“ మా వాడు లెక్కల్లో చాలా గట్టివాడే కాని జి. కె. లో పూర్.” “ఎందుకలా అంటున్నావ్?”
“600/2, గుంటూర్ అని ఎడ్రస్ రాయమంటే, 300, గుంటూర్ అని రాశాడు..
ఏం చెప్పమంటారు?!.”
“ మా వాడు లెక్కల్లో చాలా గట్టివాడే కాని జి. కె. లో పూర్.” “ఎందుకలా అంటున్నావ్?”
“600/2, గుంటూర్ అని ఎడ్రస్ రాయమంటే, 300, గుంటూర్ అని రాశాడు..
ఏం చెప్పమంటారు?!.”
సామాన్యుడికి జరిగిన అసామాన్య సత్కారం
గత పక్షం డిసెంబరు 18న పూణేలో ఒక ఆద్భుతం జరిగింది.
ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఒక కార్టూన్ క్యారెక్టరుకు అక్షరాలా శిల్పాభిషేకం జరిగింది.
అదీ భారత ప్రథమ పౌరుడి చేతుల మీదుగా!
ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లలో కనిపించే కామన్ మాన్ ను 8 అడుగుల కంచు విగ్రహంగా మలిచి సింబయోసిస్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆవరణలో స్థాపించడం జరిగింది. కామన్ మాన్ సృష్టికర్త ఆర్.కే.లక్ష్మణ్ (రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్), ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కార్టూనిస్టుగా జగద్విఖ్యాతి పొందారు.
ప్రముఖ రచయిత ఆర్.కే.నారాయణ్ (స్వామి అండ్ ప్రెండ్స్, గైడ్ ఇత్యాది నవలల రచయిత) తమ్ముడిగా, ఆయన నవలలకు, కథలకు తన బొమ్మలద్వారా ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనుడు.
నారాయణ్ మాల్గుడి అనే ఒక ఊహా నగరాన్ని, దానిలోని రకరకాల జనాలను కలంద్వారా సృష్టిస్తే, వారెలా ఉంటారో, ఆ పరికరాలు ఎలా ఉంటాయో తన కుంచెద్వారా వెలువరించి ఆ అన్నకు దీటుగా వచ్చే తమ్ముడని నిరూపించుకున్నారు.
బొమ్మలు వేయడమే కాక లక్ష్మణ్ స్వయంగా రచయిత కూడా. ‘ఏక్సిడెంట్’ వంటి క్రైమ్ కథలు, తన శైలిలో రాసినా ‘సారీ, నోర్ముయ్’ వంటి వ్యంగ్య నవలలో అన్నగారి పోకడలు పోవడం జరిగింది. చక్కటి చిత్రకారుడు, క్యారికేచరిస్టు అయిన లక్ష్మణ్ తన కార్టూన్లలో వాతావరణాన్ని నాలుగు గీతలతో సరిపెట్టకుండా విపులంగా చిత్రీకరిస్తారు.
1947లో ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కెరియర్ ఆరంభించిన లక్ష్మణ్ అర్ధశతాబ్ది దాటినా ఆ సంస్థనే అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ పత్రిక మొదటి పేజీలో కనబడే పాకెట్ కార్టూన్ శీర్షిక పేరు ‘'You Said it’. ఆ పాకెట్ కార్టూన్ ద్వారా సంఘాన్ని, రాజకీయాల్ని విమర్చించడానికి ఆయన ఎంచుకున్న పాత్ర కామన్ మాన్.
50 ఏళ్ల క్రితం నాటి గుమస్తాలు ధరించే దుస్తులు ధరించిన మధ్య వయస్కుడి పాత్రను ఆయా సంఘటనలకు సాక్షిగా నిలబెట్టారు. అతడు మాట్లాడడు. కళ్ళప్పగించి చూసి విస్తుపోవడమే అతని పని. అందుకే జన సామాన్యంలోని ప్రతీ వ్యక్తీ ఆ బొమ్మలో తనను తాను ఊహించుకోవడం జరిగింది. ఆ ఐడెంటిటీ వల్లనే కామన్ మాన్ కి అంతపేరు.
నిర్భయానికి, నిజాయితీకి పేరుబడ్డ లక్ష్మణ్ తన కార్టూన్ల ద్వారా మేధావుల ప్రేమను, ఆదరాన్ని చూరగొన్నాడు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని విడిచి వెళుతున్న లార్డ్ మౌంట్ బ్యాటెన్ ఇకపై లక్ష్మణ్ కార్టూన్లను చూడలేమని వాపోయారట.
50 ఏళ్లకు పైగా నిరంతరంగా, పాఠకులకు బోరు కొట్టకుండా ఆ శీర్షికను నిర్వహించగలిగిన ఆసామాన్య ప్రతిభాశాలి లక్ష్మణ్.
కామన్ మాన్ ను ముఖ్య పాత్ర చేసి తీసిన టీవీ సీరియల్ ‘వాగ్లే కీ దునియా’ కూడా హిట్ అయింది. దానినే తెలుగులోకి ‘అమాయక చక్రవర్తి’ పేర అనువదించారు.
తమాషా ఏమిటంటే కామన్ మాన్ పాత్ర ద్వారా లక్ష్మణ్ ఎద్దేవా చేసిన రాజకీయ నాయకులందరూ ఆనాటి ఫంక్షన్ కి హాజరయి లక్ష్మణ్ ను ఆకాశానికి ఎత్తేశారు.
సౌమ్యతకు పేరుబడ్డ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ్ తన చైనా పర్యటన సందర్భంగా లక్ష్మణ్ తనపై వేసిన కార్టూన్లను సభలో చెప్పి నవ్వించారు కూడా!
(హాసం పత్రిక సౌజన్యంతో...
ప్రచురణ: హాసం 1-15 జనవరి, 2002 సంచిక)
‘దేశికోత్తమ’ అమ్జద్ అలీఖాన్
డిసెంబర్ 15 ప్రధాన మంత్రి చేతులమీదుగా అమ్జద్ అలీఖాన్ కి ఘనసత్కారం జరిగింది. విశ్వభారతి యూనివర్సిటీవారు వివిధ రంగాలలోని నిష్ణాతులకు ఇచ్చే ‘దేశికోత్తమ’ అవార్డుకు 2002లో అమ్జద్ అలీఖాన్ ను గణాంక శాస్త్రవేత్త సి. రాధాకృష్ణా రావులకు ఇచ్చారు.
1945లో గ్వాలియర్ లో జన్మించిన అమ్జద్ అలీఖాన్ ప్రముఖ సరోద్ వాద్య నిపుణుడు. మొగలాయి రాజ దర్బారులో వాద్య సంగీతాన్ని అందించిన కుటుంబం వారిది. వారు అనుసరించే ‘సేనియా-బీన్ కర్’ ఘరానా తాన్ సేన్ వారసత్వం అంటారు. తన తండ్రి ఉస్తాద్ హఫీజ్ ఖాన్ వద్ద సరోద్ అభ్యసించిన అమ్జద్ అలీఖాన్ తన 12వ ఏట మొట్టమొదటి సోలో ప్రదర్శన నిచ్చారు. ఆలిండియా రేడియో, టీవీల ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి హిందుస్తానీ శాస్త్రీయ సంగీత వ్యాప్తికి తోడ్పడ్డాడు.
1975లో అంటే 30 ఏళ్ళకే ఆయనను ‘పద్మశ్రీ’ వరించింది. 1977లో తన తండ్రి పేర ఉస్తాద్ హఫీజ్ అలీఖాన్ స్మారక సమితిని ఏర్పరచి 1985 నుండి ప్రతీ ఏటా కచ్చేరీలు నిర్వహించి ఉత్తమ సంగీత కారులను సత్కరించే సంప్రదాయం నెలకొల్పారు అమ్జద్ అలీఖాన్. గతపక్షం డిసెంబర్ 22న ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ (సారంగి) ఎల్.కే.పండిట్ (గాత్రం హేమేంద్ర చంద్రసేన్ (సరోద్) లకు ఈ ఏటి అవార్డులు లభించాయి. 1981లో పాకిస్తాన్ పర్యటించి ఇరుదేశాల మధ్య సాంస్కృతిక వారధిని ఏర్పరచడానికి కృషిచేశారు.
సరోద్ వాద్యానికి ప్రాచుర్యం కల్పించి శాస్త్రీయ సంగీతానికి సేవ చేసిన అమ్జద్ అలీఖాన్ కు 1989లో సంగీత నాటక ఎకాడెమీ అవార్డు, తాన్ సేన్ అవార్డు, 1991లో పద్మభూషణ్ లభించాయి. సంగీతానికి ఎల్లలు లేవని చాటి చెబుతూ చైనా, ఇంగ్లండు, అమెరికా, మాస్కో, జర్మనీ, జపాన్ లలో పర్యటించిన ఖాన్ కు ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫోరమ్ అవార్డు లభించింది.
హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం వారి వంశంలో ఆరుతరాలుగా వర్దిల్లుతూ వచ్చింది. అది అమ్జద్ అలీఖాన్ తో ఆగటం లేదు తన కుమారులైన అమాన్, అయాన్ లను శిష్యులుగా చేసుకుని తరతరాల వారసత్వాన్ని, ప్రతిభను వారికి అందించారు. వారిద్దరివీ విడివిడిగా 20 దాకా ఆల్బమ్స్ వచ్చాయి. గత నెలలోనే ‘లాండ్ మార్క్ జుగల్ బందీ’ పేర(వర్జిన్ కంపెనీ విడుదల) ఇద్దరూ కలిసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు. సరోద్-సితార్ తోను సరోద్-సారంగీతోనూ జుగల్ బందీ ఉన్నా సరోద్-సరోద్ జుగల్ బందీ ఆల్బమ్స్ లో ఇదే ప్రథమం. వారిద్దరూ ఖాన్ వద్ద చిన్న వయస్సు నుండే నేర్చుకున్నారు.
తండ్రి స్థాయి ముందులో తెలియకపోయినా ఆయన వాళ్ల స్కూలుకు వెళ్లినప్పుడు అందరూ ఆటో గ్రాప్స్ కోసం ఆయన వెంటబడడం చూసి ఆయన గొప్పతనం వాళ్లకు తెలిసివచ్చింది. సరోద్ వాద్యంపై గౌరవం పెరిగింది.
వాళ్లకు విద్య నేర్పడమే తప్ప, తన వెంట కచ్చేరీలకు తీసుకువెళ్ళి వాయించమనే అలవాటు లేదాయనకు. వాళ్లు సోలో ప్రదర్శనలు ఇచ్చినపుడు వేరే రకం శ్రోతలుంటారనే అవగాహన వాళ్లకు కలగాలని ఆయన ఉద్దేశ్యం. తండ్రిగానే కాక ఒక కళాకారుడిగా కూడా ఆలోచించి కుమారులు ఇద్దరూ కలిసి ప్రదర్శనలిస్తే శ్రోతలు ఒకరితో ఒకరిని పోల్చి చూస్తారనీ, అందువల్ల ఎవరో ఒకరు బాధపడతారని ఆయన ఆవేదన. అందువల్ల జుగల్ బందీలు ఇవ్వద్దనే వారు. చివరికి ఇప్పుడు జుగల్ బందీ ఇవ్వడం జరిగిపోయింది. ఇక కంపేరిజన్ తప్పేదేమో!
ఈ ఆల్బమ్ లో వారు రెండు రాగాలు వాయించారు. రాగేశ్వరీ, పూర్వీ కళ్యాణ్!’ రాగేశ్వరిని సరోద్ మీద తొలిసారి పలికించినది అమ్జదే!
అమాన్, అయాన్ లు ‘టీవీ’లో సరిగమా ప్రోగ్రాంలలో నిర్వాహకుగా టీవీ ప్రేక్షకులకు పరిచితులు. కానీ వారికంటే ముందు కార్యక్రమం నిర్వహించిన సోనూనిగమ్ కున్న షో బిజినెస్ ఇమేజ్ వాళ్లకు లేకపోవడం ఇబ్బంది అయి పేరు తెచ్చుకోలేకపోయారు.
పైగా దానివల్ల సరోద్ వాయిద్య కులుగా వారికున్న పేరు దెబ్బతినడం మొదలుపెట్టింది. ఇక ఆ కార్యక్రమానికి స్వస్తి చెప్పి సరోద్ వాయిద్యానికే అంకితం అయ్యారు. గురువు, తండ్రి అయిన అమ్జద్ కలలు నెరవేర్చబోతున్నారు.
ప్రముఖ కవుల పై సయీద్ నక్వీ తీసిన ‘గుఫ్ తగూ రీస్ కు అమ్జద్ సంగీతం అందించారు. ఇటీవలే హెచ్.ఎమ్.వి.వారి ‘వాదా’ ఆల్బమ్ కు సంగీతం సమకూర్చారు. దానికి లిరిక్స్ రాసినది గుల్జార్. గుల్జార్ కి ఈయనంటే ఎంత గౌరవమంటే కొన్ని సంవత్సరాల క్రితమే అమ్జద్ పై గుల్జార్ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు.
అమ్జద్ కుటుంబం సరోద్ డాట్ కమ్ అనే వెబ్ సైట్ కూడా నడుపుతున్నారు. ఈ క్రమంలో ఈనాటి ‘దేశికోత్తమ’ అవార్డుకు ఒక విశిష్టత ఉంది.
విశ్వకవి రవీంద్రుడు నెలకొల్పిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం ద్వారా ఈ అవార్డు రావడం, అది కూడా కళాపిపాసి అయిన వాజ్ పేయి హస్తాలమీదుగా అందుకోవడం అమ్జద్ అలీఖాన్ కు సంతృప్తి కలిగించే అంశం.
(హాసం పత్రిక సౌజన్యంతో ...
ప్రచురణ: హాసం 1-15 జనవరి, 2002 సంచిక)
"నవ్వేజనా స్సుఖినో భవంతు "
-కన్నోజు లక్ష్మీకాంతం
మా ఆఫీసులో ఒకాయన అప్పుడప్పుడేవో జోకులంటూ చెప్పి, తానే విరగబడి నవ్వుతూ మమ్ముల్ని నవ్వమంటూ చేతుల్తో సైగలు చేస్తుంటాడు.
నిజానికవి జోకులు కావు,డోకులు. కానీ అసిస్టెంట్స్ గా మాకు తప్పదు.ఎందుకంటే,అతడో చండశాసనుడు కూడా.నవ్వకపొతే నమిలేస్తాడు.అందుకని నవ్వురాకున్నా నవ్వాలి.
''సూపర్ యాక్షన్ సార్ ''అంటూ కడుపు పట్టుకుని మరీ నవ్వాలి.అంతేకాదు మధ్య మధ్యన ''ఏం చెప్పారు సార్ '' అని అంతుండాలి.
అందునే జోకులన్నీ నవ్వేట్లుగా వుండవూ.నవ్వేవన్నీజోకులు కావు అని చెప్పుతుంటాం అప్పుడుప్పుడు. జోక్ చెప్పేటప్పుడు ఎదుటివాడు హార్ట్ కాకూదనే యింగిత జ్ఞానముండాలి.
కానీ అదేమి పట్టదు కొందరికి.
'మీరిద్దరూ బండిమీదపోతున్నప్పుడు చూస్తే,నువ్వైతే అచ్చం ఎలుగుబంటి ఎనకాల కూచుండి పోతున్నట్టునిపిస్తుంది వదినా....”అంటూ పక పక నవ్వాడు పద్మనాభం.
ఆవిడ భర్తా,అతడూ రాసుకు పూసుకు తిరిగే స్నేహితులే కావచ్చు.వాళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడుకోవచ్చు.కానీ మరీ...తనతోనే అలా మాట్లాడితే చెంప పగలగ్గొట్టాలనిపిస్తుంది.
అదృష్టవంతుడివిరా పెళ్ళాం స్మార్ట్ గా వుందన్నప్పుడు ఏ ప్రెండూ పొంగిపోడు.కానీ పళ్ళు కోరుకుంటాడు వెధవ ఎందుకు అన్నాడని. చాలా మందికి సరియైన పద్దతిలో మాట్లాడ్డం చేతగాదనిపిస్తుంది.మేమూ మాట్లాడుతున్నామనే అనుకుంటారు.గానీ ఏం మాట్లాడుతున్నారో ఎంతకూ అర్థం కాదు.
"కోపమొస్తే నేను మనిషిని కాదు"అంటాడు ఒకాయన.
“తెలుస్తూనే వుంది.చెప్పాలా!కోపం రాకున్నా అసలు మనిషివే కావు "అని గొణుక్కుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ.
అందుకని మాట్లాడే ముందు మననం చేసుకోవాలంటాడు మా నాన్న. ప్రతివాడికి 'సెన్సాఫ్ హ్యూమర్ ' 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ' తప్పనిసరిగా తెలిసుండాలి. నవ్వడం, నవ్వించడం అనేది అందరికీ తెలిసుండాలి.లేకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
“మమ్మీ...మమ్మీ...చెత్తలారి వచ్చిందే"అంటూ పరిగెత్తుకొచ్చిన అబ్బాయితో " డాడి ఎక్కడున్నాడో చూడు బాబూ "అందిట వాళ్ళమ్మ.
జోకు పాతదే అయినా కేకులా వుండాలి గానీ మేకులా గుచ్చుకోకూదనిపిస్తుంది.
“కాకా...నీవయసు వాళ్లందరూ పోయినా నువ్వొక్కడివే మిగిలావు.నీతోని లాస్ట్ "అని నవ్వినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎదుటువాడికి. “ఏమండీ...కొంచం దగ్గరికి జరగండీ.మీకో మాట చెబుతాను.” అంది ఆవిడ.
“ఇలా కొంచం,ఇంకొంచం దగ్గరికని ఇంటినిండా పిల్లల్ని తయారుచేశావుగదే!” అంటాడు బచ్చన్ ఖాన్.'అద్రక్ కే పంజే 'లో.అంతే !హాలంతా నవ్వులతో నిండిపోయింది కాసేపు.
ఆ నాటకం చూస్తే చాలు ఆయు: ప్రమాణం పెరుగుతుందేమోనని అనిపిస్తుంది.అంతగా నవ్వుకుంటాం మనం. నవ్వడం...బాగా నవ్వడం...కళ్ళల్లోంచి నీళ్ళోచ్చేలా నవ్వడం...
