Vimaanam Noruleni Yantram విమానము నోరులేని యంత్రము
- పరుచూరి గోపాలకృష్ణ
ఆ రోజు అలసిపోయి ఇంటికి వచ్చాను. సామాన్యంగా గేటుదాటి అడుగు గుమ్మంలో పెట్టేలోపే "కాఫీ తాగుతారా "అని అడుగుతుంది మా ఆవిడ...అదే 'హాసం ' మొదటి సంచిక ద్వారా మీకు తెలిసిన బుజ్జి.అలా అడగడంలో నా మీద అభిమానం కంటే కాఫీ మీద ఆమెకు ప్రేమ ఎక్కువన్న సంగతి నాకు తెలిసినా తెలియనట్లు నటించి 'అలాగే 'అంటాను.
అసలు విషయం ఏమిటంటే ఇలాంటి పర్సనల్ విషయాలు పదిమందిలో చెప్పుకోగూడదు గాని, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు ఎనిమిది మంది భార్యలను కట్టుకుంటే ఆ ఎనిమిది గుణాలూ వున్నా భార్యను ఈ గోపాల కృష్ణడు కట్టుకున్నాడని నా నమ్మకం. నేను ఏదయినా భరించగలను కానీ మా ఆవిడ అలిగి మాట్టాడకుండా వుంటే భరించలేను.అందుకే నా ఫీలింగ్స్ ని దాచేస్తూ వుంటాను.
ఇంతకు చెప్పొచ్చేదేమిటంటే ఆ రోజు నేను గుమ్మం దాటి లోపలికి వచ్చినా 'కాఫే 'మాట ఎత్తలేదు.పుట్టిన రోజు దగ్గరకు వస్తోంది.నాతో ఏదో ఒకటి కొనిపించడానికి సీను స్టార్ట్ చేస్తోందా అని అనుమానం వచ్చింది.సీరియస్ గా టివి చూస్తోందామె.
“ఇంగ్లీష్ క్లాసు అయ్యిందా ?” అంది.
“ ఎనిమిదింటికి అయిపొయింది.ఎనిమిది పదికి ఇంట్లో వున్నాను "అన్నాను.
(ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను లెండి.అంటే అసలు రాదని కాదు. మాకు 'పరుచూరి బ్రదర్స్' అని పేరు పెట్టి ఆ పేరు ద్వారా ఈ రోజు తింటున్న అన్నం పెట్టిన అన్నగారి జ్ఞాపకార్థం ఒక పుస్తకం ఇంగ్లీష్ లో రాయాలని సంకల్పం.నేను తెలుగులో వ్రాసేస్తే మాకు ఇంగ్లీష్ నేర్పుతున్న హనుమంతరావు గారు నాలుగు రోజుల్లో ట్రాన్స్ లేట్ చేసి ఇస్తారు. కాని ఆయనే సలహా ఇచ్చారు.మీ ఇద్దరి అనుబంధం రాష్ట్రం మొత్తానికి తెలుసు మీ గుండె లోతుల్లో నుండు వచ్చే ఆ మాటలు మీ మాటలయితేనే బాగుంటుందని. అందుకే రోజూ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను.ఆ పుస్తకం రాయడం ఆవిడక్కూడా మహా ఇష్టం)
“ ఫెడరేషన్ పనులు పూర్తయ్యాయా ? ” ఎంటో కత్తులు నూరుతోంది.ఈ మధ్య మా చలన చిత్ర కార్మీక సమాఖ్య వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
అప్పట్నీంచీ ఆవిడ కోసం కేటాయించిన గంటల్లో కూడా నేను ఆవిడకు అందుబాటులో వుండడం లేదు.అయినా మార్క్సిస్ట్ నాయకుడి కూతురు కాబట్టి కార్మికుల కోసం కష్టపడడం ఇష్టమే. ఏ రూట్ లో వస్తుందో అర్థం కాలేదు.
" పొద్దున్న ఫోన్ లో చెప్పేసాగా... శివకృష్ణ, కళ్యాణ్ చూసుకుంటారు " అన్నాను.
“సిట్టింగ్ లు అయిపోయాయా...?”
ఈ మధ్య కొంచెం బిజీ ఎక్కువై రోజుకి రెండు మూడు ససిట్టింగ్ లకు వెళ్ళాల్సి వస్తోంది. ఏంటీ అన్ని అయిపోయినాయా అని అడుగుతోంది కొంపదీసి ఏదైనా దుర్వార్తా ?
