బేసిరాశి - అగ్నితత్త్వము - ద్విస్వభావ రాశి - ఈ రాశియొక్కగుర్తు నడుము క్రింద భాగము గుర్రపు శరీరాకారము, పై భాగము విల్లమ్ములు ఎక్కుపెట్టిన మనిషి ఆకారముండును.
ఏకాగ్రత, పట్టుదల, అభిమానము కార్యదీక్ష ఈ రాశివారికి మూల సూత్రములు, ఏది సాధించాలనుకున్నా, మరే భావన లేక ఏకాగ్రతతో కార్యములు సాధించగలరు. సూటిగా ప్రవర్తించుట తప్ప లౌక్యము తెలియదు. వీరు సూటిగా పోగలరు గానీ, తమను అక్రమ మార్గమున పట్టించువారిని గుర్తించి జాగ్రత్త వహించలేరు. ఎచ్చటైన మోసము కనిపించిన, ఎంతటి పథకమునైనా మధ్యలో వదిలి వేయుదురు. అందువలన జీవితములో అనేక పథకములు ప్రారంభించి, మధ్యలోనే ఆపివేసి మరలా నూతన పథకములు ప్రారంభించెదరు. ఈ విషయములో యీ రాశివారు తమ ప్రవర్తనను మార్చుకొన వలసియున్నది, ఏ పని ప్రారంభించిననూ, ప్రారంభములలో విజయము సాధించగలరు. మొదట అందరూ మంచిగా ప్రవర్తించి మధ్యలో వారిని విడిచిపెట్టు అవకాశమున్నది. తాత్కాలిక ప్రతికూలతలో ఓర్పు, చిరాకు రానివ్వకపోవుట వీరి విజయమునకు అవసరం.
అనవసరమగు నియమములు పెట్టుకొనుట, పిచ్చి పట్టుదల దుష్ర్పవర్తన గలవారిపై నోరుజారుట, ఇతరులు దీనిని అవకాశముగా తీసికొనుట వీరి స్వభావములో వుండును. న్యాయము, ధర్మము అను పేర్లతో చిన్నచిన్న విషయములందు పట్టుదల వహింపకుండుట అవసరము. ధర్మము, సాహసము, పట్టుదల, చక్కని ప్రవర్తన వీరి ముఖ్య కారణములు. కాని వాటికి భిన్నముగా ప్రవర్తించు వారు యెడల క్రౌర్యము, కాఠిన్యము, విధ్వేషము కలుగు అవకాశమున్నది. వీరిది తాత్కాలిక క్రోధము.
వీరి మంచితనముపై వీరికి విశ్వాసము. ఆత్మాభిమానము ఎక్కువ, ఇతరులు వీరిని గురించి మంచిగా గొప్పగా చెప్పుకొనవలెనన్న పట్టుదల వీరికెక్కువ. ఓటమిని వీరంగీకరించరు. వీరిలో వీరు బాధపడుచూ సుఖముగా ఉన్నట్లు ఇతరులకు కనిపించెదరు. అందువలన వీరు వున్న పరిస్థితికన్న ఎక్కువ ధనవంతులని, సుఖవంతులని ఇతరులు పొరబడుటకు అభిమానము, అవరోధమై ఇబ్బందులకు గురియగుదురు. ఒకచోట ఎక్కువ కాలము నివసించుట, పనిచేయుట, ఒకే వ్యక్తులతో చిరకాలము స్థిరమైన అనుకూలతతో ప్రవర్తించుట వీరికి చాలా కష్టము, వారు నివసించే ప్రదేశంలో, కాల క్రమమున సమస్యలు పుట్టుచుండును. (కలుగుచుండును). క్రొత్త చోటు, క్రొత్త వ్యక్తులు ఎప్పుడు వీరికి అనుకూలముగా వుండెదరు.
వీరు బోధనావృత్తిగాని, న్యాయవాదవృత్తిగాని రేడియో, టి.వి. మున్నగు ప్రసార మాధ్యములలో ప్రకటన, ఉపన్యాసవృత్తులు గాని అనుకూలము, కోశాగారములకు సంబంధించిన వృత్తులు, తంతి, తపాలా, జీవిత భీమా, ట్రెజరీకి సంబంధించిన వృత్తులలో వీరు బాగుగా రాణింతురు. ఈ రాశివారు చక్కని శరీర సౌష్టవము, దారుఢ్యముకలిగి యుందురు. చిన్నతనము నందు వ్యాయామము అనుకూలము, వీరు ఆహార నియమాలు పాటించినచో 30 సంవత్సరాల తరువాత శరీరము స్థూలమై జీర్ణ కోశవ్యాధులు, రక్తపోటు (బి.పి) శిరోవేదనలు కలుగు అవకాశమున్నది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాంఘీక, వైజ్ఞానిక జీవితమున ఆసక్తి ఎక్కువ: గృహ నిర్వహణయందు ఆసక్తి తక్కువ, భర్త ఇంటిలో ఉండి ఎక్కువ విషయములు నిర్వహించుకొనవలసి యుండును.