కడుపు చెక్కలయ్యేలా నవ్వడం అనేది కేవలం మనిషికున్న అదృష్టం. నవ్వుతూ నవ్వించే వాళ్ళల్లో కొందరైతే,అసలే మాత్రం నవ్వకుండా నవ్వించే వాళ్ళు కొందరు. ఒకాయన చాల వరకు జోక్స్ చెబుతుంటాడు.
అయితే ఏ జోక్ ఎప్పుడు,ఎక్కడ,ఎవరి ముందు చెప్పాలో తెలియదు పాపం. చిన్నా పెద్ద అందరూ కూర్చున్న ఫరువాలేదు.నాన్ -వెజ్ జోక్స్ చెప్పి మొదట తనే నవ్వేస్తుంటాడు.
అలా బావుండదేమో మరి. సమయం,సందర్భం చూసుకుని జోక్ చెప్పితే చక్కని ఫలితం కనిపిస్తుంది.తమాషాగా మాట్లాడడం కావాలిగానీ ఎదుటివ్యక్తికి ఏవగింపు రాకూడదు.
విడాకుల విషయంలో భార్యాభర్తలు లాయర్ దగ్గరికి వెళ్లారు.
“అసలు నేనేం చేశానని విడాకులు కావాలంటున్నావే " అడిగాడు భర్త కోపంగా.
“ఏం చేయడం లేదనే విడాకులు కావాలంటున్నానండీ "అంది భార్య.
ఇలా కొన్ని జోక్స్ సింపుల్ గా వున్నా సుపర్బ్ మరి.
నవ్వులే నవ్వులు - 2
నవ్వితే పోయేది ఏమి లేదు...మానసిక ఒత్తిడి,ఆందోళన,అనారోగ్యం తప్ప!అందుకని సరదాగా కాసేపు నవ్వండి.నవ్వించండి.
“ మీరే ఆలోచించండి "
“నా ఎదురు బెర్త్ లో కూర్చున్న కుర్రాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.” అంటూ రైల్వే పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది ఓ టీనేజ్ అమ్మాయి.
రైల్వే పోలీస్ ఆమె వెంట వెళ్ళి, ఆమె చూపిన కుర్రాడి భుజం మీద చెయ్యేసి, “ఏమిటి సంగతి " అని గద్దించి అడిగాడు.
ఆ కుర్రాడు వింతగా చూస్తూ.. “నేనసలు ఆమె వంకే చూడలేదు.” అన్నాడు.
“నిజం ఒప్పుకున్నాడు పోలీస్ మాన్! నావంక కన్నెత్తి అయినా చూడకపోతే ఏమనుకోవాలి? మూతి తిప్పుతూ అందామె.
“ అయ్యోపాపం "
జనాభా చావు పుట్టుకల గురించి చదివిన శివాజీ, పక్కనే ఉన్న భార్యతో ఇలా
“ప్చ్.. ప్రతి నిమిషానికి ఒకడు చస్తున్నాడట” " నిష్ఠూరంగా అన్నాడు.
“అయ్యో పాపం. అన్నిసార్లు చచ్చి బతుకుతున్న ఆ దురదృష్టవంతుడు ఎవరో?”
ఎదురు ప్రశ్న వేసింది అమాయక భార్య.
“ విడాకులు "
“నిన్ననే పెళ్ళిచేసుకుని ఇవాళ విడాకులు కావాలని ఎందుకు అడుగుతున్నావు?” అడిగాడు జడ్జి.
“నిజమే, నిన్నే పెళ్ళి జరిగింది.. కానీ రాత్రి నా మనసుకు గాయమయ్యే సంఘటన జరిగింది..”
“ఎంటో అది?”
“వంటచేయడం వచ్చా అంటే రాదని చెప్పాను... ఆమాత్రానికి.. నేనేదో ఖూనీ చేసోచ్చినట్టు ఈయనగారు మహా ఆశ్చర్యంగా ముఖం పెట్టాలటండీ...?!” ఆవేశపడుతూ అడిగింది ఆ అమ్మాయి.
లిప్ స్టిక్
“మొన్నటిదాక 'పప్పా' అని పిలిచి, నిన్నటి నుంచి 'డాడీ ' అని పిలుస్తున్నావేమిటి ?” అడిగాడు తండ్రి.
“'పప్పా' అని పిలుస్తుంటే లిప్ స్టిక్ పోతున్నది డాడీ ! " అని చెప్పింది కూతురు.
వైఫ్ మర్డర్
“ మీ భార్య తొందర్లో మర్డర్ చేయబడుతుంది " చెప్పాడు జ్యోతిష్కుడు.
“ఆ సంగతి నాకు తెలుసండీ.కానీ నేను పట్టుబడకుండా వుంటానా...లేదా...అనే విషయం చెప్పండి " అని నాలిక్కరుచుకున్నాడు అతడు.
" తెలివైన డాక్టర్ "
ఒకావిడ డాక్టర్ దగ్గరికి వెళ్లి " డాక్టర్ గారు...నేను గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను " అని మొదలు పెట్టి ఆవిడ కష్టాలన్నీ చెప్పేస్తుంటే, వెంటనే డాక్టర్ గారు " ఏదీ, ఒకసారి నోరు తెరవండి " అన్నాడట.
దాంతో ఆవిడ నోరు తెరిచింది. అయినా డాక్టర్ గారు, తెరిచినా ఆమె నోరుని గమనించకుండానే గబగబా మందులు రాసిచ్చాడు.
“ అయ్యో ! మీరు నా నాలిక చూడనేలేదుగదండీ " అవి ఆవిడ అనగానే వెంటనే డాక్టర్ "అక్కర్లేదమ్మా. మీరు కాసేపు మాట్లాడకుండా వుండాలనే నోరు తెరిపించాను " అని అన్నాడంట.
“ యాభై రూపాయల జీతగాడు "
కొద్ది రోజులుగా ఒక బట్టలషాపు ముందు...జుట్టు గడ్డం పెరిగి,మాసిన బట్టల్లో అసహ్యంగా వున్నాఓ అనాకారి, పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ నిల్చోవడం వల్ల ఆ షాపుకి కస్టమర్ల రాక తగ్గిపోయింది.
ఏం చేయాలో అర్థం కాక,ఆ షాప్ యజమాని తప్పని పరిస్థితిలో వాడి దగ్గరికి వెళ్ళి
" చూడయ్యా...నువ్వో పనిచెయ్.ఆ కార్నర్ షాపు ముందేళ్ళి పాడుకుంటూ నిల్చో.రోజుకో యిరవై రూపాయలు ఇస్తాను. సరేనా !” అన్నదంటా.
అందుకు ఆ పిచ్చివాడు " చాల్లెండి సార్.ఆ షాప్ వాళ్ళే రోజుకో యాబై రుపాయలిస్తూ యీ షాప్ ముందు నిల్చోపెట్టారు " అని చెప్పడంటా.
అంతే...నోటిమాట పడిపోయింది ఆ షాపు యజమానికి.
నవ్వులే నవ్వులు - 3
నవ్వడం, నవ్వించడం, మనిషికి లభించిన గొప్ప వరం.నవ్వలేకపోయిన నవ్వించకపోయిన ఎవరికీ ఏమి కాదు.కాని మనకే ఏదో పోగొట్టుకున్నట్టుగా,దిగులుగా ఉంటుంది.దాంతో మానసిక ఆందోళన కలిగి అశాంతి చోటు చేసుకుని మనల్ని ఎన్నో రకాలుగా హింస పెడుతుంది.
అందుకని మనం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం.అప్పుడు దిగులుగాని,ఆందోళనగాని,అశాంతిగాని మన దగ్గరికి రావడానికి భయపడి పోతాయి.అందుకే కాసేపు నవ్వుకుందాం.
" పిచ్చి నవ్వు "
కిరణ్: అబ్బ! ఇవాళ ఏం తిండి తిన్నానయ్యా.. పంచ భక్ష్య పరంమాన్నాలంటే నమ్ము.. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనుకున్నా... భుక్తాయాసం వచ్చేదాకా తిన్నాను
వేణు: ఏ పెళ్ళికో, పుట్టినరోజు పార్టీకో వెళ్లి ఉంటావు, తేరగా లాగించేసి ఉంటావు, అంతేనా?
కిరణ్: అబ్బే, హోటల్లోనే తిన్నా
వేణు: అయితే ఇకనేం, ఎవడో బిల్లు కట్టేసి ఉంటాడు, అవునా?! ఓ పిచ్చి నవ్వుతో సంభాషణ చాలించాడు కిరణ్.
"పెళ్ళంటే "
కొడుకు : నాన్నా, నేనో అమ్మాయిని ఇష్టపడ్డాను.. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను..
తండ్రి : పెళ్ళంటే నూరేళ్ళ పంటరా కన్నా.. అలాగే చేసుకో..
కొడుకు : ఎంత బాగా చెప్పావు, థాంక్యూ నాన్నా..
తండ్రి : నీ మొహం, ఇందాక మీ అమ్మ ఇక్కడ అఘోరించిందని అలా అన్నాను, ఇప్పుడే పక్కింటావిడ పిలిస్తే వెళ్ళింది.. జాగ్రత్తగా విను.. పెళ్ళంటే నూరేళ్ళ మంట.. చస్తే చేసుకోకు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు, ఆనక నీ ఇష్టం - అనేసి గబుక్కున ఫోనే పెట్టేశాడు.
“ అబద్దం "
సీతయ్య వయసు డెబ్భై రెండేళ్ళు. ఈమధ్యనే ఓ కుర్రపిల్లని పెళ్ళి కూడా చేసుకున్నాడు. అది చాలామందికి మింగుడు పడలేదు. ముఖ్యంగా సీతయ్య స్నేహితుడు వీరయ్యకి చాలా ఈర్ష్యగా ఉంది.
“అంత కుర్రపిల్ల ఎలా పడిందిరా?” అన్నాడు.
“నా అందం చూసి నవ్వాడు సీతయ్య.
“అబ్బో, నాకు మాత్రం లేదేంటి ఆపాటి అందం?”
“తరగని ఆస్తి కూడా ఉందిగా”
“నాకూ ఉందిగా.. ఇంతకీ అసలు కిటుకేంటో చెప్పరా బాబూ”
“తొంభయ్యరేళ్లని అద్ధం చెప్పాననవ్వాడు సీతయ్య.
బుగ్గలు నొక్కుకున్నాడు వీరయ్య.
"ఫోర్ లు, సిక్స్ లు"
“నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ ని కూడా తియ్యనివ్వలేదు!” గర్వంగా అన్నాడో బౌలర్.
“మరా జట్టు ఎలా గెలిచింది?” అడిగాడు విలేకరి.
“ఆ.. ఏముంది?! ఏవో ఫోర్ లు, సిక్స్ లు కొట్టుకుని గెలిచారు.....” చెప్పాడు బౌలర్.
"ఆయనకేగా వంట"
"ఏం వదినా! ఇవాళ బియ్యం ఏరే పనిలేదా? తీరిగ్గా కూర్చున్నావు?” అడిగింది రమణి.
"అబ్బే ఈరోజు బియ్యం ఏరనవసరం లేదు..” చెప్పింది కాంతం.
“అంత మంచి బియ్యమా?”
"బియ్యం అవే.. కాకపోతే, ఇవాళ నాకు ఉపవాసం. ఆయనకేగా వంట" అసలు సంగతి చెప్పింది కాంతం.
కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు.
సాక్షి సంఘంలో ఆ రోజు చర్చ రాబోయే ప్రళయం గురించే...ఎవరో ఎండలు ఎక్కువగా ఉన్నాయని వాపోయారు.దాంతో జంఘాలశాస్త్రి ఉపన్యాసం అందుకున్నాడు.ఆ ఉపన్యాసం ఇలా సాగింది.
“ కావూ మరి !ఇంకా ఎక్కువవుతాయి.ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎండలు హెచ్చయి పోతున్నాయి.వర్షాలు తగ్గిపోతున్నాయి.భూమిలో సారం తగ్గిపోతుంది.భూగర్భంలో ఉండే అగ్ని అధికం అయిపోతోంది.
ఏడుతరాల క్రితం జీవించిన మనుష్యులు ఒకవేళ మళ్ళీ పుడితే వాడు మన జాతి అని మనం అనుకొం.వాడూ మనని అనుకోడు.గేదెముందు లేతపెయ్యల్లా వాడి కంటికి మనం కనబడతాం.
మన కింకా ఎలాటి కొంకినక్కలు పుడతారో ! దీని కంతా కారణం ఈ ఎండ. సూర్యుడి ఆకర్షణ శక్తి ఎక్కువ కావడం చేత భూమి దినదినానికి సూర్యుని సమీపిస్తోంది.మన తాత తండ్రుల కాలం కంటె మన టైములో ఇంకా దగ్గరికి పోయింది.ఆహా..ఇక ముందు ముందు ఏమవుతుందో ఏమో !నిమిష నిమిషం అగ్నిగుండానికి దగ్గరవుతున్నాం.
ఎప్పుడో ఏ పగలు భోజనం చేస్తున్నప్పుడో, రాత్రి నిద్ర పోతుండగానో ఈ భూమి,హోమంలో నేతిబొట్టులా , మంటలో మిడతలా, వెళ్లి ఆ గ్రహకూటమిలో పడిపోయి అంతరించిపోతే... పోనీ దీనికి ఇంకా టైముందని మనసుని ఓదార్చుకున్నా ఇంకో ముప్పు రాబోతోంది.ఇవాళ పత్రిక చూడండి.గ్రహగతుల గురించి ఫారిన్ నుండి వెలువడే పత్రిక ఇది.
దీనిలో ఏం రాసాడో తెలుసా !
ఇక కొన్ని సంవత్సరాలకు ఒక గొప్ప తోకచుక్క పుడుతుందట.దాని తోక మైళ్ళకొద్దీ పొడుగట.నడక విచిత్రమట !అంత గొప్ప తోకతో అది మన భూమిని ఫేడీలున ఒక్కటి తంతుందట.
దెబ్బకీ ఇంత లావు భూమీ పుట్ బాల్ లా ఎగిరిపడుతుంది.ఎక్కడ పడుతుందని ఆలోచించడానికి ప్రయత్నించకండి. అది మన ఊహకు అందదు. కానీ ఆ తోపులో, ఆ ఊపులో అలా అలా అంతరిక్షమార్గంలో భూమి వెళ్ళిపోతుండగా మన గతి ఏమిటో ఆలోచించి చూడండి.
చెట్టు దులుపినప్పుడు నేరేడుపళ్ళు జలజల రాలినట్లు,చెప్పు తీసుకుని మూతి మీద కొడితే పళ్ళు టపటప రాలినట్లు-భూమి నుండి చెల్లాచెదురై అదిరిపడి అంతరిక్షం నుండి జలజల జరజర...జరజర బిర బిర కిందకు పడిపోమూ ? అన్నట్టు కింద అంటే అర్థం ఏమిటి ? అసలు కింద ఎక్కడ ఉంది? భూమిని వదిలిపెట్టినవాడికి కిందేమిటి ? మీదేమిటి ?అలా అంతరిక్షంలో నుండి దిబుకు దిబుకుమని ఎన్ని యుగాలు దిగిపోతామో!? అదీకాక మాట వరసకు చెబుతున్నా-
అలా తోకచుక్క దెబ్బకు భూమి ఎగిరినప్పుడు మనం స్తంభాలని గట్టిగా పట్టుకుని కానీ, భార్యపిల్లలను అంగవస్త్రంతో గానీ, తాళ్ళతో గానీ మంచం కోడుకి వేసి కట్టేసుకుని భూమి నుండి ఎగిరిపోకుండా జాగ్రత్త పడితే ఫరువాలేదని ఆలోచన చేస్తున్నారేమో!అలా చేసినా ఉపద్రవం దాటిపోదు.
ఎందుకంటే తోకచుక్క దెబ్బతిన్న భూగోళం యమస్పీడుతో రంయిరంయిమని చెవులు గింగురులు పడే శబ్దం చేసుకుంటూ దారి, తెన్నూ లేకుండా అంతరిక్షంలో వెళుతూంటే ఏమవుతుందనుకుంటూన్నారు ?తన దారి కడ్డువచ్చిన మరో గోళంలో ఢీ కొట్టడం ఖాయం.
ఢీ కొడితే పండు దోసకాయ విచ్చినట్లు మన గోళం విచ్చుకుపోతోంది.మనం గొట్టంలో నుంచి వెన్నముద్దలు ఎగిరిపోయినట్లు పైకి ఎగిరిపోమూ ? మనలో కొందరు ఇతర గోళాలలో పడిపోకుండా ఉంటారా ? పోనీ ఇవన్నీ జరగవనే అనుకుందాం.
" వచ్చేస్తోంది ప్రళయం - 2 "
కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు.
" వచ్చేస్తోంది ప్రళయంలోని భాగంలో సూర్యునిలో వంటచెరుకు తరిగిపోతోదంట.ఇలా తగ్గి తగ్గి కొంత కాలానికి సూర్యుడు ఆరిపోతాడుట.సూర్యుడే చల్లారిపోయినప్పుడు చంద్రుడు,తక్కిన నక్షత్రాల మాట ఏమిటంటే...ప్రపంచం అంతా గాఢంధకారం అయిపోదూ!రోజంతా కాళరాత్రే గదా!ఎవరికీ కళ్ళు కనబడవు కదా...ఒకరు గుడ్డివాళ్లయితే తక్కినవారు దారి చూపవచ్చు.
అందరూ గుడ్డివాళ్ళయితే ఏదిగతి ?పైగా చలికి వణికిపోయి కొయ్యబారి పోతామేమో?అన్నం వండుకుందామన్నా, చలికాచుకుందామానుకున్నా...అగ్గిపుల్లయినా వెలుగుతుందో లేదో. అవునూ ఆరిపోయిన సూర్యునికి ఆకర్షణ శక్తి ఉంటుందా?గ్రహాలకు రాజైన సూర్యుడికే దిక్కు లేనప్పుడు ఇతర గోళాలు మాత్రం అంతరిక్షంలో నిలుస్తాయా?పైన ఉండే గోళం ఒకటి డబుక్కున మన మీద పడుతుందేమో...అప్పుడేమిటి గతి ?.” అంటూ జంఘాలశాస్త్రి పెద్ద నిట్టూర్పు విడిచి కూచున్నాడు.
