Home  »  News  »  విజయ్ బాటలో సూర్య? తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు!

Updated : Jun 29, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు తమిళ సినీ, రాజకీయ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దళపతి విజయ్ (Vijay) తన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడమే కాకుండా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడును పాలిస్తున్నారు. 

విజయ్ సాధించిన ఈ అసాధారణ రాజకీయ విజయం తమిళ సినీ పరిశ్రమలోని ఇతర స్టార్ హీరోలలో సరికొత్త ఆశలను, ఆలోచనలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే సూర్య రాజకీయ రంగప్రవేశంపై గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు, ఆయన అధికారిక అభిమాన సంఘం తాజాగా చెన్నైలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం మరింత ఆజ్యం పోసింది.

ఈ ప్రత్యేక సమావేశంలో అభిమాన సంఘం నాయకుడు చేసిన ప్రసంగం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. సూర్యను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "కాలం, దేవుడు కలిసి నిర్ణయిస్తే సూర్య ఒక గొప్ప ప్రజా నాయకుడిగా ఎదగడాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ అడ్డుకోలేరు. రాబోయే 2 నుండి 3 ఏళ్లలో మన సూర్య అభిమాన సంఘం చాలా పెద్ద స్థాయికి చేరుకోబోతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీలో ఉన్న 'నేను' అనే అహాన్ని పక్కన పెట్టి, మన అన్న సూర్య కోసం మీరంతా ఐక్యంగా పని చేయాలి. ఆయన ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదు" అంటూ ఆ నేత కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.

గతంలో సూర్య స్థాపించిన 'అగరం ఫౌండేషన్' 15వ వార్షికోత్సవ వేడుకల సమయంలో కూడా ఇలాంటి రాజకీయ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఆ సమయంలో సూర్య పిఆర్ టీమ్ మరియు అభిమాన సంఘాల ముఖ్యులు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. కేవలం సమాజ సేవ, సినిమా రంగానికే సూర్య పరిమితమవుతారని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టం చేశారు. 

కానీ, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడం, శాసనసభలో సినిమా నటుడిగా తనపై వస్తున్న విమర్శలను 'మేము ఫ్యాన్ క్లబ్ రోజుల నుంచే ప్రజల పక్షాన నిలబడ్డాం' అంటూ విజయ్ గట్టిగా తిప్పికొట్టడం వంటి పరిణామాలు సూర్య అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి.

రాజకీయ విశ్లేషకులు కూడా సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే అన్ని అర్హతలు, ప్రజాదరణ ఉన్నాయని భావిస్తున్నారు. అగరం ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సూర్య సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.