![]() |

తారాగణం: మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, అలీ, నేహా సక్సేనా తదితరులు
డీఓపీ: ఆంటోనీ శాంసన్
ఎడిటర్: కె. ఎం. ప్రకాష్
సంగీతం: సామ్ సి.ఎస్
దర్శకత్వం: నంద కిషోర్
బ్యానర్స్: కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025
మలయాళ స్టార్ మోహన్ లాల్ కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు ఇక్కడ మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు 'వృషభ' అనే ఫాంటసీ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పునర్జన్మల నేపథ్యం కావడం, ఇందులో మోహన్ లాల్ రాజుగా కనిపించడంతో.. 'వృషభ'పై ప్రేక్షకుల దృష్టి పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? (Vrusshabha Movie Review)
కథ:
త్రిలింగ రాజ్య పాలకులైన 'వృషభ' వంశస్తులు శివుని సేవకులు. అత్యంత శక్తివంతమైన స్పటిక లింగానికి ఆ వంశం రక్షణగా నిలబడుతుంది. ఎందరో దుష్టులు ఆ స్పటిక లింగాన్ని దక్కించుకోవడానికి విఫలయత్నం చేస్తారు. ఒకసారి ఓ దుష్టుడికి శిక్షించే క్రమంలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) వదిలిన బాణం కారణంగా అభంశుభం తెలియని పసివాడు మరణిస్తాడు. కళ్ళముందే బిడ్డను కోల్పోయిన తల్లి.. నీకు కూడా ఇదే గతి పడుతుందని రాజుని శపిస్తుంది. ప్రస్తుతంలో ఆది దేవ వర్మ(మోహన్ లాల్)ను ఆ గతం వెంటాడుతూ ఉంటుంది. దేవనగరి అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆది.. పెద్ద బిజినెస్ మేన్ గా ఎదుగుతాడు. అయితే అతనికి కలలో తరచూ వృషభకు సంబంధించిన సంఘటనలు కనిపిస్తుంటాయి. దీంతో తన తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి తేజ్(సమర్జిత్ లంకేష్) ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే తన తండ్రికి, తనకి ప్రాణహాని ఉన్న దేవనగరి గ్రామంలోకి అడుగుపెడతాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? అక్కడ ఆది దేవ వర్మకు వచ్చిన ఆపద ఏంటి? ఆది, తేజ్ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పునర్జన్మల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. 'వృషభ' కూడా ఆ కోవకు చెందినదే. మనకు పునర్జన్మల నేపథ్యంలో రాజుల కథ అంటే ముందుగా గుర్తుకొచ్చేది మగధీర. అందులో కథాకథనాలు కట్టిపడేస్తాయి. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే.. చాలా సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ, 'వృషభ' మాత్రం ఆ దరిదాపుల్లో కూడా లేదు.
పూర్వ జన్మలో పెద్ద రాజు అయ్యుండి, ప్రస్తుత జన్మలో ఆ జ్ఞాపకాలు వెంటాడం అనేది మంచి కాన్సెప్టే. పైగా, ప్రాణంగా ప్రేమించే వ్యక్తే మన ప్రాణం తీయాలనుకుంటే.. ఆ బాధ వర్ణాతీతం. కథలో భారీతనానికి, భావోద్వేగాలకు రెండింటికీ మంచి స్కోప్ ఉంది. విజువల్స్ తో వావ్ అనిపించవచ్చు, అలాగే ఎమోషన్స్ తో కట్టిపడేయవచ్చు. కానీ, ఈ సినిమా విషయంలో ఆ రెండూ జరగలేదు.
త్రిలింగ రాజ్య పాలకుడిగా రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) కథతో సినిమా ప్రారంభమవుతుంది. సెట్స్, విజువల్స్ తో మ్యాజిక్ చేయలేకపోయినప్పటికీ.. అంతో ఇంతో పరవాలేదు అనుకునే స్థాయిలో సినిమా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతంలో సినిమా పూర్తిగా గాడి తప్పిపోయింది. తండ్రీకొడుకుల బాండింగ్ ని హత్తుకునేలా చూపించలేకపోయారు. నిజానికి ఫస్ట్ హాఫ్ లో ఆ బాండింగ్ ఎంతలా కనెక్ట్ అయితే.. సెకండాఫ్ కి అంత వెయిట్ వచ్చేది. కానీ, పునాదే సరిగ్గా లేకపోవడంతో ఆ ఎమోషన్ తో ప్రేక్షకులు పెద్దగా ట్రావెల్ కాలేరు.
ప్రేమ కథ కూడా ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. ఫస్ట్ హాఫ్ లో మొత్తంలో ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే సర్ ప్రైజ్ చేస్తుంది. సెకండాఫ్ లో ప్రస్తుతం కంటే గత జన్మ తాలూకూ కథను ఎక్కువగా చూపించడం కాస్త రిలీఫ్ అని చెప్పవచ్చు. అయితే రైటింగ్, మేకింగ్ పరంగా మాత్రం పెద్దగా మ్యాజిక్ కనిపించదు. విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ఆర్టిఫిషయల్ గానే అనిపిస్తాయి. క్లైమాక్స్ ని డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్ లో మంచి సీన్స్ పడుంటే.. ఎమోషన్ వర్కౌట్ అయ్యుండేది.
సినిమాలో చాలా సీన్స్ ని డైలాగ్స్ తో నింపేశారు. ఆర్టిస్టులు వరుసగా డైలాగ్స్ చెబుతూ ఉంటారు. అలాగే, కథ కూడా అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. మెజారిటీ సన్నివేశాలలో కొత్తదనం లేకపోవడంతో.. సినిమా నిడివి రెండు గంటలే అయినా చూసే ప్రేక్షకులకు బోర్ కలుగుతుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
రాజా విజయేంద్ర వృషభ, ఆది దేవ వర్మ పాత్రల్లో మోహన్ లాల్ ఎప్పటిలాగే బాగానే రాణించారు. అయితే ఆ పాత్రలను మలిచిన తీరు, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో.. ఆయన కష్టం వృధా అయింది. సమర్జిత్ లంకేష్ కూడా బాగానే నటించినప్పటికీ.. మోహన్ లాల్ ముందు తేలిపోయాడు. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, అలీ, నేహా సక్సేనా తదితరులు పాత్రల పరిధి మేర నటించారు.
కథకుడిగా, దర్శకుడిగా నంద కిషోర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. మోహన్ లాల్ బ్రాండ్ ని క్యాష్ చేసుకోవడం కోసమే ఈ సినిమా తీసినట్టుగా ఉంది. సాంకేతికంగా కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. విజువల్స్ తేలిపోయాయి. సెట్స్ ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి. ఆంటోనీ శాంసన్ కెమెరా పనితనం మ్యాజిక్ చేయలేకలేదు. సామ్ సి.ఎస్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు.
ఫైనల్ గా..
నిడివి తక్కువే ఉన్నప్పటికీ, నీరసం తెప్పించే సినిమా.. వృషభ.
రేటింగ్: 1.75/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
![]() |