ఈ వార్తలన్నీ విని సభలో అందరూ తెల్లబోయారు.అందరూ నిట్టూర్పులు విడుస్తూ తమ తమ ఆలోచనల్లో పడ్డారు.వారిలో మొదటివాడు కాలాచార్యులు,బ్రహ్మచారి.పోగొట్టుకోవడానికి భార్య గానీ పిల్లలు గానీ లేనివాడు.
అయినా అందరికంటే ఎక్కువ దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. అతని బాధ ఏమిటంటే అతనికి ముక్కుపొడి అలవాటు.సూర్యుడి ఎండ లేకుండా పొగాకు ఆరబెట్టటం ఎలా జరుగుతుందాని ఒక చింత.
ఎలాగోలా అరి,ఎవరైనా పొడి చేసుకుని పెట్టుకుంటే వారిని అరువు అడగడానికి చీకటిలో వెళ్ళగలమా లేదా అని మరో చింత. తర్వాత చెప్పవలసిన వ్యక్తీ వాణీదాసుడు.
ఇతను ఒక కవి.తోకదెబ్బ తగిలి ఎగిరిపోయే భూమి ఇంకో గోళంలో ఢీకొంటే, తను వెళ్లి వేరే గోళంలో పడితే ఆ గోళంలో వారికి తెలుగు రాకపోతే ఎలా అని ఇతనికి వర్రీ. తెలుగురాని వాళ్ళు తన కవిత్వాన్ని ఆస్వాదించలేరు.తమ తమ ఆలోచనలలలో మునిగి ఉన్నారు.
భూమిలో పాతిపెట్టిన వరహాలముంత ఏమవుతుందని ఒకడు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్నకేసులో తన తరుపున తీర్పు వచ్చే సమయంలో ఇదేం ముప్పురా దేవుడా అని ఒకడు, ఎందుకైనా మంచిది,రావలసిన పద్దులు గబగబా వసూలు చేసుకుంటే మంచిది కదా అని ఆలోచించడం మొదలు పెట్టారు.
తూర్పు ప్రాంతం నుండి వచ్చిన ఒకామె " అయ్యా...మా పిన్నమ్మ నిన్ననేను వచ్చేసరికి కొత్తగా పెట్టిన ఆవకాయ ఎండబెట్టింది.అది ఎండకుండానే సూర్యుడు ఆరిపోతాడా ?” అని బాధపడుతూ అడిగింది.
ఇదంతా చూసేసరికి నాకు తోచిన ఆలోచన చెప్పబుద్ది వేసింది. “ సోదరులారా!మనకున్న దుఃఖాలు చాలనట్లు ఈ కొత్త ఏడుపులు ఒకటా?చేటలో పడిన దగ్గర్నుంచి కాటిలో పడేవకరూ మనం ఏడవవలసిన నానారకాల ఏడుపులు చాలనట్లు ఈ ఏడుపులు కూడా ఎందుకు ?చలితో బాధపడేవారు.
మంచుగడ్డ తలకు కట్టుకున్నట్టు,జ్వరం వచ్చినవాడు మంచం కింద కుంపటి పెట్టుకున్నట్టు అనం లేనిపోని కష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవాలి?.
మనకు బుద్ధినిచ్చిన దెందుకు?.దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గాలు వెతకడానికి. ఏవేవో ఊహించి,ఎప్పుడో రావాల్సిన కష్టాలు ఇప్పుడే వచ్చినట్టు ఏడవడానికి కాదు.
శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఇచ్చిన కత్తితో తన తలకాయ కోసుకున్నట్టుంది. అసలు ఈ ప్రళయం అనే ఆపదే తీసుకుంటే, అది వస్తుందో రాదో సందేహించదగినది.వచ్చినా కలియుగం నాలుగవ పాదంలో రావడానికి వీల్లేదు.
సర్వనాశనం అయిన తర్వాత విచారించడానికి కూడా మనమూ మిగలం.విచారమూ మిగలదు.ఇలాటి ముప్పురాకుండా మనం చేయగలిగేదీ లేదు.
అటువంటి ఆపదలు ఇప్పుడే వచ్చినట్లు ఏడ్చేవాడిని ఏమనాలి?ప్రపంచంలోని వస్తువులు నశించేవి,నీలో ఉన్న పదార్థము శాశ్వతంగా ఉండేది అని తెలిసి కూడా బాధపడటం ఎందుకు? ఏ మహాతేజం ముందు సూర్యుడు వెలవెలబోతాడో,అటువంటి తేజం నీలోనే ఉంది.
అటువంటప్పుడు కంటికి కనబడే సూర్యుడు ఆరిపోతే నీకేం?లేనిపోని బెంగలు పెట్టుకుని మనసు పాడుచేసుకుని చేష్టలుడిగి కూచోకండి.మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి " అని లెక్చరు యిచ్చాడు జంఘాలశాస్త్రి.
(సరదాగా కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే)
(హాసం సౌజన్యంతో)
" శబ్దాల మీద నగిషీలు "
ఆచార్య తిరుమల
అడిగేవాడికి చెప్పేవాడు లోకువని సామెత.
అడిగేవాడు ఏది పడితే అది ఎలా పడితే అలా అడగొచ్చు కానీ చెప్పేవాడు మాత్రం ఏది పడితే అది ఎలా పడితే అలా సమాధానంగా చెప్పటానికి వీల్లేదు. తలతిక్క ప్రశ్నలకు కూడా తలకెక్కే సమాధానాలు చెప్పాలి.
ఆ బాధ్యతని బలహీనతగా భావించటం వల్ల లోకువగా కనిపించవచ్చును.కానీ మళ్ళీ నోరెత్త లేని సమాధాన మిచ్చేవాడికి అడిగేవాడు లోకువే కాదు
సరికదా...జీవితాంతం దాసుడు కూడా అవుతాడు.
లోకంలో చాలా రకాల మనుషులు ఉంటారు.కొందరు ఏదోటి అడుగుతూనే వుంటారు.కానీ ఏమి తెలుసుకోరు.కొందరు ఎవ్వరూ ఏమి అడక్కపోయినా ఏదోటి చెప్తూనే వుంటారు కానీ అవతలి వారు వింటున్నారా లేదా అని కూడా పట్టించుకోరు.కొందరు అన్నీ తమకే తెలిసున్నట్టు ఏమి అడగరు.
కొందరు ఎంత తెలుసుకుందామని అడిగినా చెప్పరు.కొందరు అడిగి అడగనట్టు అడుగుతూ వుంటారు.కొందరు చెప్పీ చెప్పనట్టు వుంటారు. ఎవరు ఎలా ఉన్నా అడిగేవాడికి చెప్పేవాడికి కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని గ్రహించడం మంచిది.అడిగే విధానమెలా వున్నా చెప్పేమాట హృదయానికి హత్తుకోవాలంటే, మనోరంజకంగా వుండాలంటే...అది సత్యబద్ధమై అందంగా ఉండాలి.
ఈ విషయాన్ని మనుధర్మశాస్త్రం మహా చమత్కారంగా ఇలా చెప్పింది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!
సత్యాన్నే పలుకు,ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు,ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది.
సత్యాన్నేవిను,ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు.
వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.
" కార్యం శరణం గచ్చామి "
కవి శేఖర పానుగంటి లక్ష్మీ నరసింహారావు
ఒక రాత్రి జంఘాలశాస్త్రి సర్కస్ కంపెనీకి వెళ్లి అక్కడ జరుగుతున్న విచిత్రాలను చూస్తున్నాడు.
ఆ సర్కస్ యజమాని కండలు తిరిగిన యోధుడు, వస్తాదు.గుండెలపై పెద్దనాపరాతి బండలను పెట్టించుకుని సమ్మెటలతో కొట్టించుకుని, పెద్ద పెద్ద గొలుసులను తెంపేసి పళ్ళతో పెద్ద బరువులను లేవనెత్తడం చేశాడు.అన్నీఅయిన తరువాత ఒక వింత ఉపన్యాసాన్ని ఇచ్చాడతను.
“ బుద్ధుడు ప్రేమ మతాన్ని బోధించి జీవహింస చేయరాదని చెప్పి భారత జాతిని పాడు చేశాడు.ఆ మతంలో చేరినవారు మాంసాహారం మానేశారు.అందువల్ల బలహీనులై,పౌరుషం లేక భయ స్వభావులై భారతీయులు పాడైనారు.నేడు ఆ మతం దేశంలో లేకపోయినా దాని పూర్వాచారములు ఇంకా బాధిస్తున్నాయి.కాబట్టి వారు వీరు అనే తేడా లేకుండా అందరూ మాంసం భుజించి దేహ బాల సంపన్నులై పౌరుషవంతులై భారత వీరులనిపించుకోండి.భారత దేశాన్ని ఉద్దరించవలసిన వారు మీరే!” అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
అతని ఉపన్యాసానికి సభలోని వారు మహా ఆనందంతో కరతాళధ్వనులు చేశారు.
జంఘాలశాస్త్రి ఆ సర్కస్ యజమాని అభిప్రాయంతో ఏకీభవించక "తను మాట్లాడటానికి అవకాశం ఇవ్వవలసిందిగా " అడిగాడు.
అందుకు అతను " మాట్లాడడానికి ఏముంది ?ఇదేమన్నా కమ్యూనిటీ హాల్ గాని,పఠన మందిరంగాని, గ్రంథాలయంగాని కాదు.ఇది వ్యాయామశాల కాదు.అలాగే ఉపవ్యాసాలు ఇచ్చే తావు కాదు " అని అన్నాడు.
అందుకు జంఘాలశాస్త్రి " మరి నీవు ఎలా ఉపన్యాసం చేశావు ?” అని ప్రశ్నించాడు.
“ ఇది నా సొంత సర్కస్ కంపెనీ.నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను.నన్నుఅడగడానికి నీవు ఎవరు? ” అని వస్తాదు కసిరాడు.
అందుకు జవాబుగా " మీ సొంతమైతే మీ పనులు ఏం చేసుకున్న మాకు అభ్యంతరం లేదు. మీరు దేశాన్ని గూర్చి భారతీయుల గూర్చి ఏమేమో చెప్పారు.కాబట్టి ఒక సగటు భారతీయుడిగా మీ ప్రసంగానికి ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటున్నాను " అన్నాడు జంఘాలశాస్త్రి.
దాంతో విసుగెత్తిన యజమాని " ఏం చెప్తావో చెప్పవయ్యా !మీ మంచి కోరి ఏం చెప్పినా మీకు పనికి రానప్పుడు ఎవడు మటుకు ఏం చేస్తాడు ?"అని అన్నాడు.
“ సోదరులారా...ఈ సంఘాదిపతి ఈ రాత్రి చేసిన చిత్ర చర్యలన్ని మనకు ఆనందాన్ని ఇచ్చాయి.అయితే అధిక బాల ప్రదర్శన చూపరులకు అద్భుత వినోదకరం.నిర్జీవబల ప్రదర్శనమే ఆశ్చర్యమైనప్పుడు, సజీవ బల ప్రదర్శనం ఆశ్చర్యం కాకుండా పోతుందా ? ప్రాణం లేని రైలు బండి ప్రయాణం ఒక వింత కాదా!
ఇలాంటివన్నీ నిర్జీవబల ప్రదర్శనలు.సజీవ బల ప్రదర్శనం అంటే మన సర్కస్ యజమాని చేసిన ఫీట్లువంటిది.ఇక్కడ శక్తికి ప్రాణం వుంది.ప్రాణం వెనుక మనసు వుంది.దాని వెనుక ఆత్మ వుంది.సంకల్పబలం, ఉత్సాహం ఇందులో ఉన్నాయి.
ఇది విశేషమైన అలవాటు మీద జరుగుతుంది.దీన్ని కొత్తగా చూసేవారికి ఆశ్చర్యంగానే వుంటుంది. ఇలాంటి బలాఢ్యులు ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు.
ఉయ్యాల గొలుసులు తెంపి పిల్లల్ని ఏడ్పించడం.గడ్డపారలు వంచి రైతులను ఏడ్పించడం, నాపరాళ్ళు పగలకొట్టి రజకులను ఏడ్పించడం, డబ్బు దండగతో నిద్ర దండగతోనూ...ఊళ్ళో వారిని ఏడ్పించడం లాంటివి ఒక పనిగా పెట్టుకున్నారు ఇలాంటి వాళ్ళు.
చదువులో సున్నా సర్కసుల్లో పిడుగు. ఆడువారు కూడా ఇలాంటి పనులు సులభంగా చేస్తున్నారు.” అని ముగించ్చాడు.
(హాస్యం పత్రిక సౌజన్యంతో )
దొంగలు బాబోయ్ దొంగలు
వి. నాగరత్న
అబ్బో ఇది దొంగల రాజ్యమండీ బాబూ.
చిల్లర దొంగల దగ్గర్నుంచీ ఘరానా చోరుల వరకూ, పది రూపాయలకి కక్కుర్తి పడే పిక్ పాకెటర్ మొదలు కుంభకోణాల భోజ్యుల దాకా, డూప్లికేట్ పాస్పోర్ట్ లతో జనాల్ని రవాణా చేయడం దగ్గర్నించీ నకిలీ నోట్ల తయారీదార్ల వరకూ ఎన్నెన్ని మోసాలు చూట్టంలేదూ?!
ఇలాంటివి వెలుగు చూసినప్పుడల్లా ఓసారి బుగ్గలు నొక్కేసుకుంటాం. అదే మొదలు, అదే చివరా కాదని తెలిసినా సరే, ''అవ్వ, అవ్వ ఏమిటీ ఘోరం.. ఎంత దుర్మార్గం.. కలికారం మహిమ.. పెరుగుట విరుగుట కొరకేనని ఊరికే అన్నారా?! -ఇలాంటి ఆశ్చర్యార్థకాలతో తెగ మాట్లాడేస్తాం.
బస్ ఎక్కుతామా, టికెట్ తీసుకోబోతే పర్సుండదు. కండక్టర్లో కూసింత జాలీదయా లాంటి పదార్ధాలు ఏమైనా ఉండి అఘోరిస్తే 'ఆమాత్రం జాగ్రత్త లేకపోతే ఎలా.. సర్లే, ఇక్కడ దిగిపోండి.. చెకింగోడు వస్తే నా దుంప తెగుద్ది, నేను బుక్కవుతా'' అంటాడు.
ఆమాత్రం కనికరం లేనివాడైతే చూస్కోండి, పురుగును దులపరించినట్లు విదిలించి పారేస్తాడు.
"పర్సు పోయిందా.. ఈ నాటకాలు నా దగ్గర కాదు..నీ లాంటోళ్ళని వెయ్యిమందిని చూశా..'' టైపులో వాగుతుంటే, ఇక పర్సు పోగొట్టుకున్న వ్యక్తీ పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ''డబ్బూ పోయే, శనీ పట్టే'' చందమేగా. రైలన్నాక రాత్రి ప్రయాణంలో నిద్ర పోవడం సహజం. ఆ కుదుపులకి హాయిగా గాఢ నిద్ర పడుతుంది. ఇక చోరశిఖామణులు సూట్కేసులు చేతబట్టుకుని ఉదాయించేస్తారు.
పొద్దున్నే లేచి లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు కంప్లెయింట్ ఇస్తున్నప్పుడు చూడండి, సొమ్ము పోయిన బాధకు పోలీసోళ్ళ కామెంట్లు పుండు మీద కారం జల్లినట్టు ఉంటాయి.
''నిజంగా అందులో అంత డబ్బుందా? అన్ని నగలు ఉన్నాయా? అవన్నీ ఎందుకు మోసుకు వెళ్తున్నట్టు? కనీసం అంత విలువైన వస్తువులు ఉన్నప్పుడు చైనేసి లాక్ చేయాలన్న జ్ఞానం కూడా లేదా? తమరా వరసన్ నిమ్మకు నీరెత్తినట్టు నిద్దరోతుంటే దొంగోడి తప్పేం ఉంది? మాకు పనులు పెంచడానికి, మా దుంపలు తెంచడానికి కాకపోతే.." లాంటి మాటల ఈటెలతో పొడుస్తుంటే, బూటుకాలితో తన్నాలనిపించే మాట నిజం.
అలాగని అంత పని చేశారో, ఆనక జీవితాంతం ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుంది. ఇంకో రకం దొంగలు.. ఉద్యోగం ఇప్పిస్తానని వేలూ, లక్షలూ కాజేసే బాపతు. మోసగాళ్ళే కాదు, మోసగత్తెలూ కలరు. నైజానికి స్త్రీ పురుష తేడా లేదు. మగ దొంగల కంటే ఆడ దొంగలు మరీ డేంజర్. వీళ్ళు అవసరమైతే ఎంతకైనా దిగజారిపోతారు.
రియల్ ఎస్టేట్ దొంగలు మరో రకం. ఇళ్ళ స్థలాలు కబ్జా చేసి పారేయగల గూండాలు. ఒక స్థలాన్ని నలుగురికి అమ్మి రిజిస్టర్ చేయగల దిట్టలు. ఇంకా మాట్లాడితే భూమ్మీద లేని ప్లాటును కూడా కాగితాల్లో అమ్మగల ప్రపంచ ముదుర్లు.
ఫలానా చోటికి వెళ్తున్నామంటే, అక్కడ దొరికే వస్తువేదో కాస్త తెచ్చిపెట్టమని అడగడం సహజం. అందులో కూడా కమీషన్ వేసుకునే చిరు దొంగలు కొందరుంటారు. అదేం కక్కుర్తో, చవకబారుతనమో అంతుపట్టదు. దొంగబుద్ధి బయట పెట్టుకోవడం కాకపోతే దానితోనే బతికేస్తారా? ఈ చిన్నా పెద్దా చోరీలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే.
పొతే, బందిపోటు దొంగలు, స్కాం లు, ముఠా దోపిడీల గురించి పేపర్లలో చదివి గుండెలు అవిసేలా రోదించకపోయినా, ప్రపంచం ఏమైపోతోంది అంటూ ఇదేం ఘోరం అంటూ చెవులు కొరుక్కుంటాం. మొత్తానికి డైరెక్టుగా దోచుకునే దొంగలు, గజదొంగలదో పద్ధతి అయితే, బూటకాలు, నాటకాలతో, మోసం, నయవంచనతో దోచుకోవడం ఇంకో పద్ధతి. కోట్లు దండుకుని పరారైన కృషీ బ్యాంకు బాపతు కేడీలు రెండోరకానికి చెందుతారు.
ఇక రషీదులు, షకీళ్ళ వెనకాల రాజకీయ నాయకులూ ఉంటారు. చోటా సైజు గల్లీ గూండాలు ఉంటారు. ఏ రకంగా అయితేనేం, చేసేది మట్టుకు దండుకోవడం, దోచుకోవడం. వాళ్ళు కష్టపడరు. చెమటోడ్చరు. కానీ సుఖసౌఖ్యాలు కావాలి. కోట్ల ఖరీదు చేసే కార్లు, పోష్ ఏరియాల్లో ఇళ్ళు, ఫారిన్ ట్రిప్పులు.. ఇవన్నీ కావాలంటే కొల్లగొట్టాల్సిందే తప్పదు.
ఓ గుమాస్తా తన కనీస అవసరాలు తీర్చుకుని కష్టపడి, కూడబెడితే రిటైర్ అయ్యేనాటికి ఓ ఇల్లో, ఫ్లాటో కొనుక్కోగలడు. ఆఫీసరో, ప్రొఫెషనలో అయితే ఘనమైన కొంపా, ఖరీదైన కారూ కొనుక్కోగలడు. అంతే. కానీ, ఇలా నెలంతా కష్టపడే వృత్తులు, ఉద్యోగాలు కాకుండా దోచుకోవడం, కొల్లగొట్టడం అనే బిజినెస్ అయితే ఆర్నెల్లకో అందమైన సౌధాన్ని సొంతం చేసుకోవచ్చు.
యమా జల్సాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అందుకే, అంటారు... ''వండుకున్న అమ్మకి ఒకటే కూర, అడుక్కున్న అమ్మకి అరవై కూరలు''- అని. అలూకాస్ దొంగోడు తన విలాసాల కోసం రోజుకు లక్షలు ఖర్చు పెడతానని, సినీ నటులతో, మోడల్స్ తో గడుపుతానని చెప్పాడు.
అంతేలే, మరి.. నిజాయితీగా సంపాదించిన వాడు ఆ వరసన ఖర్చు పెట్టగలడా? సరే, ఈ దుర్మార్గాలు, దోపిడీల సంగతలా ఉంచి ఇంకో టైపు ఉంటారు. అప్పులోళ్ళు. నీతిగా తీసుకుని, నిజాయితీగా తీర్చేవాళ్ళ సంగతి కాదులెండి. కొందరికి అసలు అప్పు తీసుకునేటప్పుడే తీర్చే ఉద్దేశం ఉండదు. భారీ రుణాలు చేసి, ఐపీ పెట్టేసే వాళ్ళనీ, వేలూ లక్షలూ ఎగ్గొట్టేవాళ్ళనీ ఎందర్ని చూట్టంలేదు? కొందరు సత్తెకాలపువాళ్ళు ''అన్యాయపు సొమ్ము వంటబడ్తుండా?" అనడం వింటుంటాం.
మన పిచ్చి కాకపొతే, వంటబట్టకేం చేస్తుంది? ఒకవేళ అరక్కపోతే డైజిన్ వేసుకుంటారు. అంతేగా! ఇకపోతే అంత మొత్తం కాకున్నా ''ఓ యాభై ఇవ్వు, వందివ్వు..'' అని అడుగుతుంటారు.
ఇవ్వక చస్తామా? కానీ ఆ మొత్తాలు తిరిగొచ్చే సమస్యే లేదు.ఇలాంటివి ఎన్ని అనుభవాలు ఉన్నా మరో శాల్తీ, ఇంకో శాల్తీ తగుల్తూనే ఉంటారు. ఇవ్వాల్సి వస్తూనే ఉంటుంది. వీళ్ళకి ఇచ్చే బదులు, అడుక్కునేవారికి ఇస్తే పుణ్యమైనా దక్కేది - అనిపిస్తుంది కూడా. పుణ్యాలూ గట్రా నాన్సెన్స్ అనుకున్నా నిజంగా నిస్సహాయులైనవారిని ఆదుకోవడంలో అర్ధం ఉంది.
ఇంకొకరి నెత్తిన చేయి పెట్టాలనుకునేవారికి ఇవ్వడం శుద్ధ దండక్కాదూ?! మార్గాలు వేరు కావచ్చు. మనుషులు వేరవ్వచ్చు. కానీ, దొంగలందరిదీ ఒకటే కులం.
''పెద్ద చేప చిన్న చేపను మింగును'' తరహాలో కడుపు పెద్దదైన కొద్దీ మరింత భారీ చోరీకి పాల్పడ్డమే తప్ప తేడా లేదు. అందరూ అందరే.
మొత్తానికి మోసపోయిన వాళ్ళకు, ఈ దొంగలమీద వచ్చే పిచ్చి కోపానికి ఎడార్లో పడేసి, చుట్టూ ప్రహరీ కట్టించేయాలి అనిపిస్తుంది. గోడ ఎక్కి దూకే వీల్లేకుండా షాక్ కొట్టే ఏర్పాటు కూడా చేయగలరు!
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
హాస్యనట చక్రవర్తి మన రేలంగి -1
రెండున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో హాస్యనట చక్రవర్తిగా పేరుగాంచిన ఏకైక హాస్యనటుడు మన రేలంగి.
చిన్నతనంలో తాడేపల్లిగూడెంలో చిల్లర వేషాలు అవీ వేస్తూ నేర్చుకున్న పద్యాలు, వాటి రాగాలూ ఆ తరువాత కాకినాడలో మహాగురువు శ్రీ గండికోట జోగినాథం గారి శిష్యరికంలో నటనతోపాటు సాధించుకున్న సంగీతజ్ఞానం, యంగ్ మెన్స్ హాపీక్లబ్ లో వేసిన నాటకాల ద్వారా వంట బట్టిన హాస్య నటన శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారిని 'హాసం'గా తీర్చి దిద్దాయి. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలకు అచ్చు గుద్దినట్లు సరిపోయిన మహానటుడు, గాయకుడు కూడా.
పామరుల నుంచి పండుతుల వరకు 'రేలంగోడు' లేని సినిమా రుచించని శకం ఇప్పటికీ కొనసాగుతున్నదంటే అతిశయోక్తి కాదు. నటుల్లో రేలంగి, రచయితల్లో పింగళి, ముళ్ళపూడి, జంధ్యాల సమగ్ర సంపూర్ణ హాస్యరసం కురిపించి దాని స్వరూపాన్ని ప్రేక్షకులకు చూపిన వారంటే అత్యుక్తి కాదు. రేలంగి, రమణారెడ్డి ద్వయం ఆనాటి హాస్యరస దేవతకు రెండు కళ్లు.
ఆ తరువాత వచ్చిన హాస్య నటుల్లో చాలామందిని ప్రభావితం చేసింది రేలంగి ఫక్కీ హాస్యంతో పాటు కరుణ, రౌద్ర రసాలను కూడా సమర్ధవంతంగా పలికించిన ప్రతిభశాలి. నేను ఆంధ్ర సచిత్ర వార పత్రికకు సినిమా ఎడిటర్ గా వున్న రోజుల్లో (1959-63) తరచుగా ఆయన్ని కలిసే అవకాశం కలిగేది ఆయనలేని సినిమా ఉండకపోవడమే దానికి కారణం.
నిర్ణీత సమయానికి వచ్చి రంగు పూసుకుని సెట్ బైట ఎన్ని గంటలైనా వేచి వుండిన ఆనాటి నటులు సి.ఎస్.ఆర్. రేలంగి, ముక్కాముల వంటి వారిలోని క్రమశిక్షణ, సహనరూపంలో వారు చూపిన సంస్కారం, తమ వృత్తి పట్ల వారికి గల అంకిత భావం ప్రత్యక్షంగా చూసే అవకాశం పత్రికా విలేఖరిగా నాకు కలిగింది. ఆయన కోపం, దుఃఖం, రౌద్రం, అన్నీ హాస్యమే కురిపించేవి!
నవరసాల్లో హాస్యేతరమైన ఏ రసం ప్రదర్శించినా నవ్వు తెప్పించిన నటుడు రేలంగి. మద్రాసులో మహానాటక ప్రయోక్త తన గురువు శ్రీ గండికోట జోగినాథం గారి నాటక సప్తాహం జరిగినప్పుడు ఎంతో బిజీగా వుండి కూడా ప్రతి ప్రదర్శనకు హాజరై చివరి రోజున అయన కాళ్లకు నమస్కరించి, కౌగిలించుకుని బావురుమన్న రేలంగి ఆర్థ్ర హృదయం ప్రత్యక్షంగా చూసి పులకించిన వారిలో నేనొకడను.
ఆనాడు ప్రసంగించలేని గాద్గదికంతో ఆయన ఎంతో ఆవేశానికి గురి అయినాడు. గతాన్ని విస్మరించని వాడు నిత్య యవ్వనుడు. అటువంటి కొద్దిమంది కళాకారులలో రేలంగి ఒకరు మకుటం లేని మహారాజుగా కపటంలేని కళాకారుడుగా ఆయన జీవితం కొనసాగింది.
అటు తరువాత వచ్చిన హాస్యనటులు ఎందరికో ఆయన ముద్ర పడింది ఘంటసాల లాగా పాడాలని, రేలంగిలాగా కామెడీ చెయ్యాలని అనుకొని ఔత్సాహికులు అరుదుగా వుండేవారు. రేలంగినట జీవిత విజయానికి మహా రచయితల సంభాషణలు దర్శకుల విన్నాణాలు ఆహార్యంతో అమరిన స్వరూప దర్శనాలతో పాటు నటనాకౌశలం, 'టైమింగ్' ప్రధాన కారణాలు ముఖ్యంగా టైమింగ్ విషయంలో మహానటుడు ఎస్వీ రంగారావు, రేలంగి ఇద్దరినీ ఎక్కువగా చెప్పుకునేవారు.
గుణసుందరి కథ, ప్రియురాలు, దొంగరాముడు, సువర్ణసుందరి, రహస్యం, పాతాళభైరవి, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, మాయాబజార్, అగ్గిరాముడు, పక్కింటమ్మాయి, వెలుగునీడలు, తోడికోడళ్లు, కులగోత్రాలు, చెంచులక్ష్మి, వాగ్దానం, విప్రనారాయణ, రోజులుమారాయి, చింతామణి, చెరపకురా చేడేవు, పెళ్లికానుక, ప్రేమించిచూడు, భాగ్యరేఖ, భలేరాముడు - ఇలా ఎన్ని చిత్రాలని!
పాతాళభైరవిలో 'వినవే బాలా నా ప్రేమగోల,' ఓయమ్మలారా అనే తాళలేనే', మిస్సమ్మలో 'సీతారామ్ సీతారామ్, ' 'దర్మం సెయ్ బాబు', విప్రనారాయణలో ;ఆడది అంటే లయం లయం - ఆ నీడంటేనే భయం భయం' సారధి వారి ఎత్తుకు పై ఎత్తు చిత్రంలో కాబోలు 'ఎవడనుకున్నావ్ ఎవడనుకున్నావు ఇట్టావుండే బిచ్చాలన్నా ఇంతట్లోనే ఇంతవుతాడని' వగైరా ఎన్ని పాటలో తన పాత్రకు తనే పాడుకున్ననట గాయకుడు ఆయన.
పెండ్లిపిలుపు చిత్రంలో సి.ఎస్.ఆర్ కు జూనియర్ లాయర్ గా రేలంగి చేసిన అభినయం శ్రీ పూసపాటి కృష్ణంరాజు (సుప్రసిద్ధ కధా రచయిత రెండు బంట్లు పోయాయి) రాసిన తూర్పు యాస డైలాగులు మరుపురానివి.
(హాసం సౌజన్యంతో)
వేటూరి సుందరామమూర్తి
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
తెలుగు సినిమాకు దరహాసం- తెలుగు ప్రేక్షకుడికి వరహాసం
మన రేలంగి - 2
తెలుగు సినిమాకు దరహాసం-తెలుగు ప్రేక్షకుడికి వరహాసంగా భాసిల్లిన హాస్యనటుడు మన రేలంగి. తెలుగు తనాన్ని సంప్రదాయాన్ని తోబుట్టువులుగా చేసుకుని ఎదిగిన తెలుగువాడు రేలంగి అందుకే ఆయన నటించిన పాత్రలు ప్రేక్షకులకు అంత చేరువకాగాలిగాయి.
సహజప్రవర్తనా ధోరణి (Behaviour Pattern) సాంఘికాలలోను, కల్పనా ధోరణి జానపదాలలోను, పురాణేతిహాస పరిచయంతో పరకాయ ప్రవేశం చేసి నారదుడు, నక్షత్రకుడు, ఉత్తర కుమారుడు, లక్ష్మణకుమారుడు వంటి పౌరాణిక పాత్రలు పునః సృష్టి చేయగల నటనాపాటవం పౌరాణికాలలోను అద్వితీయంగా చూపించగలిగిన అరుదైన నటుడు రేలంగి.
శ్రోత్రియమైన క్షత్రియమైనా, దళితమైనా ఏ పాత్ర ఎటువంటిదైనా రేలంగివంటి నటశిరోమణికి అవధులు లేవు రానురాను శరీరము అనుకూలించణి అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆ పరిస్థితినే కొత్త తరహా అభినయంగా మార్చుకున్న ధీశాలి అతను.
“నర్తనశాల'లో ఉత్తరుడుగా కౌరవసేనను చూసి వణికిపోతూ అతను అభినయించిన మహాకవి తిక్కన పద్యం 'కౌరవసేనజూచి నడకన్ దొడగెన్ మదితోన మేను' కళ్లముందు ఉత్తర కుమారుణ్ణి తెచ్చి నిలబెట్టింది. మదితో మేను వణకటమనేది ఏమిటో, ఎలావుంటుందో, తిక్కన కవితా హృదయం ఎటువంటిదో రేలంగి చూపించగలిగాడు.
“చెంచులక్ష్మి' లో నారదుడుగా అతని నటన ఆ పాత్రకు చక్కగా సరిపోయిందనే పేరు తెచ్చుకుంది. నీలగగన ఘనశ్వామా' అనే హరినామ కీర్తన చేస్తూ చిత్రంలో రేలంగి భక్తిభావాన్ని ఉద్దీప్తం చేస్తూ ప్రతిభావంతంగా నటించాడు.
డైలాగు చెప్పేటప్పుడు అతను అనేక కొత్తపుంతలు తొక్కాడు తన స్టైల్ అనేది మూడు నాలుగు రకాలుగా వింగడించి ప్రేక్షకలోకం మీద విసిరి 'భళా' అనిపించుకున్నారు. తనదంటూ ఒక ఉచ్చారణ అతనికి వుండేది. 'ఆషాఢప్పట్టీయా శ్రావణపట్టీయా'... 'తమరే తమచోటికే తక్షణమే తట్టా బుట్టాతో తరలిపోవాలి' మొదలైన ఆయన డైలాగులు సినిమాహాల్లో ఈలలు వేయించేవి.
'చింతామణి'లో చచ్చిబ్రతికినవాడును సానికొంప జొచ్చి మిగిలినవాడు లేడు లేడు దైవంబుతోడు' అంటూ ఉత్తరీయం కన్నీటితో తడిపి పిండుతూ పద్యం పాడే దృశ్యం తెలుగు ప్రేక్షకుడు మరచిపోలేడు. ఆయన స్టెప్సు వేస్తూ పాడిన పాటలు 'వినవేబాలా', 'సుందరి నీవంటి దివ్య స్వరూపము', 'నవనీతమ్మా రమణయ్య మామా' కోసం మళ్లీ మళ్లీ సినిమాలు చూసిన వారెందరో! గుణసుందరిలో రాజుగారి మేనల్లుడు, పాతాళభైరవిలో రాణిగారి తమ్ముడు, చింతామణిలో సుబ్బిశెట్టి, నర్తనశాలలో ఉత్త(ర) కుమారుడు, మాయాబజార్ లో లక్ష్మణకుమారుడు, పెద్దమనుషులలో తిక్కశంకరయ్య, దొంగరాముడులో 'భ'కు వత్తులేని వట్టి బద్రయ్య అనే వీర భద్రయ్య, అగ్గి రాముడులో ఫోర్ ఫార్టీ వన్ వంటి ఎన్నో విశిష్ట పాత్రలను ఎంత ప్రతిభావంతంగా రేలంగి పోషించాడో పాత్రోచితంగా సంభాషణలు నొప్పి వక్కాణించాడో తలుచుకుంటే అది ఒక మహా చరిత్రగా సువర్ణాధ్యాయంగా స్పృతి పథంలో నిలిచిపోతుంది.
తమిళంలో టి.ఎస్. బాలయ్య, తంగవేలు వేసిన ఎన్నో పాత్రలకు తెలుగులో రేలంగి తప్పమరొక నటుడు సరితూగే వాడు కాదు. కాదలిక్క నేరమిల్లె, కళ్యాణపరిమ చిత్రాలు తెలుగులో ప్రేమించిచూడు, పెళ్లికానుకగా తీసినప్పుడు రేలంగినే ఆ పాత్రలకు ఎన్నుకొనక తప్పలేదు. రేలంగికి తను నటించిన చిత్రం పేరు చెబితే తెలిసేది కాదు 'పెండ్లిపిలుపు'లో మీ లాయర్ వేషం చాలా బాగుంది' అంటే 'పెండ్లి పిలుపా' నేనెప్పుడు వేశానుబాబూ అందులో అన్నాడొకసారి 'అదేనండీ సి.యస్.ఆర్ గారూ మీరూ' అని చెప్పబోతే 'సినిమా పేర్లు గుర్తుండవు బాబూ..... నిర్మాత పేరు చెప్పండి చాలు' అన్నాడు 'డిబి నారాయణగారి పిక్చరండీ' అంటే 'అట్టా చెప్పండి బాబూ' అని 'మంచి కామెడీ బాబూ చాల్ గొప్ప కామెడీ' అన్నాడు.
