సరిరాశి - స్థిరరాశి - వాయుతత్త్వ రాశి - ఈ రాశి చిహ్నము ఒక జల కుంభము (కుండ)ను ధరించిన మానవుడు.
విస్తృతి, నవజీనము విశాలతత్వము, పరస్పరత్వం, సూక్ష్మపరిగ్రహణ శక్తి వీరి వ్యక్తిత్వానికి మూల సూత్రాలు. ఒక నిర్దిష్ట లక్ష్యానికి ఉన్ముఖమైన ప్రణాళిక గల జీవితమూ వీరిది. వీరి శక్తిని వీరు త్వరగా గమనించుట వీరి జీవితమును సద్వినియోగ పరుచును. సామాన్యమానవునీలోని భావనలను నాగరికతను అనుకూలంగా మార్చగల శక్తి వీరికున్నది. మానవ నిర్మితమైన ప్రస్తుత వ్యవస్థపై వీరికి తీరని అసంతృప్తి యుండును. కుంభరాశిలో పుట్టినవారు చట్టమును పునర్నిర్మించగలరు.
తర్కమునకు సంబంధించని చక్కని జ్ఞాన ముండును.లక్ష్య శుద్ధి,సత్యగ్రహణము వీరికుండును. ఏదైనా వార్కి యీ విధంగా ఉండవలెనని ఆనిపించినచో అది అట్లే యుండును. వ్యక్తులను, సంఘటలను గురించి వీరికి మొదట తోచిన భావములు సరియైనవి కానీ వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ. చర్చించి, విమర్శించి, చేసిన నిర్ణయాలు సత్య దూరాలుగా ఉంటాయి. వీరి సమస్యలన్నీ వీరెక్కువగా ఆలోచించుట వలన కలుగుతున్నాయి. పరిసరవ్యక్తుల భావం వలన వీరు ప్రభావితులవుతారు. పరిసరాలు అనుకూలమైన వీరు శక్తివంతులుగానూ, కార్యసాధన సమర్థులుగను తయారగుదురు. అప్పుడు వీరి దార్శనిక జ్ఞానం శంకగా, భీతిగా, నిరుత్సాహంగా బాధపడుదురు. అనుకూలం లేని వ్యక్తుల మధ్యనున్నచో వీరి మనస్సు వేదన చెంది, పిచ్చిచేసినట్లుగా యుందురు. ఎక్కడి పనులక్కడ విడిచి దూరంగా పారిపోవ యత్నిస్తారు.
మత, సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సమస్యలు, జాతీయ, అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించు రంగములు వీరికి జయప్రదములు.విద్యాసంస్థలను నిర్వహించుట వీరికి సులభము. వీరికి నమ్మకము కలిగినను, లేకున్నను, కొన్ని అదృశ్య సూక్ష్మలోకముల శక్తులు వీరిపై పనిచేయు చుండును. అవ్యక్తమైన అంతర్వాణినుండి సందేశములను గ్రహింపగలరు.స్వప్నములలో సూక్ష్మ శరీరముతో ప్రయాణము చేయుట.దూరదృష్టి, దూరశ్రవణములు,రాబోవు విషయములు తెలియుట,కలలో చూచినట్లు జరుగుచుండును. వీరికెపుడును నూతనత్వము కావలెను కాని నూతనత్వమనే లక్షణాన్ని అదుపులో నుంచని యెడల చాలా కాలము ఒక వృత్తిలో స్థిరపడక పోవుట. వృత్తులు మార్చుట జరుగ గలదు.వారిది ప్రేమతత్వము, కానీ వీరిప్రేమకు వ్యక్తీకరణ చేయు సంభాషణలు, పనులు వీరికి చేతకావు. వీరిని ప్రపంచం యీ విషయంలో అర్థము చేసుకొనలేదు.సామాన్యంగా వీరి దగ్గర బంధువులు, స్నేహితులు వీరియందు ఆపేక్ష, ప్రేమ కలిగి యుందురు.క్రొత్తగా పరిచయమైన వారు మాత్రము వీరిని పూజించి గౌరవించురు.తమ వలన ఇతరులకు కష్టము కలిగినచో వీరు మిక్కిలి బాధ పడుదురు. ఎటువంటి అపకారియైననూ వీరికెదురైన, వీరు హాని చేయలేరు. పరిస్థితుల ఒత్తిడి లేనిచో వీరు నిష్ర్పయోజకులుగా ఉందురు. ఒత్తిడి కలిగినపుడు వీరి సామర్ద్యం ఎల్లరును (అందరినీ) ఆశ్చర్య పరిచెదురు. స్వతంత్ర నిర్ణయములు కావలసిన ఏవృత్తి యందైననూ వీరు రాణింతురు.ఆధునికశాస్త్ర పరిశోధనా ఫలితములైన వృత్తులన్నియూ వీరికి అనుకూలమే. విద్యుత్తునకు, శబ్దతరంగములకు,కాంతి తరంగములకు సంబంధించిన ఇంజనీరింగు శాఖలు వీరికనుకూలము, అనగా రేడియో, టి.వి, సినిమాలకు సంబంధించినవిగాని, శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవిగాని యగు యంత్రాంగములు వీరి బుద్ధిసూక్ష్మతకు తగియున్నవి.
ప్రకృతి తనలోని రహస్య శక్తులను వీరికి సులభముగా కైవసము చేయును.నేటివరకు ఎవ్వరూ కనిపెట్టని అంశాలను దర్శించి ప్రజలకుపకరింపచేయుటలో వీరిదే పైచేయి. ఆధ్మాతిక విద్యను, నవీనశాస్త్రముతో సమన్వయించుట, భవిష్యత్ విజ్ఞానమును ప్రజల కర్థమగునట్లు చేయుట వీరికి సులభం. జాతకమున క్రూర గ్రహాల వీక్షణ ఉంటే, విప్లవాత్మకమైన మార్పులు చేయుట ప్రభుత్వానికి, చట్టానికి, భద్రతకు వ్యతిరేకంగా ప్రజలను సంస్కరింపజూచుట కూడా సంభవం. అట్టి మార్పుల వలన సక్రమమైన వృత్తి వ్యాపారాదులు లేక జీవితము ఆవేశమునకు వ్యర్థం కావచ్చును.జ్యోతిష్యం, యోగ విద్య, మానసిక శక్తుల సాధనము, మసస్తత్వ శాస్త్రమునకు సంబంధించిన వైద్యశాఖ కూడా వారికి బాగుగా రాణించును. శరీర పరిశ్రమతో కూడినవికాని, మార్పులేని ఒకేవిధమైన పనులు గాని వీరు చేయలేరు. లేఖకుడు,టైపిస్టు, లెక్కలు వేయువాడు (ఎక్కౌంటెంట్)మున్నగు ఉద్యోగములు వీరికి రావు.వీరికి పై అధికారులతో సఖ్యత కుదురుట కష్టము. వారి శాఖకు వారే అధికారిగానుండు ఉద్యోగాలలో వారు రాణిస్తారు. విమానముల రాకపోకలతో సంబంధమున్న ఉద్యోగ, వ్యాపారములు కూడ లాభదాయకములు. దాంపత్య జీవితమున భౌతిక ఆకర్షణ కన్న మానసిక, వైజ్ఞానికాకర్షణ వీరిపై హెచ్చుగా పనిచేయును. జాలి పడుటతో. క్లిష్ట పరిస్థితులలో నాదుకొనుటతో వీరి ప్రణయ మారంభము కావచ్చును. చిన్నతనమునుండి ఏదైన ఆదర్శమునకు దీక్షవహించినచో, వీరు వివాహము చేసుకొనక పోవచ్చును. సప్తమ స్థానమునకు, కుజ శనులలో నొకరి కేంద్రదృష్టియున్నచో చట్టమునకు, అచారమునకు, నీటికి విరుద్ధముగా వివాహము జరుగును. పట్టుదలకై శీలరహితులనో, వేశ్యావృత్తివారినో వివాహమాడుట కూడా జరగవచ్చును. ఇట్టి పనులను సంఘ సంస్కారమను పేర నిర్వహింపవచ్చును, వీరి నరములెపుడునూ జాగృతమై యుండుట వలన చిరాకు, నిద్రలేమి, నరములపట్లు, మెడ, వెన్ను నొప్పులు మానసిక శ్రమవలన కలుగు నీరసముండును. భౌతికముగా జబ్బులులేని బాధలు కనిపించును. వైద్యునకు వీరి బాధలెపపుడునూ పెద్ద సమస్యే. అతి మానసిక శ్రమ వలన తలనొప్పులు, బరువు, రక్తపోటు (బి.పి), వణుకు మున్నగునవి కలగగలవు. మనస్సున చిరాకు, కోపము, ఇతరుల ప్రవర్తనలోని లోపములను సహించలేకపోవుట కలుగవచ్చును. ఆహార విహారములలో క్రమప్రవర్తనము, కాలనియమము కలిగియుండి ఆవేశములను తగ్గించుకొని, ధ్యానాభ్యాసమున్నచో వీరి నరములు వీరియధీనమున యుండును.
కార్య భారం వలన సంతాన నిరోధము, ఋతుకాల నిరోధము చేయుటకు యత్నించు వారీరాశిలో నెక్కువమంది యుందురు. గర్భాశయ వ్యాధులు కలుగవచ్చును. చిన్న వయస్సులో వివాహములు మంచివి కావు. కుటుంబ సహజీవనము తమ అభ్యుదయ బావమునకు ఆటంకమను భావము వీరికుండును. కుటుంబ పరిస్థితులను గూర్చి ఎక్కువగా ఆలోచించినచో నిద్రాభంగం, శిరోవేదన కలుగును.