సరిరాశి, ద్విస్వభావరాశి, భూతత్త్వం, ఈ రాశియొక్క గుర్తు ఒక కన్య. చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె, పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న స్త్రీ.
అభిమానము, వాత్సల్యము, బంధుప్రేమ, ఇది నాది అని ప్రాకులాడుట, తమ బాధలను శ్రమను ఇతరులు గుర్తింపవలెను కోరిక వీరి ముఖ్య స్వభావము. మనస్సు సున్నితము, సౌకుమార్యము, సున్నితమైన పనితనము చూపించుట, ఇతరుల ప్రోత్సాహము, ప్రోద్బలమును గురించి దుర్లభమైన ప్రజ్ఞ పాటవములను ప్రదర్శించుట వీరికి గల మంచి లక్షణములు. పరిస్థితులు అనుకూలించిన, వీరు రాణించి పదిమందికి ఉపయోగపడగలరు. ఇతరులు కలిసి రాసినపుడు నిరుత్సాహము, పిరికితనము వలన కార్యరంగము నుండి విరమించుట. ఆటంకములు కలుగునని భయము. వీరు పెద్దపెద్ద కార్యములు స్వయముగా ప్రారంభించరు. ఇతరులు మొదలిడినచో వీరికి సలహాలు చెప్పుట, వారి వలన వారి అండదండలతో సురక్షితముగా జీవిచవలెనని వీరు మనస్సు కోరుచుండురు. వీరి యొక్క గొప్పతనమును గుర్తించువారు లభించినప్పుడు వీరికి ధైర్యము, బలము చేకూరును. వీరి ప్రజ్ఞకు తగిన ఆత్మ విశ్వాసము లేక వీరు బాధపడుదురు. భార్యబిడ్డలు, సేవకజనము వీరి దగ్గర పనిచేయువారు వీరియందు అధికమగు అభిమానము కలిగి ఉందురు. ఇతరులను గురించి ఆలోచనలు వీరు మనస్సును బాధపెట్టుచుండును. తమను గురించి ఇతరులేమనుకుంటున్నారో అనే జిజ్ఞాస ఎక్కువ, వీరికి సరియని తోచినది సూటిగా చేయక పదిమందితో దానిని గురించి విమర్శింతురు. పదిమంది పదిరకములుగా చెప్పుట వలన వీరి జీవిత కార్యక్రమము ఎవరికీ అర్థం కాదు. వీరియొక్క ఆదర్శములు, జీవిత కర్తవ్యములు మనస్సులోనే ఉండి కార్యరూపము ధరించవు. వీరికి గృహసౌఖ్యము, చక్కని ధనము, ఆదాయ మార్గములు సంసిద్ధముగా ఉండును, స్వయంగా పర్యవేక్షించిన కార్యక్రమములు తగిన విధంగా ఫలమివ్వవు. నడివయస్సు నుండి అతిగా ఆలోచించుట, ఇతరులను గురించి చెడుగా తలచుట, వారిపైన వారు జాలిపడుట అనే లక్షణాలు రాగల అవకాశమున్నది. జన సమర్థము, జనసమూహము ఉన్న ఎడల బిడియము, పెద్దవారిని స్వయముగా కలుసుకొనుటకు సిగ్గు, తనకున్న పరిస్థితులను చెప్పుటకు సంకోచ భయములుండును. బంధుమిత్రాదులకు భయపడి మొగమాటము వలన తనకు మించిన బాధ్యతల వలన చిరకాలము బాధపడుదురు.
స్వదేశము, స్వస్థానము (జన్మస్థానము), తరువాత అనువానిపై వీరికెక్కువ అభిమానము. తప్పులు చేసినను వీరు కప్పిపుచ్చుటకు యత్నించి కష్టములు పడుచుందురు. ఎవరిని వీరు అభిమానించి కప్పి పుచ్చుదురో వారు వీరికి ద్రోహం చేయు అవకాశం ఉన్నది, వారడిగినచో ఋణములు లభించును. ఋణములు చేయుట వీరికి చాలా సులభము. వీరి స్వభావము కూడా దీనికు అనుకూలముగా ఉండును. ఈ దౌర్భల్యము (లోపము) నిగ్రహించుకొనిన ఋణగ్రస్తులు కారు. ఈ రాశిలో జన్మించినవారు కొందరు ఋణములపై జీవించుట కొందరు జూదములలో జీవనోపాధి నేర్పరచుకొనుట, వడ్డీవ్యాపారముతో జీవించుట చేయుచుందురు. వీరి కర్తవ్యమునందు చేతకానితనముండును. వచ్చిన అవకాశము వచ్చినట్లు ఆలోచించక, వినియోగించు కొనుట, నేర్చినకొద్దీ వీరి జీవితమూ చక్కగా మారగలదు. అనగా తనకు లభించిన అవకాశములు ఉపయోంచిన జీవితము బాగుండును.
బుద్ధిసూక్ష్మతనుపయోగించు వ్యట్టులన్నిటిలో వీరు రాణింతురు. లిపికి సంబంధించిన విద్యావిధానము, శాస్త్రములు, టైపు, షార్టుహాండు, కంప్యూటర్లు ముద్రణాలయము, డిక్షనరీ నిర్మాణము (నిఘంటువు), శబ్దార్థ, సూక్ష్మపరిశీలన, వ్యాఖ్యానము, వడ్రంగము, దంతపుపని, నగిషీపని, హాస్య కుశలత, కాంట్రాక్టు పనులు, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాలలు, ఆహార పరిశోధన శాలలు, బ్యాంకులు, కోశాగారములు, ద్రవ్య సదుపాయములను కనిపెట్టు విధానములు, సహకార శాఖలలో వీరు అసాధారణంగా రాణింతురు.
యుక్తవయస్సులో వివాహమైన వారికి ఆపేక్ష లెక్కువగా ఉండును. కుటుంబమున పరస్పర సహకార ముండును, ఎక్కువ కాలము ఇల్లు వదిలి ఉండలేరు. చిన్నవయస్సులోనే స్త్రీకి లోబడి తప్పని సరి వివాహము జరుగు అవకాశమున్నది. వీరికి స్త్రీ జనాకర్షణ ఎక్కువ, పురుషులకన్న, స్త్రీలకు వీరి మంచి తనము నచ్చును. స్త్రీలకు సహాయపడు కార్యక్రమములు వీరి యొక్క కాలము హరించును, ఇల్లు తీర్చుకొనగల దక్షత వీరికుండును, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టుపనులు, అల్లికపనులు, గృహోపకరణములు తయ్యారు చేసుకొనుటతో పాటు చక్కని పొదుపు, భర్తకు సరిదిద్దుకొను నేర్పుండును.
గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశసంబంధ అనారోగ్యములు వీరికి కలుగు అవకాశమున్నది, వీరు జీర్ణశక్తిని గూర్చి ప్రత్యేక శ్రద్ధవహించవలసి ఉంటుంది, లివర్ (కాలేయం) ఎపెండిక్స్, (ఆంత్రపుచ్చము) సంబంధిత శూలవ్యాధి ఏర్పడు అవకాశమున్నది. అప్పుడప్పుడు చర్మవ్యాధులు బాధపెట్టును. ఆరోగ్యము గురించి వీరికి దిగులు, బాధ ఉండును. నిరుత్సాహం, దుఃఖపడుట ఇతరులు వీరియందు శ్రద్ధ చూపుట లేదనే విషాదము పొందుట జరుగగలదు.
వీరికి కొన్ని శాఖలలో విద్యాభ్యాసం చాలా సులభం, వైద్యశాఖ గణితము, వాణిజ్య విద్య, జమాఖర్చులు లెక్కలు, వాని పర్యవేక్షణ మున్నగు వాటిలో ప్రావీణ్యముండును. ప్రేమ వివాహం జరుగు అవకాశమున్నది. వీరికి అనారోగ్యమున, సేవచేసిన వారిపై జన్మాంతరము వరకు వాత్సల్యముండును. సాంసారిక జీవనం సౌఖ్యప్రదంగా ఉండును.