గుర్రపు కళ్ళెం
రాజాధిరాజ......రాజమార్తాండతేజ.....వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం ......రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది --- ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో యెప్పుడూ వుండేవి. వాటి సంరక్షణ, మాలిష్ కి ప్రత్యెక మనుషులు. రోజూ ఉదయం, సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన. తెల్ల దొరలు అతిధులుగా వచ్చినపుడు గుర్రపు పందేలుండేవి. అయన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆడమగ అందరూ ఐదో ఏట నించి గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సిందే. రేసుల సీజనులో సిటీకి వెళ్ళి రేసులలో పాల్గొనడం ఆయనకున్న వ్యసనాలలో ఒకటి. గుర్రాలకయితేనేం వాటి పోషణ కైతేనేం , రేసుల కైతేనేం , సాలీనా వేలకి వేలు ఖర్చు పెట్టె వాడాయన.
ఈ కధంతా ఈనాటిది కాదు. ఆ రంగరాజు గారు పోయి ఏభై ఏళ్ళు అయింది. అయన కొడుకు వేంకటపతిరాజాగారూ కాలధర్మం చేసి పదేళ్లయింది. వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు. రమేష్ చంద్ర రాజా కాదు, ఉత్తి రమేష్ చంద్రుడే అతను. వెంకటపతిరాజాగారి హయాములోనే జమీందారీలు పోయాయి. భరణాలు ఏర్పడ్డాయి. రంగారాజుగారితోటే సగం జమీ అయన వ్యసనాలకీ, సరదాలకి, విలాసాలకి తరిగిపోయింది. అయన కొడుకు వెంకటపతిరాజా మిగిలినది కర్పూరంలా వెలిగించాడు. ఇప్పుడు ఆ దివాణం కళకళలాడడం లేదు. ఆ దాసదాసీ జనం లేరు. విందులు, వినోదాలు లేవు. దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్లయిపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది. అది రమేష్ చంద్రగారి గుర్రం. అది ఏమయినా సరే అమ్మడానికి వీలులేదని పట్టు పట్టగా తోడు లేనిదానిలా ఒకే గుర్రం మిగిలింది.
రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక (వంటబట్టక ) విదేశంలో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళి పదిహేను రోజుల కిత్రమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు. రావడం పెద్ద ప్లానుతోనే వచ్చాడు. ఆ గ్రామంలో భూములు, అస్తులు అన్నీ అమ్ముకుని సిటీ వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని, ఆ విధంగా చదివిన చదువుని సార్ధకపరచుకోవాలని అనుకున్నాడు. విదేశాలలో వుండి వచ్చాక డర్టీ ఇండియాలో అందునా డర్టీ విలేజీలో వుండాలంటే అతనికి ముళ్ళ మీద వున్నట్టుంది. లంకంత కొంపకి ముసలి తల్లి సుభద్రా దేవి ---ఇద్దరు దాసీలు, ఇద్దరు నౌకర్లు....వూర్లో ఎటు చూసినా పచ్చని పొలాలు , చుట్టూ కొండలు - రైతులు, ఆవులు, గేదెలు - తప్ప సివిలైజ్ డ్ ఎట్ మాస్ ఫియర్ లేని ఆ డర్టీ వూర్లో దినమొక యుగంలా వుంది . ఆస్తులు అమ్ముకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనిదిగా వుందతనికి. ఎంతకని పుస్తకాలు చదవడం , ఎంత కని రెడియోగ్రాం వినడం ! ఉదయం గంట, సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ .....రికార్డ్సు - పుస్తకాలు తిండి- నిద్ర - పదిరోజులకే యీ జీవితం విసుగెత్తి ఎప్పుడూ పోదామా అని వుంది. ఫారిన్ లో అలవాటయిన మదిరతో పాటు మగువ కోసం అతనికి శరీరం తపిస్తుంది. ఇదే ఏ సిటీలోనో అయితే పర్సు బరువుని బట్టి టెస్టు బట్టి, కావాల్సినవారిని ఎన్నుకోవచ్చు. ఈ డర్టీ విలేజ్ లో పెడ పిసుక్కునే వాళ్ళు తప్ప ఎవరున్నారు? సాయంత్రం గుర్రపు స్వారీతో వంటి నిండా చెమట పట్టాక, వేడినీళ్ళ టబ్ బాత్ తరువాత వెచ్చవెచ్చని విస్కీ -- తరువాత అతనికి యింకా వెచ్చనిదేదో కావాలనిపించిచేది, కావాల్సింది దొరక్క -----నిద్రపట్టక ..... పక్క మీద దొర్లి.... తన మత్తులో నిద్రలోకి జారేవాడు. గత పదిహేను రోజులుగా అదే రొటీన్ తో విసుగెత్తిపోయిన అతనికి.....
ఆ తెల్లారి..... అంటే అతని సంభాషణలో.....ఉదయం తోమ్మిందింటికీ లేవగానే ....కిటికీ లోంచి .....ఓ జవ్వని దర్శన మిచ్చింది. బంతిపువు రంగు చీరకి ఎర్రంచు , పచ్చ జాకెట్టు - జడలో చామంతులు ....నెత్తిన పచ్చ గడ్డి మోపుతో వయ్యారంగా గుర్రాలశాల వైపు వెడుతుంది. గుర్రాల శాలలో రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు. దూరం నించే చూసినా రమేష్ కళ్ళలో కాంతి వచ్చింది ఆమెని చూడగానే. యిన్నాళ్ళకి తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది . బ్రష్ నోట్లో పెట్టుకునే చకచక మేడదిగి గుర్రాల శాలవైపు వెళ్ళాడు. గడ్డిమోపు కింద పడేసి వంగుని గడ్డి విప్పి గుర్రం ముందు వేస్తుంది. వంగున్న ఆమె వంపు సొంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది. చామనచాయ అయితేనేం ఆమె మోహంలో మంచి కళ వుంది. పెద్ద పెద్ద కళ్ళు - తీర్చినట్లున్న కనుబొమలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక, వంకుల జుత్తు లొంగక చెల్లాచెదరై నుదుటిని పడుతుంది. ఏదో నవ్వుతూ రంగడితో మాట్లాడుతుంటే తెల్లటి పలువరుస తళుక్కుమంది.పెదాలు కాస్త నల్లగా వుంటేనేం ఆ పెదాలలో, కళ్ళలోనే ఏదో ఆకర్షణ వుందనిపించింది రమేష్ కి. ఆ ఎత్తు , లావు, నడుం, అబ్బ ఏం ఫిగర్ ....అందగత్తె కాదు.....కాని ఆమెలో ఏదో ఆకర్షణ ....దీన్నే గాబోలు యింగ్లీషులో స్మార్ట్ నెస్ అంటారు. ఉత్తి స్మార్ట్ నెస్ కాదు సెక్సీగా వుంది. ఈ లలనామణి హటాత్తుగా ఎక్కడనించి వచ్చిపడింది. అసలేవరు? ఇన్నాళ్ళు తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి? వాటే లక్కీ డే.....ఓహో ఆ పల్లెటూరి డ్రస్సు లోనే యింత ఆకర్షణీయంగా వుంది. కాస్త నాజూకు డ్రసింగ్ అవుతే .....ఆమె వలువల్ని, తలపుల్లో వలచి చూసి ఆనందిస్తున్నాడు. ఆశగా, ఆబగా .....అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడ పడ్డాడు. రంగడు నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు.....రమేష్ ని చూసి సిగ్గుతో మెలికలు తిరిగి ఒక్క గెంతులో రంగడి వెనక్కి పరిగెత్తింది.
"రంగా......ఎవర్రా...." అన్నాడు రమేష్ కళ్ళేగరేసి సీతాలుని చూపిస్తూ.
"మా ఆడదండి ..." రంగడు సిగ్గుపడ్తూ అన్నాడు.
"ఓహో.....పెళ్ళాడావా.....యెప్పుడు....?"
"మొన్నే నండి, ఆర్నెల్లయిందండి ...."
"అలాగా.....మరిన్నాళ్ళూ ....ఎప్పుడూ చూడలేదే...." సీతాలునే మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్.
'అల్లమ్మకి వల్లు బాగునేదంటే కన్నోరింటికెళ్ళి నిన్నే వచ్చిందండి..."
"అదా సంగతి ....ఒరేయ్ నీ పెళ్ళాం బాగుందిరా....మంచి పెళ్లాన్నే సంపాదించావు. పెరెంటిరా?.....' చనువుగా అడిగాడు.
"సీతాలచ్చండి... సీతా అంటానండి....' యజమాని భార్యని పోగిడినందుకు సంబరంగా, గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు.
సీతాలు సిగ్గుల మొగ్గ అయింది. కళ్ళ చివర్ల నించి చిన్నదొర మిసమిసలాడే రంగుని, వేసుకున్న ఖరీదయిన నైట్ సూట్, మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లె పూవు లాంటి కాళ్ళని , నిగనిగలాడే వంకీల క్రాపుని , చేతికున్న ఖరీదయిన వాచిని .....అన్నీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడనుకుంది సీతాలు.
"వరేయ్ రంగా, మీ సీతాలే కనక సిటీలో వుంటే సినిమా స్టార్ ని మించి పోయేది .....కాస్త షోగ్గా డ్రస్సయిందంటే ....మరి చూసుకో....మంచి ఫోటో జేనిక్ ఫేస్ రా....అనక ఎండ తగ్గేలోపల ఫోటోలు తీస్తాను యిద్దరూ ముస్తాబయి రండిరా ....సీతాలు మంచి చీర కట్టుకురా....రంగా ...నీవూ ......ఆ వేషం తీసి శుభ్రంగా రా....' అన్నాడు.
చిన్నదొర ఆదరభిమానాలకి పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బ అయిపోతూ యిద్దరూ దండాలు పెట్టారు. మొదటిసారే యింకా చూస్తె బాగుండదన్నట్టు రమేష్ అయిష్టంగానే అక్కడ నించి కదిలి లోపలికి వెళ్ళాడు.
* * * *
మధ్యాహ్నం రంగడు సీతాలు యిద్దరూ అతి వుత్సాహంగా ముస్తాబయి ఫొటోలకి వచ్చారు. సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ నైలక్స్ చీర కట్టి గులాబి రంగు జాకెట్టు తొడిగి, తోటలో గులాబీలు తలలో పెట్టుకొని నీటుగా కాటుక, బొట్టు పెట్టి తయారైంది. రంగడు రమేష్ యిచ్చిన పాత ప్యాంట్ షర్టు తొడుక్కుని సంబరంగా సీతాలు పక్కన నిలబడ్డాడు. గులాబీ చీరలో ఉదయం కంటే ఆకర్షనీయంగా వున్న సీతాలుని చూసి గుటకలు మింగాడు రమేష్. అతని మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. ఫోటోలు తీసే నెపంతో ....'అరె ....అలా మొహం వంచకూడదు , ' అలా కాదు యిటు చూడాలి -' 'ఇలా నవ్వాలి ' ......'ఇలా దగ్గిరగా నిలబడు ' అంటూ గడ్డం ఎత్తి - భుజాలు పట్టుకుని..... అనేక రకాల ఫోజుల్లో నిలబెట్టాడు ఆమెని తాకుతూ ....సీతాలు చిన్న దొరగారి స్పర్శకు ముడుచుకుపోతుంటే - ' ఏటే అలా మెలికలు తిరగ తండవు. దొర చెప్పినట్టు చూడు " అన్నాడు రంగడు. ఫోటోల కార్యక్రమం అయ్యాక ---" వరేయ్ రంగ మేడమీదకి రండిరా పాటలు విందురు గాని, రా సీతాలు నా దగ్గర అంత సిగ్గేమిటి "