సరిరాశి - స్థిరము - జలతత్త్వము - “తేలు" ఈ రాశికి సంబంధించిన చిహ్నము. పరిసర ప్రాంతములను, వ్యక్తులను గురించి ఆందోళన, పరిసరముల నుండి తనను తాను కాపాడుకొనుటకై ప్రయత్నించుటలో సునిశితమైన రహస్య ప్రవర్తన యుండును, వీరిలో జనాకర్షణ శక్తి కూడా ఉండును. ఇతరులపై తమ ప్రభావమను చూపి వీరు సులభముగా తమ మార్గమునకు రప్పించుకొను సామర్థ్యముండును. దానిని ఒక పక్షంవారు స్వలాభమునకై ఉపయోగించుకుందురు. మరియొక పక్షంవారు పరోపకారమునకై ఆరోపింపవలసిన సోపానములపై వీరి కథ నడుచును. కోరికలు ఇంద్రియసుఖములు, స్వార్థము అనువానితో అలుపులేని పోరాటముతో విజయము సాదించుకొనవలసిణ బాధ్యత మిగిలియుండును. జయించిన వారు యుగకర్తలు, మార్గ దర్శకులు కాగలరు. సంభాణలోనూ పాత కొత్తలయందును, సమర్థవంతమగు పదములతో కూడిన భాషపైనను వీరికి చక్కని పట్టు ఉండును. ఎటువంటి వ్యక్తులతో నైనా, ఎటువంటి వాతావరణమునైనా, కలిసిపోవు శక్తి ఉండగలదు. అప్రమత్తత అజాగ్రత్తగా యున్నను దుస్సాంగత్యమున చెడిపోవు అవకాశము కలదు. ఈ రాశిలో జన్మించిన బిడ్డలను పెంచుటలో ప్రత్యేక శ్రద్ధ చూపవలసి యుండును. దుస్సాంగత్యము, ఇంద్రియలోలత అను అంశముల నుండి నేర్పుతో వారిని కాపాడవలసి యుండును. సంతానమునకు భయము, రహస్య గోపనము అనే రెండు విచిత్ర మనోధర్మములు ప్రాముఖ్యత వహించును. వారిని చక్కగా ప్రోత్సహించి సజ్జన సాంగత్యము, పనిలో నిమగ్నులు కావించుట, సమానహోదాతో వ్యవహరించిన వారికి ధైర్యము, స్వతంత్ర ప్రవృత్తి, విద్యా బుద్ధులు అలవడి గొప్ప వారాగు అవకాశమున్నది.
రహస్య వృత్తి యీ రాశి వారికి ప్రత్యేక లక్షణము. వీరి ఆంతర్యము మరియొకరికి తెలియుట వీరికి యిబ్బందికరముగా యుండును. వీరు ప్రేమ చూపినను, దయ చూపినను, ఎవరికైన సహాయ మొనర్చినను దాని విషయము ఇతరులకు తెలియుట చాలా కష్టము. అనగా రహస్య, గుప్త దానాదులయందు వీరికి విశ్వాసమెక్కువ. ఈ రాశివారు మంచివారని, మంచిని సంకల్పించి ఆచరించుచున్నారని వీరి అనుచరులకు కూడా తెలియుటకు చాలా కాలము పట్టును, వీరు తమ మనస్సును ఇంద్రియములను జయింపలేనిచో వీరి భావములు, చెడ్డపనులు, స్వార్థము, కాఠిన్యము, మోసమును ఎవరును గ్రహించలేరు. కాని యొకనాడు సర్వము ప్రకటితమై క్షాళన (శుభ్రము) ప్రక్రియ తప్పనిసరి యగును. ఈ రాశి వారి మనస్తత్వము చాలా విచిత్రమైనది. ఇందు జన్మించిన వారి హృదయముల గాంభీర్యము, లోతు వారికే తెలియదు. ఇతరుల కన్నా తెలియదు. వీరు సాధారణముగా ఒకపనిలో నిమగ్నులై యున్నంతవరకు వీరి మనస్సు పవిత్రముగా ఉండును. పని తక్కువై ఆలోచించుట ప్రారంభమైనది మొదలు ఇతరులలోని లోపములు, రహస్యములు తెలుసు కొందురు. మంచి పనులు చేసినను ఎవరికిని తెలియకుండా చేయవలెనను పట్టుదలతో కొంత సమయము ప్రయత్నము వ్యర్థమగును.