“ అన్నీ అయిపోయినయ్ గాని...ఏంటి కొశ్చిన్ మీద కొశ్చిన్ వదులుతున్నావ్....ఎవరన్నా పోయారా ? ”
“ నా పరువు పోతోంది " అంది సీరియస్ గా.
“ నీ పరువా....? ఎవరు తీస్తున్నారు ?”
“ మీరే...” “ నేనా "
“లేకపోతే ఏంటి 'హాసం' రాజాగారు ఇప్పటికి ఆరవై సార్లు ఫోన్ చేసారని వంద సార్లు చెప్పాను. ఆయనతో మాట్లాడారా? ”
“అరె మరిచిపోయానోయ్ "
“ మీకేం మీరు తేలిగ్గా చెప్పేస్తున్నారు.ఆయన ఏమన్నారో తెలుసా...ఇందాక ఎవనుకోవద్దమ్మా...అసలు మీరు ఆయనకు నిజంగా చెబుతున్నారా అని అడిగారు.అక్కడికి నీరు మంచివాళ్ళు నేను చెడ్డదాన్ననేగా "
“ఛ ఛ... అదేం కాదు.నేనిప్పుడు ఫోను చేస్తాను"
“ చేసినప్పుడు మా ఆవిడ వందసార్లు చెప్పింది. నేనే మరిచిపోయాను అని చెప్పండి " అంది సీరియస్ గా . “అలాగే " అని ఫోన్ అందుకుని చెయ్యబోయి పెట్టేసాను.
“అదేంటి... మళ్ళీ ఏమొచ్చింది హలో చెబితెం బాగుంటుంది ప్లాటు దొరికింది అని చెబిటె సంతోషిస్తాడు.” అని ఆలోచించడం మొదలు పెట్టాను.
“కాఫీ తాగుతారా ? ”
“ఆ పని చెయ్.. మెదడుకి ఈ లోపు నేను కొంచం మేత వేస్తా...కాపీ కుడితిలాగా పోస్తే ఏదో ఒక ప్లాటు అందకపోదు " అని టి.వి. చూస్తున్నాను.
“ప్లాటు ఆలోచిస్తానని మళ్ళీ టి.వి.చూస్తారేంటి " అని కట్టేయబోయింది.
సెప్టెంబర్ 11వ తారీఖున డబ్ల్యు టి.వి. ని విమానం కొడుతున్న దృశ్యం కనిపిస్తుండగా టి.వి కట్ చేసింది.
“ప్లాటు దొరికింది " అన్నాను.
“ ఏది బడితే అది రాయబోకండి.' హాసం ' ఫారిస్ లో కూడా చదువుతున్నారంట "
“లేదు లేదు... అద్భుతమైన ప్లాటు దొరికింది "
“ ఈసారి దేని మీద రాస్తున్నారు ? ”
“ విమానం మీద " “ సరిపోయింది మొన్నకుక్క మీద... ఇవాళ విమానం మీదా!? ”
“ అవును అది కుక్క విశ్వాసము గల జంతువు. ఇది విమానము నోరులేని యంత్రము " “ఏంటీ...హాసానికి కథా...? అయిదో తరగతి పిల్లలకి పాఠమా ? ”
“ నువ్వెళ్ళి కాఫీ తీసుకురా... ఈ లోపు నేను ఆలోచించుకుంటాను " అన్నాను.
“ ముందు రాజా గారికి ఫోన్ చెయ్యండి " అంటూ వెళ్ళింది... ఫోన్ చేసాను.
“ హలో నేను పరుచూరి గోపాలకృష్ణ "
“ అమ్మయ్య "అన్నారు రాజాగారు.
“ అదేంటండి బాబూ... దొంగ దొరకగానే పోలీసోడు అన్నట్టు, కనిపించని వస్తువు కనిపించగానే పిల్లాడు అన్నట్లు 'అమ్మయ్య ' అన్నారేంటి ? ”
“ అమ్మో...అయ్యో...అనవలసిన వాణ్ణి...మీరు దొరికారు గనుక 'అమ్మయ్య' అన్నాను...ఇంతే"
“ప్లాటు దొరికింది"
“ఇకనేం ఇల్లు కట్టేయండి "
“చెప్పనా "
“వద్దు మహానుభావా...మీకేమన్నారాయడం కొత్తా... ముందు రాసెయ్యండి " అన్నారు రాజాగారు.
పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చిపెట్టింది బుజ్జి. ఆ పొగల్లో నుండి నాకు విమానం పొగలు కనిపించాయి.
******
అతని పేరు కుటుంబరావ్.పేరుకి తగ్గట్లు పెద్ద కుటుంబమే.అయిదుగురు కూతుళ్ళు కాపురానికి వెళ్ళిపోయారు. ఆరో కూతురికి కూడా పెళ్లి చేసేసాడు....కాపురానికి పంపించటమే మిగిలి వుంది. అంటే ఆ కాపురం ఆషాడమో, శూన్యమాసమో మూలంగా ఆగలేదు. వరకట్నం మూలంగా ఆగింది.
పాపం కుటుంబరావ్ అనుకున్నట్లు అనుకున్నవన్నీ ఇచ్చాడు కాని పెళ్లి కొడుకు మోటారుబైక్ కొనిమ్మని అడిగాడు. కొనిచ్చే పరిస్థితి లేక కుటుంబరావు చేతులెత్తేసాడు.కూతురు పుట్టింట్లోనే వుంది పోయింది.అల్లుడు అతని ఇంట్లోనే వుండిపోయాడు.
పాపం ఒకప్పుడు వెంకటగిరి ప్రాంతంలో ఎవరన్నా గట్లు మీద నిలబడి కుటుంబరావ్ ని 'మన పొలాలు ఎక్కడిదాకనండి 'అంటే " అదిగో దూరంగా తాటి తోపు కానొస్తుందే... ఆడదాకా...” అని కొంచెం గర్వంగానే చెప్పేవాడు.
ఒక్కొక్క కూతురు పెళ్ళిపీటల మీదకు ఎక్కడం ఒక్కొక్క చెక్క అతని పేరు నుంచి మారి పోవడం జరిగింది.ఇప్పుడు ఆఖరి కూతురికి ఇచ్చేయగా పదెకరాలు మిగిలి వుంది. పెళ్లి అప్పు వేరే వుంది. అలాంటి కుటుంబంలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా వుంది.ఎందుకంటే వాళ్ళ అల్లుడు వస్తున్నానని కబురు చేసాడు.
కామాక్షి కుటుంబరావు కూతురు. వెంకట్రావ్ భార్య.పెళ్ళయిన ఇన్నాళ్ళకి వస్తున్నానని కబురు చేసేసరికి మైసూర్ శాండిల్ సబ్బు మొత్తం అరిగిపోయేదాకా స్నానం చేసి,కళ్ళకు కాటుక పెట్టుకుని ముఖానికి దట్టంగా పౌడర్ రాసుకుని, నుదుట తిలకం దిద్ది, వాలు జడలో మంచి వాసన వస్తున్న మల్లెపూలు పెట్టి క్షణానికోసారి గుమ్మం దగ్గరకు వస్తోంది.
ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికయినా తనను చిన్నచూపు చూస్తే కోపం వస్తుంది.అదేంటో గాని మన భారతదేశంలో ఆడపిల్లలకి పెళ్లిపీటల మీద నుంచి లేవబోయిన మొగుణ్ణి చూసినా, పెళ్ళయ్యాక కట్నం ఇవ్వలేదని ఏడిపించే భర్తను చూసినా కోపం రాదు.అందుకు వారికి పాదాభివందనం చెయ్యాల్సిందే.
ఎన్ని మహిళా సంఘాలు గొంతెత్తి అరిస్తే మాత్రం బాధితురాలయిన మహిళా గొంతెత్తనిదే ఈ వరకట్నసమస్య తీరుతుంది.? అల్లుడి మీద కుటుంబరావు కోపం తెచ్చుకోలేదు.ముద్దుగా పెంచుకుంటున్న ఎర్ర పుంజుని కసక్కున మెడకోసి తన కూతురి కాపురానికి తగిలిన దిష్టి తీసి, మసాలా దట్టించి వేయించి, గారెలు కూడా వండిస్తున్నాడు.అతని ఇల్లాలు మహాలక్ష్మి ఇన్నాళ్ళకి కూతురు బతుకు కడతేరుతున్నందుకు "ఊరు కొన్నంత " ఆనంద పడిపోతూ వంట చేస్తోంది.
అందరి చూపులు ఏదో ఒక సమయంలో ఇంటి ముందున్న రోడ్ మీదే వున్నాయి. డగడగ సౌండ్ చేస్తూ...కొత్త మోటారు సైకిల్ మీద అల్లుడు వెంకట్రావ్ వస్తున్నాడు.
“ఏమేవ్ అల్లుడు వస్తున్నాడు....నీళ్ళు పట్రా "
“ఉదయాన్నే పెట్టిన ఆ గుమ్మం ముందే గంగాళంలో నీళ్ళు అల్లుణ్ణి చూసిన సంబరంలో నీళ్ళు కానొస్తున్నట్లు లేదా " అంది మహాలక్ష్మి.
తనూ సంతోషపడుతూనే కామాక్షి పరిగెత్తుకుంటూ వెళ్లి అద్దంలో మరోసారి ముఖం చూసుకుని మళ్ళీ పరుగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.
మోటారు సైకిల్ వచ్చి ఆగింది. ఓరగా తలుపు చాటునుంచి చూసింది. మనసు మంచిది కాదు గాని సినిమాల్లో ఈరో లెక్కనుండాడు అనుకుంది.అమ్మో మొగుడి మనసు మంచిదిగాడు అని అనుకోగూడదు.అని మనసులోనే చెంపలేసుకుంది...పెళ్ళినాటి కంటే కొంచెం ఒళ్ళు చేసాడు అనుకుంది.
చెంబుతో తనే నీళ్ళు ముంచి " డా అల్లుడూ...చాన్నాళ్ళకి మా మీద దయ కలిగింది.డా కాళ్ళు కడుక్కో " అన్నాడు కుటుంబరావు.
“ వచ్చింది కాళ్ళు కడుగుకోవటానికి, కాపురం చెయ్యటానికి కాదు "అమి పెడసరంగా సమాధానం చెప్పేసరికి దింపుతున్న కూరచట్టి చురుక్కున కాళింది మహాలక్ష్మికి...'అమ్మా ' అంది వాళ్ళమ్మను తలచుకుంటూ.
“ ఇది చూసినావా కొత్త మోటార్ సైకిల్... మా రెడ్డి దగర అప్పు చేసి కొన్నా. నలబై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు. ఏ రోజు కడితే ఆ రోజు ఇదే బండి మీద నీ ఇంటికి వచ్చి నీ కూతుర్ని మా ఇంటికి తీసుకువెళ్తా ".
“అది కాదల్లుడూ "
“వద్దు...చెప్పకుంటే దేశంలో వుండే వంద కోట్ల జనానికి ఎవడి ఇబ్బంది వాదికుంటుంది...నా ఇబ్బంది నాది ".
“అట్టా కాదల్లుడూ పదెకరాల చేను ఈ ఏడు దిష్టి తగిలేంతగా పెరిగింది.ఎకరానికి ముప్పై బస్తాలు కాడికవుతాయ్. అప్పు మెల్లగా తీర్చుకుంటా...కోత కోసి, కుప్ప నూర్చి అట్టనే అమ్మేసి ఆ డబ్బు పట్టుకొచ్చి ఇస్తా.... నా గౌరవం దక్కించు ".
“అక్కర తీరగానే అలుదు అడ్డగాడిదతో సమానం అని నేను చడువుండాన్లే మావా...ముందు పైకం పంపు ఆ తర్వాతే గదిలో గెడేసేది.” అని మోటారు సైకిల్ తిప్పుకుని వెళ్ళిపోయాడు.
ఏడుస్తున్న కామాక్షిని అక్కున చేర్చుకుంది మహాలక్ష్మి.దింపి వచ్చిన చట్టిలోవున్నకోడి మాంసం కుక్క ఆనందంగా బొక్క సాగింది.
*****
బరువుగా చేనువంక నడిచి వస్తున్నాడు కుటుంబరావ్.
“ ఏంది కుటుంబరావు...చేను తెగ దిగబడి ఇవ్వబోతుంటే మొఖం అట్టా ఏల్లాడేసేవేంది ? కొంచెం నవ్వు " అన్నాడు సుబ్బారెడ్డి.
“ ఏందీ నవ్వేది తడిక...మొత్తం పంటంతా అల్లుడు కాజేయడానికి జూస్తాండుగదా...ఇక ఈనకి బొక్కేదే దక్కేది " అన్నాడు రామిరెడ్డి అంటూ వుండగా పై నుంచి ఒక విమానం బయా కిందగా ఎగురుతోంది.
“ ఇదేంది రెడ్డి...ఇమానాలు దిగేది తిరపతిలో గదా మన ఎంకటగిరి పొలాల మీద దిగే మాదిరి వస్తావుండాదేందని " అంటున్నాడు.
ఇంతలో ఇంకా కిందకు వచ్చేసింది. చుట్టుపక్కల పొలాల్లో వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కుటుంబరావు చేల్లో లాండవుతోంది....విమానం...
“ అమ్మో నా చేను " అంటూ పరిగెత్తబోయాడు.
“ ఓరి నా పానుగాల ! అదేవన్న సైకిల్ బండనకున్నావా ఇమానమయ్యా " అంటూ అరిచాడు.
విమానం క్రాష్ లాండింగ్ అయ్యింది...మొత్తం పంటంతా నాశనం చేసుకుంటూ.... హడావుడిగా డోర్లు తెరిచారు.అందులో నుంచి కొంతమంది దిగుతున్నారు. 'ఓ....ఇమానం ఇమానం 'అంటూ చుట్టుపక్కల నుంచి వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చేసారు. కొన్ని వేలమంది పాదాల కింద పడి ధాన్యం.... మనుష్యులు తినే అన్నం మట్టిలో కలిసిపోతోంది...”నా చేను " అని రాబోతున్న కుటుంబరావ్ ని నెట్టేస్తున్నారు...
దిగేవాళ్ళలో సినిమా వాళ్ళున్నారు...రాజకీయ నాయకులున్నారు. తెరమీద కనిపిస్తే ఈల వేసినట్లు సినిమా వాళ్ళని చూసి ఈలలు వేస్తూ...డ్యాన్స్ లు చేస్తున్నారు జనం. కొందరయితే అప్పటికప్పుడే డప్పులు కొట్టుకుంటూ వస్తున్నారు.వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు అభిమానించే దేవుళ్ళు కనిపిస్తున్నారు.దేవతలు కనిపిస్తున్నారు.వాళ్ళు యముడి సింహద్వారం దాకా వెళ్లి తిరిగివచ్చారని వీళ్ళకి తెలియదు.
కుటుంబరావ్ కి మాత్రం కూతురి చెంగు నుంచి తెగిపోతూ వున్నా అల్లుడి బ్రహ్మముడి కనిపిస్తోంది. తీసి గూట్లో పెట్టేస్తున్న తాళి బొట్టు కనిపిస్తోంది.తగలబడిపోతున్న శుభలేఖ కనిపిస్తోంది...అలాగే కుప్పకూలిపోయాడు.
*****
ఆ తర్వాత చాలా నెలలు గడిచిపోయాయి.... విమానం దింపిన ఫైలెట్ కి సన్మానం జరిగింది.
కుటుంబరావ్ నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. విమానంలో ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ తీసుకు వెళ్ళిపోయారు. రెక్కలు తెగిన పక్షిలా అక్కడే పడి వుంది. ఎంక్వయిరీ ఇంకా పూర్తీ కాలేదు. మళ్ళీ కుటుంబరావ్ ఆఫీసుకు వెళ్లాడు.
“నువ్వే కుటుంబరావ్ అనీ... ఆ చేను నీదేననీ మాకు గ్యారంటీ ఏవిటయ్యా ? ”
“నేనే సార్ "
“రేషన్ కార్డుందా "
“లాగేసుకున్నారు సార్ "
“నేనేం చెయ్యలేను.నువ్వే కుటుంబరావ్ అని కలెక్టర్ ఆఫీసుకెళ్ళి లెటర్ తీసుకురా....ఆ చేను నీదేననీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి దస్తావేజు లెటర్ తీసుకురా...విమానం దిగినప్పుడు నీ చేను పంట మీదే వుంది అని మీ వూరి ఎం.ఆర్.ఓ.దగ్గర నుంచి లెటర్ తీసుకురా...”అంటూ డజను లెటర్లు తెమ్మన్నాడు.
ఒకతను పక్కగా వచ్చి మెల్లగా.... “ ఇవన్నీ తేలేకపోతే పదివేలు తీసుకురా...” అన్నాడు.
అసలే సగం తెలివున్న కుటుంబరావు వెళ్ళా ఇంటికి బయలుదేరాడు.
*****
ఇంటికి వచ్చే సరికి ఇంటి ముందు జనాలు మూగి వున్నారు.కుటుంబరావు అదిరిపడ్డాడు.
' కొంపదీసి కూతురేం అఘాయిత్యం చేయలేదు కదా...' అనుకుంటూ వస్తుండగా "హి హి హి " అని నవ్వుకుంటూ పరుగు తీసింది కామాక్షి.
“ ఏవయ్యింది "అన్నాడు భయంగా, అనుమానంగా.
“ నీ అల్లుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడంటయ్యా. ఆ వార్త విని నీ కూతురు పిచ్చిదైపోయింది.” అంటూ బావురుమంది.
కామాక్షి పరుగు తీస్తోంది. పరుగెత్తి, పరుగెత్తి...పరుగెత్తుకుంటూ చేను దగ్గరకు చేరుకుంది.
“అయ్...విమానం...ఓయ్ విమానం... " అని ఎండిపోయిన చేలో డాన్స్ చేసింది.అక్కడే కొందరు పిల్లలు విమానం ఎక్కి ఆడుకుంటుంటే....
" రేయ్ దిగండి... ఇది నా విమానం. దీన్నో నా తాళి బొట్టు పెట్టికొన్నా... దిగండి " అని గసిరింది. “ఇమానమా ఇమానమా నా కాపురం ఎందుకు చెడిపోయింది !? ” అని అడిగింది.
*****
ఏం సమాధానం రాయాలో తెలియక పెన్ను పక్కన పెట్టాను.
“ అయిపోయిందా " అని అడిగింది బుజ్జి.
“ ఆఖరి పేజి రాయాలి " అన్నాను.
“ ముందు నాకు థాంక్స్ చెప్పండి "
“ ఎందుకు ? ”
“ ఇందాక నేను టి.వి.కట్టేసినప్పుడు విమానం వచ్చి బిల్డింగుల్ని గుద్దే సీను చూసారు. అదే కథగా రాసారు గదా "
“ లేదు " అని రాసిన కథ చెప్పాను.
“ అప్పుడలా జరిగిందా ? ”
“కథలెప్పుడూ జరగవు...జరిగినట్టు రాస్తాం "
“ అప్పుడు మీ అన్నయ్య కూడా వున్నారుగా అందులో.... అడగండి "
“ ఇప్పుడు తను కాశీలో వున్నాడు...చిరంజీవి గారి సినిమా షూటింగ్ కి వెళ్లాడు.కథ పూర్తీ చేస్తే రాజా సంతోషిస్తాడు "
“ నాకు పుట్టినరోజు నాడు పాతిక వేలు గిప్ట్ ఇస్తానంటే ముగింపు చెబుతాను "
“ సరిపోయింది...బ్లాక్ మెయిలింగా ? ”
“ లేదు...ఒక్కోసారి మీకు తట్టనివి నాకు తడుతూ వుంటాయి కదా "
“ అలాగేలే చెప్పు " ఆవిడ ఇలా చెప్పింది.
“ పిచ్చి కామాక్షి ఇంకా అడుగుతూనే వుంది విమానాన్ని. ఈ నాటికీ అడుగుతూనే వుంది. నా కాపురం చెడిపోవడానికి కారణం ఎవరు ? అని.ఆ పిచ్చి తల్లికి తెలియదు విమానానికి నోరుండదు, అది నోరు లేని యంత్రం... వుంటే... దీనికి కారణం అందులో ప్రయాణీకులా ? దాన్ని తోలిన ఫైలట్లా ? నష్టపరిహారం అందించని ప్రభుత్వమా ? పిచ్చి ఆనందంలో పంటను మట్టిలోకి తొక్కేసిన ప్రజానీకమా ? అని అడిగితే.”
“ కాదమ్మా...వరకట్నం నిషేదించబడిన ఈ దేశంలో అధిక కట్నం ఇవ్వలేదని నిన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్న నీ మాజీ మొగుడిదీ " అని చెప్పి వుండేది.
“ థాంక్స్ బుజ్జీ గొప్పగా చెప్పావ్ "
“ నేనెప్పుడూ అలాగే చెబుతా....మీరే అర్థం చేసుకోరు. బంగారం కొంటానికి బయలుదేరుదామా ? ” “అవును...విమానం నోరులేని యంత్రం "
*****
( ఈ కథ జరగలేదు.అంతా కల్పితమే. ఇది ఎవర్ని నొప్పించడానికి, వొప్పించడానికి రాసింది కాదు...కేవలం హాసం (తెలుగు వన్) పాఠకులను మెప్పించటం కోసం మాత్రమే....)
- పరుచూరి గోపాలకృష్ణ