![]() |
![]() |

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు క్రేజీ హీరోలు కనిపిస్తే ఆ మజానే వేరు. ఇప్పుడు అలాంటి ఒక సూపర్ కాంబినేషన్‌ను సెట్ చేసి ట్రేడ్ వర్గాల్లో భారీ హల్చల్ సృష్టిస్తున్నారు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది.
ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 18న సాంప్రదాయ పూజా కార్యక్రమంతో ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 22 నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు ‘జనవరి 13 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇక విక్టరీ వెంకటేష్ జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో అనిల్ రావిపూడి మొదటగా కళ్యాణ్ రామ్ మరియు కృతి శెట్టిలపై వచ్చే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ లోపు వెంకటేష్ తన మునుపటి సినిమా బాధ్యతల నుండి ఫ్రీ అయి ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్స్‌లోకి అడుగుపెడతారు.
ఈ సినిమాను ఒక పక్కా ఫ్యామిలీ అండ్ పండగ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి మలుస్తున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్స్ తర్వాత వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు కళ్యాణ్ రామ్ తోడవడంతో బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
నిర్మాతలు ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా 2027 జనవరి 13న విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |