వజ్రం, శుక్రగ్రహమునకు ప్రీతిప్రదం. “వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి" అనడంలోనే వజ్రం ఎంత గట్టిదో తెలుస్తుంది. దేవేంద్రుడి ఆయుధం 'వజ్రాయుధం ప్రయోగిస్తే ప్రత్యర్థి ముక్కలు కాక తప్పదన్నది పురాణాలలోని విశేషం. అలా నవరత్నాలలో ప్రత్యేక స్థానాన్ని, అన్నింటికన్నా విలువైనది గానూ గుర్తించబడిన 'వజ్రం' తెల్లగా మాత్రమే వుంటుందని అనుకుంటారు, తెలుపులోనే కాదు, పసుపు, ఎరుపు, నీలం, నలుపు, రంగుల్లోనూ వజ్రాలు దొరుకుతాయి. ఇది తక్కిన రత్నములలో శ్రేష్ఠమైనది, గట్టిది, కావున దీనిని సంస్కృతమున పురుష రత్నమని, తెలుగున మగ మాణిక్యమని వ్యవహరిస్తారు.
“తెలుపగు వజ్రము సుకృతం
బలవడు కెంజాయ వజ్ర మది వశ్యము శ్రీ
గలిగించు బీత వజ్రము
నలుపగు వజ్రంబు జనుల నాశము జేయున్"
తా: తెలుపు వన్నెగల బ్రహ్మణ జాతి వజ్రము పుణ్యపురుషార్ధములను కలుగజేయును. ఎరుపు వన్నెగల క్షత్రియజాతి వజ్రము సర్వజన వశీకరణము కలుగజేయును. పచ్చని కాంతిగల వైశ్యజాతి వజ్రము ఐశ్వర్యమును కలుగజేయును. నల్లని కాంతిగల శూద్రజాతి వజ్రము ప్రాణసంకటము కలుగజేయును.
రత్నములు బలాసురుని వలన పుట్టినవని కొందరు, దధీచి మహాముని వలన పుట్టినవని కొందరు, స్వయంగా భూమియందు పుట్టిన రాళ్ళలో చిత్రమైన రాళ్ళే రత్నములని కొందరు చెప్పుతారు. మెరుపు వంటి కాంతి, కలిగి శాస్త్రోక్తమైన లక్షణములు గలిగిన వజ్రమును దాల్చిన రాజు సామంతరాజుల నెల్ల ధన పరాక్రమము లచే జయించి భూమిని పరిపాలించును.
రేఖా బిందు రహితములగు వజ్రములు పురుషులు, రేఖాబిందుయుక్తములు నారంచును గలవి స్త్రీలు, మూడు కోణములు కలిగి మిక్కిలి పొడవైనవి. నపుంసకములు, వీటిలో పురుష వజ్రములు రసబంధనము చేయును, శ్రేష్ఠముగా యుండును, స్త్రీ వజ్రములు శరీరకాంతి నొసంగును, స్త్రీలకు సుఖము నిచ్చును, నపుంసకవజ్రములు వీర్యహీనములు, కామహీనములు, బలహీనములు నగును. స్త్రీ వజ్రము స్త్రీలకు, నపుంసకవజ్రము నపుంసకులకు ఇవ్వవలెను. పురుష వజ్రములు అందరూ ధరింపదగినవే.
వజ్రములోని దోషాలు:
కాకపదము: కాకి పాదము వలె నల్లని చారలు కలిగినది
ముండ్రిమా: కాంతి లేకుండా మురికిగా వున్నవి.
వజ్రం విలువను '4 సి' క్లారిటీ, క్వాలిటీ, క్యారెట్స్ తో పాటు కటింగ్ కూడా వజ్రం విలువని నిర్ణయించే ఒకానొక క్వాలిటిగా మారిపోతుంది. వజ్రం తాలూకు అందం డానికి కట్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కంటింగ్ వలననే రత్నం పై భాగం కింది భాగాలలో కాంతి పరావర్తనం చెందుతూ ట్రాన్స్ పరెన్సీ తాలుకూ అందాన్ని అందిస్తుంది.
పదిహేనవ శతాబ్దం మధ్యలో అష్టకోణముఖం వజ్రాలను సరికొత్త కటింగ్ విధానంలోనికి తీసుకురావడం ప్రారభమయింది, 18వ శతాబ్ద ప్రారంభంలో ఆధునాతన బ్రిలియంట్ కట్ మొదలైంది, వజ్రాన్ని మూడు భాగాలుగా విభజించిచూస్తారు. అందులో ఒకటి క్రౌన్ రెండు గర్ డిల్ మూడు పెవిలియన్ ఇరవయ్యోశతాబ్దం ప్రారంభంలో వజ్రానికి బ్రిలియంట్ కట్ చేసి ప్రస్తుతం మనకు అందే రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. దాంతో వజ్రం ఎక్కువ కోణాలలో కాంతిని ప్రతిఫలిస్తూ... చెదిరిపోవడం జరుగుతుంది.
1880 సం||లో హెర్రీమోల్సాన్ అనే పరిశోధకుడు, పేరాఫిన్ బోన్ ఆయిల్, లిథియయ్ ఉపయోగించి 60 లక్షల పౌన్ల ఒత్తిడి వద్ద ప్రయోగశాలలో కృత్రిమ వజ్రం తయారు చేశారు. అయితే అది విఫలమయింది. ఆ తరువాత అనేక పరిశోధనలు జరిగాయి. 1955 ఫిబ్రవరి 16వ తేది జనరల్ఎలక్ట్రిక్, న్యూయార్క్ వారు 50000 (27600 సి) వద్ద కర్బనాన్ని వజ్రంగా తయారు చేసి ఈ ప్రయోగంలో సఫలీకృతులయ్యారు. ఈ తయ్యారీ విధానం చాలా ఖర్చుతో కూడినది.
వజ్రాలు దొరకు ప్రదేశాలు:
సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ గనులు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఘనా, సిరియా, జైర్ బోట్స్ వానా, రష్యా, ఆమెరికా, ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, గుంటూరు జిల్లా కొల్లూరు వజ్రకరూర్లను, మధ్యప్రదేశ్ లోని పన్నా మైన్ లోను లభిస్తున్నాయి. ఇవి ముఖ్యమైన గనులు కాగా నదీ తీరపు గనులలో నీటి ప్రవాహంతో వచ్చే వండ్రుతో కలిసి కూడా ఎక్కువగా లభిస్తున్నాయి, ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన గనులు గోల్కొండ గనులుగా పేరుగాంచాయి. ప్రపంచంలో చెప్పబడిన ప్రసిద్ధమయిన వజ్రాలు ఈ గనులలో లభించినవే.
వజ్రం కటింగ్ ప్రక్రియ ఒకటి లేదా రెండు స్టేజీలోనే పూర్తయిపోవాలి. వజ్రాన్ని కటింగ్ చేయడం ఎక్కువ సమయం పడుతుంది. అమ్ స్టర్ డామ్, న్యూయార్క్, ముంబాయి, కేప్ టౌన్, టెల్ అవీవ్ తదితర మహానగరాలలో ఖరీదైన వజ్రాలను కటింగ్ చేస్తుండగా శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, బ్రెజిల్, ఇజ్రాయిల్ లోని మారుమూల ప్రాంతాలలోని కొన్ని చోట్ల తక్కువ ఖరీదు రత్నాలను కటింగ్ చేయడం జరుగుతుంది.
ప్రపంచంలో అమూల్యంగా చెప్పుకోబడే వజ్రాలు ప్రస్తుతం వివిధ దేశాలలో ప్రభుత్వం అధీనంలోనే వున్నాయి. ఇలా అమూల్యమైన వజ్రాలలో కొన్నింటిని చూస్తే-
కోహినూర్ వజ్రం:
ప్రపంచంలోనే అత్యంత విలువ గల పెద్ద వజ్రంగా పరిగణించబడే కోహినూర్ వజ్రం తెలుగు వారి అమూల్య సంపద, గోల్కొండ రాజ్యంలోని కొల్లూరు గనిలో దొరికినది. ఈ వజ్రం, పారశీక భాషలో కోహినూర్ అనగా 'కాంతిపర్వతం' అని అర్ధం. 105 క్యారెట్లతో 21.6 గ్రాముల బరువు ఉంటుంది. ఖీల్జీ సేనాని కపూర్ తో కాకతీయ ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని క్రీస్తుశకం 1310 లో ఢిల్లీ సుల్తాన్ కి ఈ మాల్యాలను జయించిన అల్లావుద్దీన్ ఖిల్లీ దీన్ని సొంతం చేసుకున్నాడు. 1526 లో వజ్రం బాబర్ వశం అయింది. మొఘల్ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన నాదిర్ షా ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. మహ్మద్ షా విలువైన వజ్రాన్ని నాదిర్ షాకి ధారాదత్తం చేశాడు, నాదిర్ షా దాన్ని చూడగానే కోహ్ - ఇ- నూర్ 'కాంతి శిఖరం' అని వర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ వజ్రం చరిత్రలో పలు వివాదాలకు కారణం అయింది. హిందూ రాజులకు, పారశీక రాజులకు మధ్య ఈ వజ్రం గురించి యుద్ధాలు జరిగాయి. చివరికి ఈ వజ్రం బ్రిటీష్ వారికీ దక్కింది. 1877 లో విక్టోరియా మహారాణి హిందూ దేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినప్పుడు ఆమె కిరీటంలో ప్రధానమైన వజ్రంగా పొదగబడింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కోహినూర్ వజ్రం చుట్టూ పలు కతలు, కథనాలు అల్లబడ్డాయి. ఇది ధరించినచో మగవారికి శాపంగాను, ఆడవారికి మేలు చేకూర్చేదిగా దీని గురించి చెప్తారు.
కులినాన్ వజ్రం:
ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన వజ్రాల్లో అత్యంత బరువైనది ఈ కులినాన్ వజ్రం. 3106 క్యారెట్లు వజ్రం నుండి కట్ చేసి, పాలిష్ చేసి, ట్రిమ్ చేసి, ఈ 530, 20 క్యారెట్ల వజ్రాన్ని తయారు చేస్తారు, 'స్టార్ ఆఫ్ ఆఫ్రికా' గా పిలువబడే ఈ వజ్రం అది వెతికి పట్టుకున్న మైనింగ్ కంపెనీ చైర్మన్ సర్ థామస్ కులినాన్ పేరుతో గుర్తింపు పొందింది. చివరికి ఈ వజ్రం కూడా బ్రిటిషర్స్ చేతికే చిక్కి ప్రస్తుతం లండన్ లో భద్రపరచబడింది.
సెంటినరీ వజ్రం: 247 ముఖాలతో మెరిసిపోయే దీని బరువు 273.85 కారట్లు.
ఐడల్ ఐ వజ్రం: రాణి రషితాను టర్కీ సుల్తాన్ ఎత్తుకు పోయినప్పుడు కాశ్మీర్ షేక్ ఈ వజ్రాన్ని ఇచ్చాడని ఒక కథ ఉంది. దీని బరువు 70.20 కారెట్లు.
రీజెంట్ వజ్రం: హైదరాబాద్ లో గోల్కొండ వద్ద 1701 సంవత్సరాలలో లభించినట్లు చెప్పే ఈ 140.5 కేరెట్లు వజ్రం ఒకప్పుడు ఫ్రాన్స్ రాజు 15వ లూయిస్ కిరీటంలోను, నెపోలియన్ చక్రవర్తి కత్తి పిడిలోను ఉండేదని చెబుతారు.
బ్లూహోప్ వజ్రం: హెచ్.టి.హోఫ్. అనే బ్యాంకర్ ఈ 44.50 క్యారెట్ల వజ్రాన్ని కొనుగోలు చేయడంతో దీనికి "హోప్ వజ్రం"గా పేరు వచ్చింది. ఆ తరువాత ఫ్రెంచి రాజు 15 వ లూయిస్ దగ్గరకు చేరింది. ఇది ప్రస్తుతం వాషింగ్ టన్ లోని స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ లో వుంది.
సాన్సీ వజ్రం: ఇది 55 క్యారెట్స్ ఉండే వజ్రం. 1490 వరకు చార్లెస్ అనే రాజు వద్ద ఉన్న ఈ వజ్రం ఆ తర్వాత కాలంలో ఓ ఫ్రెంచ్ అంబాసిడర్ చేత కొనుగోలు చేయబడింది. ఆ రాయబారి పేరు 'సాన్సీ" తోనే ఇది ప్రసిద్ధి చెందింది. 1906 లో ఈ వజ్రం ఇంగ్లండ్ లోని 'ఆస్టర్' అనే కుటుంబ ఆస్తిగా మారింది.
