జన్మ నక్షత్రం (జాతకంలో చంద్రుడున్న నక్షత్రం) నుండి నిత్య నక్షత్రం (ముహూర్తం రోజున చంద్రుడున్న నక్షత్రం) వరకు లెక్కించి (9 సంఖ్యకు మించినచో 9 చే భాగించి శేషసంఖ్యను స్వీకరించాలి) 9 చే భాగించగా శేష సంఖ్య 1- జన్మతార, 2- సంపత్తార, 3- విపత్తార, 4- క్షేమతార, 5 – ప్రత్యక్తార, 6 – సాధనతార, 7- నైధనతార, 8- మిత్రతార, 9- పరమ మిత్రతార. 2,4,6,8 తారలు శుభప్రదమైనవి. 9 వ తార మాధ్యమం. 'వివాహే ప్రత్యగుత్తమా' అనే వచనాన్ని అనుకరించి వివాహానికి ప్రత్యక్తార తప్పనిసరి అయితే పనికి వస్తుంది.
'జన్మనక్షత్రగ శ్చంద్రః ప్రశస్తః సర్వ కర్మసు
క్షౌరభేషజ వాదాధ్వకర్తనేషుచ వర్జయేత్'
జన్మనక్షత్రంలో ఉ న్న చంద్రుడు క్షౌరం, ఔషధ సేవనం, వివాదాలు (కోర్టు వ్యవహారాలూ మొ||) ప్రయాణం, చెవులు కుట్టడం అనే అంశాలకు తప్ప తక్కిన విషయాలకు ప్రశస్త ఫలితాలనే ఇస్తాడు. ఉపనయనానికి జన్మతార, జన్మలగ్నం, జన్మమాసం మొ|| విశేష శుభ ప్రదాలని విశేష వచనం.
తారాదోషాలు - ఘడియలు విడవడం: మొదటి ఆవృత్తిలో మొత్తం పనికిరాదు. రెండవ ఆ వృత్తిలో విపత్తార మొదటి 20 ఘడియలు, ప్రత్యక్తారలో మధ్య 20 ఘడియలు, నైధన తారలో చివరి 20 ఘడియలు విడవాలి. మూడవ ఆవృత్తిలో దోషం ఉండదు.
ప్రథమ నవకంలో (జన్మ నక్షత్రం నుండి 9 వ నక్షత్రం వరకు), విపత్, ప్రత్యక్, నైధన తారలు అశుభాలు. రెండవ నవకంలో (10 వ నక్షత్రం నుండి 18 వ నక్షత్రం వరకు) విపత్తార 1వ పాదం, ప్రత్యక్తార 4 పాదం నైధన తార 3 వ పాదం అశుభాలు. మూడవ నవకంలో (19నుండి 27 నక్షత్రాలు మూడు) శుభప్రదాలే.
ప్రథమ నవకంలో 1వ తారం, రెండవ నవకంలో 3వ తార, మూడవ నవకంలో 5 వ తార, మూడు నవకాలలో నైధన తార విడువక తప్పని సరి అని మరో అభిప్రాయం.
చంద్రుడు ఉచ్చ న్వక్షేత్రాలలో ఉండగా విపత్తార, ప్రత్యాక్తారలైనా, 1,4 పాదాలు విడిచి తక్కిన పాదాల్లో అన్నీ శుభప్రదాలే. (వివది ప్రత్యగే చైవ చర మంచాద్యకం వినా, స్వోచ్చ స్వర్ క్ష గతశ్చంద్ర శ్శుభదస్సర్వకర్మసు).
తారాబలం (మతాంతరం): జన్మ నక్షత్రం నుండి నిత్యం (చంద్రుడున్న) నక్షత్రం వరకు లెక్కించి 9 చే భాగించగా శేషం 1. గార్ధభం - ధననాశం, 2. అశ్వం - ధనలాభం, 3. హస్తి - లక్ష్మీప్రాప్తి, 4. గేండా - మరణం, 5. జంబుకం - స్వల్పలాభం, 6. సింహం - సర్వ కార్యసిద్ధి, 7. కాకం - నిష్పలం, 8. నెమలి - సుఖప్రాప్తి, 9. హంస – సర్వసిద్ధి (సచిత్ర జ్యోతిష శిక్ష)
చంద్రబల, తారాబల ప్రాధాన్యం: శుక్లపక్షంలో, చంద్రబలం, కృష్ణపక్షంలో తారాబలం ముఖ్యమైనవి.