అతడు ఆ ఆ ఇద్దరూ
సి.వి.డి.ఎన్. ప్రసాద్
అపర్ణ, “ ఏం నిర్ణయం తీసుకున్నావ్ …?’’ నలభై ఎనిమిది గంటల మౌనం తరువాత అతడి నోటి నుంచి కర్కశంగా వెలువడ్డ కత్తిలాంటి తొలి ప్రశ్న అదే. ఒక్కసారి ఆ ప్రశ్నలోని పదును గుండెల్లోకి కసుక్కున దిగినట్లయింది. పట్టరాని బాధతో విలవిల్లాడాను. ఆ ప్రశ్నలో నిర్ణయం తీసుకునే ఛాయిస్ వున్నా ధ్వని పాకి మటుకు కన్పిస్తున్నా నిజానికి తనకు అనుకూలమైన రీతిలోనే వ్యవహరించాలన్న ధోరణి అతడి అంతరాంతరాల్లో వుంది. నెమ్మదిగా కళ్ళెత్తి అతడివైపు సూటిగా చూశాను. రక్తం రుచి మరిగిన పులిబొమ్మ తలకు తగిలించుకున్న మనిషిలా నా కళ్ళకి కన్పించాడు.
అసహ్యం వేసింది. విసురు గాలికి కిటికీ తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. అంతవరకూ పెరిగిపోతున్న నా గుండె చప్పుడులాగే వాటిని వేద్దామని లేచాను. బయట ప్రకృతి కూడా బీభత్సంగానే ఉంది – మా ఇంటి వాతావరణంలానే ఆకాశం భోరున ఏడుస్తోంది కాబోలు కుండపోతగా వర్షం చినుకై, వరదై, వాగై రహదారంతా జలదారైంది. అప్పుడప్పుడూ మెరుపు వుండీ వుండీ ఉరుము అతడి కటువైన ప్రశ్నలాగా ఉస్సురని నిట్టూరుసూ కిటికీ తలుపులు మూసి వెనక్కి నడిచాను. రెండు గదులూ, ఒక వంటిల్లూ – ఎక్కడివక్కడ చక్కగా, పొందికగా సర్దిన సామాను టేబుల్ పై బుల్లితెర అప్పటికే బోర కొడితే పసందైన పాటలంధించే టేప్ రికార్డర్ ఇదో చిన్న సామ్రాజ్యం.
ఈ గృహిణి, మహారాణి తనే … రెండ్రోజుల క్రితం వరకూ ఈ రకమైన ఆలోచనతోనే మది పులకించేది. అతడు శ్రీపతి తాను శ్రీమతి. అతడో సగం తానో సగం. రెండు సగాలు ఒకటయ్యే రసజగం మాది. పెద్దలు కుదిర్చిన వివాహం శృంగార ప్రవాహం కాగా ముచ్చటైన మూడో అతిధిని ఆహ్వానించేందుకు మరికొంత గడువు కావాలనుకోన్నాం. స్వంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ మరికొంత సమకూరాక ఆ మూడో వ్యక్తీ ఆడయినా మగయినా గ్రీన్ సిగ్నల్ ఇద్దామనుకున్నాం. కానీ, ఇంతలోనే ఆ ఘడియ నా ముందుకు తోసుకోచ్చేసింది. బయట ఎక్కడో పిడుగుపడ్డ ధ్వని. అది నా హృదయంలోనే ఫెటిల్మని బద్దలైన అనుభూతితో ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.
మూడో వ్యక్తీ రాకకు అతనివైపు నుంచి రంగం సిద్ధమైపోయింది. ఇక నేను తల నిలువుగా ఊపటమే తరువాయి. ఈ గృహప్రాంగణాన్ని ఆ మూడో మనిషి కోసం ముస్తాబు చేయాల్సిన పనే మిగిలుంది. అతడి ముఖతా వివరాలన్నీ విన్న తర్వాత మనసు మనసులో లేదు. చేదు తిన్నట్లనిపించింది. జీవితంపై వరక్తిపుడుతోంది. మళ్ళీ ఇల్లంతా కలియజూశాను, ‘కలయా, వైష్ణవమాయా …?’ అనిపిస్తోంది నాకు ఇదంతా చూస్తుంటే. ‘ ఈ ఇంట్లోని ప్రతి వస్తువుతోనూ పెంచుకున్న అనుబంధం వట్టిదేనా …?’’ ఆ భావనతో వణికిపోతున్నాను. మళ్ళీ శ్రీపతి కంఠం ఖంగుమంది – “తీసుకునే నిర్నయమేదో తొందరగా తీసుకో నువ్వు! లేకుంటే గనుక …’’ ఆర్దోక్తిలోనే ఆపేశాడతను.