'మాయాబజార్' లో లక్ష్మణకుమారుడుగా ఆ రాజదర్పం, ఆత్మాభిమానం, తండ్రినుంచి సంక్రమించిన లక్షణాలన్నిటికీ అద్దంపట్టే రీతిలో రేలంగిహావభావ ప్రదర్శన అద్భుతం. అలాగే శశిరేఖకు తాళికట్టే సన్నివేశంలో పెద్దపులి, భూతం కనిపించగానే అంతచేరువలో అవి ప్రత్యక్షమైతే ఎంత గాభరాపడి గావుకేకలు పెడతామో అక్షరాలా అలా ప్రవర్తించిన మహానటుడు ఒక పక్క చెక్కలవుతున్న కడుపును చేత్తో పట్టుకుని అతనికి జోహారు చెయ్యని ప్రేక్షకుడు ఆనాడు ఈనాడూ కూడా లేదంటే అతిశయోక్తికాదు తన తోటి హాస్యనటులు రమణారెడ్డి, అల్లురామలింగయ్య, చదలవాడ రామకోటి, నల్ల రామ్మూర్తి, సీతారాం, లంక సత్యం, బొడపాటి వంటి వారికి ఆయన పెద్ద దిక్కుగా వుండేవాడు. తమిళ రంగంలో ఎస్.ఎస్.కృష్ణన్, టి ఎ మధురం హాస్యనటులుగా చరిత్రలో నిలిచిపోయేజంట. అలాగే రేలంగి, గిరిజ వెరసి రేలంగిరిజ అలా నిలిచిపోతారు.
మరో మరుపురాని తెరదాంపత్యం సూర్యకాంతంతో! బ్రతుకుతెరువు, భార్యాభర్తలు, దొంగరాముడు, తోడికోడళ్లు వగైరా చిత్రాలలో వారి జంట అభినయం చూసి ఆనందించనివారులేరు. 'ఇరుగువారిని పొరుగువారినిచుట్టాలని పక్కాలని స్నేహితులనీ, వివిధ వృత్తుల్లో వున్నవారిని చిన్నతనం నుంచీ పరిశీలించి చూసేవాణ్ణి మిమిక్రీ ఆర్టిస్టులు ఇదేగా చేసేది.
అదే నేనూ చేసేవాణ్ణి స్కూల్లో మాస్టర్లనీ వారి మాటనీ, నడకనీ, ఇమిటేట్ చేసిన స్టాండప్ ఆన్ ది బెంచ్ గాణ్ణి. కొందరి కంఠస్వరం వారువారు చేసే వృత్తులు, వాటి దైనందిన అవసరాలని బట్టివుంటుంది. అలాగే పాటలాగా మాటకూ శృతి వుంటుంది. ఇవన్నీ గమనించి సొంతం చేసుకునేవాణ్ణి. అది హాబీగా మొదలై జీవనంగా మారిపోయింది అదే నాకు కాస్త తిండీ, మరికాస్త పేరుకూడా తెచ్చిపెట్టింది, అని రేలంగి 1953 లో పచ్చియస్సాస్ కాలేజీ ఆవరణలో జరిగిన చెన్నపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి సన్మానసభలో చెప్పాడు.
'నాటకాల పిచ్చి ముదరడంతో సంగీతంలో సాపాసాలు కూడా పట్టడం నేర్చుకున్నాను రంగస్థల పద్యాలు, పాపట్ల కాంతయ్యగారి పాటలు పాడేవాణ్ని కాకినాడలో నటించే రోజుల్లో నా పద్యాలు నేనే పాడేవాణ్ణి. అంతా మా గురువుగారు జోగినాధం గారి తర్ఫీదు 'రైతులపై అనురాగము జూపని రాజులుండగా ఏల' వంటి ఆనాటి సినిమా పాటలూ బాగా పాడేవాణ్ణి' అని కూడా తను ఎలా గాయకుడైనదీ రేలంగి ఆ సభలో చెప్పడం జరిగింది.
అందుకే ఆయన అటు తర్వాత సినిమాలలో పాడిన పాటల్లో శృతి శుద్ధత వుండేది. తను వేసే పాత్రకు తగ్గట్టు కంఠస్వరం మార్చిపాడే పద్ధతి ఆయనది. హాస్యానికి, సంగీతానికి విడదీయలేని సంబంధం నెలకొల్పిన 'హాసం'గా ఆయన్ని కీర్తించవచ్చు. పరదేశి వంటి ద్విభాషా చిత్రాలలో గాజుల బేహారిగా తమిళంలో తీసిన 'పూంగోదై' చిత్రంలో కూడా రేలంగే నటించాడు అల అనక తమిళ చిత్రాలలో ఆయనకు పేరువచ్చింది.
షూటింగ్ విరామ సమయాలలో ఆయన సంభాషణలు గోష్ఠులు చాలా వినోద భరితంగా ఉండేవి ఒకసారి తన సాటి నటుడితో 'కొరియా యుద్ధం ఎంత వరకు వచ్చింది బాబూ 'అని అడిగాడు రేలంగి.' అదేమిటి! అది ఆగిపోయి అయిదేళ్లు దాటిపోయింది కదా' అన్నాడు ఆ నటుడు 'అది కాదు బాబు మొన్న అడిగితే ఎవరో గనోక్వెల్ దాకా వచ్చిందన్నారుగా' అన్నాడు రేలంగి 'గనోక్వెల్ ఏమిటి అది దగ్గు మందు కదా' అన్నాడు పాపం అమాయకుడు 'ఆ విషయం తమకు తెలుసో లేదో అనీ' అంటూ కొంటెగా నవ్వాడు ఆయన!
అగ్రశ్రేణి నటుడి స్థాయిలో హీరోలకు హీరోగా వెలిగిన రేలంగి చరిత్ర సినీ పురాణంలో ఒక స్వర్ణ పర్వం ఎందరో స్త్రీ పురుష తారల మధ్య రేలంగిని చూసి జన సముద్రం ఉప్పొంగిన సందర్భాలు అనేకం 'నాదేముంది బాబు అంతా ఆ తల్లిదే' అని కళా సరస్వతికి ఆయన నమస్కరించేవాడు మహానటి సావిత్ర అంటే ఆయనకు ఎంతో ప్రేమ, గౌరవం, అంతటి ఆర్టిస్ట్ లేదు, రాదు అనేవాడు అలాగే సి ఎస్.ఆర్ అన్నా అమిత గౌరవం. ఎప్పుడూ ఎంత చిన్న వాడినైనా నాయనా, బాబూ అని తప్ప సంబోధించి ఎరుగని నిగర్వి, వినయశీలి, సంస్కారి రేలంగి.
ఏ రంగ స్థలం నుంచి వచ్చి తాను మహానటుడైనాడో, స్టార్ గా వెలిగాడో ఆ రంగస్థలాన్ని ఆయన ఏనాడూ మరువలేదు. జీవితంలో చివరి దశలో సైతం చింతామణి వగైరా నాటకాలు ప్రదర్శించి తన అభిమానం చాటుకున్నాడు.
ఈ హాసయోగికీ, హాస్యరసయోగికీ ఇదే నా అంజలి.
(హాసం సౌజన్యంతో )
- వేటూరి సుందరరామమూర్తి
Shooting Lo Ting Ting
రావికొండలరావు
***********************
షూటింగ్ అంతే సినిమా షూటింగ్, టింగ్ టింగ్ అంతే ఆక్కడి జరిగే తమాషాలు, సరదాలు, కబుర్లు మొదలైనవన్నమాట.
సినిమాల్లో అవుట్ డోర్ ఇన్ డోర్ అనీ రెండు ఉంటాయి. ఆ రోజుల్లో స్టూడియోలో, ఫ్లోర్ లో షూట్ చేస్తే ఇన్ డోర్. బయట ఎక్కడి తీసిన అవుట్ డోర్. ఆ లెక్కలో చూస్తే ఇవాళ అన్నీ అవుట్ డోర్లే. స్టూడియోలో ఫోర్లోలో తక్కువ.అలాంటిదే ఒక అవుట్ డోర్ మద్రాసులో ఒకరింట్లో జరుగుతుంది.
ఆ ఇల్లు ఊరికి చివర. షూటింగ్ ఏమిటంటే ఆ ఇంటి ఇలాలు మరణించడం. ఆమెను పాడేమీద కట్టి తీసుకెళ్లడం. తక్కిన పాత్రలన్నీ బోరున ఏడవడం వగైరా. ఉదయం షూటింగ్. షూటింగ్ కి కావలసిన సరంజామా ఏడో గంటకి ఆ యింటి దగ్గర జేరవేయాలన్నారు. అందుకని, ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వెదుళ్ళతో కట్టిన పాడే, పాడె ముందు తీసుకెళ్ళి "నిప్పు ఉట్టి " సిద్ధం చేసి ఆ ఇంటి దగ్గరికి నాన్ లోకి తీసుకొచ్చారు.
అది పెద్ద ఇల్లు. కాంపౌండ్. పెద్దగేటు వున్నాయి. లోపల ఇంటి వాళ్ళున్నారు. గెట్ దగ్గర వాచ్ మెన్ కూడా వుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు వచ్చి గేటు కొట్టి పిలిచి అలసిపోయారు. ఇంట్లో వాళ్ళు ఇంకా లేవలేదు. వాచ్ మెన్ ఎక్కడికో పోయినట్టున్నాడు. ఇక లాభం లేదని, ఆ పాడెనీ, నిప్పుకుండనీ గేటు దగ్గర పెట్టేసి, ఇంకేవో సామాన్లు తీసుకురావడానికి ఆ సెట్టు అసిస్టెంట్స్, వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయారు.
ఏడున్నర ప్రాంతాలలో ఆ ఇంటికి ఎదురుగా వున్నవాళ్ళు ఒక్కొక్కరే నిద్ర లేస్తున్నారు. ఒక భర్త నెమ్మదిగా తన భార్యని గుమ్మంలోకి తీసుకువచ్చి ఎదురు గేటు చూపించాడు. ఆమె దిగ్గుమంది. ఆ భర్త కూడా ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. అలాగే ఇంకో ఇంటి వాళ్ళు గుమ్మంలోకి వచ్చి కంగారు పడ్డారు. వీళ్ళందరికీ గేటు పక్కనే ఉన్న పాడె, కుండ కనిపించాయి. అదంతా సినిమా షూటింగ్ సరంజామా అని వాళ్లకి తెలీదు.
" పాపం! నిన్నటిదాకా ఆయన నిక్షేపంగానే వున్నాడు. రాత్రికి రాత్రి ఏమైందో పాపం !"
" అది కాదే...ఆ ముసలావిడ, ఇంటి ఆవిడ తల్లి కాబోలు, ఆవిడకు చాలాకాలంగా సుస్తీటగా. ఆవిడ పోయిందేమో "
" ఆవిడ పోవడం ఏమిటండీ. నిన్న సాయంకాలం కూడా నాతో మాట్లాడితేనూ "
పొద్దున్నే వాళ్ళయింటికి పాలు తీసుకొచ్చిన పాలవాడు కూడా కంగుతిన్నాడు. ఇలాంటి సమయంలో పాలు ఇవ్వడమా మానడమా అని ఆలోచించి వెళ్ళిపోయాడు. పక్కఇల్లవాళ్ళు ఇక ఆగలేకపోయారు. ఎదురింటి వారి చుట్టాల్లో తమకు స్నేహితులైన వాళ్ళింటికి ఫోన్ చేసి అడిగారు. ఈ విషయం చెప్పారు.
మరి కాసేపటికి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పరామర్షకి బయలుదేరారు. వాచ్ మెన్ గేటు తీశాడు.
" ఏమైంది " అని అడిగారు నెమ్మదిగా. అతను ఇంకా నెమ్మదిగా " ఏంలేదే ?" అన్నాడు.
అందరూ దిగాలు పడుతూ లోపలికి వెళ్లారు.
" రండి రండి..ఏమిటి పొద్దున్నే వచ్చారు. ఎంత అదృష్టం! రండి కూర్చోండి. " అని అంది ఆ ఇంటి ఇల్లాలు.
వీళ్ళు మొఖాలు చూసుకున్నారు. ఎక్కడా విచారాలు లేవు. శవం వున్న సాక్ష్యం లేదు. మరి ఆ పాడె నిప్పుకుండ..? ఉండబట్టలేక అడిగారు ఆ పాడె అవి ఏమిటని.
" అదా సినిమా షూటింగ్ మా ఇంట చేస్తామన్నారు. అయితే అలాంటి సీను వుందని మాకు చెప్పలేదే " అన్నాడు ఇంటాయన. మొత్తానికి టీ కప్పులో తుఫాను చల్లారిపోయింది.ఎదురింటి పక్కింటి వాళ్ళు "అమ్మయ్య "అనుకున్నారు.
గేటు గలవాళ్ళు గేటు దగ్గరకు రాగా, సినిమాకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరూ కార్లు దిగుతున్నారు.అపార్థాలు కలిపించినందుకు, ఆ చర్యకూ ప్రొడక్షన్ వాళ్ళ మీద మండిపడ్డారు.
" పొరపాటు అయింది. ఇప్పటికిప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళలేం.క్షమించండి. ఎక్సూజ్, మన్నించండి " లాంటి మాటలన్నీ వాడి షూటింగ్ అవుననిపించుకున్నారు.
నవ్వించగల సెన్సార్రథం
1 వ భాగం
రావికొండల రావు
చాలా ఏళ్ళ క్రితం "శంకర్స్ వీక్లీ " లో ఓ కార్టూన్ పడింది. ఫిలిమ్ సెన్సార్ ఆఫీసులో, ఆఫీసర్ చేతిలో ఫిలిమ్ రీలు పెట్టుకని, కళ్ళు విశాలం చేసుకుని వెర్రి ఆనందంతో చూస్తూ వుంటాడు వెనకాల వున్నా గుమాస్తా! " సార్...ఈ సినిమా ప్రొడ్యూసర్లు నిరీక్షిస్తున్నారు కట్స్ చెబితే వెళ్లిపోతారట " అంటాడు.
" ఉండవయ్యా! ఈత దుస్తుల్లో వున్నఈ అమ్మాయిని కాస్సేపు చూసి కట్స్ చెప్తా " అని అంటాడు ఆఫీసర్.
" అందుకేనేమో చాలామంది సెన్సార్ బోర్డుమెంబర్లు కావాలని ప్రయత్నిస్తూ వుంటారు అన్ సెన్సార్డ్ సినిమాలు చూసేవాళ్ళు వాళ్ళే కదా !" అన్నారు సరదాగా పింగళి నాగేంద్రరావుగారు పానగల్ పార్క్ సమావేశంలో.
" వాళ్ళు చూస్తే చెడిపోరా ? మనం చూస్తే చెడిపోతామా ? అన్నారు ఆయనే చమత్కారం మిళాయించి హాయిగా పింగళి నవ్వు నవ్వుతూ. సినిమాలు పుట్టిన కొన్నేళ్ళదాకా సెన్సార్ గొడవలేదు. నిశ్శబ్ద చిత్రాలు యధాతధంగా విడుదలైపోయేవి. పైగా ఒక తమాషా ఏమిటంటే అమెరికన్ సినిమాల్లో అసభ్యత, ఆశ్లీతం ఎక్కువగా వుందని ఆ దేశంలో సెన్సారింగ్ వచ్చేసింది. మన దేశంలో లేదు గనుక సెన్సార్ కాని అసలు సిసలు సినిమాలే వచ్చి ఆడేటివి.
ఇంకేముంది. ప్రేక్షకుల కళ్ళకి కావలసినంత పంట! దీనిని ఆపకపోతే అది దేశ సంప్రదాయ వ్యవస్థని మత కలుపుతుందని సెన్సారింగ్ కావాలని పెద్దలు, పార్లమెంటేరియన్లూ (అప్పుడు వుండేవారు) పట్టుబట్టి ''సినిమెట్రో గ్రాఫ్ యాక్ట్ '' పేరుతో సెన్సారింగ్ ప్రవేశపెట్టారు. అది మనదేశ సినిమాలకి కూడా వర్తిస్తుందన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు, జిల్లా మేజిస్ట్రేట్లూ ఆ సినిమాలు చూసి ప్రజలు చూడతగ్గవి వుంచి తక్కినవి కోసిపారేసేవారు.
ఆ కోతలో కోయ్యబడిన సినిమాయే అసలు సినిమా. మనకింకో గొడవ కూడా వుంది. బ్రిటీష్ పాలన, స్వరాజ్య ఉద్యమం సినిమా ప్రభుత్వాన్ని విమర్శించరాదు. అందులో జాతీయ భావాలు ఉండరాదు. జాతి, మత వైషమ్యాలు కూడా వుండేవి గనుక ఒక హిందువు, ఒక ముస్లిమ్, ఒక విద్యాధికారి సెన్సార్ సమితిలో సభ్యులుగా వుండేవారు. జాతీయ భావాలున్న పుస్తకాన్నీ నాటకాల్నీ ఎలాగూ ప్రభుత్వం నిషేధించింది.
అంచేత పురాణ చిత్రాల్లోనే వీలైనంత వరకూ జాతీయ భావాలు వచ్చేలా (శబ్దరహిత చిత్రాలే) చూసుకునేవారు నిర్మాతలు. అప్పుడే ఒక తమాషా జరిగింది. ''భక్తవిదుర్'' 1921 లో అని భారత కథ సినిమాగా వచ్చింది. పురాణ కథ కదా అని ఏం పట్టించుకుంటార్లే అని విదురుడిని గాంధీజీలా తయారుచేశారు. మోకాళ్ళ మీదికి పంచె, కర్రతో వుంటాడు విదురుడు. తలమీద గాంధి టోపీ కోదా పెట్టారు.
