Home  »  News  »  ఆ స్టార్ హీరోయిన్ల దారిలోనే అనుపమ‌.. హీరోయిన్‌గా లాంగ్ రన్ కోసం సరికొత్త స్ట్రాటజీ!

Updated : Jun 2, 2026

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ముప్పై ఏళ్లు దాటితే చాలు గ్లామర్ పాత్రలకు క్రేజ్ తగ్గి ఆఫర్లు నెమ్మదిస్తాయి. అయితే ఈ మూస పద్ధతిని బ్రేక్ చేసి ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు రాణించాలని గట్టి ప్లాన్ తో ముందుకు వెళ్తోంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ బ్యూటీ తన కెరీర్‌లో నయా స్ట్రాటజీని ఫాలో అవుతోంది.

తొలినాళ్లలో 'ప్రేమమ్', 'శతమానం భవతి' వంటి సినిమాలతో హోమ్లీ బ్యూటీగా, పక్కింటి అమ్మాయిగా కుర్రకారు మనసు దోచుకుంది అనుపమ. కేవలం ఆ క్యూట్‌నెస్, గ్లామర్‌తోనే మరో నాలుగైదేళ్లు సులువుగా నెట్టుకురావచ్చు. కానీ ముప్పై ఏళ్ల మైలురాయి దాటాక కూడా రేసులో నిలబడాలంటే కొత్త హీరోయిన్ల పోటీని తట్టుకోవడం కష్టమని భావించిన ఈ భామ, కేవలం కమర్షియల్ రోల్స్ కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను లైన్ లో పెడుతోంది.

గత కొద్ది కాలంగా అనుపమ ఎంచుకుంటున్న కథలను గమనిస్తే ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తుంది. 'కార్తికేయ-2' లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆమెకు ఎన్నో కమర్షియల్ ఆఫర్లు తలుపు తట్టినా.. వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించింది. వాటి స్థానంలో పరదా, లాక్‌డౌన్, మరీచిక వంటి పూర్తి కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది.

ముఖ్యంగా 'మరీచిక' చిత్రంలో వెంకటలక్ష్మి అనే విలక్షణమైన పాత్రలో అనుపమ చేసిన నటనకు, ప్రయోగానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అయితే ఇలాంటి ప్రయోగాత్మక పంథా ఎంచుకోవడం వెనుక పెద్ద రిస్క్ కూడా దాగి ఉంది. కమర్షియల్ ఫార్ములా సినిమాలను వదిలేయడం వల్ల బాక్సాఫీస్ మార్కెట్ తో పాటు రెమ్యునరేషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

గతంలో 'కిష్కిందపురి' లాంటి కొన్ని సినిమాలు మినహాయిస్తే ఆమె చేసిన కొన్ని ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. అయినప్పటికీ తాత్కాలిక విజయాల కోసం పాకులాడకుండా, బాలీవుడ్ సీనియర్ నటీమణులు విద్యాబాలన్, టబుల తరహాలో లాంగ్ ర‌న్‌లో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సాయి పల్లవి, కీర్తి సురేష్ లు కూడా గ్లామర్ పైనే కాకుండా తమ నటనపై నమ్మకంతోనే ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనుపమ కెరీర్ ప్లానింగ్ పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముప్పై ఏళ్ల వయసులోనే ఇమేజ్ మార్చుకుంటూ భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవడం మంచి నిర్ణయమేనని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా, విమర్శకుల మెప్పు పొందితే భవిష్యత్తులో మరింత బలమైన క్యారెక్టర్స్ వస్తాయని అనుపమ బలంగా నమ్ముతోంది.

ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో మరికొన్ని క్రేజీ విమెన్ సెంట్రిక్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది అనుపమ పరమేశ్వరన్. ఈ కొత్త ప్రయోగాలు ఆమెను టాలీవుడ్‌లో ఏ స్థాయికి తీసుకెళ్తాయో.. నటిగా ఎలాంటి గుర్తింపును తెచ్చిపెడతాయో చూడాలి!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.