![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ కి ముందు వరకు ఎన్టీఆర్ నటన గురించి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన నటన గురించి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి.. ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి బడా ఆఫర్స్ ఎన్టీఆర్ తలుపు తడుతున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అలాగే టీ-సిరీస్ సైతం ఆయనతో ఓ భారీ పాన్ ఇండియా ఫిల్మ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే హాలీవుడ్ సైతం ఎన్టీఆర్ వైపు చూస్తుండటం ఆసక్తికరంగా మారింది.
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ తన తాజా మార్వెల్ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ-3' ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బోను నుంచి పులులతో కలిసి జంప్ చేసిన యాక్టర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని, భవిష్యత్తులో అతనితో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. హాలీవుడ్ ప్రముఖుల దృష్టి ఎన్టీఆర్ పై పడటం చూస్తుంటే.. బాలీవుడ్ ఎంట్రీతో పాటు త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
![]() |
![]() |