![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ స్టార్స్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్ కి పేరుంది. బిగ్ స్టార్స్ తో తలపడి ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి సంక్రాంతి హిట్స్ ని శర్వానంద్ సొంతం చేసుకున్నాడు. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు కావడం విశేషం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. (Nari Nari Naduma Murari Trailer)
రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన 'నారీ నారీ నడుమ మురారి' ట్రైలర్ సరదాగా ఉంది. టైటిల్, టీజర్ చూసినప్పుడే ఇది ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో కథ అని అర్థమైపోయింది. అయితే దీనిని 'సామజవరగమన' తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కించారని తాజా ట్రైలర్ తో స్పష్టమైంది.
"అమ్మాయిలు అంకుల్స్ తో జాగ్రత్త.. ఇట్లు మీ లవకుమార్" అని రాసున్న ఆటోని చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఆటో డ్రైవర్ గా సత్యను పరిచయం చేశారు. పొట్ట ఎక్కువగా ఉన్న మహిళను చూసి.. ప్రెగ్నెంట్ లేడీ అని సత్య పొరబడటం కామెడీగా ఉంది. ఇంజనీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తున్న గౌతమ్ అనే యువకుడిగా శర్వానంద్ కనిపిస్తున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వా పాత్రను చూపించారు. శర్వానంద్, నరేష్ తండ్రీకొడుకులుగా కనిపించారు. 'మళ్లీ పెళ్లి' చేసుకున్న నరేష్.. "నాదో చిన్న కోరికరా. నీ తమ్ముడు, నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ" అని శర్వాతో చెప్పిన డైలాగ్ బాగా పేలింది. నరేష్, సత్య, సంపత్, సునీల్, వెన్నెల కిషోర్, సుదర్శన్ పాత్రలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని ట్రైలర్ హామీ ఇచ్చింది.
సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ హవా ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి సినిమాకి ఉండాల్సిన లక్షణాలు 'నారీ నారీ నడుమ మురారి' ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మరి ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కి.. ఈ సినిమా ద్వారా మరో సంక్రాంతి విజయం దక్కుతుందేమో చూడాలి.
![]() |
![]() |