదిగా వారములు, మేశాదిగా లగ్నములు కలిపిన మొత్తమును 9 చే భాగించగా శేషం 1 అయిన మృత్యుపంచకం, 2 అయిన అగ్ని పంచకం, 4 అయిన రాజపంచకం, 6 అయిన చోర పంచకం, 8 అయిన రోగ పంచకం అవుతుంది. ఈ ఇందింటిని పంచకములు అంటారు. ఈ పంచకములు చెడు ఫలితాలనిస్తాయి. కనుక వివాహాది శుభకార్యములకు యాత్రలకు పనికిరావు.
శేషం 3, 5, 7, 0 అయిన అట్టి లగ్నము పంచకరహితమైనదిగా గుర్తించవలెను.
మృత్యుపంచకం - మృత్యువును, అగ్ని పంచకం- అగ్ని భయమును,
రాజ పంచకం - రాజభయమును, చోరపంచకం - దొంగల భయమును,
రోగపంచకం రోగభయమును కల్గించును.
ఉదా: విరోధినామ సం|| కార్తీక షష్టి శుక్రవారం మూలా నక్షత్రం, వృషభలగ్నం.
తిథి షష్టి 6
వారం శుక్రవారం 6
నక్షత్రం మూల 19
లగ్నం వృషభం 02
33/9= శేషం -6 చోరపంచకం
పంచకరహితం - మతాంతరాలు: పంచకరహిత గణనములో మతాంతరాలున్నాయి. గత తిథి సంఖ్యను తత్కాల లగ్నసంఖ్యను మాత్రమే కలిపి 9 చే భాగించగా మిగిలిన శేషమును పైన చెప్పిన పంచకరహిత పద్ధతిలో ఫలితములు తీసుకోనవలెను.
పై ఉదాహరణలో గత తిథి పంచమి, ప్రస్తుతం లగ్నం వృషభం.
5+2=7 పంచక రహితమైనది.
పంచకరహితము - మాసాదిగా గణనము: శుక్ల పాడ్యమి మొదలు తెలుగు సంఖ్య, ఆదివారం మొదలు వారసంఖ్య, అశ్వని నక్షత్రము మొదలు నక్షత్ర సంఖ్య, మేషాదిగా లగ్న సంఖ్యలను కలుపగా వచ్చిన మొత్తాన్ని 9 చే భాగించగా వచ్చిన శేష సంఖ్య 1 మృత్యు పంచకం, 2 అగ్ని పంచకం, 4 రాజపంచకం, 6 చోరపంచకం, 8 రోగ (వసు) పంచకాలు అవుతాయి.
ఉదా: విరోధినామ సం|| మార్గశిర బహుళ విదియ గురువారం, ఆరుద్ర నక్షత్రము, సింహ లగ్నం పరీక్షిద్దాం.
పక్షాదిగా మాసాదిగా
తిథి బ.విదియ 2 17 (15+2)
వారం గురువారం 5 05
నక్షత్రము ఆరుద్ర 6 06
లగ్నం సింహం 5 05
మొత్తం 18 33
9 చే భాగించగా శేషం 0 6
పక్షాదిగా లగ్నం పంచక రహితమైనది. మాసాదిగా చోరపంచకమైనది.
ధృవక పధ్ధతి: మేఘమునకు 4, వృషభమునకు 6, కర్కాటకమునకు 5, సింహమునకు 4, కన్యకు 3, తులకు 2, వృశ్చికం 1, ధనుస్సుకు 0, మకరమునకు 1, కుంభమునకు 2, మీనమునకు 3 ధృవకములు.
తిథి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలతో పాటు పై ధృవక సంఖ్యను కూడా కలిపి భాగించి పంచకహితమైనదా అని పరీశీలించవలెను.
పంచ రహితము:
పంచకరహితములో వేరొక పద్దతి 'పంచ రహితము' అనగా 5 శేషంగా రాకూడదు.
'తిథి ఉడు దినలగ్నం మిశ్రితం పంచధాకృతా
తిథి రవి దశ నాగైర్వేద సంఖ్యా యుతం యత్
నవహృత హర శేషం శోభనే వర్జనీయం
రుగనల నృపచోరైర్శ్వమ్యనా దూషితంచ'
తిథి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపి, ఆ మొత్తమును అయిదు ప్రతులుగా ఉంచి, మొదటి ప్రతిలో 15, రెండవ ప్రతిన 12ను మూడవ ప్రతిలో 10ని, నాల్గవ ప్రతిలో 8ని, అయిదవ ప్రతిలో 4ను చేర్చి 9 చే అయిదు మొత్తాలను భాగించగా 5 శేషం గా రాని యెడల పంచకరహితం. అయినట్లుగా తెలిసికొనవలెను.
మొదటి ప్రతిలో 5 మిగిలిన రోగము
రెండవ ప్రతిలో 5 మిగిలిన అగ్ని
మూడవ ప్రతిలో 5 మిగిలిన రాజ
నాల్గవ ప్రతిలో 5 మిగిలిన చోర
అయిదవ ప్రతిలో 5 మిగిలిన మృత్యుపంచకములు.
అన్ని ప్రతులలో 5 శేషంరాని యెడల పంచకరహితమైనట్లు తెలుసుకొనవలెను.
ఉదా: విరోధినామ సం|| కార్తీక శుద్ద షష్టి శుక్రవారం, మూలానక్షత్రం, వృషభలగ్నం.
తిథి -6 + వారం -6 +నక్షత్రం - 19 +లగ్నం -2=33.
రోగ అగ్ని రాజ చోర మృత్యు
33 33 33 33 33
+ 15 12 10 08 04
మొత్తం 48 45 43 41 37
పై మొత్తమును 9 చే భాగించగా
శేషం 3 0 7 (5) 1
4వ దానిలో 5 శేషంగా మిగిలినది కావున చోరపంచకమైనది.
పంచక పరిహారములు: రాత్రి యందు రోగపంచకమును, పగటి యందు రాజపంచకమును, సాయంప్రాతస్సంధ్యలందు మృత్యుపంచకమును, అన్నివేళలందు మృత్యుపంచకమును విడువవలెను.
ఆదివారం రోగపంచకం, మంగళవారం అగ్ని పంచకం మరియు చోరపంచకం, శనివారం రాజపంచకం, బుధవారం మృత్యుపంచకం విడువవలెను.
రాజ సేవలందు, రాజపంచకం, గృహసంబంధ విషయములందు అగ్ని పంచకం, ప్రయాణము నందు చోర పంచకం, వివాహమందు మృత్యుపంచకం మంచివి కావు.