Home » Dwadasha Rasulu Karakatwalu » సింహ రాశి
సింహ రాశి

బేసి, స్థిరరాశి, అగ్నితత్వము, గర్జించు సింహము ఈ రాశికి చిహ్నము. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలెనను కుతూహలము, తమమాటను ఇతరులు పాటించినచో బాగుపడుదురను నమ్మకం. చురుకుతనం, తొందరపాటు, ప్రథమ లోపము, పశ్చాత్తాపం, హృదయ వైశాల్యము, ఆపేక్ష వీరి స్వభావమునకు పునాదులు. ఏనాడును, ఎట్టి పరిస్థితులలో ఓటమి నంగీకరింప కుండుట, ఇతరులను ఒక మార్గమున నడపవలెనను కాంక్ష నిరాశ చెందకుండుట వీరికి గల మంచి లక్షణములు, ఆవేశము మాత్రం ఎక్కువ. దానివలననే వారు చిక్కులు ఎదుర్కొనవలసి వస్తుంది. వీరికి తెలియకుండా బాధ్యతలు తలపై వేసుకొని చిరకాలము బాధపడుతుంటారు.

 

వీరి అభిమానము, దురభిమానం కాకుండా చూచుకొనవలసినబాధ్యత వీరిపై ఉన్నది. ఒక వర్గమునకో, పక్షమునకో (పార్టీ) మతమునకో వీరి అధికారము కట్టుబడినచో వీరావర్గమునకు ఆనతి (తక్కువ) కాలములో అధికారస్థానము పొందగలరు. కానీ వీరి సామర్థ్యం సంకుచితమగును. సర్వమానవ సౌభ్రాత్వత్వము, జీవిత ప్రాథమిక సత్యములను నమ్మి వీరు అవలబించుట సర్వదా శ్రేయోదాయకం. వీరి పథకములలో ఇతరులు సుఖపడుట జరుగును. వీరే స్థితియందున్ననూ వీరి నాశ్రయించువారు వీరిపై ఆధారపడువారు. వీరికి లొంగినవారు, వీరి అడుగు జాడలలో నడచువారు ఎప్పుడునూ ఉందురు.

 

వీరికి భావ తీవ్రత అధికం. వీరి ప్రజ్ఞ సునిశితము మరియు అతివేగంగా పనిచేయును. అనగా అతి విమర్శ వీరి మనస్సుకు పనికిరాదు. వీరి వేగమునకు వాడితనమునకు తట్టుకొనలేనివారిపై క్షణములో కోపించుదుర్గుణము కలదు. దాని వలన చాలా నష్టము వీరికి కలుగును.

 

ఐహిక సంబంధములలో వీరికి చాలా నిగ్రహమా వశ్యకము. లేనిచో పరాజయము తప్పదు. సమాజములో ఎక్కువమంది వీరి దృష్టికి కనిపించదు. వీరికి నచ్చని విషయములు ఎక్కువమందిలో వీరికి కనిపించుచుండును. వానిపై వీరి మనస్సు నిలిచినచో తప్పులు పట్టుట, న్యాయము పేరుతో కోపగించుకొనుట, గిల్లికజ్జాలు పెట్టుకొనుట, పోరాడి వెనుకకు మరలివచ్చుట, ఉద్యోగాది జీవనోపాధి మార్గములు దెబ్బతినుట, జీవితము కష్టముల పాలగుట సంభవించవచ్చును.

 

ఎవరేతప్పు చేసినాను, అంగీకరించినచో క్షమింతురు. రహస్య గోపనము చేసినవారిని నాశనము చేయగలరు. వీరికి కోపము కలిగించు ప్రధానాంశములు రెండు. 1. గుట్టు, గుంభన, చాటుమాటుతనము, 2. నమ్మకముతో మోసం చేయుట, ఇతరుల సంబంధమున వీరికి ప్రేమయో, ద్వేషమో ఉండుట సాధ్యముకాని, లౌక్యముతో మంచిగా కాలక్షేపము చేయుట వీరికి సాధ్యపడదు. మానవత్వముపై మంచితనముపై వీరికి అంతులేని నమ్మకమున్నది. క్రొత్తవారిని వీరు నమ్మకుండా నుండలేరు. జాలి కలిగించే దృశ్యము కనిపించినచో వీరు కష్టముల పాలైనా బాధ్యతలను వహించి సహాయం చేయుదురు. దాని వలన కొంతమంది కపటజాలి చూపి వీరికి మోసము చేయు అవకాశమున్నది.

 

మోసము చేయుట, నమ్మించి నట్టేట కపట ప్రేమ చూపుట వీరి స్వభావములో లేవు, అందరూ వీరి మాటలకు లోబడవలెనని, అందరికన్నా, తెలివైనవారని వీరి నమ్మకం. వీరి కంఠధ్వని ఇతరులనాకర్శించును. వీరి వాక్యములు సూత్రప్రాయములు, ఆలోచనాత్మకమై ఉండును. డబ్బు, ఆస్తి పాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవికావు. కాని కీర్తి దాహము, ప్రచార కాంక్ష అను రెండు విషయములలో మాత్రము వీరు లొంగిపోవుదురు. డాంబికత్వము, ఇతరులు పొగడవలెనను కోరిక వీరిని వీరు శ్లాఘించుకొనుట (పొగుడుకొనుట) అనులక్షణములు అధీనములో ఉన్న వీరంతటివారుండరు.

 

వైద్యవృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలములు. బాధలో నున్నవారిని రక్షించు వృత్తుల శాఖలలో వీరు రాణింతురు. వ్యాపార సంస్థలలో ప్రచారమునకు సంబంధించిన వృత్తులు కూడా మంచివి. ఔషదముల రసాయన ద్రవ్యముల, వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ, టూరింగ్ ఏజంట్లుగా పనిచేయుట, వీరికి సరిపడు వృత్తులు ఇంకను వాగ్ధాటికి, ఉపన్యాసాదులను, సాహిత్యమునకు, శాస్త్రబోధనకు, సాంకేతిక విద్యలక్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో కూడా వీరు రాణింతురు. మొత్తము మీద వీరు ఉద్యోగములో కన్న, వ్యాపారాదులలోనే ఎక్కువగా రాణింతురు. ఒకరి క్రిందపని చేయు చిన్న ఉద్యోగములలో వీరికి చిక్కులుండును. అధికారులతో వీరికి మంచి సంబంధములు కుదరవు. ఈ విషయంలో కొంచెం నిగ్రహం తప్పనిసరి.

 

ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి, ప్రేమదేవతగా ఆరాధింపవలెనను ఆదర్శం వీరికుండును. సామాన్యముగా ఈ విషయమున వీరికాశాభంగము కలుగగలదు. త్వరపడి ఆవేశమున అపాత్ర (తగని) వ్యక్తిని వివాహము చేసుకొనుట, వీరపేక్షించిన ప్రేమతత్త్వము లభించనప్పుడు, జీవితసౌధము కూలిపోయినట్లు వీరు బాధపడుటకు జరుగుటకు అవకాశమున్నది. వీరికి స్త్రీ జనాకర్షణ ఎక్కువ, వీరి ఆవేశముచే ఆకర్షింపబడిన కొందరి స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపములు కలుగు అవకాశమున్నది. వీరి శీలముపై వీరి ప్రేమ సామాన్యము ఆధారపడి ఉన్నది.

 

చిన్నతనమున జ్వరబాధలు, వడగాల్పుల క్రిందపడి దెబ్బతగిలించుకొనుట, అగ్నిప్రమాదములు సంభవించగలవు. యవ్వదశలో జీర్ణకోశబాధలు, కడుపునొప్పి, తలనొప్పి, పార్శ్వపునొప్పులు, కంటిజబ్బులు కలుగవచ్చును. నడివయస్సునుండి శరీరము స్థూలమై, అతి శ్రమవలన గుండె జబ్బు రక్తపోటు (బి.పి) కంటిచూపు మందగించుట కలుగవచ్చును. శరీర వ్యాయామము ఆరుబయట విహారము వీరికి ఆరోగ్యము కలిగించును.

 

ఈ రాశిలో జన్మించు స్త్రీలకు విద్యలో ప్రావీణ్యం సులభముగా కలుగును, పిల్లలను పెంచుట, క్రమశిక్షణనిచ్చుట వీరికి వెన్నతోపెట్టిన విద్యలు. ఈ బాధ్యతలను విడిచి, సాంఘికముగా పురోగమించు కోరిక కొందరికి కలుగును. అటువంటి స్త్రీలకు, ఇల్లు సంబంధిత వ్యవహారములు పట్టవు. వీరిలో కొంతమంది దేశపర్యటన చేసి అనేక వింతలను విశేషములను చూడగలరు.


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.