విదురనీతులన్నీ జాతీయ భావాలతోనూ స్వరాజ్యానికి సంబంధించి వుంటాయన్నా మాట. శబ్దం లేదు గనుక కొంత అక్షరాల్లో చూపించారు. కొంత వ్యాఖ్యానింపజేశారు. సెన్సార్ వాళ్ళు ఆ సినిమా చూసి మొత్తం విదురుని కత్తిరించమన్నారు. అప్పుడా గాంధీ విదురున్ని తీసేసి భారత విదురుడిలాగా గడ్డాలూ మీసాలూ పెట్టి మళ్ళీ షూట్ చేశారట! హహహహహ..........హహహహహహహహహ....
"ఏమండోయ్ " అంటూ గావుకేక పెట్టింది సుబ్బలక్ష్మి.
"వస్తున్నా" అంటూ ధభీ ధభీమని శబ్దం చేసుకుంటూ పరిగెత్తుతూ వచ్చాడు సుబ్బారావు.
"ఏమాయ్యింది సుబ్బులూ..నీ వంట్లో బాలేదా? తలేమన్నా తిరుగుతోందా? ఉండు కాస్త కాఫీ పట్టుకొస్తాను స్థిమిత పడుదువు గాని" అన్నాడు భుజం మీద టవల్ దులుపుతూ
" ఓరి మీ కాఫీ దొంగల్ దోల.. మహ గొప్ప పగిలే వార్త విన్నా అండీ" అన్నది సు.ల(సుబ్బ లక్ష్మి)
"పగలే వార్త అంటే ఏమిటి"? అన్నాడు అమాయకంగా సు.రా(సుబ్బా రావు)
కిసుక్కున నవ్వి భర్త బుగ్గ మీద ఓ పోటు పొడిచి " ఎంత అమాయకపు ప్రాణి అండీ మీరు" అన్నది
"అందుకేగా నిన్ను చేసుకుని చస్తున్నా రోజూ.తెలివు ఉండుంటే ఏ ఎదురింటి అలివేలు మంగనో లేక పక్కింటి పంకజాక్షినో చేసుకునేవాణ్ణి" అని తనలో తను గొణుక్కున్నాడు సు.రా
" ఏమిటీ గొణుకుతున్నారు" అని గుడ్లురిమి చూసింది సు.ల
"అబ్బే ఏంలేదు ఉత్తిదే" అంటూ మొహం అష్టవంకర్లు పెట్టాడు సు.రా
"అసలే మీరు అష్టావక్ర దానికి తోడు అష్టవంకర్లు ఎందుకు తిరుగుతారు లెండి" అన్నది సు.ల
"నన్నిలా ఏడిపించడానికి పిల్చావా? అసలే కూర పడేఅసి వచ్చ పొయ్యి మీద, పోయి చూసుకుంటా వంట" అంటూ వెళ్ళబోయాడు సు.రా
"చాల్లేండి సంబడం" అంటూ భర్త రెక్కుచ్చుకు లాగింది సు.ల
"అబ్బా వదులు వదులు..నువ్విలాంటి జీవహింస చేస్తే నేనివాల్టినుండి వంటింట్లో వంట బంద్ ఆ తర్వాత నీ ఇష్టం" అన్నాడు సు.రా జబ్బ రుద్దుకుంటూ.
"సరే లెండి మరి కాస్త నేను చెప్పేది కూడ వినండి.. మొన్నటికి మొన్న "భస్మాన్ ఖాన్" ని మనిషిని చంపిన నేరానికి అరెస్ట్ చేశారు కదా?..నిన్నటికి నిన్న బొగ్గు కుంభకోణంలో , బొగ్గు లాంటి మనిషి "జూదరి" పై కేస్ వేశారు కదా?" అని ఆగింది సు.ల
"మరి ఇవాళ ఏమి జరిగినది?" అనడిగాడు సు.రా
"అవినీతి పరురాలై కోట్లకు కోట్లు మింగేసి ఆ నేరాన్ని తన బండి తోలిన పాపనికి డ్రయివర్ కి అంటగట్టిన పాపానికి ఆమెను అరెస్ట్ చేశారు" అని ఆగింది సు.ల
"ఓహ్ నిజమా?" అన్నాడు సు.రా.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది సు.లా.. నా విషయంలో ఇప్పటీకైన న్యాయం గెలిచి నాకు ఈ చెర నుండి విముక్తి కలిగితే బావుణ్ణు" అని వాపోయాడు సు.రా .
" అంటే నన్ను పెళ్ళిచేసుకోవడం పెద్ద నేరం మీ ద్రుష్టిలో..
"కాదా? ఓ అచ్చటా ముచ్చటా లేదు..మగ వెధవనయ్యుండి కూడా ఇలా వంటింట్లో వంటలు చేసుకుంటూ పెళ్ళానికి బానిసలా బ్రతుకుతున్నా..అక్కడ ఆఫీసులో మేనేజర్ ని ఇక్కడ వంటింట్లో ప్యూన్ గాడిని..ఛీ ఛీ నా బ్రతుకు చెడా" అంటూ వాపోయాడు సు.రా
" అమ్మో అమ్మో నన్నేనా ఇన్ని మాటలంటోంది..నేనెప్పుడన్నా మీ వంటకి వంక పెట్టానా లేక మిమ్మల్ని అవి తీసుకురా అవి తీసుకురా అని సాధించానా? ఇక్కడుంటే మీరు పడే కష్టం చూడలేక అత్తగారు బాధపడుతుంటే ఆవిడ మంచి కోసం ,మీ మంచి కోసం ఆవిడను వెళ్ళగొట్టానే, మీకు ఆ విశ్వాసమైనా ఉందా? ఆదర్శ పత్ని ని నన్ను ఎంతలేసి మాటలన్నారు? అంటూ ఆరున్నొక్క రాగం అందుకుంది సు.ల..
" ఆపుతావా నీ ఏడుపు. ఎవరన్నా వింటే నేను నిన్ను అష్టకష్టాలు పెడుతున్నాననుకుంటారు.." అనరిచాడు సు.రా
" అవుననువు నా బాధ మీకో లెక్ఖ కాదులేండి " అంటూ ముక్కు చీదేసింది సు.ల..
"ఈ దరిద్రమొకటీ మధ్యలో" అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళాడు సు.రా
సాయంత్రం కూరగాయలు కొనుక్కుని ఇంటి దగ్గరకొస్తుండగా పక్కింటివాళ్ళ కుక్క " జిమ్మీ" వచ్చి గేటు మీద ముగ్గెయ్యడానికి కాలెత్తింది.. అది చూసి వొళ్ళు మండిన సు.రా ఒక్క తన్ను తన్నాడు "జిమ్మీని"..కుయ్యో మొర్రో అంది జిమ్మీ
జిమ్మీ అరుపులకి బయటకొచ్చిన పక్కింటి పంకజం " జిమ్మీ" అని ఓ పొలికేక పెట్టి పరుగెత్తుకుంటూ వెళ్ళి జిమ్మీని తన చేత్ల్లోకి తీసుకుంది బావురు మంటూ..
సు.రా వైపుకి తిరిగి" నువ్వసలు మనిషివేన? కుక్కని ఇలా బాదుతావా? ఏదో తెలియక కాలెత్తితే నోరు లేని జీవాన్ని ఇలా పశువులా బాదుతావా? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా" అని లంగించుకుంది
సు.ర ఏదన్నా అనేలోపునే పక్కింటి పంకజం మొగుడు పా.రా( పాపా రావు) పరిగెత్తుకుంటూ వచ్చి " యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేయించి బొక్కలో తోయించకపోతే నా పేరు పాపా రావే కాదు" అని శపధం చేసి తొడ కొట్టాడు.. ఆ శబ్దానికి వాళ్ళింట్లో పార్క్ చేసున్న స్కూటీ పడిపోయింది
ఆ మర్నాడు యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు జంతు హింస చేసినందుకు గాను సు.రా మీద కంప్లెయింట్ ఇచ్చి అరెస్ట్ చేయించారు..కేస్ కోర్టుకి వెళ్ళినప్పుడు సదరు జడ్జ్ తన తీర్పు ఈ విధంగా వినిపించాడు
" సుబ్బారావనే ఈ ముద్దాయి మానవత్వాన్ని మరచి తన పశు ప్రవుర్తితో మూగ జీవంపై హింస చేసినందుకు, పంకజం అనే ఈమే తీవ్ర మనస్థాపానికి గురయ్యి మంచమెక్కింది.. ఆమె మంచమెక్కినందుకు ఆమె భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యి తన కంపెనీ లావాదేవీలు సరిగ్గా చూడకపోవడం వల్ల వారికి కొన్ని లక్షల్లో నష్టం వాటిల్లింది.. కావున ఇన్ని నేరాలను అవలీలగా చేసిన ఈ సుబ్బారావుకి ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష ఇంకా లక్ష రూపాయల జరిమాన విధించడమయినది..
అక్కడ భస్మాన్ ఖాన్ ని, జన పతిత ని, జూదరి ని కోర్టు నిర్దోషులుగా తీర్పు చెప్పింది.. అమాయకుడైన సుబ్బారావు జైల్లో పడేడుస్తుంటే కిరాతకాలు చేసిన వారు నిర్దోషులుగా విడుదలయ్యి స్వేచ్చగా తిరుగుతున్నారు..
జై హింద్!
....Madhu Addanki
ఈ మధ్య అందరూ ఏదో చాల బిజీ గా ఉంటున్నట్టు గమనించాడు సుబ్బరావు... ఎవ్వరినీ చూసినా మొబయిల్లో, కంప్యూటర్లో చాలా చాల బిజీగా ఉంటున్నారు.. ఆఫీస్లో కొలీగ్ అప్పుడప్పుడు మాట్లాడేవాడు అతను కూడ వీటిల్లో చాలా బిజీ అయిపోయాడు..అప్పుడప్పు నవ్వుతూ వెర్రి వెర్రి పోజులు పెట్టి తన ఫోన్లో ఫొటోలు తీసుకుంటున్నాడు కొలీగ్..ఇదంతా కంగాళీ గోంగూరలాగ అనిపించింది మన సుబ్బడికి..
ఇంట్లో కూడ అదే పరిస్థితి..భార్య తను చేసిన వంటలు ఎప్పటికప్పుడు ఫొటోలు తీసేస్తోంది... వంటల పుస్తకం కోసమేమో అని సరిపెట్టుకున్నాడు సుబ్బడు...కూతురు,కొడుకు కంప్యూటర్లో తెగ బిజీగా ఉంటున్నారు...
ఇక రోడ్డుమీద పోయేవాళ్లది కూడా అదే పరిస్థితి.ఎప్పుడూ ఫోన్లో చూడటమో లేక నవ్వుతూ ఫొటోలు దీగడమో...పనిమనిషి,పాలవాడు,రిక్షా తొక్కేవాడు,ఆటో తోలే వాళ్ళు,లారీ డ్రైవర్స్,బస్ డ్రైవర్స్,స్కూటరిస్ట్స్ ఒకరేమిటి ప్రపంచమంతా తమ తమ ఫోన్లల్లో బిజీ..ఇదేదో అంతుచిక్కని ప్రశ్నలా తయారయ్యింది సుబ్బడికి...అసలీ ఈ కధా కమామిషూ ఏంటో తెల్సుకోవాలనుకున్నాడు..
ఒక రోజు పొద్దున్న లేవగానే కార్యక్రమాలు పూర్తిచేసుకుని కాఫీ కోసమని వంటగదిలోకి వెళితే అక్కడ పొగలు సెగలు కక్క్తున్న కాఫీ కప్ ముందెట్టుకుని నవ్వుతూ తన ఫొటో తీసుకుంటోంది భార్య రమణి...చూడగానే చిర్రెత్తుకొచ్చింది సుబ్బడికి
"పొద్దుపొడిచిందగ్గరనుంది పొద్దుపొయ్యేదాకా ఏమిటీ ఫోన్లల్లో నువ్వు ఈ ఫుటోస్ తీసుకోవడం?
అసలెందుకు తీస్తున్నావు" అనడిగాడు సుబ్బడు..
"ఫేస్బుక్ లో అప్లోడ్ చెయ్యడానికి" అంది రమణి..
"డవున్లోడ్ గురించి విన్నాగాని ఈ అప్లోడ్ ఏంటి" అన్నాడు సుబ్బడు..
భళ్ళున పగిలిన శబ్దం అయ్యింది..కంగారుగా తన చేతిలోని కప్పు కేసి చూసుకున్నాడు సుబ్బడు ...ఉహూ కప్పు అలానే ఉంది మరి ఏది పగిలిందబ్బా అనుకుంటూ చుట్టూ చూసేసరికి నోరింతలావు తెరిచి నవ్వుతూ ఫుటో తీసుకుంటూ కనిపించింది రమణి..
ఇంక కోపం భరించలేక ఒక్క రంకె వేశాడు సుబ్బడు..
ఆ రంకె విని అయ్యో బయట గేటు వేసుందో లేదో? గేదేమన్నా దూరిందా అనుకుని బయటకి పరుగెత్తబోయిన రమణిని రెక్కుచ్చుకుని ఆపి కింద కూలేశాడు సుబ్బడు..
"గేదలు,ఆవులు లేవు గాని కోపం లో నే పెట్టిన రంకె అది" అన్నాడు...
"మీరా "అంటూ బోల్డాశ్చర్యపోయింది రమణి.."ఏది మళ్ళీ అలా రంకెట్టండి ..మీ వాయిస్ రెకార్డ్ చేసి అప్లోడ్ చేస్తా ఫేస్బుక్ లొ....రంకె మొగుడు...అని కాప్షన్ పెట్టి" అంది..
హారి భగవంతుడా నాకు పిచ్చెక్కేట్టుంది అనుకుని జుట్టు పీక్కోబోయాడు..మళ్ళా అలా పీక్కునేటప్పుడు పిచ్చి మొగుడు కాప్షన్ తో ఫొటో అప్లోడ్ చేస్తుందేమో అన్న భయం వేసి జుట్టు పీక్కోవాలన్న ప్రయత్నం మానుకున్నాడు..
ఇంకలాభం లేదనుకుని భయాన కుదరదు కాబట్టి నయానా,బుజ్జగించి అసలు సంగతి తెల్సుకోవాలనుకున్నాడు సుబ్బడు..
"రమణీ హి హి హీ" అని నవ్వుతూ పిలిచాడు..
"ఏమిటండీ" అన్నది రమణి...
"మరేమ నువ్వీ మధ్య ఫోన్లల్లో ఫొటోలతో బిజీ,పిల్లలు కంప్యూటర్లో బిజీ మా ఆఫీస్ లో ప్రతి ఒక్కడు ఫోన్లల్లో ఫొటోస్ తీసుకోవడంలో బిజీ..అసలు సంగతేంటి? ఏమిటిదంతా" అనడిగాడు సుబ్బడు..
అతన్ని పిచ్చివాడిని చూసినట్టు ఒకసారి చూసి..."మీకు తెలియదా ఎందుకో" అనడిగింది రమణి..
"నిజ్జంగా అమ్మ తోడు నాకు తెలియదు" అన్నాడు సుబ్బడు..
"అయితే వినండి,నేను బాబి గాడు,చిట్టిది,మన పాలవాడు,బడ్డీ కొట్టు వాడు ఒక్కరేమిటి సమస్తం జనాలు బిజీగ ఉంటున్నది " ఫేస్బుక్" తో" అన్నది రమణి.
"ఫేస్బుక్ అంటే" అనడిగాడు సుబ్బడు..
ఈయనకి నిజ్జంగా పిచ్చిలేదుకదా అనుకుని "ఫేస్బుక్ అంటే కంప్యూటర్ లొ ఒక సయిట్..అక్కడ మనం ఎంతమందినో కలవచ్చు మన ఫుటోస్ పెట్టుకోవచ్చు ఒక్కటేమిటి మనం చే సే సమస్తమైన పనులు అందులో పెట్తచ్చు,మన ఏమనుకుంటున్నామో,ఎక్కడికి వెల్తున్నామో అసలెందుకు బతుకుతున్నామో ఇలాంటివన్నీ పెట్టొచ్చు.."అన్నది రమణి..
"దీని వలన ఏమిటి లాభం "అనడిగాడు సుబ్బడు...
అనుమానం లేదు ఈయనకి పూర్తిగా పిచ్చెక్కింది అనుకుంది రమణి..."ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండీ.. ఈమధ్య అన్ని చోట్లా ఫేస్బుక్ అ.యిడి.వాలీడ్...ఫేస్బుక్ లో నే పిల్లల కాండక్ట్ చూస్తారు..ఫేస్బుక్లోనే రిపోర్ట్ కార్డ్లు ఇస్తారు..అసలు ఫేస్బుక్ అ.యిడి ఉంటే గాని హాస్పిటల్ లో అప్పాయింట్మెంట్ కూడ ఇవ్వట్లేదు...అంతెందుకు ఫేస్బుక్ అ.యిడి లేకుంటే మన పాలవాడు పాలు కూడ పొయ్యడు తెల్సా "అంది...
"అవునా ఫేస్బుక్ అంత పవర్ఫులా" అనడిగాడు సుబ్బడు.. అంతే ఫేస్బుక్ అంటే ఏమిటి,వాటి ఉపయోగాలు,మిగితా కధా కమామీషు అంతా దంచి కొట్టింది రమణి..అలా దంచుతున్నప్పుడే ఫొటో తీసి అమాయకు భర్త కి తెలివైన భార్య కాప్షన్ పెట్టి వారిద్దరి ఫొటో అప్లోడ్ చెసింది...
"చూడండి మన ఫుటో కి ఎన్ని లైకులు వచ్చాయో" అని చూపించింది రమణి...
ఫేస్బుక్ లో తన అకవుంట్ ఓపెన్ చేసుకోకపోతె తన పరువు నిలబడేట్టు లేదు అనుకున్నాడు..
"రమణీ మరి నాకు కూడ ఫేస్బుక్ అకవుంట్ తెరవాలని ఉంది ఎలాగో చెప్తావా" అనడిగాదు..
ఓకే అంటూ ఒక చిందేసింది రమణి..ఆ మేరా ఫ్లోరింగ్ కదిలినట్టనిపించింది సుబ్బడికి...ఫేస్బుక్ లో ఇంత పవరుందా అనుకున్నాడు..
మొత్తానికి ఆ ఉదయాన సుబ్బడి అకవుంట్ తెరిచారు...సు.రావు అన్న పేరుతో.. తన పేరు చాల వరయిటీ గ ఉందనుకుని మురిసిపోయాడు సుబ్బడు...
అకవుంట్ ఒపేన్ చేశాక అక్కడ ఏమేమి ఉంటాయో ఎలా చేయాలో అంతా పూసగుచ్చినట్టు వివరించింది రమణి...కొంతమందిని ఫ్రెండ్స్ గా యాడ్ చేసింది...ఇంకొన్ని గ్రూపుల్లో జాయిన్ చేసింది సుబ్బడిని.. ఆనందంతో పొంగిపోయి ఒక రంకె వేశాడు సుబ్బడు..
ఛీ పాడు గేదెలు అంటూ బయటకు పరిగెత్తబోయిన రమణిని జబ్బుచ్చుకుని మళ్ళా ఆపేశాడు సుబ్బడు...
మళ్ళా రంకె వేయమని అతని రంకెని రికార్డ్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి " టేక్ ద రంకె ఛాలెంజ్" అని పోస్ట్ పెట్టింది...
..ఆ తర్వాత సుబ్బడు రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళిపోయాడు..
ఆఫీస్ లో అడుగెట్టాడో లేదో హాహాకారాలు,రంకెలూ వినబడ్డాయ్... బాబోయ్ ఏమయ్యిందో అనుకుని లోపలికెళ్ళేటప్పటికి అందరూ రంకెలు ,హాహాకారాలు వేస్తున్నారు..ఏమయ్యిందండీ అని తన కొలీగ్ని అడిగాడు సుబ్బడు..
"ఏమి లేదు సుబ్బారావు...నీ రంకె ఛాలెంజ్ ని మేమందరమూ ఆక్సెప్ట్ చేశాము..సో రంకెలేస్తున్నాం" అన్నాడు...
వెంటనె కంప్యూటర్ ముందు కూర్చుని తన ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాడు సుబ్బడు..
100 లైకులు వచ్చాయి ప్లస్ ఛాలెంజ్ ని చాల మంది తీసుకున్నాట్టు తెలిసింది..
అంతే ఆనందం ఆపుకోలేక ఒక్క రంకేశాడు సుబబ్డు..వెంటనే ప్యూన్ మెయిన్ గేట్ మూయడానికి వెళ్ళిపోయాడు ఆఫీస్లోకి బర్రేమన్నా వచ్చిందేమో అని..
అలా రంకె ఛాలెంజ్ తో మొదలయ్యింది సుబ్బడి ఫేస్బుక్కాయణం..
నెమ్మది నెమ్మదిగా ఫొటోస్ అప్లోడ్ చెయ్యటం తన కెన్ని లైకులొస్తున్నాయో చూసుకోడం..లైకులు తగ్గితే బాధ పడటం, తన కనా వేరొకరికి లైకులెక్కువ వస్తె కుళ్ళుతో దహించుకుపోవడం లాంటివిమొదలయ్యాయి..
తను ఉన్న గ్రూపులన్నింటిలో ఏదో ఒక పోస్టులు పెట్టడం..సంబంధం లేనివనా సరే...
పిచ్చి గీతలు గీసి కళాళండమని వంటల గ్రూపులో పోస్ట్ చెయ్యటం...
కపిత్వం రాసి పాటల గ్రూప్లో పోస్త్ చెయ్యటం..
తన గార్ధభ స్వరంతో రాగాలు ఆలాపించి వార్తల గ్రూపులో పోస్టు చెయ్యడం ఇలాంటివాటిల్లో ఆరితేరిపోయాడ్ సుబ్బడు..
ఏ చోటికెళ్ళినా చెక్ ఇన్ స్టేటస్ పెట్టాల్సిందే...
చేతిలో పాప్ కార్న్ తో థియేటర్ మెట్ల మీద నుంచుని పోస్ కొడుతూ..
కూరగాయల సంచీతో మార్కెట్లో ఫుటో దిగుతూ
ఆఫీస్ లో వర్క్ అంటూ..
నేటివిటీ అంటూ తన ఊరి పొలం గట్టు మీద నుంచుని ఫుటో దిగుతూ కాలువలో జారిపడినా..స్లిప్పయ్యానోచ్ అంటూ ఫుటో..
మధ్య మధ్యలో తల నొప్పితో ఉంటే ఫీలింగ్ పెయింఫుల్ అని...
అసిడిటీ తో కడుపు మండుతుంటే ఫీలింగ్ బరంట్ అని స్టేటస్ లు పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సుబ్బడు...
ఇలా ఉండగా ఫీలింగ్ లకీ అంటూ ఒక స్టేటస్ పెట్టి.....చెకెడ్ ఇన్ యట్భీమాస్ లాడ్జ్ అని పెట్టాడు..తరువాత తిరుమల అంతా బోడిగుండుతో ఫోటోలు దిగుతూ అప్లోడ్ చేశాడు...
దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకుని ఇంటి కొచ్చి తలుపు తీసేటప్పటికి గుండె జారి గల్లంతయ్యింది...
ఇల్లంతా పూచిక పుల్లతో సహా దోపిడీ చేశారు...
ఎలా జరిగిందీ దారుణం అనుకుంటూ పోలీసులకి కంప్లయింట్ ఇస్తే తీరిగ్గా వచ్చిన పోలీసులు వేసిన మొదటి ప్రశ్న "మీకు ఫేస్బుక్ అకవుంట్ ఉందా" అని?
ఉంది అన్నారు సుబ్బడు,రమణి..
"మీరు స్టేటస్ అప్ డేట్పెట్టారా" అనడిగాడు ఇన్స్పెక్టర్..
"పెట్టాం" అన్నారు..
"మీ ఇంట్లో దోపిడీ జరగటానికి మీరే కారణం....మీరిలా అప్డేట్లు పెట్టి ఎప్పుడు ఎక్కడికి వెల్తున్నారో ఎప్పుడొస్తున్నారో పెట్టి దొంగలకి కావలసినంత వెసులుబాటు కల్పించారు"...అన్నాడు ఇన్స్పెక్టర్..
ఫేస్బుక్ తో ఎంత ఘోరం జరిగిందిరా గోవిందా గోవిందా అనుకున్నారు సుబ్బడు,రమణి..ఆ తరువాత జీవితంలో ఫేస్బుక్ మొహం చూడలేదు....
...........Madhu Addanki
వోటుకి పోటు ఏంటి అనుకుంటున్నారా..ఆగండాగండి..కధలోకి కూతంత తొంగి చూడండి.
అనగనగా " తింగరి" కాలనీ.. అక్కడ ఉన్న ఆడంగులందరూ కలిసి " పోసుకోల్" మహిళా మండలిని స్థాపించారు...ఇల్లు,వాకిళ్ళు వదిలేసి అమ్మలక్కలందరూ కష్టపడి ఆ మండలి అభివ్రుద్ధికి తమ వంతు తాము సాయం చేశారు..అంత్టి ప్రతిష్టాత్మకైన ఆ మండలికి ఆ సంవత్సరం అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ సారి పారా చంద్రమ్మ, ఇంకా చెత్తకుంట్ల చందనా రాణి పోటీ చేస్తున్నారు..
ఇద్దరూ ఇద్దరే..హేమా హేమీలే.. ఎలాగైనా సరే తమ బలం తాము నిరూపించుకోడానికి తెగ ఉర్రూతలూగుతున్నారు.. మహిళా మండలి కార్యవర్గం రెండుగా చీలిపోయింది. కాలనీ వాసులు కూడా దాదాపుగా చీలిపోయారు.. మధ్యస్థంగా ఉన్న కొద్దిమంది మాత్రం చోద్యం చూస్తున్నారు.
ఎలెక్షన్ల టయిం దగ్గరపడే కొద్దీ ఎటువంటి ఎత్తు వేసి అవతల వారిని చిత్తు చేద్దామా అని ఆలొచిస్తున్నారు..చంద్రమ్మ తన ముఠాతో, చందన తన ముఠాతో గూడుపుఠానీ నడుపుతున్నారు..ఇటువంటి పరిస్థితులలో చంద్రమ్మకి కుడి భుజమయిన రేవతిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారన్న వార్త కలకలం రేపింది.
ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియని అయోమయ పరిస్థితి.."వోటుకి పోటు" కారణం మీద అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి.. కాలనీ పోకిరీలు గోడల మీద చంద్రమ్మ అరెస్ట్ గురించి వార్తలు రాశారు.. అందరూ ఒక్కసారి బిత్తరపోయారు ఏంటిది ఎందుకిలా జరిగింది అని.
ఇంతకీ జరిగిందేమిటంటే చందనా రాణి ముఠాలోని కొద్ది మందిని తమ వైపు తిప్పుకుందామన్న ఆలోచనతో రేవతి ప్రత్యర్ధి గ్రూప్లోని ఒక సభ్యురాలు స్టెఫనీ ని కలిసింది.. కలిసి రోకలిపోటుతో దంచిన బియ్యంతో చేసిన నేతి అరిసెలు ఒక 500 ఇస్తానని ఆశ చూపింది.. అసలే అరిసెలంటే ఉన్న మక్కువ చేత స్టెఫనీ అందుకు వొప్పుకుని తన ఇంటికి ఆహ్వానించింది రేవతిని...
200 అరిసెలు ముందుగా అందివ్వడానికి వెళ్ళిన రేవతిని స్కెచ్ వేసి పట్టుకున్నారు పోలీసులు...అదంతా తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసింది స్టెఫనీ.. పోటు అరిసెలతో తమ సభ్యులని కొనడానికి పారా చంద్రమ్మే ఈ స్కెచ్ వేసిందని, ముందుగా పారా చంద్రమ్మని అరెస్ట్ చేయాలని చెత్తకుంట్ల చందనా రాణి ఇంకా ఆమె సభ్యులు డిమాండ్ చేశారు.. పోలీసులపై వత్తిడి తెచ్చారు..స్టెఫనీ ఇంట్లో దొరికింది 200 వందల అరిసెలే కాబట్టి మిగితా 300 అరిసెల కోసం పోలీసులు వెతుకులాట మొదలెట్టారు..
పోలీసులు తమ వంతు దర్యాప్తు తము సాగించారు.. ముందుగా కాలనీలో అందరిళ్ళు సోదా చేశారు.. ఆండాళ్ళు ఇంట్లో ఒక యాభై అరిసెలు దొరికాయి.. ఆండాళ్ళు కంగారు పడుతూ అవి మేము ఆర్డెర్ ఇచ్చి చేయించుకున్న అరిసెలు మా ఇంటిఫంక్షన్ కి అని గగ్గోలు పెట్టింది..
తరువాత పూటకూళ్ళమ్మ ఇంటికెళితే అక్కడ ఒక రెండు వందల అరిసెలు దొరికాయి.. మేమే అరిసెలు చేసి అమ్మేది..నేనే మాన్యుఫాక్చురర్ కం డీలర్ ని..నన్ను మీరు అరెస్ట్ చెయ్యలేరు..చట్టం వొప్పుకోదు అంటూ ఐ.పీ.సీ సెక్షన్ల లిస్ట్ చదివింది.. ఆ లిస్ట్ కి దిమ్మ తిరిగి పోలీసులు వేరే ఇంట్లోకి చొరబడ్డారు...అక్కడ బియ్యపు పిండి, బెల్లం కనిపించింది..పూటకూళ్ళమ్మ ఆర్డరిస్తే పోటు బియ్యంపిండి మేమే కొట్టాము మాకు తెలియదు మమ్మల్నిన్వాల్వ్ చెయ్యొద్దు అని మొరపెట్టుకున్నారు వాళ్ళు.
ఎక్కడ వెతికినా అరిసెలు దొరకలేదు పోలీసులకి.. అరిసెలు చంద్రమ్మ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చంద్రమ్మని అరెస్ట్ చేయాలని చందనా రాణి డిమాండ్ చేసింది..
అరిసెలకి నాకు ఎటువంటి సంబంధం లేదు.. నా ఇమేజిని డామేజ్ చేసినదుకు చందనా రాణి ని అరెస్ట్ చేయాలని పారా చంద్రమ్మ ఎదురు కేస్ వేసింది.."పోసుకోల్" మహిళా మండలి "వోటుకి పోటు" వివాదం ఊరంతా పాకింది, మీడియాకి ఎక్కింది.. వెంటనే చానెళ్ళ వాళ్ళు వచ్చి కాలనీ మీద పడ్డారు.. కనిపించిన ప్రతివాడిని, ఇంటర్వ్యూ చేసి పారేశారు.. దీని మీద " దుమ్ము రేపుతా" టీ.వీ స్టూడియోలో "ముఖా ముఖి" , బిగ్ డిబేట్ లాంటివి నిర్వహించారు ఇంకా ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోడానికి యస్ అంటే ఒక నంబర్, నో అంటే ఇంకో నంబర్ కి కాల్ చెయ్యమని విజ్ఞప్తులు చేశారు.
ఈ గొడవ ముదిరి ముదిరి పాకాన పడీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమ ద్రుష్టిని సారించాయి.. చంద్రమ్మ వెనక కొన్ని రాజకీయ పార్టీలు, చందనా రాణీ వెనక కొన్ని రాజకీయ పార్టీలు చేరాయి. చందనా రాణి కి అవినీతి స్కాం లో పీకలోతు కూరుకుపోయిన జగన్మాత తన పూర్తి సహకారాన్ని అందిస్తానంది..చంద్రమ్మకి నేషనలిస్ట్ పార్టీ కి సంబంధించిన నాయకులు భరోసా ఇచ్చారు..ఈ సమస్య దేశ పార్లమెంట్ దాక చేరింది.. దేశ అధ్యక్షునితో కలవడానికి చంద్రమ్మ ఢిల్లీ వెళ్ళింది..ఢిల్లీ చేరిన చంద్రమ్మ నేషనలిస్ట్ నాయకులందరికీ నేతి అరిసెలు పంచింది.. వారతా అరిసెలంటే ఉన్న మక్కువ చేత ఆనందంగా అరిసెలు తిన్నారు..అయితే అసలు పోటు అరిసెల స్కాం ఎలా జరిగింది అనడగగా అరిసెలు నావి కావు..చందనా రాణి ముఠాలోని సభ్యుల దగ్గర నుండి పట్టుకున్నవి.. నాకు షుగర్ ఉంది కాబట్టి తీపి పదార్ధాలు నేను తినను అంటూ వెర్రి నవ్వు నవ్వుతూ మెలికెలు తిరిగింది చంద్రమ్మ.అలా మెలికెలు తిరిగీ తిరిగీ తన గోడు చెప్పుకుని ఘొల్లుమ్నది.. ఢిల్లీలోని ఏ ఒక్క శాఖ కూడ వారమ్రోజులు పనిచెయ్యలేదు.. ఆవారం రోజులు చంద్రమ్మ గోడు విన్నాయి శాఖలన్నీను..నువ్వుఇలా గగ్గోలు పెట్టకు నీకు మా వంతు సహకారం చేస్తామని వాళ్ళు భరోసా ఇచ్చాక శాంతించింది ఆ తర్వాత ఆనందంగా ఇంటికి చేరుకుంది..
ఓ పక్క చందనా రాణి తనదైన శైలీలో చంద్రమ్మని అమ్మనా బూతులు తిడుతూ, చంద్రమ్మ ముఠాలోని సభ్యులందరినీ ఏదో ఒక కేస్లో ఇరికించి మొత్తానికి ఎలెక్షన్ లో గెలిచింది..ఈ వోటమి తట్టుకోలేక, తనపైన వచ్చిన తప్పుడు కేసులని వదిలించుకోలేక చంద్రమ్మకి మతి భ్రమించి దేశదిమ్మరిలా తిరుగుతోంది.
ఇదండీ వోటుకి పోటు..ఎప్పుడైనా ఎవరైనా "హోం మేడ్ అరిసెలంటే" పొరపాటున కూడ ఆ వైపు చూడకండే...
...........Madhu Addanki
ఉస్సూరంటూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రామారావు...తలబద్దలయిపోతొంది కాస్త కాఫీ పడేస్తావా అంటూ అరిచాడు రామారావు... ఎక్కడా చప్పుడు లేదు..ఎమయ్యింది అబ్బా అంకుంటూ లోపలికి తొంగి చూశాడు..టీ.వీ ఎదురుగా యోగా మాట్ వేసుకుని ఏదో ఆసనం వేయడానికి నానా తిప్పలు పడుతోంది భార్య గజలక్ష్మి..
గజం అంటూ నెమ్మదిగా పిలిచాడు ..ఉహూ పలకలేదు..ఆసనం వేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యింది..గజం అని పెద్దగా పిలిచాడు..ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఏంటన్నట్టు..
మొగుడనేవాడు ఆఫీస్ నుండి వస్తాడు వాడి మొహాన కాస్త కాఫీ నీళ్ళన్నా పోద్దామనే యోచన ఉందా అని అరిచాడు రా.రా( రామారావు)
ఏమండీ ఇంత కష్టపడి నేను ఆసనాలు వేస్తున్నా కదా..ఆ కాఫీ ఏదో మీరు కలుపుకుని నాకూడా కాస్త పడెయ్యొచ్చుకదా అంది గజం..
ఏమి అనే ఓపిక లేక బలవంతంగా పళ్ళు నూరుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకున్నాడు రా.రా
కాఫీ సరే ఏమి అవండి తగలేసిందో అనుకుంటూ గిన్నెలన్నీ మూతలు తీసి చూశాడు..గిన్నెలన్నీ ఖాళీ..
కోపం నషాళానికి అంటి చిందులు తొక్కడం మొదలెట్టాడు ధన ధన ధన అంటూ..భూకంపం,భూకంపం అంటూ భూమి అదిరేలాగా పరుగులెడుతూ గజం బయటకి వెళ్ళబోయింది...గజం రెక్కుచ్చుకుని ఆపేశాడు రా.రా అది భూకపం కాదు కోపంలో నేను తొక్కిన చిందులకి భూమి అదిరింది అని చెప్పాడు..
