Home  »  News  »  Deool band 2: తొమ్మిది రోజుల్లో 40 కోట్లు వసూలు.. కంటెంట్ కి పట్టిన మహాభాగ్యం 

Updated : May 30, 2026

స్టార్స్ లేకపోయినా పర్లేదు కంటెంట్ ఉంటే చాలు కోట్ల రూపాయల కలెక్షన్స్  మీ సినిమాకి వచ్చేలా చేసే బాధ్యత మాది అని ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్తున్నారు. కంటెంట్ కి ఉన్న కెపాసిటీ అది. ఇప్పుడు ఆ కంటెంట్ నే నమ్ముకొని మరాఠీ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన 'దేవూల్ బంద్ 2' సరికొత్త రికార్డులని సృష్టించే పనిలో ఉంది.  


10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస సోషల్ కామెడీ డ్రామా  విడుదలై తొమ్మిది రోజులు కూడా తిరగకముందే ఏకంగా 40 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యానికి  గురిచేస్తోంది. నటుడు మరియు దర్శకుడు ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, 2015 నాటి సూపర్ హిట్ మూవీ 'దేవూల్ బంద్'కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్ల వెనుక ప్రేక్షకుల నుండి లభిస్తున్న బలమైన మౌత్ టాక్ కీ రోల్  పోషిస్తోంది. మే 21న మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,175 స్క్రీన్లలో కొత్త రకం పద్దతిలో  తెల్లవారుజామున 5:30 గంటల బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. ఉదయాన్నే ఆటలకే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం సినిమా విజయాన్ని ముందే సూచించింది. ఆ తర్వాత క్రమంగా పెరిగిన డిమాండ్ కారణంగా కేవలం కొన్ని రోజుల్లోనే మేకర్స్ మరో 600 స్క్రీన్‌లని అదనంగా జోడించాల్సి వచ్చింది. మొదటి ఆదివారం నాడే ఏకంగా 5.90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, రెండవ శుక్రవారం నాటికి కూడా 3.19 కోట్ల వసూళ్లతో తన జోరును ఏమాత్రం తగ్గించుకోలేదు. ప్రస్తుతం40 కోట్ల మార్క్‌ని  దాటి దూసుకుపోతున్న ఈ చిత్రం, నానా పటేకర్ క్లాసిక్ హిట్ 'నటసామ్రాట్' పేరిట ఉన్న46 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్స్ రికార్డుని  దాటేందుకు కేవలం 6 కోట్ల దూరంలో నిలిచింది. రితేష్ దేశ్‌ముఖ్ నటించిన 'రాజా శివాజీ' 115 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ మరాఠీ చిత్రంగా 'దేవూల్ బంద్ 2' నిలిచింది.

. స్నేహల్ తార్డే పోషించిన సంగీత పేగుడే అనే ఒక సామాన్య మహిళా రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిత్యం అప్పులు, కష్టాలతో సతమతమయ్యే ఆమె, తన సమస్యలు తీర్చాలంటూ దేవుడిని వేడుకున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనవుతుంది. ఒకరోజు నది ఒడ్డున ఉన్న చీమల పుట్టపై రాయి విసరడంతో, ఆమెకు సాక్షాత్తూ శ్రీస్వామి సమర్థ్ (మోహన్ జోషి) దర్శనమిస్తారు. ఆ తర్వాత స్వామి ఆమె గ్రామానికి వస్తారు. అయితే, ఆయన కేవలం ఆ మహిళకు మాత్రమే కనిపిస్తూ, ఇతరులకు కనిపించకపోవడంతో ఊరి జనం ఆమెకు పిచ్చి పట్టిందని భావిస్తారు. హాస్యం, భక్తితో పాటు మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల వంటి అత్యంత సున్నితమైన సామాజిక అంశాన్ని ఈ చిత్రం అద్భుతంగా స్పృశించింది.


Also read: Karuppu: సూర్య, ఆర్ జె బాలాజీ మధ్య గొడవ.. ఇప్పటికి 300 కోట్లు అంట 

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను సీనియర్ నటుడు మోహన్ జోషి ఇటీవల పంచుకున్నారు. దర్శకుడు ప్రవీణ్ తార్డే పనిలో ఎంతగా లీనమైపోయారంటే, ఒక ఇండోర్ షెడ్యూల్ సమయంలో ఏకంగా 33 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా నిరవధికంగా షూటింగ్ చేస్తూనే పోయారు. లోపల లైటింగ్ సెటప్ అంతా ఒకేలా ఉండటం వల్ల బయట రాత్రి అవుతుందో, పగలు అవుతుందో ఎవరికీ అర్థం కాలేదు. దర్శకుడిని అడిగే ధైర్యం లేక అందరూ అలాగే పనిచేయగా, చివరకు 30 గంటలు దాటిన తర్వాత మోహన్ జోషి ధైర్యం చేసి సమయం గురించి గుర్తుచేశారు. దాంతో షాకైన దర్శకుడు, మరో రెండు షాట్లు తీసుకుని షూటింగ్‌ కి ప్యాకప్ చెప్పారు. అలాగే షూటింగ్ మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వచ్చిన గ్రామస్థులు తమ పనులకు వెళ్లిపోతే, సెట్‌లోని డ్రైవర్లని , స్నేహితులని జూనియర్ ఆర్టిస్ట్ దుస్తుల్లో మార్చి షూటింగ్ పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

 

 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.