జన్మరాశి ప్రాధాన్యం: వివాహం మొ|| శుభకార్యాలు, ప్రయాణం, గోచారం మొ|| అంశాలకు జన్మరాశి, జన్మ నక్షత్రాలు ముఖ్యమైనవి. (జన్మరాశి తెలియని వారు, అన్ని విషయాలలో నామ నక్షత్రమే చూసుకోవలసి ఉంటుంది)
యాత్ర, యుద్ధం, వివాహం, గృహప్రవేశం, క్షౌరం అనే అంశాల్లో జన్మచంద్రుడు దోషి, వివాహ విషయంలో "స్త్రీణాం జన్మత్రయం శ్రేష్టం" “పుంవివాహముదితం శుభం బుధైః" అనే అనుకూలవచనాలు జన్మనక్షత్రాన్ని కూడా అంగీకరిస్తున్నాయి. “చంద్రమా జన్మ చంద్రోపి జన్మర్ క్ష పరివర్జితః" మొదలైన వచనాలు జన్మనక్షత్రాన్ని నిషేధిస్తూ జన్మచంద్రుని అంగీకరిస్తున్నాయి.
“కృషి భరన వివాహేన్నాశనౌ మౌంజిబంధే
ప్రథమ యువతి సంగారామ కూపాది కృత్యే
పటవిధి మభిషేకే జన్మ చంద్రః ప్రశస్తుః
ఇతి వదతి వరాహః క్షౌరయాత్రాం విహాయ" – దైవజ్ఞ కల్పద్రుమం
మొదలైన వచనాలు జన్మచంద్రుని అంగీకరిస్తున్నాయి.
నామరాశి ప్రాధాన్యం: దేశ (అర్వణం), గ్రామ (అర్వణం), గృహ (ముఖద్వారార్వణం), యుద్ధ, సేవా (ఉద్యోగం) వ్యవహారాలకు నామరాశి, నామ నక్షత్రం ముఖ్యమైనవి.
స్త్రీ, పురుషుల రాశిప్రాధాన్యం: వివాహం, గర్భాధానం, గృహప్రవేశం, (గృహిణి గృహముచ్యతే) మొదలైన స్త్రీ ప్రాధాన్యం గల కార్యాల్లో స్త్రీ పురుషుల కిరువులకి, తారాబలాదులు చూడక తప్పదు. కుమారునికి ఉపనయనం మొదలైన ఇతర అంశాల్లో (కుమారునికి తండ్రికి తారాబలం చూడాలి) స్త్రీ (తల్లి) నక్షత్రానికి తారాబలం సరిపడకున్నను ఇబ్బంది లేదు.
ద్వాదశ చంద్రుడు: ఉత్సవం, రాజ్యాభిషేకం, జాతకర్మ, వ్రతబంధం, వివాహం, ప్రయాణం మొ|| అంశాలకు ద్వాదశ చంద్రుడు శుభ ప్రదుదే. తక్కిన అన్ని శుభకార్యాలకు ద్వాదశ చంద్రుడు దోషి. సామాన్యంగా 4, 8, 12 స్థానాలలోని చంద్రుడు ఉండడం మంచిది కాదు.
షడ్జన్మ నక్షత్రాలు:జన్మ నక్షత్రం, జన్మ నక్షత్రం నుండి 10 – కర్మ నక్షత్రం, 16 – సంఘాత నక్షత్రం, 18 – సముదాయ నక్షత్రం, 23- వినాశ నక్షత్రం, 25- మానస నక్షత్రాదులు సకల శుభ కర్మలకు విడువదగినవి.
చంద్ర స్థితి: కొందరి అభిప్రాయంలో పూర్ణచంద్రుడు 4,2 స్థానాల్లో గాని, మేఘలగ్నంలో గాని ఉన్నా శుభ ప్రదుడే. చంద్రుడు అశుభడైనా, గురుని యుతి, దృష్టి ఉంటే శుభుడౌతాడు. ఉచ్చ, శుభ నవాంశలలో గాని, అధిమిత్రరాశి, నవాంశలలో గాని ఉంటే శుభుడౌతాడు.
షడష్టరిః చంద్రదోషం: 6,8,12 స్థానాల్లో చంద్రుడుంటే సకల గుణాలు ఉన్న లగ్నమైనా కన్యకు ఆపదనిస్తుంది.
సగ్రహ చంద్ర దోషం: క్రూరగ్రహంతో చంద్రుడు కలిస్తే సగ్రహ చంద్రదోషం.
దోష పరిహార గ్రహ స్థితులు: లగ్నంలో శుక్రుడుంటే వెయ్యి దోషాలు, బుధుడుంటే పదివేల దోషాలు గురుడుంటే లక్షదోషాలు నివారిస్తాయి. సప్తమం తప్ప తక్కిన కేంద్ర (4, 10), కోణాల్లో (5,9) బుధుడుంటే వెయ్యిదోషాలు, శుక్రుడుంటే పదివేల దోషాలు, గురుడుంటే లక్ష దోషాలు నివారిస్తాయి.
లగ్నాధిపతిగాని, లగ్న నవాంశాధిపతిగాని, కేంద్రాల్లో (1,4,7,10) గాని, లాభం (11) లో గాని ఉంటే సకల దోష నివారణ, 11 లో సూర్యుడుంటే సకల దోష నివారణం. కేంద్ర కోణాల్లో గురుడు, శుక్రులుంటే చాలా దోషాలను నివారిస్తాయి.
చంద్రుని శుభత్వ పాపత్వాలు : చంద్రునికి పాపార్గళ (క్రూరగ్రహ మధ్యస్థితి), క్రూర గ్రహ యుతి, దృష్టులు అశుభత్వాన్నిస్తాయి. ఆధిపత్య పాపియైన చంద్రుడు గూడ శుభ గ్రహ నవాంశ, మిత్ర నవాంశలలో ఉండడం, గురు దృష్టి కలిగి ఉండడం వల్ల శుభుడౌతాడు.
చంద్రుని భావ ఫలాలు: లగ్నం- లక్ష్మీప్రదం, ద్వితీయం - మానసికానందం, తృతీయం - ధనసంపత్తి, చతుర్థం - కలహం, పంచమం - జ్ఞానసిద్ధి, షష్ఠి- సంపద, సప్తమం - రాజగౌరవం, అష్టమం - మరణం, నవమం - ధర్మలాభం, దశమం - వాంఛాసిద్ధి, ఏకాదశం - సర్వలాభాలు, ద్వాదశం - హాని.
దోష స్థితి ఉన్న స్వ, మిత్ర, ఉచ్చల్లో ఉండి పూర్ణ చంద్రుడైతే ఆ దోశాలుండవు. శుభగ్రహ, మిత్రగ్రహ నవాంశలలో ఉన్న గురుయుతి, దృష్టులున్నా ఆ దోషాలుండవు.
సంక్రాంతి కాలీన గ్రహస్థితి - బలం: చంద్రుని రాశి సంక్రాంతి కాలంలో తారాబలం బాగుంటే ఆ రాశిలో నివసించే 2 ½ రోజులు శుభ ఫలితాలనిస్తాడు. రవి సంక్రాంతి కాలంలో చంద్రబలం బాగుంటే ఆ నెలరోజులు రవి మేలుచేస్తాడు. కుజ సంక్రాంతి సమయంలో రవి గోచార స్థితి బాగుంటే ఆ రాశిలో కుజుడు సంచరించే 1 ½ మాసం మేలు చేస్తాడు. బుధ సంక్రాంతి సమయంలో రవి గోచర స్థితి బాగుంటే ఆ రాశిలో బుధుడు సంచరించే 1 మాసం మేలు చేస్తాడు.
జన్మ నక్షత్ర విచారణ:
బాలాన్న భుక్తౌవ్రత బంధనేకపి రాజ్యాభిషేకం ఖలు జన్మధిష్య్టం
శుభ త్వ నిష్టం సతతం వివాహే సీమంత యాత్రాధిషు మంగళేషు
జన్మనక్షత్రం అన్నప్రాశన, ఉపనయన, రాజ్యాభిషేకాలకు శుభప్రదం. వివాహ సీమంత యాత్రాదులకు నిషిద్ధం అని ఒక మతం.
జన్మ నక్షత్రగ శ్చంద్రః ప్రశస్తః సర్వ కర్మసు
క్షౌర భేషజ వాదాధ్వ కర్తనేషుచ వర్జయేత్ - ముహూర్త దీపిక
క్షౌరం, మందువాడడం, ప్రయాణం, చెవులు కుట్టడం అనే అంశాల్లో తప్ప తక్కిన విషయాలన్నింటిలో జన్మ నక్షత్రం శుభప్రదమే అని మరో మతం.