![]() |
![]() |

తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి, నిర్మాత శర్మిలా మాండ్రే(sharmiela mandre)తన జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రముఖ తమిళ చలనచిత్ర నిర్మాత, ప్యాషన్ స్టూడియోస్ అధినేత సుధన్ సుందరంతో ఆమె నిశ్చితార్థం వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో జూన్ 25వ తేదీన గురువారం ఉదయం అత్యంత ఘనంగా జరుగగా మీడియాకి లేటుగా తెలిసింది.
ఈ ప్రత్యేక వేడుక కోసం శర్మిలా మాండ్రే, సుధన్ సుందరమ్(sudhan sundaram)ఇద్దరూ ఐవరీ (ఆఫ్-వైట్) రంగు సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోయారు. శర్మిల అందమైన ఐవరీ చీరలో కనువిందు చేయగా, సుధన్ సాంప్రదాయ కుర్తా ధరించి రాయల్ లుక్‌లో కనిపించారు. నిశ్చితార్థం ముగిసిన తర్వాత ఈ కొత్త జంట తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలను పంచుకుంటూ, కేవలం "అండ్ జస్ట్ లైక్ దట్..." అంటూ ఒక ఉంగరం ఎమోజీని జోడించి తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన వెంటనే రమ్య , సోనూ గౌడ, అమలా పాల్ వంటి పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు శుభాకాంక్షలు తెలియచేసారు.
నటిగా శర్మిలా మాండ్రే ప్రస్థానాన్ని పరిశీలిస్తే, 19 ఏళ్ళ వయసులోనే 2007లో 'సాజ్ని' అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయమయ్యింది. ఆ తర్వాత కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో దాదాపు 35కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కృష్ణ, నవగ్రహ, ఆకే, గాలిపాట 2, పౌడర్, మరియు ఇటీవలి 'ది డెవిల్' వంటి విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా, 'శర్మిలా మాండ్రే ప్రొడక్షన్స్' బ్యానర్‌పై కంటెంట్ ఆధారిత చిత్రాలని నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా కూడా రాణిస్తున్నారు.
Also read: చిరు అదరగొడితే సమంత ఆదుకుంది.. 2026 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇదే
మరోవైపు శర్మిల కాబోయే భర్త సుధన్ సుందరమ్ తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన నిర్మించిన 'పార్కింగ్' చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తమిళ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును గెలుచుకోవడం విశేషం. అంతేకాకుండా, విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'మహారాజా', కప్పల్, సీతకాతి వంటి ఎన్నో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను ఆయన ప్యాషన్ స్టూడియోస్ ద్వారా నిర్మించారు. ఇలా సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ప్రతిభావంతులు ఇప్పుడు జీవిత భాగస్వాములు కాబోతున్నారు. ఈ ఏడాది చివర్లోనే వీరి వివాహం జరగనుంది.

![]() |
![]() |