Home  »  News  »  ఓటీటీలోకి వచ్చేసిన 'పెద్ది'.. హిందీ వెర్షన్‌లో ట్విస్ట్.. రన్ టైమ్ ఎంతంటే?

Updated : Jul 9, 2026

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చేసింది. రామ్ చరణ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో జూన్ 4న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, ఐదు వారాల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ఫ్లిక్స్' (Netflix) లో అడుగుపెట్టింది. జులై 9, గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. 

అయితే ఈ ఓటీటీ రిలీజ్‌లో అందరూ ఊహించినట్లుగానే రన్ టైమ్ విషయంలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలు ఉండగా, కొన్ని కారణాల వల్ల కొన్ని సీన్స్ కట్ చేసి 3 గంటల 5 నిమిషాలకు తగ్గించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అదే క్రిస్ప్ వర్షన్ అయిన 3 గంటల 5 నిమిషాల రన్ టైమ్‌తోనే ఈ చిత్రం అందుబాటులోకి రావడం గమనార్హం.

ఈ భారీ చిత్రానికి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. 

థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ది', కేవలం కంటెంట్ బలంతోనే వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రామ్ చరణ్ కెరీర్‌లో హైయెస్ట్ సోలో గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ మాత్రం జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. విజయనగరం జిల్లాలోని కొండ కింది ఊరు నేపథ్యంలో సాగుతుంది. వందలాది మంది ప్రజలు నివసిస్తున్నప్పటికీ, ఆ ఊరికి ప్రభుత్వం తరఫున ఎలాంటి గుర్తింపు ఉండదు. కనీస రహదారి సౌకర్యాలు గానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గానీ ఆ ఊరి ప్రజలకు అందవు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ ఊరి మనుషులను చాలా చిన్నచూపు చూస్తుంటారు, చివరికి వారు చేసే కూలీ పనుల్లోనూ తీవ్ర వివక్ష చూపిస్తారు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన యువకుడే పెద్ది (రామ్ చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలీ పనులు చేసుకునే పెద్ది, క్రికెట్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతని ఆట తీరు చూసి విజయనగరం, బొబ్బిలి జట్లు క్రికెట్ బెట్టింగ్ మ్యాచ్‌లలో ఆట కూలీగా పెద్దిని వేలంలో పోటీ పడి మరీ పాడుకుంటూ ఉంటాయి.

అయితే, తన ఊరిలో జరిగిన ఒక విషాద మరణం పెద్ది ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కేవలం డబ్బు కోసం కాకుండా, తన ఊరికి ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకురావడం కోసమే ఆడాలని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు. అందుకోసం అందరూ ఆడే క్రికెట్‌ను వదిలేసి, మట్టి కుస్తీ (రెజ్లింగ్) బాట పడతాడు. ఆ తర్వాత పెద్ది జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయికి వెళ్లినప్పటికీ అతనికి ఆశించిన గుర్తింపు ఎందుకు దక్కలేదు? చివరకు తన ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పెద్ది ఎంచుకున్న మరో సంచలన క్రీడ ఏంటి? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కథ. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ విజువల్ ఎమోషనల్ రైడ్‌ను చూడవచ్చు.

 

 

Ram Charan, Peddi Movie, OTT, Netflix, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.