ఆ ‘లేకుంటే …’ తర్వాత ఖాళీ భర్తీ చేయలేనంత తెలివితక్కువదాన్ని కాదు కానీ, ఆ మూడో మనిషికి గ్రీన్ సిగ్నల్ ఎలా ఇవ్వగలను? అది నా కడుపు చీల్చుకుని వచ్చే పసికందు కాదే ! నా ‘రెండో సగాన్ని’ పంచుకునేందుకు వస్తున్నది నా భర్త ఇష్టపడిన మరో పడతి. నా మెళ్ళో పడిన మూడుముళ్ళపై బిగుసుకుంటున్న నాలుగో ముడి పెళ్ళయి అయిదేళ్ళు గడిచాయి. ఈ అయిదేళ్ళలోనూ గుండెకు దగ్గరగా తిష్ట వేసుకుని ‘ఊపిరి ఊహలు’వింటూ ప్రాణంలో ప్రాణంలా కలిసిపోయింది తాళి. ఇప్పుడా తాళినే ఎగతాళి చేస్తున్నాడతను. స్వయానా నా భర్త శ్రీపతి. ఒక్కసారి పూనకం వచ్చినట్లనిపించింది.
ఆ తాళిని చూపిస్తూ అన్నాను గట్టిగా … “నేనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే అసలు ఊరుకునేది లేదు. ఇది నా సామ్రాజ్యం. ఇందులోకి వేరెవరు అడుగుపెట్టినా అపర కాళీనే అవుతాను’’ అంతే! ఆ తర్వాత అతడక్కడ లేడు. మరో రెండు గంటల తర్వాత అపస్మారకస్థితిలో అతడు. ఆమెకోసం ఆత్మహత్యాయత్నం చేశాడతాను. ఆస్పత్రిలో అతడికి సపర్యలు చేస్తూ నేను.
*****
రెండేళ్ళ క్రితం ఇదే ఆస్పత్రి ఇదే బెడ్ మీద అతడు యాక్సిడెంట్ కి గురై చావుబ్రతుకుల మధ్య ఉంటె సమర్యాలు చేసింది తనే. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో అతడుంటే మళ్ళీ అదే డ్యూటీ మా ఇద్దరి పెద్దలకు సమాచారం అందించాను. నా తల్లీతండ్రీ ఒకటే గొడవ. అంతటి అపస్మారక స్థితిలోనూ అతడి పెదవుల నుంచి ఆమె పేరే ‘స్నేహ’ అని. “ఏం తక్కువ చేశాను …?’’ పదేపదే ప్రశ్నించుకుంటున్నా దొరకని సమాధానం. “అందంగా లేనా?’’ పెళ్లి చూపులనాడే మైకమొచ్చి కానీకట్నం తీసుకోకుండా ఎగిరిగంతేసి మరీ పెళ్లి చేసుకున్నాడాయే. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా ‘మేడ్ ఫర్ ఈచ్ ఆదర్’ అంటూ ఆశీర్వదించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎల్ని చక్కనైన ఉద్యోగం సజావుగా సాగుతోంది జీవితం. ‘ఇంతలో ఇదేమిటి? ఇలా అయ్యింది. నన్ను పరాయిదాన్ని కన్నెత్తి చూడని, పన్నెత్తి పలకరించని ఈ మగవాడిలో ఈ ‘మగడి’లో ఈ మార్పేమిటి?’ ఆలోచిస్తున్నాను. ఆ రోజు రాత్రి అతడన్నమాటలు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కటిగా ‘’మా ఆఫీసులో ‘స్నేహ’ అనే అమ్మాయి ఎంతో మంచిది. చూడచక్కనిది కూడా’’
“నాకన్నానా …?’’ “ఎందుకులే, చెబితే ఈర్ష్యపడతావు’’ “ఛీ .. పొండి ,,, ఉడికిస్తున్నారు’’ ఆ విషయాన్ని సరదాగా తీసుకుంది తను. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడతను “మన దాంపత్యానికేం ఇబ్బంది రాదు. నిన్ను కూడా చక్కగా చూసుకుంటాను. ఆమెని పెళ్ళి చేసుకుంటే నువ్వు అడ్డు చెప్పకూడదు సరేనా …?’’ మొదట జోక్ అనుకుని నవ్వాను. తరువాత షాక్ అయ్యాను. ఈ నలభై ఎనిమిది గంటల్లోనూ బంగాళాఖాతంలో అల్పపీడనం లోకాన్ని చుట్టుకున్న ముసురు తన జీవితంలోనూ తుఫాను. చిగురుటాకులా వణికిపోతున్నాను ‘ఇంతకీ నాకు అర్థం కాని విషయమొక్కటే నా వెనుక ఇంట ప్రమాయణం నడుపుతున్న ఈ ‘మగా’నుభావుడికి తాను కట్టిన తాళి గుర్తురాలేదా? అని.
