లగ్నాత్తు 11 వ స్థానం అన్ని గ్రహాలకు శుభప్రదమే. 3, 8 స్థానాల్లో సూర్యుడు, 3, 12 స్థానాల్లో చంద్రుడు (వివాహానికి 12వ స్థానంలో చంద్రుడుంటే రిఃఫ చంద్రదోషం), 3, 6 స్థానాల్లో కుజుడు, 2, 3, 4, 5, 6, 9, 10 స్థానాల్లో బుధ, శుక్రుడు, 2,5,6,9,10,12 స్థానాల్లో రాహువు శుభప్రదులు. కేంద్ర (1,4,7,10 స్థానాలు), కోణాల్లో (5, 9), 11 వ స్థానంలోను శుభగ్రహాలుండాలి. పాపగ్రహాలుండకూడదు. 3,6,11 స్థానాల్లో పాపగ్రహాలుండాలి.
జన్మరాశి నుండి 8, 12 రాశులు లగ్నాలు కాకుండా మిగిలిన రాశులు మాత్రమే లగ్నాలు కావాలి. లగ్నం నుండి కేంద్ర (1, 4, 7, 10 భావాలు) కోణాల (5, 9 భావాలు) సౌమ్య గ్రహాలు, 3, 6, 11 భావాలలో క్రూర గ్రహాలు ఉండాలి. ఈ స్థితిని లగ్నశుద్ధి అంటారు. జన్మరాశి నుండి ఉపచయ భావాలు (3,6, 10, 11) లగ్నాలైతే మిక్కిలి శుభప్రదం.
భావం భావాధిపతిచే చూడబడినా, భావాధిపతితో కలిసి ఉన్నా బలం కలిగినదౌతుంది. పూర్తి శుభ ఫలితాన్నిస్తుంది. పాపగ్రహం ఉన్నా, పాపగ్రహించే చూడబడినా దోష ఫలితాన్నిస్తుంది. లగ్నంలో క్రూర గ్రహం ఉంటే ఆ లగ్నం ఏ శుభకార్యానికి పనికిరాదు. 6 లో శుక్రుడు, 8 లో కుజుడు, 6,8 భావాల్లో చంద్రుడు విశేష దోషకారులు. లగ్నాధిపతి నీచ, శత్రు క్షేత్రాలలోను, అష్టమంలోనూ ఉండరాదు. అస్తంగతుడు కారాదు. వక్రి కారాదు. లగ్నం లాగ్నాధిపతులు శుభయుతి, దృష్టులు కలిగి, పాపయుతి దృష్టులు లేకుంటే లగ్నం బలం కలదౌతుంది. ఈ విధమైన గ్రహ స్థితులున్నప్పుడు లగ్నబలం కలదౌతుంది. దానిని లగ్నసిద్ధి అంటారు.
భావ శుద్ధి: వివాహానికి లగ్నాత్తు 7వ స్థానం (జామిత్ర శుద్ధి), ప్రయాణానికి 8వ స్థానం, గ్రుహారంభానికి 10వ స్థానం, గృహ ప్రవేశానికి 4 వ స్థానం, అన్నప్రాశనకు 10 వ స్థానం - అన్ని కార్యాలకు 8 వ స్థానం శుద్దంగా (గ్రహ రహితంగా) ఉండాలి. ఆయా భావాలకు సంబంధించిన కార్యాలకు, ఆ యా భావాల్లో శుద్దిగా ఉండడం అవసరం.