ఈ రాశి ప్రభావములోని వారు - శస్త్ర వైద్యుడు, ఆయుధదారి యగు యోధుడు, రక్షక భటుడు మెకానిక్ ఇంజనీరు, కార్మికుడు, వేగముగల వాహనములు నడుపు వారు, లోహమయ వస్తువులు ధరించువారు. వడ్రంగము, మేకులు, సుత్తిపని చేయుటలో ప్రత్యేక ప్రజ్ఞ యుండును, అపరాధ పరిశోధనా శాఖ వారు, సి. ఐ. డి. మొదలగు విద్యలో నిపుణులు, నల్లమందు, పొగాకు, గంజాయి, మత్తుపదార్థములు, విషప్రయోగవస్తువులు తయారు చేసి రహస్యముగా సరఫరా చేయువారు, వాటిని పరిశోధించి పట్టుకొను రక్షణశాఖవారు ఈ రాశిలో నిపుణులు. అతి తీవ్రమైన, వాడియైన వాగ్ధాటి రచనా ప్రభావముచే జీవనయాత్ర సాగించు నైపుణ్యత కలవారు కూడా ఈ రాశిలో జన్మింతురు. వీరికి చిన్న వయస్సులో వివాహమయినచో నడివయస్సున కొంతకాలము భార్యకు సుదీర్ఘమైన అనారోగ్యములు కలుగును, అనూహ్యమగు కారణములచే రెండవ వివాహము జరగవచ్చును. ఆలస్యముగా వివాహమైన అంతకుముందు వయస్సున తీరని క్లిష్ట సమస్యలు, వీరి ప్రణయ జీవితమునకు సంబంధించినవి సంభవించి తరువాత జీవితమున అప్పుడప్పుడు పునరావృతమగు (మరల మరల జరుగును) వీరిలో కొందరు వివాహ జీవితమును నిర్వహించుచున్నట్లు నటిస్తూ, కోపతాపములవలనో, వైరాగ్యమువలనో దాంపత్య సుఖమును కోల్పోవుదురు. కొందరు అవివాహితులుగా వుండగలరు. కొందరికి తెలిసిన కుటుంబమొకటి, ప్రచ్చన్నమైనా కుటుంబమొకటి యుండవచ్చును. చిన్నతనమున తీవ్ర అనారోగ్యములుండును. కొంత వయస్సు వరకు కృశ శరీరము దాంపత్య జీవితము నుండి స్థూలశరీర మేర్పడుట, సుదీర్ఘమైన, స్వల్ప అనారోగ్యము లుండును. నడుము, మోకాళ్ళు, గొంతు, మూత్ర విసర్జన అవయములకు సంబంధించిన వ్యాధులు కలుగుచుండును. వార్ధక్యమున మూత్రసంబంధ నిరోధనము (పురుషులకు) మూలవ్యాధి, ఫిస్టులా (భగంధరము) కలుగవచ్చును. పాదములు, పొట్ట, లివరు, నీరు పట్టుట గుండె నీరు పట్టుట, కామెర్లు మున్నగునవి కలుగవచ్చును. స్త్రీలలో శిశుపోషణ, గృహ నిర్వహణ నైపుణ్యం, సామర్థ్యం, ఎక్కువ ఉద్యోగము చేయదలచిన వారు, ప్రసూతి చికిత్సాలయములు, మాతాశిశు పోషణ, కేంద్రములు, అనాధ శరణాలయములు మున్నగు శాఖలు సార్ధకమై జీవితము ధన్యమగును