నీలం శనిగ్రహానికి సంబంధించిన రత్నం, దీనిని బ్లూ సఫైర్ అంటారు. ఒక కొరండమ్ అల్యూమినియం తాలూకు క్రిస్టలైజ్డ్ ఆక్సైడ్. ఇందులో ఇనుము, టైటానియం కలవడం వలన దీనికి నీలిరంగు వచ్చి చేరింది. అలాగే సఫైర్ ఇతరత్రా ఖనిజాలు కలిసినప్పుడు నీల రంగు కాకుండా పసుపు, గులాబి, నారింజ, పచ్చ, వయొలెట్ రంగుల్లోనూ కనిపిస్తాయి. వజ్రం తరువాత నీలం మాత్రం కఠినమైనదిగా చెప్పవచ్చును.
గరుడ పురాణోక్త నీల లక్షణాలు చూస్తే, బలాసురుడను రాక్షసుని నీలోత్పల కాంతులగు నేత్రములు సింహళ ద్వీపమందుబడెను. అవి సముద్ర తరంగ ప్రసారితాలై భూముల యందా కరములయ్యెను. ఆ నేత్రముల వలన కేతకీవనపంక్తులవలె సాంద్రములగు ఇంద్ర నీలమణులు ఉత్పన్నములయ్యెను. అందు బలరాముని వస్త్రము, ఖడ్గము, తుమ్మెద, హరిశరీరము, హరునికంఠము బోడశెనగ పుష్పములను బోలిన నీలకాంతి గల రత్నము ఆవిర్భవించెను.
నీలములలోని దోషాలు:
త్రాస: పగుళ్ళు వున్నవి;
భిన్న: కళాహీనముగా వున్నవి;
పటలం: మధ్యకు చీలినట్లుగా ఉన్నవి;
పాషాణగర్భ: లోపల ఇసుక రేణువులు వున్నవి;
మృద్గర్భ: లోపల నల్లని మట్టి వున్నవి;
రక్తబిందువు: ఎర్రటి రక్తపు చుక్కలు వున్నవి;
మలినము: కాంతి లేకుండా వున్నవి.
కెంపులు, నీలాలు రెండు కూడా కొరండమ్, అంటే ఒకే జాతి కెంపు రత్నాలుగా గుర్తించబడ్డాయి. ఐతే కెంపు ఎరుపు రంగులో మాత్రమే లభ్యమవుతుండగా, నీలం అనేక రంగుల్లో దొరుకుతున్నాయి. నీలాలు కెంపులు ఒకేవిధమైన కఠినత్వం, సాంద్రత కలిగి ఉంటాయి. మనదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలోనే ఇంద్రనీలాలు ఎక్కువగా దొరుకుతున్నాయి.
హీట్ ట్రీట్ మెంట్ ద్వాటా రంగు పెంచుకున్న నీలాలు జ్యోతిష పరంగా మంచి ఫలితాలను అందించవు. ఎందుకంటే రత్నము వేడి చేస్తున్నప్పుడు దానిలోని అణునిర్మాణక్రమం తప్పిపోతుంది. అందువలన హీట్ ట్రీట్ మెంట్ ద్వారా వచ్చిన ఏ రత్నములైన జ్యోతిషపరంగా వుపయోగించకపోవడం మంచిది.
నీలాలలో రకాలు:
1. ఇంద్రనీలం: తల వెంట్రుకల వంటి నల్లని రంగు.
2. మహానీలం: భూమి మీద పెట్టినప్పుడు ఆ ప్రాంతమంతా నీలంగా కనిపిస్తుంది.
3. నీలమణి: విష్ణుక్రాంత (కృష్ణ) పుష్పాలవలె ప్రకాశించేవి
ఇందులోని మరోరకం: మయూరనీలం, నెమలి కంఠం రంగులో ప్రకాశించేది.
నీలాలు దొరికే ప్రదేశం:
ఆస్ట్రేలియా, మయన్మార్, కాశ్మీర్, శ్రీలంక, థాయ్ లాండ్, వియత్నాం, ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, కంబోడియా గనుల్లో దొరుకుతాయి. ఈ దేశాలన్నింటిలో శ్రీలంక, ఆస్ట్రేలియాలలో దొరుకే నీలాలు 'డీప్ బ్లూ' కలర్ కలిగి వుండి, నాణ్యమైన నీలాలను అందిస్తున్నాయి.
నీలాలకు గల ఇతర నామాలు:
అశ్మ సారము, ఇంద్రనీలమణి, ఇంద్రము, ఔషదము, గల్వర్కము, జర్ ఘరము, తృణమణి నీలమణి, మాసారము, సుసారము అనే పేర్లున్నాయి.
జ్యోతిష పరంగా అనుకూలమైన వారు ధరించినపుడు, ఆ రత్నం వలన సంపద, కీర్తి, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి, మానసిక ప్రశాంతత, మంచి సంతానం, ధరించిన వారికి అందిస్తుంది. మరియు దొంగల బయం నుండి, ప్రమాదాల నుండి ప్రయాణాలలో యాక్సిడెంట్స్ నుండి. అగ్నిప్రమాదాలనుండి రక్షణ కవచంలా ఉంటుంది. నీలం ధరించడం వలన రక్తశుద్ది జరగడమే కాకూడ, తలనొప్పి, వాంతులు, కళ్ళుతిరగడం తదితర అనారోగ్యాలు రాకుండా వుంటాయి. గుండె జబ్బులనుండి కాపాడుతుంది.
లక్షణాలు:
జాతి - కొరండమ్; రకాలు - బ్లూసఫైర్; వ్యాపారనామం - బ్లూ సఫైర్; దేశీయనామం - నీలం, శని, బ్లూసఫైర్, నీలి.
రసాయన సమ్మేళనం:
Al2O3 అల్యూమినియం ఆక్సైడ్; స్పటిక ఆకారం - ట్రైగోనల్; స్పటిక లక్షణం - ప్రిస్ మ్యాటిక్, వర్ణం -నీలం, వర్ణమునకు కారణం - ఐరన్ మరియు టైటానియం; మెరుపు - విట్రియన్; కఠినత్వము -9 ధృడత్వము - గుడ్; సాంద్రత S.G – 3.99 నుండి 4.00; ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR; పగులు - కొంకాయిడల్ నుండి అసమానము; అంతర్గత మూలకాలు - స్పటికాలు, ద్రవ తెరలు, ఫెదర్స్, జోనల్ నిర్మాణాలు, సిల్క్; కాంతి పరావర్తన పట్టిక (R.I)-1.760 – 1.768 నుండి 1.770-1.779; UV light – జడం; సాదృశ్యాలు -స్పినల్ అక్వామెర్రైన్, కోబాల్ట్, గ్లాస్, టుర్ములిన్, ప్లాస్టిక్, కైనైట్, జోయిసైట్, కృత్రిమ సఫైర్, బోనిటోయిట్.