అవును అతడికి ఎందుకుగుర్తొస్తుంది. తాళి అది ఉండేది నా మెడలో కదా ..! కండిషన్ సీరియస్ అని అంతకుముందు చెప్పిన డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే ప్రమాదం ఏమీ లేదని హామీ ఇచ్చేశారు. అతడు నెమ్మదినెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఆస్పత్రిలో సకల సపర్యలూ నా ఆధ్వర్యంలోనే వేళకు మందులూ మాకులూ చూడడంతోపాటు ఆహారం కూడా అందిస్తున్నాను. కాసేపు నీకు తీరిక, ఏకాంతం దొరికితే చాలు అతడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అదే అడుగుతున్నాడు. వారిద్దరి పెళ్ళికి అనుమతించమని … ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుళ్ళ’ సిన్మాలు చూసి చూసి ఇలా అయిపోయాడా?’ మనసులో అనుమానం కలిగింది నాకు.
‘ఇంట్లో ఇల్లాలిని, వంటింట్లో ప్రియురాలిని మేనేజ్ చేయడంలోని హీరోయిజం ఇతగాడికి ఆడర్శమా’ అర్థం కావటంలేదు నాకు. అన్ని సేవలు చేస్తున్నా అవన్నీ మనసుపెట్టి చేస్తున్నవి కావు. “మొదటిభార్య హోదాలో ఉన్న తాను అడ్డంకి కాకూడదనే ఉద్దేశ్యంతో ఆఖరి అస్త్రంగా ఆత్మహత్య చేసుకోబోయాడట. కాపురాన్ని రచ్చకీడ్చాడు. అందుకే అతడంటే ముఖం మొత్తింది. అయినా, సమస్య ఒక కొలిక్కి రాలేదు కనుక ఇంకా అతడు నా ఇంటి ప్రాంగణంలోనే మొగుడి హోదాలో ఉన్నాడు కనుక ఇన్ని సపర్యలూ చేయడం.
మనువు ఇద్దర్ని ఒకటి చేస్తుందంటారే? కట్టిన తాళి, వేదమంత్రాలు, పురోహితుల ఆశీస్సులు, అతిథుల శుభాకాంక్షలు, వీటన్నిటికీ మించి తాళి కట్టిన క్షణం నుంచి ఇతడు నావాడు అనే భావన వేర్వేరు పరిసరాల్లో పెరిగిన ఇద్దరు ఆడ-మగ ను ఏకం చేస్తుంటారే? అదంతా అబద్దమా? విదేశీయులు సైతం మెచ్చుకునే వివాహ వ్యవస్థ నేడు విచ్చిన్నమవుతోందా? ఒంటరిగా ఉన్న సమయాల్లో మెదడును తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఒకటీ అరా వివాహ బంధాలు వైఫల్యమైనంత మాత్రాన ఆ వ్యవస్థలన్నీ బలహీనమైనట్టు కానేకాదు. అది వారి వారి సొంత గొడవలు అంతే! అలా అని సమాధానపడడం ఇది రోజూ జరుగుతున్నదే.
*****
శ్రీపతి : అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మత్తెక్కిపోవడమంటే ఇప్పుడే తెలిసొచ్చింది. స్నేహ నిజంగానే స్నేహశీలే ఆఫీసులో నా ఎదురుగా ఉన్న సీటులోనే ఆమె కూర్చుంటుంది. ఇరవై నాలుగ్గంటల రోజులో అధికభాగం ఆఫీసులోనే ఉంటే అదే ఆఫీసులో పనిచేస్తున్న ఆడ=మగ నడుమ ఆకర్షణ రూపు మార్చుకుని ప్రేమైతే – మేం ఇద్దరమే ఉదయం పదినుంచి సాయంత్రం అయిదు వరకూ ముఖాముఖి మధ్యాహ్న వేళల్లో భోజన విరామంలో ఇంటినుంచి తెచ్చుకున్న ఆహారం ఇచ్చిపుచ్చుకోవడం, చిర్నవ్వుల పలకరింపులు, కులాసా ప్రశ్నలను దాటి మా మధ్య ప్రేమ ఎలా మొలకేట్టిందో తెలీని విషయమే.
“నేనో పెళ్ళయినవాడినని, ఇంటిదగ్గర కళ్ళల్లో వత్తులు వేసుకుని శ్రీమతి తన రాకకోసం ఎదురుచూస్తుందని ఆ కుర్రతరహా దశదాటి అయిదేళ్ళయ్యాయని ఆమె సమక్షంలో గుర్తురావు. నా పరోక్షంలో కూడా కళ్ళ వాకిళ్ళలో ఇంద్రధనుసులు పూయిస్తూ, వెన్నెల వెలుగుల్ని విరజిమ్ముతూ జతగానే ఉండేదామె. సాయంత్రాల్లో చలిమంత్రాలు చదువుతూ ఆఫీసయ్యాక ఆమెతో కలిసి నడిచిన అడుగులు ఎదడుగుల్ని ఏనాడో దాటిపోయాయి. ఇంటికి వచ్చినా ఆమె జ్ఞాపకమే వ్యాపకమై నమసున మల్లెల్ని పూయించేది.
ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలో అటెండయిన తోలి పెళ్ళిచూపుల్లో ఓ.కే. చేసేసిన తరువాత ఇంటికి వచ్చిన శ్రీమతి నిజానికి నాకు తక్కువేం చేయలేదు. నేను బాధపడితే ఆమె కన్నీళ్ళు వర్షించేది. … నేను నవ్వితే ఆమె గలగలా నవ్వేది. నా సుఖంలోనూ, దుఃఖంలోనూ సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకుంది అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. తలవంచుకుని తాళి కట్టించుకుంది. తలెత్తుకుని భార్యగా హుందాగా నిలచింది. ఎప్పుడూ తలవంచుకునే పనేం చేయలేదు. అయినా శారీరకబంధాన్ని మనసు దాహాన్ని తీర్చింది స్నేహ, కేవలం తాళి కట్టించుకున్న మాత్రాన మనసుపడకూడదని ఈ ఆక్షలేమిటో?
హృదయానికి దగ్గరగా వచ్చిన వారిని ఆహ్వానించకూడదనే సామాజిక నీటి సూత్రానికి కాలం చెల్లింది. స్నేహ జతగా లేని జీవితాన్ని ఊహించలేకున్నాను. అలాగని శ్రీమతిని ఒప్పించలేకున్నాను. ఈ సమస్యని గురించి ఎవరికి చెప్పినా “ఒళ్ళు పొగరెక్కి’’ అని నిందిస్తారు. వారే, సామాజిక పరిరక్షకులమని చెబుతూ నీతిసూత్రాలు వల్లేవేస్తారు. కాగాడాపట్టి వెతికికే వారిలో కొందరి జీవితాల్లోనైనా కొన్ని చీకటి రహస్యాలు దొరక్కపోవు. ఎలాగైనా సరే, స్నేహాని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను ఆమె లేనిదే నా బతుకు శూన్యత అంతే! డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాను. ఎదురుగా శ్రీమతి వున్నా ఏదో శూన్యం వెంటాడుతోంది నన్ను … “ప్చ్ …!’’ బాధగా నిట్టూర్చాను.
*****
స్నేహ ;లా “పెళ్ళయిన మగాడితో ప్రేమా …?’’ “అనుభవానికి ప్రాధాన్యం కదా! శ్రీపతికి అయిదేళ్ళ పూర్వానుభవం మెరిట్ కాబోలు’’ “ఏదేమైనా ఈ తరం ఆడపిల్లల అంతరంగం అస్సలు అర్థం కావట్లేదు గురూ! వారి అభిరుచి ఎలాంటిదో ఆగమ్యగోచరం’’ కామెంట్స్ కొన్ని సరదాగా, మరికొన్ని ఈర్ష్యగా, ఇంకొన్ని హృదయాన్ని కత్తిలా కోసే శాడిస్టిక్ గా వింటున్నాను. ఇన్నాళ్ళూ వెనుకవెనుక చెవులు కొరుక్కునే వాళ్ళు శ్రీపతి ఆత్మహత్యాయత్నంతో ఆస్పత్రిపాలయ్యాక మరీ దారుణంగా మొహం ముందే అనేయడం ప్రారంభించారు. ఆఫీసులోని కొలీగ్స్, ఇతరులు ఇదే తంతు.
‘లవ్’ రెండక్షరాల చిన్నపదమే అయితే అది జీవితాన్ని వెలిగించగలదని శ్రీపతి జతలోనే తెలిసింది నాకు. మన ఆలోచనలు పంచుకునే తోడు, మన అభిరుచులతో జోడ్డీ కట్టే హితుడు, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ గా అతడ్ని ఎంతో ఉన్నత స్థానంలో ఊహించుకుంటూ వస్తున్నాను. పెళ్ళయినవాడని తెలిసినా మానసికంగా అతగాడి జతను ఆహ్వానించాను. మామూలు ప్రేమకథలకే సమాజం, కులం, మతం, ధనం, బలం అండతో అణచివేస్తుంటే కాస్త భిన్నమైన ఈ ప్రేమకథకు అన్నీ అడ్డంకులే! ప్రతి మలుపులోనూ పల్లేరులే అయినా అనుక్షణం అండగా ఉంటానన్న అతడి మాటలే మనోధైర్యం లోకం ఏకమై కత్తికట్టినా సమాజ వ్యతిరేకమని విమర్శల జడివాన కురిసినా, ఆరునూరైనా అతడి సాన్నిధ్యమే మనస్ఫూర్తిగా కోరుకుంటోంది తను.
పెళ్ళి తర్వాత అతడొకరి సొత్తు ఆ పరాయి సొత్తుని అభిలషించడం సమంజసం కాదు. ఇంకోక్కరి ఆస్థిని సంగ్రహించడం మహాపాపం ఇలాంటి వ్యాఖ్యలు వినివిని విసుగెత్తిపోయింది తనకు. రక్తమాంసాలు కలిగి, ప్రేమాభిమానాలు వాంచించే వ్యక్తులు ఒకరికొకరు ఆస్తి ఎలా అవుతారు? నాన్సెన్స్ నిజానికి సహజీవనంలో మనసు పాత్ర ప్రధానమైనది మనసుపడని మనువు సబబు కాదు. ఎంతో చిన్నదైన జీవితంలో అభిలషించింది అందుకోకుంటే అంటా నిష్ప్రయోజనమే.
“ఇది నా థీరీ అంతే! అందుకే, అతడు ‘ఐలవ్ యూ’ చెప్పిన మరుక్షణం అంగీకరించాను చెట్టాపట్టాలేసుకుని ఊరూ వాడా తిరిగాం. నా సహచర్యంలో అతడి మనసుకి స్వాంతన దక్కింది. అతడి సమక్షంలో నా మనసు పురివిప్పిన నెమలిగా మారేది. మరిప్పుడు, కథ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం – తానే పాత్రదారైనా ఓ ప్రేమ నాటకాన్ని ఉత్కంఠతో వీక్షిస్తున్నాను. ముగింపు ఎలా ఉండాలో తెలియక నిరీక్షిస్తున్నాను. ఈ సస్పెన్స్ తో నరాలు తెగిపోతున్నట్లు ఉంటోంది అంతే!
