Home  »  News  »  'వారణాసి' BGM కోసం కీరవాణి సంచలన నిర్ణయం.!

Updated : Jul 28, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం దర్శక నిర్మాతలు ఏ చిన్న విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా గ్రాండ్ విజువల్స్ కి తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (రీ రికార్డింగ్) అందించడానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. 

సాధారణంగా ఎంతటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కైనా కీరవాణి కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే అద్భుతమైన రీ రికార్డింగ్ పూర్తి చేసి ఇచ్చేస్తుంటారు. కానీ 'వారణాసి' సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన ఏకంగా 5 నెలల భారీ సమయాన్ని కేటాయిస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అవసరమైతే ఈ రీ రికార్డింగ్ వర్క్ కోసం ఏకంగా 6 నెలల వరకు సమయం తీసుకోవడానికి కూడా కీరవాణి మానసికంగా సిద్ధమయ్యారంటే ఈ చిత్రం విజయం కోసం ఎంతటి శ్రమ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

రాజమౌళి-కీరవాణి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన ప్రతీ సినిమా కూడా మ్యూజికల్ గా, రీ రికార్డింగ్ పరంగా సంచలన విజయం సాధించింది. కానీ ఈసారి మొదటిసారిగా వీరిద్దరూ పాన్ వరల్డ్ స్థాయిలో అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించడానికి వస్తుండటంతో ప్రతీ ఒక్క ఫ్రేమ్ వెనుక వినిపించే సంగీతం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన 'వారణాసి' థీమ్ మ్యూజిక్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ థీమ్ ట్రాక్ లోనే కీరవాణి తనదైన ప్రతిభను చూపిస్తూ ఆడియన్స్ లో సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లో ప్రతీ చిన్న సౌండ్ వినియోగంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

రీ రికార్డింగ్ విషయానికి వస్తే, 2026 సెప్టెంబర్ నుంచే కీరవాణి మ్యూజిక్ వర్క్స్ అధికారికంగా ప్రారంభించి, 2027 జనవరి నాటికి పూర్తి స్థాయిలో బీజీఎమ్ వర్క్స్ ముగించాలని షెడ్యూల్ ని లాక్ చేశారు. దాదాపు ఐదు నుండి ఆరు నెలల సుదీర్ఘ సమయం కేవలం మ్యూజిక్ కోసం కేటాయించడం అనేది భారతీయ సినిమాలో అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో అడుగు పెట్టనుంది.

 

 

Varanasi, Re Recording, MM Keeravani, Mahesh Babu, SS Rajamouli

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.