ఏడురంగుల సమ్మేళనమే మన శరీరం. ఈ రంగులలో ఏ ప్రాథమిక రంగు మనలో లోపించినా, ఆ లోపం కారణంగా మనం అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. రంగు కిరణాల లోపం కారణంగా మనలో వ్యాధులు వచ్చే అవకాశముంది. ఒక వ్యక్తిని సూర్య చంద్రుల ప్రభావం పడకుండా ఒకచోట ఉంచినప్పుడు ఆ వ్యక్తికి కొన్ని చర్మవ్యాధులు, మరికిన్ని అనారోగ్య లక్షణాలు కనిపించి తీరుతాయి. కాబట్టి గ్రహాల కిరణాలు మనిషిని తాకుతాయని, అలా తాకడం అవసరమని మనకు అర్థమవుతుంది.
ఈ కాస్మిక్ రేస్ లో కొన్ని మనిషి మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి జన్మ, నామ నక్షత్రాలను అనుసరించి కొన్ని గ్రహాల ప్రభావం అతడి మీద ఉంటుంది. ఆయాగ్రహాల ప్రభావం వలన అతడికి అందే కాస్మిక్ రేస్ కారణంగా అతడికి అనారోగ్యం వస్తుంది. ఐతే, ఆయా గ్రహాలకు సంబంధించిన ప్రత్యేక రత్నాలు ధరించడం వలన గ్రహాల నుండి అందే కిరణాల వడపోత జరిగి, ఉపయోగకర కిరణాలు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల నుండి అందే కిరణాల ప్రభావం ఎక్కువ కావచ్చు, లేదా అసలు ప్రభావితం చూపకపోవచ్చు. కాని రత్నం ఆ కిరణాలను న్యూట్రలైజ్ చేసి సరిపడేంత మోతాదులో శరీరానికి గ్రహాల కిరణాల ప్రభావం అందిస్తుంది. కాబట్టి రత్నాలలో దోషాలు వాటి లక్షణాలను తెలుసుకుంటే దోషాలు లేని రత్నాలు ధరించడం వలన ప్రయోజనం ఉంటుంది.
భారతీయ సాహిత్యములో తొమ్మిది సంఖ్యకు అగ్రస్థానమున్నది. నవబ్రహ్మలు, నవరసాలు, నవగ్రహాలు, నవధాన్యాలు, నవనిధులు, నవఖండాలు, నవ ఆత్మ గుణములు, నవ గ్రహదేశములు, నవ చక్రములు, నవదుర్గలు, నవ రత్నాలు మొదలైనవి దీనికి తార్కాణం.
ప్రాచీన కాలం నుండి భారతదేశం "రత్నగర్భ" అని పేర్కొనబడుతూ ఉంది. రోమన్ చరిత్ర కారుడు "ప్లీవీ" ప్రపంచ దేశాలన్నింటిలో హిందూదేశమే ఎక్కువ రత్నాలను ఉత్పత్తి చేస్తుంది అని ప్రాచీన కాలంలోనే వ్రాసాడు. మన ప్రాచీన గ్రంథాలలో రత్నాల పేర్లు తెలుపడమే గాని, వాటి గుణగణాలు, ఉపయోగాలు, మంచి చెడ్డ జాతులను విడదీసి వివరాలు ప్రథమంగా బుద్ధభట్ట "రత్నపరీక్ష" అనే గ్రంథం వ్రాశాడు. తరువాత వరాహమిహిరుడు "బృహత్సంహిత" లోనూ చాలా విషయాలు వ్రాసారు. “రసజలనిధి" అనే గ్రంథంలో రసాయనిక తత్వాన్ని గూర్చి బాగుగా వివరించబడింది.
మహారత్నాలయిన వజ్రం, నీలం, కెంపు, పుష్యరాగం, పచ్చ వీటిని పంచరత్నాలంటారు. వైడూర్యం, గోమేధికం, పగడం, ముత్యం వీటిని ఉపరత్నాలంటారు. రత్నాలలో ఎక్కువ విలువైనది వజ్రం. దీనిని రత్నరాజ మంటారు. వజ్రాలు, పచ్చలు. కెంపులు, నీలాలు ఇవి నిజరత్నాలు. వీటిని ఉత్తమ జాతివిగా భావిస్తారు. కావున ఎక్కువ విలువగలవి, మధ్యమజాతి రత్నాలు, ఆకారపు వయ్యారాలు, కోత పనితనాలు, స్వచ్ఛతయూ కలిగిఉండినచో, ఆ అతిశయం వలన విలువగలవిగాను, తక్కినవి అధమజాతులు చాలా ఉన్నాయి.