వారములు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.
వారాలు ఏర్పడే పద్దతి: ఆకాశంలో చంద్రుని స్థానంలో సూర్యుడు, సూర్యుడున్న స్థానంలో చంద్రుని భావించగా, కక్ష్యాక్రమం ఈ విధంగా ఏర్పడుతుంది. శని, గురు, కుజ, రవి, శుక్ర, చంద్ర. ఆ క్రమంలో హోర (1గంట)లు ఏర్పడతాయి. శనివారం శని హోరతో ఆరంభం అవుతుంది. సూర్యోదయం నుండి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరలు నడుస్తాయి. (మందామరేజ్య భూపుత్రః సూర్య శ్శుక్రేంద్రుజేందవః) అవే మరల పునరావృతం అవుతాయి. 3x7=21 గంటలు పూర్తి అయిన తర్వాత 22 వ గంట శనిహోర, 23వ గంట గురుహోర, 24వ గంట కుజహోర పూర్తికాగా ఆదివారం రవిహోరతో ప్రారంభం అవుతుంది. ఆ విధంగా ఏ వారం ఆ గ్రహానికి చెందిన హోరతో ఆరంభం అవుతుంది.
ఆదివారం: రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు శుభం.
సోమవారం: అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు శుభం.
మంగళవారం: శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పుతీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.
బుధవారం: సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుతకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.
గురువారం: సమస్త శుభకార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచింది.
శుక్రవారం: వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.
శనివారం: ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం.