జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశుల్లో గురుడు సంచరిస్తున్న కాలం గురుబలం కలది అవుతుంది.
సింహగురుడు - గురు శుక్రాస్తమయాలు: గురు, శుక్రాస్తమయాలు (గురు, శుక్ర, మూఢాలు), సింహగురుడు, మకర గురుని సమయంలో శుభకార్యాలు చేయరాదు. గురుని వక్ర, అతిచారాల్లో కూడా శుభకార్యాలు చేయరాదని కొందరి అభిప్రాయం. ఏనుగు దంతాలతో, రత్నాలతో చేసిన నూతన ఆభరణాలు గురు శుక్ర మూఢాల్లో ధరించరాదు. మూఢాలలో చేయడగని కార్యాలు ఈ సమయాల్లో చేయరాదు.
సింహగురుని నిషేధావాదం: సింహగురుడు మేశాంశ మొదలు సింహ నవాంశ వరకు ఉన్న కాలం విడిచి తక్కిన సమయంలో, తక్కిన ప్రదేశాలలో వివాహాదులు చేసుకోవచ్చును. సింహరాశిలో గురుడున్నప్పుడు గోదావరికి ఉత్తరాన, గంగానదికి దక్షిణాన గల ప్రదేశంలో వివాహాదులు చేయరాదు. సింహంలో గురుడుండగా మేషంలో సూర్యుడున్న మాసంలో, గురుడు సంచరించే కాలంలో వివాహాదులు చేయవచ్చు.
మేషంలో సూర్యుడుండగా సింహ గురుడున్నప్పుడు గంగా గోదావరీ మధ్యదేశంలో గూడ వివాహాదికం చేయవచ్చు, కళింగ, గౌడ, గూర్జర దేశాల్లో సింహస్థ గురుడు పూర్తిగా విడువదగినవాడు. రేవానదికి తూర్పున, గండకీ నందికి పశ్చిమాన, శోణానదికి ఉత్తర దక్షిణాలలోనూ, మకర గురు దోషం లేదు. కొంకణ, మాగధ. సింధు దేశాల్లో మకర గురుడున్న సమయంలో వివాహాదులు చేయరాదు.
మూఢాల్లో విడువదగిన పనులు: నూతన వ్రతారంభాలు, వధూ ప్రవేశం, మహాదానాలు, యాగారంభం, ప్రత్యేక శ్రాద్ధాలు, అన్నప్రాశన, ప్రథమ రక్షాబంధం, వేద వ్రతాలు, వృషోత్సర్గం, దేవప్రతిష్ట, మంత్రోపదేశం, ఉపనయనం, వివాహం, నూతన తీర్థయాత్రలు. సన్న్యాసం, రాజదర్శనం, పట్టాభిషేకం, చాతుర్మాస్య వ్రతారంభము, కర్ణవేధ మొ|| గురు శుక్రుల వృద్ధాస్తమయ బాల్యాలలో చేయరాదు.