![]() |
![]() |
సీనియర్ నటుడు సాయికుమార్ నట వారసుడిగా ‘ప్రేమకావాలి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఆది సాయికుమార్. తొలి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకొని యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘లవ్‌లీ’ చిత్రం కూడా మంచి హిట్‌గా నిలిచింది. 2013లో ఆది హీరోగా వచ్చిన ‘సుకుమారుడు’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘షణ్ముక’ వరకు దాదాపు 20 సినిమాల్లో హీరోగా విభిన్నమైన పాత్రలు పోషించారు. వాటిలో ఒకటి, రెండు తప్ప ఆది కెరీర్ గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగపడలేదు. అయితే అతనికి ప్రతి సినిమాలోనూ నటుడిగా మంచి పేరు వచ్చింది.
అందం, అభినయం ఉంటూనే ఒక కమర్షియల్ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగిన తన కుమారుడు సక్సెస్‌ఫుల్ హీరోగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని సాయికుమార్ తపనపడ్డారు. ఒక సాలిడ్ హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి హిట్ సినిమా.. తాజాగా విడుదలైన ‘శంబాల’ రూపంలో వచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్ టాక్ వస్తోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆది హిట్ ట్రాక్‌లోకి వచ్చినట్టేనని రిపోర్ట్స్ చెబుతున్నాయి. పురాణాలను లింక్ చేస్తూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ అనే సైంటిస్ట్ పాత్రను ఆది సమర్థవంతంగా పోషించారని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దీన్నిబట్టి ఆది కెరీర్‌కి ఇక ఢోకా ఉండదనేది అర్థమవుతోంది.
![]() |
![]() |