Home  »  News  »  'పెద్ది' మూవీ లుక్‌లో రోడ్లపై తిరిగిన జగపతి బాబు.. గుర్తుపట్టలేకపోయిన జనం!

Updated : Jun 3, 2026

టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతి బాబు తన నటనతోనే కాకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్న జగ్గూభాయ్.. తాజాగా ఒక సినిమా కోసం చేసిన సాహసోపేత ప్రయోగం ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మారుమోగిపోతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ భారీ యాక్షన్ డ్రామాలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే అత్యంత పవర్‌ఫుల్ మరియు డీగ్లామరైజ్డ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను ఆయనే స్వయంగా అభిమానులతో పంచుకున్నారు.

తన క్యారెక్టర్ గెటప్‌ను టెస్ట్ చేయడానికి జగపతి బాబు ఏకంగా హైదరాబాద్ నగర రహదారులపై సాధారణ వ్యక్తిలా నడుచుకుంటూ వెళ్లారు. బట్టతల, ప్రోస్తెటిక్స్ మేకప్, తెల్లటి గడ్డంతో పక్కా లోకల్ లుక్‌లో పంచె కట్టుకుని ఆయన తిరుగుతున్నా.. కళ్లముందున్నది స్టార్ నటుడని అక్కడున్న వందలాది మంది జనం అస్సలు గుర్తుపట్టలేకపోయారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను జగ్గూభాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మెప్పించిన జగపతి బాబు.. లెజెండ్ సినిమాతో విలన్‌గా మారి తన రూట్ మార్చారు. ఆ తర్వాత అరవింద సమేత, రంగస్థలం వంటి చిత్రాల్లో ఆయన చూపించిన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' కోసం ఆయన పడిన తపన, క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసిన విధానం చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.

ఈ వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, మెగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది కేవలం నటన కాదు.. సినిమాపై ఆయనకున్న అంకితభావం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. జనాల్లో అంతసేపు ఉన్నా ఎవరూ గుర్తుపట్టకపోవడం ఒక నటుడిగా తనకు ఎనలేని తృప్తిని ఇచ్చిందని జగపతి బాబు సంతోషం వ్యక్తం చేశారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో ఊరమాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు అప్పలసూరి గెటప్ వీడియోతోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పీక్స్‌కి చేరాయి. థియేటర్లలో ఈ పాత్ర ఏ రేంజ్‌లో రచ్చ లేపబోతుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.