ఎందుకలా చిందులేశారు అనడిగింది గజం..ఎందుకా ఆకలేస్తోంది ..ఎమన్నా ఉందేమో తినటానికి అని చూస్తే ఏమీ లేదు..రోజంతా ఏమి చేశావ్ వంట కూడ చెయ్యకుండా అనరిచాడు రా.రా..
ఇవాళ నుండి నేను డయటింగ్ చేస్తున్నా...నాతో పాటు మీరు కూడ చేస్తున్నారు నాకు నైతికంగా మద్దతిస్తున్నారు అన్నది..
ఆ నేనొప్పుకోను అని అరిచి మళ్ళా చిందెయ్యబోయాడు రా.రా..రెక్కుచ్చుని లాగింది గజం..చేయి ఊడిపోయిందేమో అన్నంత నొప్పి పుట్టింది రా.రా కి.. సరే చిందెయ్యను కాని ఇంకెప్పుడూ ఇలా రెక్కుచ్చుకుని లాగకు..అర్భకుడిని తట్టుకోలేను అన్నాడు..
గజం....హి హి హీ అని పిలచాడు..
ఏంటీ అన్నట్టుగా చూసింది గజం...ఆకలేస్తోంది గజం అన్నాడు..
సరే ఉండండి తెస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది.. ఈ లోపల టీ.వీ ఆన్ చేసి పిలుస్తుందేమో అని చూస్తున్నాడు..ఇంతలోపల ఒక పళ్ళెం నిండా ఆకు కూరలు ఇంకో పళ్ళెం నిండా కూరగాయ ముక్కలు పెట్టుకొచ్చింది
అదేంటి ఇప్పుడు వంట చేస్తావా అనడిగాడు రా.రా..
హి.హి.హీ అని నవ్వుతూ ఒక్క జెల్లకాయిచ్చింది రా.రా కి మీరు భలే జోకులేస్తారు అంటూ..ఇవి వంట చెయ్యడానికి కాదు తినటానికి అంది..
పక్కలో బాంబ్ పడ్డట్టు అదిరిపడ్డాడు రా.రా.. ఏమిటీ ఈ గడ్డి ఇప్పుడు నేను తినాలా? అవునండీ మరి నేనేమో నోరుకట్టుకోలేను.... నేను డయటింగ్ చేస్తున్నప్పుడు మీరు మామూలు తిండి తింటే ఇంక నా డయటింగ్ సాగినట్టే అందుకని నాతో పాటు మీరు కూడ డయటింగ్ అన్నది గజం..
హతవిధీ ఎంత దెబ్బ కొట్టావే అనుకుంటూ దిక్కులేని పక్షిలాగా ఒక్కసారి ఆ కాయగూరలవైపు చూశాడు...
ప్లీస్ తినరూ అంటూ బుంగమూతి పెట్టింది గజం..
ప్లీస్ అలా బుంగమూతి పెట్టకు గజం ..మామూలుగానే నిన్ను చూడలేను మళ్ళా ఆ బుంగమూతి కూడ ఎందుకు అన్నాడు..
మీరు భలే చిలిపి అంటూ చళ్ళున చరిచింది గజం..
ఇదో ఇలా చీటికి మాటీకి నువ్వు తోలు ఊడొచ్చేలా చరిచావంటే నేను ఈ తింది తినను బయటనుండి పిజ్జా తెప్పించుకుని తింటా అని బెదిరించాడు..
ఆ రోజు నుండి మొదలయింది జీవహింస రా.రా కి...ఒకరోజు పచ్చి కూరలు,ఇంకో రోజు ఉడికించిన కూరలు..అందులోను ఉడికించిన బెండకాయ..(అది తినలేక వాంతి చేసుకున్నాదు పాపం.)ఇంకో రోజు కేవలం కూరగాయల జూస్..కాకర,బెంద,పుదినా ఇలాంటివి.. వీటన్నింటికి తోడు రోజూ 5 కిలోమీటర్ల నడక,ఆసనాలు వగైరా వగైరాలు..
ఈ డయటింగ్ వల్ల గజలక్ష్మి అంగుళం కూడ తగ్గలేదు కాని రా.రా మాత్రం బక్కచిక్కి పోయి,పేగులు,ఎముకలు బయటపడి అస్థి పంజరం లాగ యాడు.. ఒకరోజు ఉన్నట్టుంది ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయాడు... కొలీగ్స్ హాస్పిటల్ కి వేసుకుపోయారు...అతనికి సర్వ రకాల పరీక్షలు చేసి దాక్టర్ చెప్పాడు..ఇతను తిండి తిని చాలా రోజులయినట్టుంది ముందు కడుపు నిండా భోజనం పెట్టండి అని... అలాగే దాక్టర్ అంటూ గుడ్ల నీరు కుక్కుకుని తలూపింది గజం...
కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చిన రా.రా కి కనిపించిన ద్రుశ్యం ఏంటంటే ఒక ప్లేట్ నిండా పకోడీలు,ఇంకో పళ్లెంలో బర్గర్ పెట్టుకుని భోంచేస్తీంది గజం...
గజం ఏంటి నువ్వు డయటీంగ్ మానేశావా అనడిగాడు రా.రా.. లేదండీ డయటీంగ్ చేసి నోరు చచ్చిపోయింది అందుకని అప్పుడప్పుడు ఏదొ వారానికి 5 సార్లు మాత్రమే ఇవి తింటుంటాను అన్నది..
హా అంటూ విరుచుకు పడిపోయాడు రా.రా....
ఇదండీ గజలక్ష్మి డయటింగ్ కధ...
మీరందరూ కూడ డయటింగ్ పేరుతో కనిపించినవల్ల ట్రై చేయకుండా ,కడుపు కాల్చుకోకుండా పౌష్టికాహారం తీసుకుని ,వ్యాయామం చేయండి...
..........Madhu Addanki
" మార్కా ఆర్ట్స్" అప్పుడప్పుడే పైకొస్తున్న ఒక ప్రొడక్షన్ కంపెనీ.. దాని అధినేత నిర్మాత విభు ఆలుగడ్డ... ఈ ఆలుగడ్డ ఫ్లాపులెరగని ధీరుడు, క్రేజ్ ఉన్న గొప్ప దర్శకుడు "చంద్రమౌళి" తో సినిమా తీద్దామనుకుంటున్నాడు.. సినిమా గురించిసంభాషణ ఇలా ఉంది.
"చంద్రమౌళిగారు మీరు గొప్ప పేరున్న దర్శకులు ... మీకున్న క్రేజ్ ని ఉపయోగించుకుని కనీ వినీ ఎరుగని రీతిలో ఒక గొప్ప సినిమాని చెయ్యాలి..అది అన్ని రికార్డులు బద్దలు కొట్టాలి..ఎలా చేద్దాం చెప్పండి" అన్నాడు ఆలుగడ్డ.
" ఆలుగడ్ద గారు సినిమా అంటే కట్టె,కొట్టె , తెచ్చె..ఒక హీరో ,ఒక పవర్ఫుల్ విలన్, ఒక పవర్ఫుల్ సపోర్టింగ్ ఖారెక్టెర్ , ఒక అందమైన హీరోయిన్, అద్భుతమైన లొకేషన్స్.. ఇవుంటే చాలు సినిమా తీసెయ్యొచ్చు.సాధారణంగా అన్ని సినిమాల్లో హీరోదే సినిమా అంతా కాని మన సినిమాలో విలందే ముఖ్య పాత్ర ఇంకా సపోర్టింగ్ ఖారెక్టెర్ ది. అదే మన సినిమా స్పెషాలిటీ" అన్నాడు చంద్రమౌళి.
" మరి కధ?" అనడిగాడు ఆలు.
"అన్ని సినిమాల్లోను కధ ఉంటుంది..అసలు కధే లేకుండా సినిమా తీసి విజయవంతం చెయ్యడం మన స్పెషాలిటీ" అన్నాడు మౌళి.
" అసలు కధే లేకుండా సినిమా తీస్తే అసలు ఆడుతుందంటారా? ఇన్ని కోట్లు పెట్టి సినిమా నిర్మించే నేను , పూరి గుడిసెలోకి మారాల్సి వస్తుందేమో" అంటూ నసిగాడు ఆలు.
" నాకున్న క్రేజే మీ సినిమాని ఆడిస్తుంది.. మీడియాలో బిల్డప్పులిచ్చి, అగ్రెసివ్ మార్కెటింగ్ చేసి, ఇప్పుడొస్తోంది, అప్పుడొస్తోంది అంటూ ఊరించి మొదటి వారం కలెక్షన్లు వచ్చేల చూసుకుంటే చాలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి.." అన్నాడు మౌళి.
"సరే కాని అసలంటూ ఏదో కధతో నడిపించాలిగా సినిమా మొత్తాన్ని?" అన్నాడు ఆలు..
"మీరేమి దిగులుపడకండి మా ఇంట్లో వండి వడ్డిస్తారు" అన్నాడు మౌళి
"అంటే ఇప్పుడు మీ ఇంట్లోనా లంచ్? వెల్దాం పదండి" అన్నాడు ఆలు.
"మా ఇంట్లోనే కధని వండి వారుస్తారు...మీకు భోజనం కాదు" అని విసుగ్గా ఆలు వైపు చూశాడు మౌళి.
"మీ ఇంట్లో వండి వార్చేవాళ్ళు ఎవరబ్బా?" అన్నాడు ఆలు.
"ఇంకెవరు మా నాన్నగారే..ఆయన ఖాళీగా కూర్చుని తనకొచ్చిన పిచ్చి పిచ్చి ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకుంటారు.. అందులోంచి మనకి నచ్చిన పాయింట్లు మనం ఏరుకుని కధ రాయమంటే ఏదో టూకీగా అల్లేస్తారు..దానిని మనం 3 గంటల సినిమాగా సాగదీయొచ్చు" అన్నాడు మౌళి..
"సంగీతం, మాటలు, కాస్ట్యూంస్, రీరికార్డింగ్, ఎడిటింగ్, కాస్టింగ్ ఇవన్నీ?" అనడిగాడు ఆలు
"బయ్ 1 గెట్ ఫ్యామిలీ ఫ్రీ" ఆఫర్ నాది.కధ: నాన్న, సంగీతం: అన్న, కాస్ట్యూంస్: నా భార్య, ఎడిటింగ్: కజిన్, కాస్టింగ్: కొడుకు, రీరికార్డింగ్ : చెల్లి, స్క్రీంప్లే, దర్శకత్వం: నేనే" అన్నాడు మౌళి
"మరి హీరో, హీరోయిన్ల మాటేఅమిటి "అనడిగాడు ఆలు
"అక్కడికే వస్తున్నా.. ఈ మధ్య వరసగా మూడు హిట్లు కొట్టిన మన కండల హెరో విభాస్ ని తీసుకుందాం. "అన్నాడు మౌళి
"అతనికి డయలాగ్ డెలివెరి లేదు కదా పవర్ఫుల్ రోల్ కి పనికొస్తాడంటారా?"అన్నాడు ఆలు
డయలాగ్ డెలివెరీ లేకున్నా ఎక్స్పెషన్స్ లేకున్నా ఫర్లేదు, కండలు చూపించి, రెండు మూడు ఫైట్స్ పెడితే చాలు, లాగించెయ్యొచ్చు" అన్నాడు మౌళి
"కాని రెండు మూడు ఫైట్లతో, కండలు చూపించే రెండు మూడు సీన్లతో సినిమా మొత్తం ఎలా లాగిస్తారు "అన్నాడు ఆలు అయోమయంలో
" అందుకే కదా ఒక పవర్ఫుల్ విలన్ ఇంక పవర్ఫుల్ సపోర్టింగ్ ఖారెక్టర్స్ ని పెట్టేది" అన్నాడు మౌళి.
"సరే సినిమా టైటిల్ ఏమి పెడదాం" అన్నాడు ఆలు.
"మహాబలి" అన్నాడు మౌళి.. ఇది ఒక పీరియాడిక్ మూవీ గా తీద్దాం.. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు కత్తి కాంతారావు, యన్.టీ.ఆర్ సినిమాలు చూశాం ఇలా ..ఇది కూడా అలాంటి సినిమా అనే కవరింగ్ ఇవ్వొచ్చు.. అందుకే రెండు మూడు కత్తి యుద్ధాలు పెట్టాలి." అన్నాడు మౌళి.
"సరే ముందు కధ రానీయండి అప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడొచ్చు" అన్నాడు ఆలు.
"ఆశ దోశ అప్పడం వడ..అదేం కుదరదు ముందు బడ్జెట్ ఫిక్స్ అయ్యాకే కధా కాకరకాయానూ" అన్నాడు మౌళి.
"సరే మరి బడ్జెట్ ఎంతో చెప్పండి" అన్నాడు ఆలు.
"వంద కోట్లు" అన్నాడు ఠక్కున మౌళి..
"వంద కోట్లా" అంటూ అవాక్కయ్యాడు ఆలు..నావల్ల కాదండీ మరీ వందకోట్లంటే నేను తూగలేను" అన్నాడు ఆలు.
"ఇండియాలోనే అతి ఖరెదైన సినిమాగా దీనిని నిర్మింద్దాం.. సినిమాకి హైపుని, క్రేజ్ ని క్ర్యేట్ చేసి మీ పైసలు మీకొచ్చేటట్టు చేస్తా.. ఒకేసారి 4 భాషల్లో విడుదల చేద్దాం మీరేమి దిగులుపడకండి. డిస్ట్రిబ్యూటర్ గా మన ఖళ్ రాజు ఉండనే ఉన్నాడు. హాళ్ళన్నీ మన భల్లు బల్వింద్ దగ్గర, వీరేశ్ బాబు దగ్గర ఉన్నాయి ..వారే రిలీస్ చేస్తారు.. మీకెందుకు భయం" అంటూ ఆలూ ని వొప్పించాడు మౌళి..
అలా వొప్పించాక విభస్ కి కబురెడతారు.. విభాస్ పరిగెత్తుకుంటూ ఆయాసపడి మరీ వాలతాడు ఆలు దగ్గర. మౌళి సినిమా అనంగానే గెంతేస్తాడు విభాస్.. ఓటమే ఎరుగని దర్శకుడి సినిమాలో, భారతదేశంలోనే అతి ఖరీదైన సినిమాలో నటీంచే అవకాశం తనకే దక్కిందని మురిసి ముక్కలైపోయాడు విభాస్.
తరువాత మిగితా కాస్టింగ్ అంతా జరిగి ఒక శుభముహూర్తాన సినిమా షూటింగ్ మొదలవుతుంది.. షూటింగ్ మొదలయ్యాక విభాస్ వేరే ఏ సినిమా చెయ్యటానికి వొప్పుకోలేదు.. అలా రెండేళ్ళు గడిచేసరికి విభాస్ కి టెన్షన్ మొదలయ్యింది. ఈ సినిమా చూడబోతె అయ్యేలా లేదు..వచ్చిన మిగితా ఆఫర్స్ అన్నింటినీ వదులుకున్నాడు..ఈ సినిమా ఒకవేళ ఫట్ అయితే తన కరీయర్ సమూలంగా ఫట్ అవుతుందని దిగులు చెందుతున్నాడు..అతను తప్ప మిగితా అందరూ ఆనందంగా షూటింగ్ చేశారు..ఆ సినిమాలో హీరో, విలన్ ,నిర్మాత, దర్శకుడు తప్ప మిగితా అందరు పక్క రాష్ట్రం వారే.
తరువాత మార్కెటింగ్ వాళ్ళు తమ ప్రతిభ తాము చూపెట్టారు.. అగ్రెసివ్ గా మార్కెటింగ్ చేసి నెట్ లో హల్చల్ చేశారు..భారతంలోనే తై గొప్ప సినిమా మన తెలుగు వారు తీయడం మన అద్రుష్టం /గొప్పదనం అంటూ.
సినిమా విడుదలకి ముండే సదరు ఖళ్ రాజు మెజారిటీ హాళ్ళల్లో టికెట్స్ కొనేసి వాతీని బ్లాకులో 5 వేలకి అమ్మించడం లాంటి చిచ్చోరా పన్లు చేసి లక్షలకి లక్షలు లాభాలు ఆర్జించాడు..ఇకపోతే సినిమా రిలీస్ అయ్యింది భారీ హంగామా తో.. మార్నింగ్ షో చూసిన జనాలు పెదవి విరిచారు.. నెగటివె టాక్ వచ్చేసింది.అసలు కధ అన్నది లెకౌండా సినిమా తీశారని..సినిమా చూసిన ప్రేక్షకులకి అర్ధం కానిది ఒక్కటే ఇంతకీ సినిమాలో "మహాబలి" ఎవరన్నది? విభాస్ ఆ, విలనా లేక కామ్య క్రిష్ణ నా అని?
వెంటనే సినిమా యూనిట్ ఒక ప్రెస్మీట్పెట్టింది.. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఒక ఖరీదైన సినిమాని మన తెలుగు వాళ్ళు తీశారని.మా కష్టం చూశైనా మీరు జాలిపడి సినిమా చూడండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాళ్ళ బాధని అర్ధం చేసుకున్న ప్రజలు పాపం కష్టపడ్డారులే అని తమవంతు సాయంగా సినిమాని చూడాలని తపన పడి సినిమా చూసి నిరాశ చెందారు..
సినిమాకి క్రియేట్ చేసిన క్రేజ్ వల్ల, మార్కెటీంగ్ వల్ల, హైప్ వల్ల వసూళ్ళ వర్షం కురిపించింది.. నిర్మాత, దర్శకుడు, విలన్ ఇంకా మిగితా నటీ నటులు అంతా హ్యాపీ.. ఒక్క విభాస్ తప్ప. సినిమా మెగా బ్లాక్బస్టర్ అయ్యి భారత దేశంలోనే రికార్డులు బ్రేక్ చేసినా అతనికి దుఖమే మిగిలింది . ఎందుకంటే ఆ సినిమాలో అతని కన్నా విలన్ కి, కామ్య క్రిష్న కి పేరొచ్చింది.. ఈ సినిమా ఎందుకు వొప్పుకున్నానా అని దుఖంతో కుమిలిపోతున్నాడు విభాస్..
.......Madhu addanki