*****
పెళ్ళంటే మూడు ముల్లె కేవలం ఇద్దరి జీవితాలాకి సంబంధించినది. అతడూ- ఆ ఇద్దరూ మూడు ముళ్ళ క్లేశాన్ని అనుభవిస్తున్నారు వింతగా పల్చటి వస్త్రం ముళ్ళకంప మీద పడ్డట్లయింది ముగ్గురి పరిస్థితి. గట్టిగా లాగితే జీవితాలే శిథిలమయ్యే పరిస్థితి. అలా ఉంచినా ఏ ఈడురుగాలికో వస్త్రం చిరిగిపోక తప్పదు. ఒకే కప్పు క్రింద ఇద్దరు సహజీవనం చేస్తున్నా కన్పించని ఇనుపతెర విడదీస్తోంది వారిని. ఆఫీసులో ఎదురెదురుగా ఉన్నా ఇదివరకటి ప్రైవసీ కోల్పోయిన భావన వారిద్దరిలోనూ పరిష్కారం కావాలి! ఏదో పరిష్కారం కావాలి అదేమిటి? ముగ్గురి హృదయాల్లో ఒకే ప్రశ్న.
“తను పక్కకు తప్పుకుని ఆమెని ఆహ్వానించాలా? అతడి మరో పెళ్ళిక పౌరోహిత్యం వహించాలా?’’ సతమతమవుతోంది అపర్ణ. “అందరం కలుసుకుందామంటే అభ్యంతరమేమిటో? సమాజానికేం చోద్యం చూస్తుంది. ఎవరి జీవితాలు వారివి. వాటిని ఎవరికీ వారు రూపకల్పన చేసుకోవాలి శ్రీపతి అనుకుంటున్నాడు. ఇద్దరు అతివల ప్రేమకథలో ఒక స్త్రీ త్యాగం తప్పనిసరా? తాళిబంధంతో ఇదివరకే కట్టిపడేసుకున్న ఆమెని, అతడిని అలాగే వదిలేసి తాను ‘శూన్యం’లోకి వెళ్ళిపోవాలా? ఇదేనా అసలు సిసలైన పరిష్కారం?
స్నేహ పరిస్థితి విశ్లేషించుకుంటోంది. ఆలోచనల సులోచనలు ధరించి ఆ ముగ్గురూ ఎవరికీ వారే! ఆరోజు= తెల్లారేసరికి టేబుల్ మీద ఓ కాగితం రెపరెపలాడుతూ కనిపించేసరికి శ్రీపతిలో ఆసక్తి పెరిగింది. గబుక్కున తీసుకుని చదివాడు. “సంసార సరిగమల మధురిమలు కొరవడిన దాంపత్య మందిరంలో ఇక నా ఉనికి ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏకశయ్యపై పవళిస్తున్నా మన మధ్య చాలా దూరం పెరిగిందని తెలిసొచ్చింది. కేవలం తాళి కట్టించుకున్న అధికారంతోనే మిమ్మల్ని ఈ ఇంట్లో ఆపగాలిగాను తప్ప రెక్కలొచ్చి ఎగురుతున్న మీ మనసుని నిరోధించలేకున్నాను.
అందుకే సె’లవ్’ శ్రీపతి రాసిన ఉత్తరామది ఒక్కసారి గుండె జారినట్లిపించింది శ్రీపతికి. “ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బహుశా పుట్టింటికేమో?’’ తనకు తానే ప్రశ్నించుకుంటూ సమాదానాలిచ్చుకుంటూ సతమతమవుతున్న వేళలో ఆఫీస్ కొలీగ్ ప్రత్యక్ష మయ్యాడక్కడికి … అతడొస్తూనే “ఇది నిజమా?’’ అడిగాడు. శ్రీపతికి మొదట అతనేమన్నదీ అర్థం కాలేదు. అందుకే అడిగాడు “ఏదీ…?’’ అని.
“ఈ ఆడవాళ్ళు ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పలేం. నిప్పును ముట్టుకున్నా స్త్రీలను తాకినా అంటుకోవడం సహజాతి సహజం’’ ఆ కొలీగ చెబుతున్నాడు ఉపోద్ఘాతంలా ….. అది విద్యుద్ఘాతంలా తగులుతోంది శ్రీపతికి. “ప్లీజ్ …! ఏం జరిగిందో చెప్పు?’’ అడిగాను ఆతృతగా … “ఓ చెప్పలేదు కదూ …! ఆమె రాజీనామా చేసి ఊరు విడిచి వెళ్ళిపోయింది’’ చెప్పాడతను. “ఎవరూ …?’’ శ్రీపతి ప్రశ్న. “స్నేహ …’’