![]() |
![]() |

నందమూరి కుటుంబం అంటేనే తెలుగు చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ ఒక చెరగని ముద్ర. స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్థాపించిన ఆశయాలు, నందమూరి హరికృష్ణ చూపించిన బాటను ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబం నుంచి మరొక ప్రముఖ వ్యక్తి ప్రజా సేవలో చురుగ్గా ముందుకు వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె ఎవరో కాదు... స్వర్గీయ నందమూరి జానకీరామ్ సతీమణి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లకు వదిన అయిన నందమూరి దీపికా జానకీరామ్.
ఇటీవల కాలంలో నందమూరి దీపిక చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్వర్గీయ జానకీరామ్ జ్ఞాపకార్థం, ఆయన సేవా స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు "నందమూరి జానకీరామ్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, దాని ద్వారా నిరుపేదలకు, చిన్నారులకు, విద్యార్థులకు నిరంతరం అండగా నిలుస్తున్నారు.
తాజాగా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమంలో నందమూరి దీపిక స్వయంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అంగన్‌వాడీ చిన్నారులతో ఆమె ఆప్యాయంగా ముచ్చటించి, వారి ముద్దుల నవ్వులను తిలకించడం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
https://www.instagram.com/p/DbDaTGQFDwF/
"పిల్లలు దైవ స్వరూపులు... వారి చిరునవ్వుల్లోనే దేవుడి ఆశీర్వాదం కనిపిస్తుంది. చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారికి మెరుగైన విద్య, మంచి ఆరోగ్యం, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం మనందరి సామాజిక బాధ్యత" అని ఈ సందర్భంగా దీపిక గారు పేర్కొన్నారు.
"సేవే మా సంకల్పం... చిన్నారుల సంక్షేమమే మా లక్ష్యం" అనే నినాదంతో ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆమె ముందడుగు వేస్తున్నారు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలలు, దివ్యాంగులు, పేద కుటుంబాల అవసరాలను గుర్తించి నందమూరి జానకీరామ్ ట్రస్ట్ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
https://www.instagram.com/reel/DbDoZHITWAQ/
నందమూరి జానకీరామ్ గతంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన తనయులు మాస్టర్ ఎన్టీఆర్, మాస్టర్ సౌమిత్రి ఇప్పటికే 'దాన వీర శూర కర్ణ' బాలల చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. చిన్న ఎన్టీఆర్ త్వరలోనే హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
భర్త ఆశయాలను, నందమూరి వంశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను దీపిక భుజస్కంధాలపై వేసుకున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చేయూతనిస్తూ, విద్యార్థుల చదువుకు ఆసరాగా నిలుస్తున్న ఆమెను చూసి నందమూరి అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాక్షేత్రంలో దీపిక ఇంత చురుగ్గా పాల్గొంటుండటంతో, త్వరలోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో కూడా దీపిక ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపిన విషయాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాజకీయ ప్రకటనలు ఏవీ చేయకపోయినప్పటికీ, ప్రజా సేవ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తీరు చూస్తుంటే, నందమూరి వారసత్వాన్ని ప్రజాసేవలో సరికొత్తగా చాటేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, జానకీరామ్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుస్తూ నందమూరి దీపిక సాగిస్తున్న ఈ సేవా ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Nandamuri Deepika, Public Service, Nandamuri Janakiram, NTR, HariKrishna
![]() |
![]() |