టేలర్ బర్డన్ వజ్రం: ఒక్కప్పుడు ఎలిజబెత్ రాణి కంఠహారంలో ఉండే 69.42 కేరెట్ల వజ్రాన్ని 1979 లో 3 మిలియన్ల అమెరికన్ డాలర్లకు వేలం వేశారు, ఇది ప్రస్తుతం సౌది అరేబియాలో ఉందని భావిస్తున్నారు.
హార్టెన్సియా వజ్రం: నెపోలియన్ సవతి కూతురు, హాలెండ్ రాణి పేరు మీద ప్రాచుర్యం పొందిన ఈ 20 కేరెట్ల వజ్రం, 14 వ లూయిస్ కొన్న దగ్గర్నుంచి ఫ్రెంచ్ రాజుల కిరీటాలను అలంకరించింది. ప్రస్తుతం ఇది పారిస్ లో వుంది.
“షా" వజ్రం: ఈ వజ్రం భారతదేశంలో లభించిన అపురూప వజ్రం దీని బరువు 88.7 కేరెట్స్ చాలా తక్కువగా పాలిష్ చేయబడిన ఈ వజ్రం అనేకసార్లు చేతులు మారి చివరికి ఇరాన్ రాజు చేతికి చేరింది. ఆయన వద్ద చాలా కాలం వరకు వున్న ఈ వజ్రం 1892లో 'నికోలస్'కి బహుమానం ఇవ్వబడింది. చివరకి ఈ అరుదైన వజ్రం మాస్కో చేరి. ప్రస్తుతం క్రెమ్లిన్ లో వుంది.
టిఫాని వజ్రం: సౌత్ ఆఫ్రికాకు చెందిన కింబర్లీ మైన్స్ నుండి సేకరించబడిన ఈ వజ్రం మొదట టిఫాని అనే నగల వ్యాపారి దీనిని తీసుకుని 52 స్క్వేర్ పీసెస్ గా మార్చాడు.
ప్లోరెంటైన్ వజ్రం: 137.27 క్యారెట్ల ఈ డైమండ్ ఎవరి ద్వారా సేకరించబదినదో తెలియదు కానీ, 1657 ప్లోరెన్స్ కి చెందినా 'మదీసి' కుటుంబానికి చేరింది. ఆ తరువాత 18 వ శతాబ్దంలో హాబ్స్ బర్గ్ రాజు కిరీటాన్ని అలంకరించింది. కాని మొదటి ప్రపంచయుద్ధం నుండి ఈ వజ్రం కనిపించడం లేదని అంటారు.
డ్రెస్ డెన్ వజ్రం: భారతదేశంలో ఒక గనిలో ఇది దొరికింది. 1700 సంవత్సరంలో "త్యూక్ అగస్టా" దీనిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డ్రెస్ డెన్ లోని గ్రీన్ హల్ ఈ వజ్రం ఉంది.
వజ్రమునకు ఇతర నామాలు:
కుంఠము, కులిశము, గిరికంఠము, గిరిజ్వరము, చిదకము, నిర్ఘాతము, పులకము, వజ్రము, హీరము. మగమాణిక్యం, రవ్వ, మూలరాయి, వజ్జిరము అనే నామాలు ఉన్నాయి.
లక్షణాలు:
జాతి -డైమండ్,రకాలు - డైమండ్; వ్యాపారము - డైమండ్; విదేశీయ నామము - హిరా, వజ్రం; రసాయన సమ్మేళనం - Cl శుద్దమైన కర్భనము; స్ఫటిక ఆకారము - క్యూబిక్; స్పటిక లక్షణం - ఆక్టాహైడ్రాన్, ట్విన్స్; వర్ణం - వివర్ణం, పసుపు మరియు భ్రౌన్; వర్ణమునకు కారణం - నైట్రోజన్ అంతర్గత మలినాలు మెరుపు - ఎడ్ మంటిన్; కఠినత్వము - 0; ధృడత్వము - గుడ్; సాంద్రత – (S.G)3.52, ఏకలేక ద్వికరణ ప్రసారం; పగులు - శంకు ఆకృతి; స్టెప్; అంతర్గత మూలకాలు కార్బన్, స్ఫటికాలు, కాంతి పరావర్తన స్ఫటిక -(R I) 2.418; అతినీలలోహిత కిరణాల పరీక్ష – బలహీనం; సాదృశ్యాలు - మోజోనైట్, సిజడ్.