![]() |
![]() |
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సరికొత్త రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. టాలెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. కేవలం రామ్‌చరణ్ ఇమేజ్, క్రేజ్ కారణంగానే మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.
గ్లోబల్ మార్కెట్‌లో రామ్ చరణ్ స్టార్ డమ్ ఈ స్థాయి వసూళ్లకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్ల వద్ద అభిమానుల సందడి, భారీ అంచనాలు సినిమాను బాక్సాఫీస్ రేసులో ముందంజలో ఉంచాయి. గతంలో రాజమౌళి విజువల్ వండర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చరణ్.. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంతో సోలో హీరోగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.
ఈ సినిమా కోసం రామ్ చరణ్ పల్లెటూరి కుర్రాడిగా చేసిన మేకోవర్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక ప్రాంతీయ క్రీడా నేపథ్యమున్న కథతో పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మెగా హీరో సక్సెస్ అయ్యారు. కంటెంట్ బలంగా ఉండి, హీరో ఇమేజ్ తోడైతే భారీ యాక్షన్ చిత్రాలే కాకుండా ఇలాంటి ఎమోషనల్ డ్రామాలు కూడా వండర్స్ క్రియేట్ చేస్తాయని ఈ సినిమా నిరూపించింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మొదటి రోజే 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన హీరోల జాబితా ఆసక్తికరంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 6 చిత్రాలతో (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD, రాధేశ్యామ్) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (R R R, దేవర), రామ్ చరణ్ (R R R, పెద్ది) చెరో రెండు సినిమాలతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే అల్లు అర్జున్ (పుష్ప 2), పవన్ కళ్యాణ్ (OG) కూడా ఒక్కో చిత్రంతో ఈ రికార్డు క్లబ్‌లో ఉన్నారు.
'పెద్ది' సాధించిన ఈ భారీ ఓపెనింగ్స్‌తో మెగా అభిమానులు దేశవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చరణ్ హవాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా ఇదే రకమైన కలెక్షన్ల జోరు కొనసాగితే, లాంగ్ రన్‌లో ఈ సినిమా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |