![]() |
![]() |
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతుండటంతో తమిళనాడులోని కోయంబత్తూరు గంగా హాస్పిటల్‌లో అత్యంత జాగ్రత్తల మధ్య విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. గత కొంతకాలంగా ఈ మణికట్టు సమస్య చరణ్‌ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ, షూటింగ్ షెడ్యూళ్లకు ఆటంకం కలగకుండా ఉండేందుకు శస్త్రచికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో సరైన సమయం చూసుకుని ఈ మైక్రో సర్జరీని ప్లాన్ చేశారు.
ఈ శస్త్రచికిత్స ప్రక్రియకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ స్వయంగా నాయకత్వం వహించారు. ఆర్థోపెడిక్ విభాగంలో దశాబ్దాల అనుభవం కలిగిన ఆయన, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న ఒక లెజెండ్రీ వైద్యులు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి అత్యంత క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించిన ఘనత డాక్టర్ రాజశేఖరన్‌కు ఉంది. నాటి నుండి మెగా కుటుంబంతో ఆయనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంటూ వస్తోంది.
రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ కావడంతో పాటు వరుస యాక్షన్ సినిమాలలో నటిస్తున్న తరుణంలో, మణికట్టుకు అత్యుత్తమ చికిత్స అందించాలనే సంకల్పంతో అమెరికాలోని మయామికి చెందిన ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. చేతి, మణికట్టు శస్త్రచికిత్సలలో, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీలలో డాక్టర్ బాడియా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిపుణులు. సాధారణంగా ఆయన అపాయింట్‌మెంట్ దొరకడమే ఒక సాహసం లాంటిది, అలాంటిది ఒక టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఆయన ప్రత్యేకంగా భారత్‌కు రావడం ఆసక్తికరంగా మారింది.
డాక్టర్ ఎస్. రాజశేఖరన్, అమెరికా సర్జన్ డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ తమ వైద్య నిపుణుల బృందంతో కలిసి ఈ శస్త్రచికిత్సను ఎంతో నైపుణ్యంతో పూర్తి చేశారు. సర్జరీ అనంతరం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత సంతృప్తికరంగా ఉందని, రికవరీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని వైద్యులు ధృవీకరించారు. మరో 4 రోజుల పాటు కోయంబత్తూరులోని ఆసుపత్రిలోనే పూర్తి విశ్రాంతి తీసుకున్న అనంతరం, వైద్యుల సలహా మేరకు రామ్‌చరణ్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
చరణ్ శస్త్రచికిత్స సమయంలో చిరంజీవి, సురేఖ దంపతులు అలాగే ఉపాసన కొణిదెల కోయంబత్తూరులోనే ఉండి ఆయన పర్యవేక్షణ చూసుకున్నారు. వైద్యుల ప్రత్యేక బృందం పర్యవేక్షణలో రామ్ చరణ్ వేగంగా కోలుకుంటుండటంతో మెగా అభిమానులు తీవ్ర ఉపశమనం పొందారు. రామ్ చరణ్ పూర్తిగా కోలుకుని, మరింత శక్తివంతంగా, ఉత్సాహంతో తన రాబోయే భారీ ప్రాజెక్టుల చిత్రీకరణల్లో పాల్గొనాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
![]() |
![]() |