Home  »  News  »  బాలయ్య బర్త్‌డే స్పెషల్: 32 ఏళ్ల తర్వాత డిజిటల్ హంగులతో మళ్లీ వస్తున్న ‘భైరవద్వీపం’!

Updated : May 29, 2026

తెలుగు సినిమా రంగంలో జానపద చిత్రాల మార్కెట్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో, సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అద్భుత దృశ్యకావ్యం ‘భైరవద్వీపం’. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ జానపద బ్రహ్మాండం విడుదలై విజయవంతంగా 32 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో టెక్నాలజీ ఎంతో మారింది, కానీ భైరవద్వీపం సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో అలాగే ఉంది.

ఇప్పుడు సరికొత్త డిజిటల్ హంగులతో, సరికొత్త 4K విజువల్స్ మరియు అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో ఈ చిత్రం థియేటర్లలోకి రీ-రిలీజ్ కావడానికి సిద్ధమైంది. జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

1994 ఏప్రిల్ 14న విడుదలైన ‘భైరవద్వీపం’ అప్పట్లో ఒక సంచలనం. చందమామ కథలను తలపించేలా, మంత్రతంత్రాలు, గగన విహారాలు, వింత మనుషులు, మాయా ద్వీపం వంటి అంశాలతో సింగీతం శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని ఒక అద్భుత కళాఖండంగా మలిచారు. ఇందులో బాలకృష్ణ వీరోచిత నటన, కురూపిగా ఆయన చూపించిన వైవిధ్యం నటుడిగా ఆయన స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. రోజా అందచందాలు, యువరాణిగా ఆమె నటన ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం, ముఖ్యంగా ‘శ్రీ తుంబుర నారద..’, ‘విరిసినది వసంతగానం..’ వంటి పాటలు అప్పట్లో పెద్ద సంచలనం. ఈ పాటలు ఇప్పటికీ సంగీతప్రియులు మెచ్చే పాటలే. 90వ దశకంలో ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా జానపద చిత్రం చేసే సాహసం నంద‌మూరి బాలకృష్ణ చేశారు. దానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ తోడై ఏకంగా 9 నంది అవార్డులు సాధించింది ‘భైరవద్వీపం’. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్లాసిక్ సినిమాలను రీ-రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మురారి, పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవరెడ్డి, ఖుషీ, సింహాద్రి, తొలిప్రేమ, బిజినెస్ మేన్ వంటి చిత్రాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లనే సాధించాయి. అయితే ఒక జానపద చిత్రాన్ని సరికొత్త డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి విడుదల చేయడం చాలా అరుదు. నేటి తరం ప్రేక్షకులకు అప్పటి గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ థియేటర్లలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. బాలయ్య పుట్టినరోజున థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘భైరవద్వీపం’ సినిమాను థియేటర్లలో పెద్ద స్క్రీన్‌పై చూడటం అంటే ఒక మధురమైన జ్ఞాపకం. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ చిత్రాన్ని జూన్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ-వాచ్ చేయడానికి నందమూరి అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ జానపద విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద మరెన్ని సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.