చరరాశి, సరిరాశి, జలతత్త్వం. ఈ రాశికి చిహ్నం ఎండ్రకాయ లేక పీత అను జలభూచారం. అటు పోటులు వృద్ధిక్షయాలు మున్నగు ద్వంద్వములగు పరిణామాలు ఈ రాశియందు ఉద్భవించును. ఈ రాశిలో జన్మించిన వారికి మనస్సు ఆవేశాత్మకం. వీరి మనస్సునకు ఒకనాడు పూర్ణిమ, ఒకనాడు అమావాస్య. కొంతకాలం ఉత్సాహం, ఆశ, సంతోషం వెల్లివిరియును, మరికొంత కాలము విషాదము, నిరాశ, దిగులుతో ఉందురు, వీరి తెలివితేటలు కొంతకాలము సూర్య చంద్రులు ప్రతిబింబించిన సముద్రం వలె సమస్తమును దర్శనము చేయగలిగి ఉందురు. కొన్ని దినములు అమావాస్య చీకటిలో సముద్రం వలె, అకారణ భీతి, నిరాశ. ఒంటరితనమన్న ఇష్టం, అభిలాష, బంధు, మిత్ర బృందంతో కలిసి ఉండలేక చికాకుపడుట ఉండును.
వ్యక్తులతో వీరు కొంతకాలం అత్యంత అనురాగము కలిగి ప్రాణంగా కలిసిపోవుట, మరల విడిపోయి యావజ్జీవితం సంబంధం లేని విఘాతములు ఏర్పడును. వీరికి ఆపేక్షలు ఉన్నంతకాలం నిర్మలం, గంభీరములు, అవి తొలగినచో రక్తములు శూన్యములు. వీరి మనస్సునకు ఆవేశమెక్కువ. విమర్శ తక్కువ, ఆవేశమునకుతరుచుగా లోనగుదురు. మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉన్న సమయాలలో చక్కటి దర్శనజ్ఞానం కలిగి ఉండి అతి సూక్ష్మాంశములను కూడా గ్రహించును. ఇట్టి వేళలలో ఉపన్యాసవేదికలపై వీరు మున్నెరుగని నూతన విషయములను గూర్చి ధారాళంగా ప్రసంగిస్తారు.
వీరిని నమ్మించుట, మోసగించుట సులభం. కాని వీరు ప్రశాంతముగా ఉన్న ఎడల, ఎదుటివారి మనస్సులలో భావాలను సులభంగా గ్రహించగలరు. సముద్రతీరము వీరి నివాసమునకు తగినది. కవులు, చిత్రకారులు, గాయకులు, కల్పనాకథల రచయితలుగా వీరు ప్రజ్ఞను ఉన్నత సీమలలో విహరింపజేసి గంభీర భావములతో సహృదయములను ఉఱ్ఱూతలూగింపగలరు.
వీరికి చురుకుదనమెక్కువ, ఎప్పుడు ఏదో ఆలోచించుట, దేనికోసమో త్వరగా పరుగులెత్తుట, అనవసరమగు పనులు చేయుచు తిరుగుచుందురు. వీరికి ఒక స్థిరమైన అభిప్రాయముండదు. ఎవరితో కలిసి ఉన్ననూ అట్టి స్వభావముతో ప్రవర్తింతురు. వీరి యొక్క మేలుకోరువారు సింహరాశివారు. అందువలన సింహరాశి వారితో జీవితము అనగా సంబంధ బాంధవ్యములున్న మంచిది. అనగా వారితో వివాహజీవితం ఉంటే మంచిది. అప్పడు ఈ రాశివారికి స్థిరత్వము, సౌఖ్యము, జయము తప్పక కలుగును. వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువ, చిన్నతనము నుండి జరిగిన సన్నివేశములు కలిసిన వ్యక్తులు స్పష్టముగా జ్ఞప్తియుందురు. వీరు ఏ పనినీ సొంతంగా సాధించలేరు. మరియొకరి ప్రోత్సాహమున్నచో సాధించలేని కార్య ముండదు. వీరికి నచ్చిన వారికొరకై వీరు కాలమును ధనమును వస్తూ సంపదను మరియు సమస్తమును వెనుకచూపు లేక వినియోగము చేసి సమర్పింపగలరు. వీరికి నష్టము కలుగుచున్ననూ శ్రమ కలుగు చున్ననూ, అనారోగ్యం కలుగుచున్ననూ లెక్కచేయక, సహాయము, సంరక్షణ, సేవలు చేయగలరు.
ప్రయాణమునకు సంబంధించిన వృత్తులు వీరికి అనుకూలములు. వాహనములు. నౌకలు, విమానములు, రైలుబండ్లపై తిరుగు వృత్తులలో వీరు రాణించెదరు. టూరింగు ఏజంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషదముల ఏజంట్లు, ప్రచారం చేయువారుగా వీరు నైపుణ్యము ప్రదర్శింతురు. వీటిపై జరిగే ఎగుమతి, దిగుమతి వ్యాపారము, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు పానీయములవ్యాపారాలు వీరికి బాగుగా కలిసి వచ్చును. ఉద్యోగముకన్న వీరికి వ్యాపారము లాభదాయకము. వైద్యవృత్తి, గ్రంథముల క్రయ విక్రయము ఉపరి పరిశ్రమ వ్యాపారము కూడా వీరికి లభించును.
భార్యా పుత్రులపై వీరికి ఆపేక్ష ఎక్కువ. ఇల్లువిడిచి ఎక్కువ కాలము ఉండలేరు. ఇతర ప్రదేశములు ఎంత సుఖవంతమైననూ వీరికి విశ్రాంతి లభించదు. వీరి జీవితభాగస్వామి తెలివైనది, ఇంటి నిర్వహణలో నేర్పరి. ఆదాయ వ్యయములపై జాగ్రత్త కల్గి ఉండును. వీరికి గృహ సౌఖ్యము, శయ్యాసన, వాహనాది సౌఖ్యాలుంటాయి.
బాల్యమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలుగవచ్చును. వివాహానంతరం స్థూల శరీరము కలుగగలదు. అలసట, ఆయాసం, దాహం, శ్వాసకోశాది వ్యాధులు కలుగవచ్చును. ముసలితనమున మధుమేహం (షుగర్, రక్తపోటు (బి.పి)) ఉదర, జీర్నాకోశ, లివర్ వ్యాధులు కలుగవచ్చును. నీరు పట్టుట, మూత్రపిండముల, మూత్ర నాళమూలా వ్యాకోచము, గుండె పెద్దదగుట కలుగవచ్చును. ఆహార పానీయాదుల నియమం, పరిమితి ఈ రాశివారికి చాలా ముఖ్యం. మద్యపాన అలవాటు గలవారు మానలేక పెరిగి దానితోనే మరణించు అవకాశమున్నది. ఉబ్బసం, క్షయవ్యాధి, నెత్తురు పడుట (దగ్గినప్పుడు) మున్నగునవి రాగల అవకాశములున్నవి. మనస్సు దిగులుతో ఉన్న తరుణంలో ఆరోగ్యం చెడును.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లలితకళల్లో మంచి ప్రావీణ్యం, గృహాలంకరణ, గృహోపకరణముల సేకరణ మొదలగు వాటిలో నైపుణ్యం ఉంటాయి. సంగీత సాధన వలన కంఠధ్వనిలో భక్తి, పారవశ్యం, హృదయ ద్రువీకరణ శక్తి కలుగును, ఈ రాశిలో పుట్టినవారు యోగ మంత్ర తంత్రోపాసన చేసిన ఫలితములు త్వరగా కలుగును, జ్యోతిర్విద్య నభ్యసించుట, ధ్యానం వీరికి సులభం. ఇవే కాక భక్తి యోగ సాధన కూడా సులభమే. లలితకళలు, యోగసాధన ద్వారా సులభముగా పరిపూర్ణత పొందగలరు. ఆత్మ సమర్పణ మార్గమున పరమ గురువులతో ఒకరికి జీవితమరపించుకొనుట, వారితో సూక్ష్మశరీర సంబంధములు విచిత్రానుభూతులు కలుగగలవు.