Home  »  News  »  మర్మదేశం మళ్లీ వచ్చేసింది.. ఓటీటీలో 'వీరభద్రుని రహస్యం' స్ట్రీమింగ్.!

Updated : Jul 3, 2026

టెలివిజన్ చరిత్రలో 90వ దశకంలో వచ్చిన 'మర్మదేశం' సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆ సీరియల్ అందించిన థ్రిల్, భయం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అలానే నిలిచిపోయాయి. ఇప్పుడు అదే అద్భుతమైన మిస్టరీ, హారర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్తగా రూపొందిన రీసెంట్ హారర్ థ్రిల్లింగ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' (Veerabhadruni Rahasyam). 90ల నాటి క్లాసిక్ భయాన్ని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా పరిచయం చేసేందుకు ఈ సిరీస్ సిద్ధమైంది. సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సరికొత్త వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 వేదికగా డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది.

ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ సిరీస్ ఏకంగా 60 ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేయబడింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్‌ను ఒకేసారి కాకుండా, ప్రేక్షకులలో ఉత్కంఠను మరింత పెంచేలా ప్రతీ వారం రెండు సరికొత్త ఎపిసోడ్స్‌ చొప్పున విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ టీజర్ మరియు ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేయడమే కాకుండా, వీరభద్రుని చుట్టూ ఉన్న ఆ గూఢ రహస్యం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచేశాయి. 

ఈ సిరీస్‌ను దర్శకుడు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌లో వెన్నెల అనే పవర్‌ఫుల్ పాత్రలో అన్నీ మెరిపించగా, యోగానందగా రఘుకుంచె పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీషతో పాటు అనురాధ, బాలచంద్ర, కల్కి కీలక పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ కథ మొత్తం వీరభద్రపురం అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు కింద ఎంతో పురాతనమైన వీరభద్రుని గుడి ఉంటుంది. ఆ గ్రామ పెద్దతో పాటు ఊరి ప్రజలందరూ ఆ స్వామిని తమ కులదైవంగా అమితంగా నమ్ముతుంటారు. కేవలం భక్తి మాత్రమే కాదు, ఆ ఊరిలో ఒక కఠినమైన మూఢనమ్మకం కూడా బలంగా నాటుకుపోయింది. ఊరిలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ వీరభద్రుడే స్వయంగా వచ్చి శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ ఆ గుడిలో గంట మోగితే, తప్పు చేసిన వాడి చావు ఖాయమనే భయంకరమైన నమ్మకం అక్కడ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఊరిలో వరుసగా కొన్ని దారుణమైన హత్యలు జరుగుతాయి.

ఊరి జనం అంతా ఈ చావులకు దైవాగ్రహమే కారణమని భయపడుతుంటే, సిటీ నుండి ఆ ఊరికి వచ్చిన ఒక ఆధునిక భావాలున్న అమ్మాయి మాత్రం ఈ మూఢనమ్మకాలను అస్సలు ఒప్పుకోదు. సైన్స్‌ను నమ్మే ఆమె, ఈ వరుస హత్యల వెనుక దేవుడు లేడని, ఎవరో బలమైన వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె రహస్య విచారణ మొదలుపెడుతుంది. అసలు వీరభద్రుని పేరు చెప్పి ఆ ఊరిలో చంపేస్తోంది ఎవరు? ఆ దారుణ హత్యల వెనుక దాగున్న అసలు సూత్రధారి ఎవరు? వీరభద్రపురం దాచిపెట్టిన ఆ భయంకరమైన రహస్యం ఏంటి? ఆ ఊరి పెద్ద కుటుంబానికి, ఈ వీరభద్రుని గుడికి ఉన్న అసలు లింక్ ఏంటి? అనే అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న 'వీరభద్రుని రహస్యం' సిరీస్ చూడాల్సిందే.

 

 

Veerabhadruni Rahasyam, Web Series, Marmadesam, OTT, ZEE5

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.