Home  »  News  »  The India Story: 'ది ఇండియా స్టోరీ' టీజర్ రివ్యూ.. ఒళ్ళు గగుర్పొడిచే నిజాలతో వస్తున్న కాజల్ అగర్వాల్!

Updated : Jun 5, 2026

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది ఇండియా స్టోరీ' (The India Story). జీ స్టూడియోస్, మిగ్ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. సమాజంలో మన కళ్లముందే జరుగుతున్న ఒక భయంకరమైన, చేదు నిజం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

మనం రోజూ తినే ఆహారం ఎంతలా కలుషితం అవుతోంది, అది మన ప్రాణాల మీదకు ఎలా తెస్తోంది అనే సున్నితమైన, ఆలోచింపజేసే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. "ఇండియాస్ మోస్ట్ షాకింగ్ ట్రూత్" అంటూ ప్రారంభమైన ఈ టీజర్, దేశంలో జరుగుతున్న కల్తీల వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆహార పదార్థాల్లో, పాలలో కెమికల్స్ కలపడం.. కూరగాయలు, పండ్లలో ఇంజెక్షన్లు గుచ్చడం వంటి దారుణాలను ఈ టీజర్‌లో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించారు.

కల్తీ ఆహారం వల్ల దేశంలో ప్రతి 60 సెకన్లకు ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారనే షాకింగ్ గణాంకాలను కూడా ఈ టీజర్‌లో ప్రస్తావించారు. ప్రతి ముగ్గురిలో ఒక కుటుంబం క్యాన్సర్ లాంటి మహమ్మారితో పోరాడుతుందని, ఏటా కోటి మందికి పైగా దీనివల్ల చనిపోతున్నారనే చేదు నిజాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. "ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్" అంటూ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని కరెక్ట్‌గా ఎలివేట్ చేశారు. ఈ  టీజర్‌లో ఒక చిన్న పాప "అమ్మా ఈరోజు వంటలో ఏం చేసావ్?" అని అడిగే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తుంది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గ్లామర్ పాత్రలకే కాకుండా ఇలాంటి సందేశాత్మక చిత్రాల్లో నటించడానికి ఆమె ముందుకు రావడం విశేషం. చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథను అందిస్తూ నిర్మించారు. బలమైన కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా జూలై 24, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతుండగా, ఇదొక కనువిప్పు కలిగించే సినిమా అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.